BREAKING NEWS

ఆంధ్రా కాశ్మీర్ - లంబసింగి

              "మేఘాలలో తేలిపోమన్నది... అమ్మాయితో సాగుతూ చిలిపి మది.." ఈ పాట వింటూ ఉంటే కచ్ఛితంగా ఒక్కసారైనా మేఘలని అలా తాకాలని , దగ్గర నుంచీ చూడాలని ఆశగా ఉంటుంది. ఎక్కడో హిమాలయాలు , కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లోనే ఇలాంటి అవకాశం ఉంటుంది. కానీ అంత దూరం వెళ్ళడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు కదా. ఎంతో ఖర్చు , మరెంతో ఆత్మ స్థైర్యం అవసరం.. మరి ఆ కోరిక తీరే మరో మార్గమే లేదా... మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. ఒక్కసారి ఆలోచిస్తే మన పక్కనే ఉన్న "లంబసింగి" మనకు గుర్తు రాక మానదు. 

                        విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఎంతో అందమైన, మనోహర ప్రాంతాల్లో ఈ లంబసింగి ఒకటి. రాష్ట్రంలోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతంగా లంబసింగి కి ఓ ప్రత్యేకత ఉంది. విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఈ లంబసింగి అందాలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీయులు కూడా వస్తుంటారు. ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం, కాలుష్యం అంటే తెలియని పచ్చని గ్రామం. రణగొణ ధ్వనులు మచ్చుకైనా వినిపించని ప్రశాంతత.. ఇవన్నీ లంబసింగి సొంతం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంద్రుడు లేని భూతల స్వర్గంలా అనిపిస్తుందీ గ్రామం. ఉండే జనాభా సుమారు 100 లోపే. కానీ ఆదరించేందుకు మాత్రం ఎప్పుడూ ముందుంటారు. లంబసింగి అందాలు చూసేందుకు వెళ్ళే పర్యాటకులను ఆప్యాయంగా పలకరిస్తూ , సహాయం చేస్తుంటారు ఈ గ్రామస్థులు....

                     విశాఖపట్నం నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉందీ అద్భుత ప్రదేశం. వైజాగ్ నుంచి ముందుగా నర్సీపట్నం చేరుకోవాలి. అక్కడి నుంచి పాముల వంపులు తిరిగిన ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేస్తే లంబసింగి చేరుకోవచ్చు. ఎంతో ఆహ్లాదంగా, థ్రిల్లింగ్ గా ఉండే ఈ ఘాటీలో ప్రయాణం ఒక మరపురాని అనుభూతి. ఆకాశాన్ని తాకే చెట్లు, ఆశ్చర్యాన్ని కలిగించే లోయలు, ఒక్కసారైనా చూడాలనిపించే జలపాత అందాలు. ఇవన్నీ లంబసింగి ని టూరిస్ట్ స్పాట్ గా మార్చేశాయి. లంబసింగి అందాలు తనివితీరా చూడాలి అంటే నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో వెళ్ళాలి.

ఉదయాన్నే 4 గంటల సమయంలో లంబసింగి లో ఉండేలా వెళితే చాలు. మీ ఆనందానికి అవధులు ఉండవు. కాలుష్యంతో నిండిపోయిన మన నగరాల్లో కనిపించని అద్భుతం ఆ సమయంలో అక్కడ కనిపిస్తుంది. అవే మేఘాలు. మేఘాలు అద్భుతం ఏమిటి అనుకోవద్దు. ఎక్కడో ఆకాశంలో ఉండే మేఘాలు మీ పక్కనే వచ్చి వాలితే... ఎంచక్కా చేతులతో ఆ మేఘాలను ముట్టుకొగలిగితే??? అద్భుతం కాదంటారా? ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి వెళ్తే మీరు కూడా ఆ థ్రిల్ నీ లైవ్ లో అనుభవించవచ్చు. 

                         ఈ గ్రామంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి గురువారం ఇక్కడ జరిగే సంత చాలా బాగుంటుంది. నేరుగా గిరిజన తండాలు నుంచి తీసుకువచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, రక రకాల పంటలు అమ్ముతుంటారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి సిద్ధంగా పండించిన పంట భలే రుచిగా ఉంటాయి. ధర కూడా చాలా తక్కువ. మన నగరాల్లో కేజీ కొనే డబ్బులతో ఈ సంతలో ఓ 4 కేజీలు కొనేసుకోవచ్చు. ఇన్ని అట్రాక్షన్స్ ఉన్న ఈ లంబసింగి లో ఉన్న ఒకే ఒక్క మైనస్ వసతి. దూర ప్రాంతాల నుంచి వెళ్లే వారికి అక్కడ రాత్రి బస చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని కాటేజీ నిర్మాణాలు చేపడితే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

లంబసింగి వెళ్ళాలి అనుకునే వారు ముందుగా విశాఖ నుంచి నర్సీపట్నం చేరుకోవాలి. అక్కడి నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్ళే బస్సులు ఉంటాయి. వాటి ద్వారా చేరుకోవచ్చు. లేదా కార్లు, బైక్ లు లాంటి సొంత వాహనాల్లో కూడా వెళ్ళచ్చు...

Photo Gallery