BREAKING NEWS

మందు - మాఫియా

          "మందు/డ్రగ్"  ఈ పేరు వినగానే  అమ్మో అని భయపడతారు. ఇది రెండు రకాలు. ఆరోగ్యం బాగు లేనప్పుడు వాడేది ఒక రకం ,  ఆరోగ్యం బాగున్నప్పుడు వాడేది ఇంకో రకం . రెండు రకాల మందులలోను కొంత నిషేధం ఉంది , మరి కొంత స్వేచ్ఛా ఉంది. మెడికల్ షాపులలో దొరికేది ఒకరకం మందు  అయితే  ,  వైన్ షాపులో దొరికేది మరో రకం మందు. ఈ రెండింటికి నిర్దిష్టమైన అనుమతులు , లైసెన్సులు , నియమ నిబంధనలు , నిర్ణీత వ్యాపార వేళలు లాంటివి ఎన్నో అవసరం.

మాములుగా అయితే. షాపులు క్లోజ్ చేసేసాక ఇక మందు లభించదు. కానీ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా  వ్యాపారులు షాపులు బంద్ అయ్యాక కూడా వారి అనధికార దుకాణాల్లో  "రేటుపై" లభించే ఏర్పాట్లు చేస్తారు. వీటిపై అధికారులు చెకింగ్ లు , మీడియాలో కథనాలు మాములు విషయం.
ఓకే... ఇక అసలు విషయానికి వస్తే... మందు (వైన్) అందరికీ అవసరం ఉండదు కానీ , "మందులు"  మాత్రం ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికీ అవసరమే . ఈ అవసరాన్నే  వ్యాపారులు తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు.
  
             10 మాత్రలు ఉండే ఒక  స్ట్రిప్ ధర 100 రూపాయిలుగా ఉంటే , అదే స్ట్రిప్  జనరిక్ లో 30 రూపాయలకు లభిస్తుంది.  ఈ జనరిక్ మందుల గురించి   ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా, కంపెనీ పేరుతో  ప్రిస్క్రిప్షన్  వ్రాయవద్దు అని డాక్టర్స్ కు  ఎన్ని సార్లు హెచ్చరించినా ఫలితం సున్నా .. పోనీ ,, ప్రజలు తమకు తాముగా జనరిక్ మందులు కొంటారా ??  అమ్మో .. ఇంత చవగ్గా వచ్చే మందులు మంచివి కావేమో.. పని చెయ్యవేమో అనే భావన.

ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టరుని చూడడం ఎప్పుడూ ఉన్నదే కానీ, చక్కగా , పుష్టిగా , ఆరోగ్యంతో ఉన్నవాళ్లు కూడా ముందు జాగ్రత్త  పేరుతో ,  పేరున్న ఓ డాక్టర్ ని సంప్రదించడం వారు సూచించిన మేరకు , వారు చెప్పిన చోట  "అన్ని" రకాల టెస్టులు చేయించుకుని , ఆ రిపోర్టులు తెచ్చి , డాక్టర్ గారికి చూపించి , బ్రహ్మాండంగా ఉన్నావోయ్ అనిపించుకుని తృప్తిగా వచ్చేయడం ఇటీవల జరుగుతోంది.

              ఇది చూసి కొన్ని  కంపెనీల వారు  టోటల్ బాడీ చెకప్ ఒక రేటు , తలకు ఒకరేటు , కాళ్లకు ఒక రేటు, బాడీ పై భాగానికి ఒక రేటు , క్రింద భాగానికి ఒక రేటు , ఒక్కరికే అయితే ఒక రేటు , మొత్తం కుటుంబం అయితే ఒక రేటు  ఇలా రకరకాల ప్యాకేజిలతో ప్రజలను ఆకర్షించేందుకు రాయితీలు కూడా ప్రకటిస్తున్నా రు. ప్రజలు కూడా తక్కువేమీ కాదు ,, చవగ్గా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా చటక్కున అందిపుచ్చుకుంటున్నారు. "నువ్వు ఒకందుకు పోస్తే  - నేనొకందుకు తాగాను"  అన్న సామెత లాగ,  డాక్టర్ దగ్గరకు వెళ్తే అతను ఫీజ్ అడుగుతాడు , నేరుగా లాబ్ కు వస్తే ఫీజ్ మిగులుతుంది , అని ప్రజలు ఆలోచిస్తే , డాక్టర్ ద్వారా పేషెంట్ వస్తే , డాక్టర్ కే సింహభాగం కమిషన్ ఇవ్వాలి , నేరుగా పేషెంట్ నే రప్పించుకుంటే డాక్టర్  కమీషన్ మిగులుతుంది అని లాబ్ వారు ఆలోచిస్తున్నారు. ఎవరి స్ట్రాటజీ వారిది.

