BREAKING NEWS

లంచం - కధా కమామిషు

"లంచం ఇచ్చుట - తీసుకునుట రెండూ నేరమే!! ఎవరైనా లంచం అడిగితే ఫలానా నెంబర్ కు ఫోన్ చెయ్యండి !!!" ఇవీ ఇప్పుడు ఏ ప్రభుత్వ , ప్రవైట్ ఆఫీసులుకు వెళ్లినా మనకు ముందుగా కనిపించే బోర్డులు.  

అంతెందుకు , దేవాలయానికి వెళ్ళినా అక్కడ కూడా  కానుకలు   హుండీలలోనే... తలనీలాలు, పూజారులకు డబ్బులు ఇవ్వకండి . టికెట్ కు తగిన డబ్బులు మాత్రమే చెల్లించండి. తలనీలాలు తీసే క్షురకుని దగ్గర కూడా  డబ్బులు ఇవ్వవద్దు. అని పెద్ద పెద్ద అక్షరాలలో బోర్డులు దర్శనం ఇస్తాయి. వారిని నిరంతరం గమనించడానికి ప్రతీ దగ్గర CC TV కెమెరాలు కూడా అమర్చబడి ఉంటాయి. 

అసలు వినియోగదారుడ తనపని చేయించుకోవడానికి అవసరమైన పూర్తి సరంజామాతోనే వెళ్తాడు. అంతేగాని అక్కడ లంచం అడుగుతారని గాని ఇవ్వాలని గాని అనుకోడు.  తీరా ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టాక ఈ బోర్డులు చెప్పకనే చెబుతాయి 

"ఇక్కడ లంచం ఇవ్వనిదే పని జరగదు అని." అప్పటిదాకా   నియోగదారునిలో లేని అభిప్రాయం ఈ బోర్డు ద్వారా వారి బుర్రలో ప్రవేశపెట్టడంలో అందరూ కృతకృత్యులయినట్లే .అప్పుడు మొదలు పెడతారు ఆలోచించడం... మన పని జరగాలంటే ఎవరిని సంప్రదించాలి ? ఎంత లంచం ఇవ్వాలి ? ఎన్ని రోజులలో పని జరుగుతుంది ? లంచం ఇవ్వకుండా మన పని జరగదా?  ఇలా అనేక విధాలుగా ఆలోచించి ఆలోచించి కాస్తో కూస్తో విప్లవ భావజాలం ఉన్నవారు లంచం ఇవ్వకుండా తమ పని చేయించుకోవాలని భావించి , సంబంధిత సీట్ కు వెళ్తారు.

  అప్పుడు మొదలవుతుంది అసలు కథ... ఆ రోజు అతను సెలవు. మరొకరు ఆ సీట్ వర్క్ చూడరు. ప్రక్కసీట్ లో ఉన్నవారిని అడిగితే  "ఇవాళ అతను సెలవు , రేపు రండి " అని , చాలా కూల్ గా చెబుతారు.  ఆ రేపు రండి అనడంతోనే  చిర్రెత్తుకొస్తుంది. ఎందుకంటే ??? కాలం విలువైనది కదా... నిజమే !!! అది ఎవరికైనా విలువైనదే మరి ..  వినియోగదారుడు కూడా ఎక్కడో ఉద్యోగమో , వ్యాపారమో , రోజు కూలో చేసుకుంటూ ఉంటాడు. అతను ఉంటున్న ఏరియా నుండి ఈ ఆఫీసుకు రావడానికి  డబ్బు , శ్రమ , టైమ్ ఖర్చు పెట్టుకుని వస్తే ఇక్కడి పరిస్థితి ఇది. ఇక చేసేది లేక  , ఈసురోమని ఇంటికి తిరుగుముఖం పట్టడమే. పోనీ , మర్నాడే మళ్ళీ వెళ్లడానికి అతని పరిస్థితి అనుకూలిస్తుందా ... వరసగా 2 రోజులు పని మానేస్తే యజమానులు ఒప్పుకోరు.

కాబట్టి మళ్ళీ ఎప్పుడో ఆ ఫైల్ పట్టుకుని బిక్కు బిక్కు మంటూ వెళ్తాడు. అల్లంత దూరం నుండే ఆ సీట్ లో  నిండైన విగ్రహం కనబడగానే  అమ్మయ్య అనుకుని గబ గబా వెళ్తాడు. వెళ్లిన 10 నిమిషాలకు గాని ఇతనికేసి తలతిప్పి చూడరు. ఎలాగో మొత్తానికి అతని దృష్టి తన మీద పడేలా చేసుకున్నాక  వచ్చిన విషయం వివరంగా చెప్పి , కూడా తెచ్చిన ఫైల్ అందిస్తాడు. ఆ ఫైల్ చూసిన వెంటనే ఫలానా  ఓ కాగితం లేదు అది పట్టుకు రండి చూద్దాం అంటాడు. అంత వరకూ అన్ని పేపర్స్ కరెక్ట్ గా పెట్టాను అని ఎంతో నిబ్బరంగా ఉన్న సగటు మనిషి ఒక్కసారి షాక్ కి లోనై , అందాక మీరు పని ప్రారంభించండి సార్ , ఆ కాగితం రెండు రోజులలో తెస్తాను అని ఎంత బ్రతిమాలినా , అబ్బే ! ఆ కాగితం పట్టుకుని రండి అని ఆ ఫైల్ అతనికిచ్చేసి , తన పనిలో తాను మునిగిపోతాడు.

