BREAKING NEWS

గంజాయి - నిర్మూలన సాధ్యమా?

జీవితం... ఎంతో అందమైనది. మనం ఎలా అనుకుంటే ఎలా మన జీవితాన్ని మలచుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మంచి మార్గంలో వెళితే పెద్దయ్యాక కూడా మంచిగానే మారతారు. పొరపాటున చెడు సావాసాలు చేసి అటువైపు ఆకర్షితులు అయ్యారో ఇక అంతే... అందమైన జీవితం కాస్తా చేజేతులా నాశనం చేసుకున్నట్టు. గతంలో కన్నా ఈ మధ్య కాలంలో మాదక ద్రవ్యాలు. ముఖ్యంగా "గంజాయి" అక్రమ రవాణా యువత అలవాటు పడుతున్నారు.   అయితే గంజాయి రవాణా వరకు మాత్రమే మనకు బయటకు కనిపిస్తున్నది. అయితే గంజాయి పంట ఎలా సాగు చేస్తారో తెలుసుకుంటే మాత్రం కచ్ఛితంగా షాక్ అవ్వాల్సిందే...

               చుట్టూ ఎత్తైన కొండలు.. మధ్యలో కాస్త భూభాగం... కొన్ని వేల అడుగుల లోయలో ఉండే ఈ ప్రాంతమే గంజాయి సాగుకు అనుకూలంగా ఉంటుంది.  కొన్ని వందల ఎకరాల్లో ఈ గంజాయి సాగు చేస్తుంటారు గంజాయి వ్యాపారులు. అలాంటి ప్రాంతంలో అసలు గంజాయి పండిస్తారు అనే ఆలోచన కూడా రాలేని, ఊహించలేని ప్రాంతం అది. ఇక పండించడానికి అడ్డు అదుపు ఏం ఉంది?? వందల ఎకరాలు... లాభదాయకమైన పంట. అలాంటి కొండ ప్రాంతాల్లో మామూలు పంటలు ఏమీ పండవు. కాబట్టి చాల మంది ఈ గంజాయి పంట సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా గంజాయి మొక్కలకు 12 గంటల పాటు వెలుతురు తగిలేలా ఉండాలి. ఈ గంజాయి మొక్కలు సాగు చేయడం చట్ట రీత్యా నేరం. అందుకే వెలుతురు సమృద్ధిగా దొరుకుతుంది. ఎవరికీ దొరకని కొండ ప్రదేశంలో ఈ పంట సాగు చేస్తుంటారు. 9 నుంచి 15 వారాల్లోనే ఈ మొక్క పుష్పించడం స్టార్ట్ అవుతుంది. తర్వాత జరిగేది అందరికీ తెలిసిందే...

                         చాలా సందర్భాల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకుంటూ ఉంటారు. ఇంకొన్ని సార్లు పూర్తిగా గంజాయి తోటలను ధ్వంసం చేసేందుకు కూడా అధికారులు రంగం సిద్ధం చేస్తుంటారు... ఏదో మామూలు పంటల దగ్గరకు వెళ్లినట్లు వెళ్ళడం అసాధ్యం. ఎందుకంటే ఇంత పెద్ద కొండల నడుమ ఈ పంట ఎక్కడ ఉందో గుర్తించడం చాలా కష్ట సాధ్యమైంది. అందుకే టెక్నాలజీ వినియోగించుకుంటున్నారు అధికారులు. వారికున్న సమాచారం ప్రకారం కొంత భాగాన్ని సెలెక్ట్ చేసుకుని డ్రోన్ సహాయంతో జల్లెడ పడతారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి ధ్వంసం చేస్తుంటారు. అక్కడ పండించే తీరు చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. డ్రిప్ ఇరిగేషన్ మాదిరిగా కూర్చున్న చోటు నుంచి కదలాల్సిన అవసరం లేకుండా పైపుల ద్వారా వాటర్ అందిస్తున్నారు అంటే ఏ రేంజ్ లో పంట సాగు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ గంజాయికి మంచి డిమాండ్ ఉంది. పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ.

కొండ మీద కొంటె కేజీ 5000 ఉంటే కిందకి దిగేసరికి రెట్టింపు రేటు. జిల్లా దాటితే ఒక రేటు, రాష్ట్రం దాటితే మరో రేటు. ఇలా ఎంతో లాభం చేకూరుతుంది ఈ గంజాయి సాగు వలన. సాగు మాత్రమే కాదు. రవాణా చేసే వారికి కూడా భారీ మొత్తంలోనే అందుతుంది. అందుకే ఈ పంటలు ధ్వంసం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో ధ్వంసం చేస్తుండడంతో దాడులకు కూడా వెనుకాడరు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు గుంపులు గుంపులుగా నిర్వహిస్తారు. జనం ఎక్కువ మంది ఉంటే సాగు చేసే వారు కాస్త తగ్గి ఉంటారు.

                     ఈ గంజాయి సాగును శాశ్వతంగా, సమూలంగా నిర్మూలిస్తాం అంటూ అధికారులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ నిజానికి అది సాధ్యం అయ్యే విషయం కాదు. ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి ఆ కొండ ప్రాంతంకు వెళ్లి ధ్వంసం చేసి వస్తారు. కానీ అక్కడి నుంచి అధికారులు వెళ్ళిన మరుక్షణం మరోసారి విత్తనాలు నాటేస్తారు. ప్రతిసారీ అంత రిస్క్ చేయలేరు కదా. అలాంటప్పుడు ఇక సంపూర్ణ నిర్మూలనకు అవకాశం ఏది?? గంజాయి ఉత్పత్తిని నిర్మూలిస్తాం అనే మాటలు కాకుండా వాటి వాడకం దారులపై దృష్టి సారించాలి. ఏదైనా వస్తువు వాడేవాళ్లు ఉంటేనే కదా ఏ కంపెనీ అయినా తయారుచేసి మార్కెట్లోకి తెచ్చేది. అసలు వాడేవారు లేకపోతే?? ప్రొడక్ట్ ఉండదు. ఆ కంపెనీ కూడా ఉండదు. ఇదే సూత్రం సరిగ్గా ఇక్కడ కూడా వర్తిస్తుంది. సాధ్యమైనంత త్వరగా గంజాయి వాడకాన్ని తగ్గిస్తే ఆటోమేటిగ్గా గంజాయి సాగు, అక్రమ రవాణా లాంటి చట్ట వ్యతిరేక పనులకు బ్రేకులు పడతాయి. 

Photo Gallery