BREAKING NEWS

ఫ్యాన్ వార్స్

సినిమా ఇండస్ట్రీ... రంగుల ప్రపంచం. అదో కొత్త బంగారు లోకం... ఒక్కసారి ఈ లోకంలో అడుగు పెడితే చాలు. మన లెవల్ మారిపోతుంది. సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే ప్రజల్లో గుర్తింపు మామూలుగా ఉండదు. ఇక స్టార్ హీరోలు సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్. బయట కనిపిస్తే చాలు.

ఫోటోలు, ఆటోగ్రాఫ్ ల కోసం తెగ ఎగబడతారు. ఇక తమ అభిమాన హీరోల సినిమా రిలీజ్ రోజు అయితే ఆ హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. కటౌట్ లు, బ్యానర్ లతో పండగ వాతావరణం కనిపిస్తోంది. తమకు నచ్చిన హీరో పై అభిమానం చాటుకోవడం తప్పు కాదు. కానీ పక్క హీరో అభిమానులతో గొడవలు పడడం ఇప్పుడు యూత్ లో ఫ్యాషన్ గా మారిపోయింది.

                         ఫలానా స్టార్ హీరో సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ హీరో అభిమానులు కాలర్ ఎగరేసుకుని గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో "మీ హీరోకు మా వాడంత సత్తా లేదురా" అంటూ ఎగతాళి చేయడం మొదలౌతుంది. ఇదంతా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కనిపిస్తున్నాయి. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. హీరోల దగ్గర మొదలైన గొడవ, వాదన అభిమానులు వ్యక్తిగత విషయాలకు దారి తీస్తోంది. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది అభిమానులు.

సినిమాలు కేవలం మన సంతోషం , ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తున్నవే తప్ప వాటి కోసం గొడవలు పెంచుకుని శతృవులు తయారు చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్. ఇదే విషయం మీద సినిమాలు కూడా చేశారు మన దర్శకులు... అభిమానుల ఆలోచనలు ఎలా ఉంటాయి. సినిమా రియాల్టీ ఏమిటి... లాంటివన్నీ అందరికీ అర్థం అయ్యేలా చూపించారు. అయినా సరే మార్పు రావడం లేదు. వాట్సప్ గ్రూప్, ఫేస్బుక్ పేజ్ లు క్రియేట్ చేసుకుని మరీ కొట్టుకుంటున్నారు. గొడవలు వద్దంటూ ఆ హీరోలే స్వయంగా చెప్పినా పట్టించుకునే అభిమాని ఒక్కడు కూడా లేడు... 

                  స్టార్ హీరోల సినిమాలు కాస్త గ్యాప్ తీసుకుని రిలీజ్ అయితే పరిస్థితి ఒకలా ఉంటుంది. మా హీరో రికార్డ్స్ గొప్ప అంటే కాదు మా హీరోవే గొప్పంటూ వాగ్వివాదం దిగుతారు. ఇక పొరపాటున గానీ ఒకేసారి ఒకేరోజు రిలీజ్ అయితే? వామ్మో...  ఇక చెప్పేదేముంది. థియేటర్ల దగ్గర పెద్ద యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. ఒకరిని మించి ఒకరు హంగామాలు చేస్తారు. మొదటి ఆట నుంచే రికార్డ్స్ కోసం పరి తపించిపోతుంటారు.. ఈ కల్చర్ ఇప్పటిది కాదు. సినిమా ఇండస్ట్రీలో "స్టార్" అనే పదం స్టార్ట్ అయిన దగ్గర నుంచీ హీరోలకు ఈ బాధ తప్పడం లేదు. గతంలో ఎలాంటి ఈగోలు ఉండేవి కావు అని అనుకుంటాం...

నిజమే... హీరోలకు ఏమీ ఉండేది కాదు. కానీ వాళ్ళ అభిమానులతోనే అసలు సమస్య అంతా... కృష్ణ , ఎన్టీఆర్ గానీ కృష్ణ , నాగేశ్వర రావు గానీ లేదా మరే హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేయాలి అంటే ఆ దర్శక నిర్మాతలకి కత్తి మీద సామే... ఏ హీరో పేరు ఫస్ట్ వేశారు దగ్గర నుంచి మా హీరోకు ఎన్ని డ్రెస్ చేంజ్ లు ఉన్నాయి? ఎన్ని పాటలు ఉన్నాయి? లాంటి వాటిలో కూడా పోటియే... పొరపాటున ఒక హీరో కన్నా మరో హీరోకి ఒక్క విషయంలో అయినా కొంచెం తేడా ఉంటే ఇక అంతే సంగతులు...

సినిమా థియేటర్లు, రీల్స్ తగలబడిపోవాల్సిందే.... రచ్చ రచ్చ చేసేవారు. అందుకే ఆచి తూచి ఏ మాత్రం తేడాలు లేకుండా మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కించేవారు. ఇప్పుడైతే ఆ సమస్యే లేదు. అసలు మల్టీ స్టారర్ అనే పదమే తెలుగు సినిమా ప్రేక్షకులు మరచిపోయారు. దానికి ఒక్కటే కారణం. హీరోలపై మనకున్న వల్లమాలిన అభిమానమే.... హీరోలందరూ ఎప్పుడూ బాగుంటారు. ఒకరి సినిమాలకు ఒకరు వెళ్తారు. హిట్ అయితే కలిసి పార్టీలు చేసుకుంటారు. మధ్యలో మనకెందుకు ఈ గొడవలు... సినిమాను సినిమాగా మాత్రమే చూడండి. ఆ మత్తులో, మాయలో పడి గొడవలకు మాత్రం దిగకండి..
 

Photo Gallery