చేసేదేమీ లేక మళ్ళీ ఇంటి ముఖం పట్టడమే .. ఇలా ... ఓ 4 , 5 సార్లు తిరిగేకా గాని అతనికి  జ్ఞానోదయం కాదు . లంచం లేకుండా పని జరగదు అని.  ఎంతో కొంత లంచం ఇచ్చుకుని , ఎదో ఒకలా పని జరిపించుకోవాలనే ధృడనిచ్చయంతో ఈ సారి వెళ్లి వాకబు చేస్తాడు తన పని గురించి. వెంటనే నవ్వుతూ ఎంతో ఆప్యాయంగా అంతకు మించి మర్యాదగా ఓ వ్యక్తి  ప్రత్యక్షమవుతాడు. చేతిలో ఉన్న ఫైల్ అతనే అందుకుని మనం చెప్పేలోగానే  ఇంత ఇవ్వండి , సాయంత్రమే వచ్చి మీ సర్టిఫికెట్ పట్టుకెళ్లండి అంటాడు.

అతను చెప్పిన మొత్తం అతనికి చదివించుకుని , సాయింత్రం ఎప్పుడు అవుతుందా అనుకున్నంతలోనే ఫోన్ చేసి మరీ మీ పని అయిపోయింది , వచ్చి తీసుకోండి అని చెబుతారు. ఇది నిజమా ? కలా ! అనిపిస్తుంది. ఇదీ లంచం యొక్క పవర్ ... అప్పుడు అనుకుంటాడా సగటు మనిషి , ఇన్నాళ్లూ అనవసరంగా డబ్బు , శ్రమ , టైమ్ వృధా చేసుకున్నానే .. ఈ లంచమేదో ముందే ఇచ్చేస్తే బాగుండేది కదా అని ,,, కానీ ,, ఏదైనా అనుభవంలోకి వస్తేనే కదా తెలిసేది.

ఇక నిర్మలంగా గుడికి వెళ్లి , తలనీలాలు సమర్పించుకుని ,  దైవ దర్శనం చేసుకుందామనుకుని  వెళ్ళినప్పుడు  ముందుగా తలనీలాలుకు ఉచితంగా , లేదా  ఓ పది రూపాయలు తీసుకునో టికెట్ ఇస్తారు. టికెట్ తీసుకుని లోపలకు వెళ్తే  ఒక్కో క్షురకుడి ముందు  చాంతాడంత క్యూ ఉంటుంది. నిజాయితీగా ఉంటే తన వంతు వచ్చేసరికి గంట పైగా సమయం పడుతుంది. అప్పుడు మొదలవుతాయి సైగలద్వారా రాయబారాలు. వెంటనే అతను కేకేస్తాడు మీరు రండి బాబూ !!   అతను మీ అందరికన్నా ముందే వచ్చి , టికెట్ ఇచ్చేసి వెళ్లారు అని లైన్లో ఉన్నవారికి చెబుతాడు.

ఎన్ని CC TV  కెమెరాలు  ఉన్నప్పటికీ  "లంచం తన ప్రభావం తాను చూపిస్తుంది." ఆ తరువాతి ఘట్టం దర్శనం. ఇక్కడ కూడా బోల్డంతమంది జనం. అప్పటికే లంచాల ద్వారా పని సులువుగా చేయించుకోడానికి అలవాటు పడిన సగటు మానవుడు ఆ వైపుగా చూస్తాడు. ఇలాంటి వారికోసమే ఎదురుచూస్తున్న సదరు వ్యక్తులు ఠకీమని వాలిపోతారు. చక చకా బేరసారాలు అయిపోతాయి. డైరెక్ట్ దర్శనం అయిపోతుంది. ఇది కూడా లంచం పవరే !!!

 ఇంత కథ ఉన్న ఈ లంచానికి  చాలా పేర్లు కూడా ఉన్నాయి. బహుమానం , ఖర్చులు , తాంబూలం , కష్టానికి తగ్గ ప్రతిఫలం ,  ఇచ్చి పుచ్చుకోవడం , పనికి ఆహార పథకం  ఇలా అనేక నామధేయాలతో ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది. వేరొకరి పని చెయ్యడానికి అతని నుండి  లంచం తీసుకునే వ్యక్తి , మరో దగ్గర తన పని చెయ్యడానికి మరొకరికి లంచం సమర్పించుకోవాలి. "ఏదైనా ఒక నిర్జీవ వస్తువు కదలడానికి  ఎంతో కొంత బాహ్యశక్తి  అవసరం" అన్న సూత్రం లాగే.... "ఏదైనా పని జరగడానికి ఎంతో కొంత లంచం అవసరం

Photo Gallery