BREAKING NEWS

క్షణం క్షణం టీవీ వీ"క్షణం"

సమాచారం తెలుసుకోవలసిన అవసరం మనందరికీ ఉంది. మనకు తెలిసిన సమాచారం మేరకు మనం చేయబోయే పనులు ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు .. సరదాగా సినిమాకు వెళ్ళాలంటే , ఆ సినిమా ఏ ధియేటర్ లో ఆడుతోంది ? ఆ రోజు ఆటలు ఉన్నాయా ? ఏ కారణం చేతనైనా బందు చేస్తున్నారా ? ఆ రూటులో ట్రాఫిక్ ఎలా ఉంది ? మనం వెళ్లే సమయానికి  VVIP లు ఎవరైనా వస్తున్నారా ? అందువలన ఆ రూటు బ్లాక్ చేసారా ? ఇలాంటి అనేక విషయాలను ముందుగానే తెలుసుకుని మనం ప్రోగ్రాం ఫిక్స్  సుకుంటాం.. 

ఇలాంటి సమాచారం ఏదీ తెలుసుకోకుండా  అనుకున్నదే తడవుగా బయలుదేరిపోతే  ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కేవలం లోకల్ లో సరదాగా సినిమాకు వెళ్లాలనుకుంటేనే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు. దూర ప్రాంతాలు వెళ్ళాల్సినప్పుడు ఇంకెంత సమాచారం అవసరం ?? కాబట్టి  ఈ సమాచార సేకరణ అన్నది పూర్వ కాలం నుండీ నేటి వరకూ కొనసాగుతున్న  , భవిష్యత్తులో కూడా కొనసాగనున్న  ఒక నిరంతర ప్రక్రియ. 

           తొలి నాళ్ళల్లో సమాచార మార్పిడి సాంప్రదాయబద్దంగా ఉండేది. టముకు వేసి చెప్పడం ద్వారా కొంత , ఇరుగు పొరుగు వారి ద్వారా కొంత , వీధుల నాలుగు కూడళ్లలో కొంత , నూతుల వద్ద కొంత , వ్యవసాయ పనుల్లో కొంత , వారాంతపు సంతలలో కొంత , తిరునాళ్ళలో కొంత , సాంస్కృతిక కార్యక్రమాలలో కొంత... ఇలా అనేక మార్గాలలో ఒకరి ద్వారా మరొకరికి  సమాచార మార్పిడి జరిగేది. 

కాలక్రమేణా వచ్చిన మార్పులకి అనుగుణంగా ఈ సమాచార మార్పిడిలో  విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అందులో భాగంగానే టెలిఫోన్ సేవలు , తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని వలన దూర ప్రాంతాలలో ఉన్నవారి మధ్య  మాట్లాడుకోవడాలు ,  ఉత్తర , ప్రత్యుత్తరాలు వ్రాసుకునే వీలు కలిగింది. ఆకాశవాణి ప్రసారాల ద్వారా  కంటికి కనబడకుండా కేవలం వినబడే ప్రక్రియ ద్వారా సమాచారాన్ని వార్తల రూపంలో వినేవారు. గోడ పత్రికల పేరుతో  నలుగురికీ కనబడే గోడల మీద వ్రాసిన వ్రాతల ద్వారా కొంత సమాచారం తెలుసుకునేవారు.

  తరువాత కాలంలో చేతి వ్రాతతో కూడిన కరపత్రాలు ద్వారా మరికొంత సమాచారం తెలుసుకునేవారు. ముద్రించిన వార్తా పత్రికలు అందుబాటులోకి వచ్చాక దేశం నలుమూలలలో జరుగుతున్న విశేషాలు మన ఇంట్లో నుండే తెలుసుకోవడం మొదలయ్యింది.  అంతవరకూ కేవలం చెవులతో విని , కంటితో చదివి వార్తలు తెలుసుకునే స్థాయి నుండి దూరదర్శన్ అవిర్భావంతో ఎక్కడో జరిగిన విషయాలను మన " నట్టింట్లో " కూర్చుని చూసే స్థాయికి పెరిగింది. అది మొదలు మరి వెనక్కి తిరిగి  చూడక్కర్లేనంతగా సమాచార విప్లవం ప్రారంభం అయ్యింది. ఒకే ఒక్క న్యూస్ ఛానల్ నుండి కొన్ని వందల న్యూస్ మరియు  వినోదాత్మక ఛానల్స్ ఉద్భవించాయి.

సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఎక్కడి నుండి ఎక్కడికైనా నేరుగా మాట్లాడుకునే అవకాశం కలిగింది. స్మార్ట్ ఫోన్ కూడా వచ్చాక  విదేశాలలో  ఉన్నవారితో కూడా ఎదురుగా కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకునే అద్భుతమైన అవకాశం కలిగింది. 
   సరే... మనకు మనంగా ఎంత సమాచారం తెలుసుకోగలిగినప్పటికి వార్తా పత్రికలు , TV ల ద్వారానే వార్తలు తెలుసుకోవడానికి ఉత్సాహం  చూపిస్తాం. 