               అసలు ఈ జబ్బులు నిజమైనవేనా?? సృష్టించబడినవా?? చక్కగా సముద్రపు ఒడ్డున పండించిన గడ్డ ఉప్పు వాడుకునే వాళ్ళం . నూతులు , చెరువులు , గెడ్డలు లో లభించే నీటిని త్రాగేవాళ్ళం. బయట చిరుతిళ్ళు తినేవాళ్ళం. ఎక్కడ పడితే అక్కడ , ఎలా పడితే అలా ఉండేవాళ్ళం.  అయినా సరే ఎప్పుడూ భరించలేని జబ్బులు గానీ , బీపీ , షుగర్లు గానీ తెలియవు. హాయిగా , ఆనందంగా తిని తిరిగే వాళ్ళం. మనం ఇష్టపూర్వకంగా  తిని , అరిగించుకుని , హాయిగా జీవిస్తున్న వారిని అవి తినకూడదు , ఇవి తినకూడదు అని డాక్టర్స్ చేత చెప్పించడం , వైద్య సంస్థలతో చెప్పించడం  ప్రజలను భయపెట్టడం మొదలుపెట్టారు. 

                అంతవరకూ నచ్చిన తిండి తినే మనం సడన్ గా  అది మానేసి ,  వ్యాపారులు సూచించిన వాటిని వాడడం మొదలు పెట్టాం. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ, గడ్డ ఉప్పు తినే వారు అది మానేసి ,  "అయోడిన్  సాల్ట్ "  వాడడం మొదలు పెట్టారు. ఈ ఉప్పు వాడకం పెరిగాక  90  శాతం మంది  ప్రజలు "థైరాయిడ్"  తో  బాధపడుతున్నారు.  తీరిగ్గా ఇప్పుడు మళ్ళీ అదే డాక్టర్స్  అయోడిన్ సాల్ట్ వలననే  థైరాయిడ్ సమస్య వస్తోందని , గడ్డ ఉప్పే  మంచిదని చెప్పడం మనకు తెలుసు కదా. అలాగే ఒకప్పుడు  మానేయమని చెప్పిన నెయ్యి , నూనె , ఆకు కూరలు , పప్పులు , పాలు , పెరుగు ,   సెనగపలుకులు , రాగులు మొదలైనవి అన్నింటినీ మళ్ళీ తినమని మీటింగులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు.

BP లెవెల్స్ , షుగర్ లెవెల్స్  యొక్క  ప్రామాణికం కూడా  కొంతమంది  ప్రయోజనం కోసం మార్చేస్తున్న రోజులు ఇవి.  పాపం !!!  అమాయక ప్రజలు ఏవి తినాలో ?? ఏవి తినకూడదో ???  తెలియక సతమతమవుతున్నారు. ఒక పదార్ధాన్ని ఒక శాస్త్రవేత్త తినమంటాడు. అదే పదార్దాన్ని మరో శాస్త్రవేత్త తినకూడదు అంటాడు. ఒకే వ్యాధికి ఒక డాక్టర్ ఒకలా చెబితే , మరో డాక్టర్ మరోలా చెబుతారు. ఎవరిని నమ్మాలి ?? దేనిని ఆచరించాలి. 

              ఒక ప్రక్క అనారోగ్యానికి గురి చేసే   "మందు" విక్రయాలలోనూ ,  మరో ప్రక్క  అనారోగ్యాన్ని తగ్గించే "మందు" విక్రయాలలోనూ కూడా  "మాఫియా" నడుస్తోంది.  దీనికి పరిష్కారం లేదా ??  లేకేం.."బిజినెస్ మేన్"  సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు, "ఎవరి మాటా వినకు ,, మనిషి మాట అసలు వినకు నీకేం తినాలనిపిస్తే అది తిను , నీకేం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి." రోగం రాకముందే ముందు జాగ్రత్త పేరుతో అడ్డమైన టెస్టులు వద్దు.  అతి జాగ్రత్తతో తినాలనిపించిన  వాటిని తినకుండా ఉండొద్దు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చావుని ఎవ్వరూ ఆపలేరు.

అలా అయితే చాలా మంది ప్రముఖులు చావుని జయించేవారే.. కాకిలా కలకాలం బ్రతికే బదులు , హంసలా ఆరు నెలలు బ్రతికినా చాలు అన్నది ఆర్యోక్తి...మీ గ్లామర్  రహస్యం ఏమిటి ? అని  వయసు మీద పడినా ,  అందంగా కనిపించే  వారిని  అడిగినప్పుడు వారందరూ  చెప్పే జవాబు ఒక్కటే... ఏ విధమైన టెన్షన్స్ పెట్టుకోము ,, మనసు ప్రశాంతంగా   ఉంచుకుంటాము.. దేని గురించి  ఆలోచించం, మనో నిబ్బరంతో  ఉంటాం ,, చిరు నవ్వు చెదరనివ్వం .... 
          కాబట్టి , మనం కూడా అనవసరమైన ఆందోళనలకు , ఉద్రేకాలకు , కోపతాపాలకు  గురి కాకుండా మన ఇంట్లో మనం చేసుకోగలిగే చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు పాటిస్తూ , ఆరోగ్యంగా , ఆనందంగా , చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉందాం.. సర్వే జనా సుఖినో భవంతు..

 

Photo Gallery