BREAKING NEWS

అభయమేదీ

నిర్భయ చట్టం... మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యేక చట్టం. ఢిల్లీలో ఓ మహిళపై జరిగిన దారుణం దేశం మొత్తాన్ని కుదిపేసింది. అయితే ఈ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత అయినా మహిళలపై లైంగిక దాడులు తగ్గాయా??  ప్రశ్నకు కచ్ఛితంగా నో అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే నేరాలు తగ్గకపోగా మరింత పెరిగాయని చెప్పాలి. 

             వరంగల్‌ జిల్లాలో ఇంటి డాబాపై నిద్రపోతున్న తొమ్మిది నెలల పసికందుపై ఓ మృగాడు లైంగిక దాడికి పాల్పడి ఆమె మరణానికి కారణమయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది... అలాంటి ఘటన మరువకముందే.. తాజాగా విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. సరదాగా ఆడించడానికి తీసుకెళ్ళి నాలుగేళ్ల చిన్నారిని అతి పైశాచికంగా అత్యాచారం చేసి ఆసుపత్రి పాలు చేశాడో దుర్మార్గుడు..
ఇలాటి ఘటనలు కొన్ని బయటకు వస్తుంటే మరికొన్ని కామ్ గా సెటిల్ చేసుకుంటున్నారు. 

                     ఏదైనా తప్పు జరిగితే మళ్లీ తిరిగి అదే తప్పు చేయడానికి ఎవ్వరైనా భయపడాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ లో ఉంది. ఎన్ని సార్లు , ఎంత మందిని అరెస్ట్ చేస్తున్నా ఇలాంటి ఘటనలు మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. 2016 లో 3.38 లక్షల కేసులు మహిళలపై దాడులు కేసులు నమొదయితే అందులో 11 శాతం రేప్ కేసులే ఉంటున్నాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు... మహిళలు అర్ధరాత్రి మాత్రమే కాదు. పట్ట పగలు కూడా భయం లేకుండా తిరిగి రోజులు కావని మహిళలు భయాందోళనకు గురవుతున్నారు.. 

                  ఇంటర్నెట్ లో లభించే అశ్లీల వీడియోలు, కంటెంట్ వలనే నేర ప్రవృత్తి పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. అయితే నేరానికి పాల్పడే వారిపై సరైన శిక్ష కూడా లేకపోవడంతోనే ఇలాంటి నేరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఇందాక చెప్పినట్టు రేప్ చేస్తే ఊహించలేని శిక్ష విధిస్తారు అనే భయం ప్రతి ఒక్కరిలో ఉండాలి. కానీ ఆ భయమే ఇప్పుడు నేరగాళ్లలో కనిపించడం లేదు. పోకిరి సినిమాలో చెప్పినట్టు చట్టాలు ఎక్కువయ్యే కొద్దీ ఏదో ఒక లొసుగు అడ్డు పెట్టుకొని తప్పించుకుంటున్నారు.

ఇప్పటికే పూర్తి కానీ కేసులు కోర్టుల్లో కొన్ని లక్షలు ఉన్నాయి. కానీ ఇలాంటి రేప్ కేసులు రెగ్యులర్ కేసులుగా కాకుండా స్పెషల్ గా ట్రీట్ చేయాలి. విచారణలో నిందితుడు ఎవరో తెలిసిన వెంటనే కఠిన శిక్షలు అమలుచేయాలి. అన్నింటి కన్నా ముందు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి బెయిల్ మంజూరు చేయకుండా నిలిపివేయాలి. అప్పుడే నేరస్థులకు భయం కలుగుతుంది. 

                      అలాగే అటు మహిళలు కూడా ఇలాంటి నేరాల పట్ల కాస్త అవగాహనతో ఉండాలి. చాలా వరకు అఘాయిత్యాలు చేస్తున్న వారు బాధితురాలికి తెలిసిన వారే అవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ రోజుల్లో అమ్మాయిలకు చిన్నప్పటి నుంచే సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణ ఇప్పించాలి.

ఎవరితో ఎలా మెలగాలి, ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే ఎలా ఎదుర్కోవాలి లాంటి అంశాలపై తర్ఫీదు ఇవ్వాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇంటికి వెళ్ళేవారు ఫోన్ ఛార్జింగ్ లో ఉంచుకోవాలి. వారి సమాచారం ఎప్పటికప్పుడు ఇంట్లో వారికి తెలియజేస్తూ ఉండాలి. బాగా తెలిసిన వారే కదా అనే నమ్మకంతో వాళ్ళు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మకూడదు. ఎక్కడికి ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులూ లేని హ్యాపీ లైఫ్ మీకే సొంతం

Photo Gallery