ఈ టీవీ ఛానల్స్ వారు మొదట్లో నాణ్యమైన వార్తలు ప్రసారం చేసేవారు. కానీ. వారిలో వారికే పోటీ పెరిగి , అందరికన్నా ముందే తమ ఛానెల్ లో ప్రసారం చేసేసి TRP రేటింగ్ పెంచుకోవాలనే తాపత్రయంలో  ఒక్కోసారి ఫేక్ న్యూస్ చెప్పేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ పేరుతో ఊరించడం , తీరా ఆ న్యూస్ లో పస లేకపోవడం ఇటీవల కాలంలో అన్ని ఛానల్స్ కామన్ గా  చేస్తున్నాయి. మూడు సెకెన్స్ లో చెప్పగలిగే  వార్తను అటు తిప్పి , ఇటు తిప్పి , చెప్పిందే చెప్పి , చూపించిందే చూపించి,  గంటల కొద్దీ  ప్రజల విలువైన సమయాన్ని హరిస్తున్నారు. జరిగిన విషయాన్ని  ఉన్నది ఉన్నట్లుగా  కాకుండా ,  వారికి అనుకూలంగా రకరకాల అంశాలు జోడించి ఒక్కో ఛానల్ వారు ఒక్కో విధంగా ప్రసారం చేస్తున్నారు. వీటికి తోడు మధ్యలో వాణిజ్య ప్రకటనలు. పోనీ , ఎలక్ట్రానిక్ మీడియా నిర్వహణ చాలా ఖర్చుతో కూడినది కనుక ఈ వాణిజ్య ప్రకటనలు ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు అనుకుందాం.

ప్రతీ క్షణం అతి ఖరీదైనది కనుక  కేవలం క్షణ కాలానికి అధిక మొత్తంలో వ్యాపార సంస్థల నుండి వసూలు చేస్తారు. కానీ , ఏ మాత్రం పస లేని , ఎవరికీ ఉపయోగపడని , అనవసరమైన వార్తలను పదే పదే గంటల సమయం ప్రసారం చేసి అటు ఛానల్స్ వారి విలువైన సమయం మరియు ఆదాయం , ఇటు ప్రజల విలువైన సమయం వృధా చెయ్యడం ఎందుకో అర్ధం కాని విషయం. TV ఛానల్స్ యాజమాన్యాలు ఈ పధ్ధతి  మానుకోవాలంటే TRP రేటింగ్ లు ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పాలి.

ఛానల్స్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలే కానీ , ఆ పేరుతో లోప భూయిష్టమైన పోటీ  ఉండకూడదు. వేగంగానూ ,  సూటిగానూ , నిజాయితిగానూ , నిష్పక్షపాతంగానూ  వార్తను ప్రసారం చెయ్యాలి.  అంతేగానీ ,, TV సీరియల్ లాగ  , TV లో బ్రేకింగ్ న్యూస్ కూడా సాగకూడదు. ఇక  ఈ ఛానల్స్ లో చర్చల విషయానికి వస్తే , ఏదో ఓ పనికి మాలిన విషయం మీద కొంతమందిని చర్చకు పిలవడం , వారందరూ లైవ్ లోనే బూతులు మాట్లాడ్డం , ఒక్కోసారి కొట్టుకోవడం కూడా జరుగుతోంది.

ఏవైనా హిందూ పండగలు , గ్రహణాలు వంటివి వచ్చినపప్పుడు  శాస్త్రాన్ని ఔపాసన పట్టిన మహా పండితులను ,  ఏమాత్రం శాస్త్ర పరిజ్ఞానం లేని హేతువాదుల ముసుగులో ఉన్న కొంతమందిని , ఇతర మతస్తులను పిలిచి చర్చలో కూర్చోబెట్టడం. ఇక ఆ చర్చ చూడాలి ... అన్నీ తెలిసిన పండితులకు , ఏమీ తెలియని, కనీస సంస్కారం లేని పామరులకు విచిత్రమైన సంవాదం. శాస్త్ర ప్రామాణికంగా వీరు చెప్పే విషయాలకు ,  తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే పామరుల విషయాలకు ఎక్కడ పొంతన కుదిరేను ?? పోనీ ఆ చర్చనైనా పూర్తి కానిస్తారా ?? వారికి కేటాయించిన టైమ్ అవగానే అర్ధాంతరంగా చర్చను ఆపించేస్తారు ఘనత వహించిన  సమన్వయకర్త గారు. సోషల్ మీడియా సంగతి సరే సరి ...

ఎవరు ఎక్కడ ఎందుకు పుట్టిస్తారో తెలియదు కానీ ,   నీళ్ళల్లో నిప్పులు పుట్టిస్తారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు. ఏది నిజమో ? ఏది అబద్ధమో ? తెలియని పరిస్థితి. శాస్త్రజ్ఞులు తమ జీతాన్ని ధారబోసి, భవిష్యత్ తరాల సౌఖ్యం కోసం కనిపెట్టిన అద్భుతమైన ఆవిష్కరణలను  అభిలషనీయమైన మార్గంలో గొప్పగా వినియోగించుకోవడం చేత గాక , మొత్తానికి మనమంతా అదో రకమైన మాయలో , మరో  రకమైన మత్తులో జోగుతున్నాం... శాస్త్రవేత్తలారా మన్నించండి ....

Photo Gallery