BREAKING NEWS

డేరింగ్ డాగ్ "వర్ష"

కుక్కలు. మనం పెంచుకునే అన్ని రకాల జంతువుల్లో నూ ఎంతో విశ్వాసంగా, నమ్మకంగానూ ఉండేవి ఇవే... అందుకే ఎన్నో సంవత్సరాలుగా మనుషులతో మమేకం అయిపోయి ,మనలో ఒకటిగా ఉంటున్నాయి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. పోలీస్ డాగ్ అంటే స్పెషల్ ట్రైనింగ్ గ్యారంటీ... నేరస్తులను చిటికెలో పట్టుకునేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత నుంచీ పోలీస్ డిపార్ట్మెంట్ లో సేవలు అందించేందుకు ఆ శునకం సిద్ధంగా ఉంటుంది. సంవత్సరాలు తరబడి సేవలందించి నేరస్తులను కనిపెట్టే ఈ పోలీస్ జాగిలాలు మరణిస్తే పోలీస్ లాంఛనాలతో నివాళులు అర్పిస్తారు. తాజాగా విజయనగరం లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది...

     అదో పోలీస్ డాగ్.. పేరు వర్ష... చాలా యాక్టివ్. ఎంత పెద్ద కేసు అయినా చిటికెలో పరిష్కరించేందుకు పోలీసులకు హెల్ప్ అవుతుంది. ఒక్కసారి రంగంలోకి దిగితే చాలు. నేరస్థుడు పోలీసులకు చిక్కినట్టే. ఘటన స్థలంలో వర్ష ఉందని తెలిస్తే నేరస్థులకు హడలే... ఎలాంటి నేరస్తుడికైన వర్షను చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. హైదరాబాద్ ఇంటిలిజెన్స్ విభాగంలో స్పెషల్ ట్రైనింగ్ పొందిన వర్ష విజయనగరంలో తమ సేవలు అందించింది.  పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్ష కు పెద్ద ట్రాక్ రికార్డ్ ఉంది. ఎంతో మంది అభిమానులును కూడా సంపాదించుకుంది వర్ష. దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా మరణించింది ఈ డేరింగ్ పోలీస్ డాగ్. 

           విజయనగరం జిల్లా పోలీసు శాఖలో సమర్థవంతంగా పని చేసిన పోలీస్ డాగ్ స్క్వాడ్ 'వర్ష' అనారోగ్యంతో మృతి చెందింది. విజయనగరంలోని అయ్యన్నపేట స్మశాన వాటికలో పోలీస్ అధికారి లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి పోలీస్ డాగ్ వర్ష కు పోలీసులు నివాళులు అర్పించారు. 2011 నవంబర్ 28న జన్మించిన 'వర్ష' హైదరాబాద్ ఇంటెలిజెన్స్ రక్షణ విభాగంలో శిక్షణ పొందింది. ఆ తర్వాత విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో ఇప్పటి వరకు ఎనలేని సేవలందిస్తోంది. 

        జిల్లాకు సంబంధించిన ఎన్నో కేసులను చేధించడంలో వర్ష కీలక పాత్ర పోషించింది. పోలీస్ శాఖలో  ఎనిమిదేళ్ల పాటు సేవలందించిన  'వర్ష' జిల్లాలో సుమారు 130 కేసుల్లో అనుమానాల నివృత్తి చేయడంలో, క్లూస్ సేకరణలో సేవలందించింది. విజయనగరం మండలం ధర్మపురిలో జరిగిన హత్య కేసును, పార్వతీపురం మండలంలో జరిగిన మరో హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో వర్ష  కీలకపాత్ర పోషించింది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో వర్ష పోలీసుల్లో ఒకరిగా మారిపోయింది. అధికారులకు సైతం వర్షపై ప్రత్యేక అభిమానం ఉండేది. పోలీస్ టీమ్ లో వర్ష లేకపోవడంతో అధికారుల్లో చెప్పలేని బాధ అలముకుంది... 
 

Photo Gallery