BREAKING NEWS

అత్యాచారాలు-అఘాత్యాలు.

ఐదు  సంవత్సరాల పాపపై అత్యాచారం ,,, మానభంగానికి గురి అయిన తొమ్మిది నెలల పసికందు, వివాహితపై అఘాయిత్యం, డెబ్బై ఏళ్ళ బామ్మకు లైంగిక వేధింపులు ,, ఏడవ తరగతి చదువుతున్న బాలికపై  యాసిడ్ దాడి,  స్నేహితుడిని చంపిన పదహారు సంవత్సరాల బాలుడు,డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిపై యువకుల, దౌర్జన్యం, గొలుసు దొంగతనంలో పట్టుబడ్డ ఇంజినీరింగ్ విద్యార్థి , గంజాయి అక్రమ రవాణాలో  డిగ్రీ విద్యార్థులు, వాహనాలను దొంగలిస్తున్న మైనర్ బాలురు ,, ఇలాంటి వార్తలు  ,,,  ప్రతీరోజు , ప్రతీక్షణం మనం వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం ..

ఈ సమాజం ఏమవుతోంది  ఎక్కడికెళ్తోంది ??? దీనికి  పరిష్కారం  ఏమిటి ??? ఎవరికి వారు  ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చింది అసలు ఈ సమస్య ఇంత తీవ్రరూపం దాల్చడానికి ఏమిటి కారణం .. పూర్వపు రోజులలో మనుష్యులులో నేరప్రవృత్తి లేదా?? చూద్దాం  నేటి ఆధునిక కాలంలో కుటుంబం అంటే నిర్వచనం మారిపోయింది.  భర్త , భార్య , ఇద్దరు పిల్లలు. ఇదే ఈ తరానికి తెలిసిన న్యూక్లియర్ కుటుంబ నిర్వచనం ..

కొన్ని కుటుంబాలలో ఇద్దరు పిల్లలు కూడా కాదు ,, కేవలం ఒకే ఒక సంతానంతో కుటుంబాన్ని నియంత్రించుకుంటున్న వారు కూడా గణనీయంగా పెరుగుతున్నారు. ఆ ఉన్న ఒకరో , ఇద్దరో ఆడపిల్లలు ఉన్న కుటుంబాల సంగతి కాస్త ప్రక్కన పెడితే ఇద్దరు కానీ ఒక్కడు కానీ మగపిల్లలు ఉన్న కుటుంబాల గురించే ఇప్పటి మన ప్రస్తావన ...

 ఆడపిల్లల విషయంలో తల్లితండ్రులందరూ అవసరానికి తగిన (మించి) జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడ , ఎప్పుడు , ఎలా ఉండాలో అనుక్షణం  శిక్షణ ఇస్తూ ఉంటారు. అమ్మాయి ఎక్కడికి వెళ్తోంది ?  ఎవరితో మాట్లాడుతోంది ? ఎలాంటి స్నేహితులు ఉన్నారు ? లాంటి ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా కనిపెడుతూఉంటారు ,, ఉండాలి కూడా !!! ఫలితంగా సర్వసాధారణంగా అమ్మాయిలులో చెడుప్రవర్తన  చాలా చాలా తక్కువ. తల్లితండ్రుల శిక్షణ , పర్యవేక్షణలలో సాధ్యమైనంతవరకు  ఆడపిల్లలు సాంప్రదాయబద్దంగా , సంస్కారవంతంగా , అనుకువగా , సున్నిత మనస్కులై ఉంటారు.

           ఇక అబ్బాయిల విషయానికి వస్తే  " పురుషాధిక్యం " అనే  విషపురుగు మొట్టమొదటిసారిగా వాడి బుర్రలో ప్రవేశించేది బాల్యంలో వాడి తల్లిదండ్రుల సమక్షంలో , వాడి ఇంట్లోనే. ఎందుకంటే .. జనరల్ గా  అమ్మాయిల విషయంలో తీసుకున్నంతగా అబ్బాయిల విషయంలో జాగ్రత్తలు తీసుకోరు. మగ పిల్లాడే కదా .. ఏమవుతుందిలే ,,  వాడికేం ? వాడు మగ మహారాజు లాంటి మాటలు తెలిసీ తెలియని వయసులోనే అబ్బాయిల ప్రవర్తనపై  తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మగాడు ఎలా అయినా తిరగొచ్చు , ఏమైనా చెయ్యొచ్చు , ఎంత లేట్ నైట్ అయినా ఇంటికి వెళ్లొచ్చు , ఎవరితోనైనా స్నేహం చెయ్యొచ్చు  లాంటి అభిప్రాయాలు క్రమేపీ అలవాటు అవుతాయి.

ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ,,  ఈ ప్రభావం మరింతగా ఉంటుంది.   ఉదయాన్నే ఉరుకులు , పరుగులతో ప్రారంభమైన దినచర్య  అలసటతో  మంచం మీదకు చేరడంతో ముగుస్తుంది. పోనీ ,,, పిల్లలకు మంచి బుద్ధులు , జాగ్రత్తలు , నీతికధలు ,  సామెతలు ,  పొడుపుకధలు,  పురాణాలు , మన సంస్కృతి , సంస్కారాలు ,  పిల్లలు - పెద్దల పట్ల  వ్యవహరించే విధానాలు మొదలైనవి చెప్పడానికి  ఆ ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటారా ?? వీళ్ళు ఉండనిస్తారా ?? ఎవరు చెప్పారో ?? ఎందుకు చెప్పారో ?? తెలియదు గానీ  " చిన్న కుటుంబం - చింత లేని కుటుంబం" అని... తమను కని , పెంచి ఇంత వారిని చేసిన  తల్లితండ్రులను కూడా తమతో ఉండనివ్వనంత "చిన్న కుటుంబం"  కావాలనుకుంటున్నారు. 

          సో .. విషయానికి వస్తే ,, అదిగో అలా స్టార్ట్ అవుతుంది " మేల్ డామినేషన్ " వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ? తిరిగి ఎప్పుడు వస్తున్నాడో ? ఏమి చేస్తున్నాడో ? ఎవరితో స్నేహం చేస్తున్నాడో ? లాంటివి అసలు పట్టించుకోరు .. నిజానికి అంత సమయం కూడా పాపం వారికుండదు. వారి విలువైన సమయం అంతా. ఎంత సంపాదించవచ్చు ? ఎలా సంపాదించవచ్చు ? పిల్లాడికి ఎంత ఎక్కువ ఆస్తి ఇవ్వొచ్చు ? లాంటి  అతి ముఖ్యమైన పనులకు మాత్రమే కేటాయిస్తారు. చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. తమ తల్లితండ్రులు తమకు ఆస్తిపాస్తులు ఏమీ ఇవ్వలేదు.. చాలా బాధలు పడి పడి ఈ స్థాయికి వచ్చాం, మా పిల్లలు మాత్రం ఆ పరిస్థితి అనుభవించకూడదు, అందుకే .. వారి ప్రతిక్షణం సంపాదనకు  మాత్రమే ఉపయోగిస్తారు. వీటన్నింటి ఫలితంగా ,,  తాను ఏమి చేసినా చెల్లుతుంది  అనే భావన మగపిల్లవాడి మనసులో  బలంగా నాటుకుపోతుంది . ఇక అప్పుడు అలా మొదలైన ఆ భావం  ఎన్ని అనర్ధాలకో దారి తీస్తుంది.

విచ్చలవిడిగా తిరగడం , ర్యాగింగ్ చెయ్యడాలు , పెద్దలు , గురువులపై సెటైర్లు వెయ్యడం , ఆడపిల్లలను ఏడిపించడం , వేధించడం , సిగరెట్లు , మందు , డ్రగ్స్  , పబ్ లు , జూదం , సినిమాలు , జల్సాలు వీటన్నింటికి కావలసిన డబ్బు సంపాదన కోసం దొంగతనాలు , మోసాలు , నిషేధిత వస్తువుల రవాణా మొదలైన ఎన్నో ఎన్నెన్నో చెడు వ్యసనాలకు అలవాటు పడి , 
చేజేతులారా తమ భవిష్యత్ ను తామే పాడు చేసుకుంటున్నారు. మరో ఆడపిల్ల జీవితాన్ని కూడా పాడు చేసి , ఆ తల్లితండ్రుల ఉసురు కూడా  పోసుకుంటున్నారు.  ఇదంతా జరగడానికి కారణం కేవలం ఆ కుటుంబంలో పెద్ద దిక్కు లేకపోవడం , అమ్మాయిల విషయంలో తీసుకుంటున్న శ్రద్ద అబ్బాయిల విషయంలో  పేరెంట్స్  తీసుకోకపోవడం.

               అన్నింటికంటే ముఖ్య విషయం తమ అమ్మాయికి మరో అబ్బాయి మూలంగా హాని జరగకూడదు అని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారే తప్ప , తమ అబ్బాయి మూలంగా ఎవరి అమ్మాయికి హాని జరగకూడదు అనే దిశగా ఆ అబ్బాయిని తీర్చి దిద్దలేకపోతున్నారు.

అత్తా ఒకింటి కోడలే  అన్నది పాత సామెత... మనబ్బాయి కూడా మరో ఇంటి అమ్మాయి పాలిట కీచకుడు అన్నది కొత్త సామెత..

Photo Gallery