BREAKING NEWS

చందనం ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆధ్యాత్మికం

 ఆనాటి కాలం నుండి చందనంని మనం పూజల్లో ఉపయోగిస్తూ ఉన్నాము. చందనానికి ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. చందనం అనేక విధాలుగా మనం ఉపయోగిస్తూనే ఉన్నాం. అయితే చందనం వల్ల ఉపయోగాలు ఏమిటి?  దానికి అంత ఘనత ఎందుకు? అయితే ఆనాటి కాలం నుంచి కూడా చందన చర్చ భోగ ప్రదము, శుభప్రదము, ఆరోగ్యప్రదము, ఆహ్లాదకరం ఆధ్యాత్మికము.

అయితే ఈ చందనం భారతీయులకు చెందిన ఒక వైభవం. ఎవరినైనా గౌరవించడానికి చందనంని ఉపయోగిస్తూ ఉంటాము. అంతెందుకు ఏ పెళ్లిళ్లు అయినా పేరంటాలు అయినా ఆడ, మగ అనే భేదం లేకుండా ఆడవాళ్ళకి మెడ మీద మగవాళ్ళకి చేతుల మీద చందనాన్ని పూస్తారు. అలానే శుభలేఖల మీద కూడా ''మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి'' అని రాస్తారు. అంటే మేము చేసే అతిథి మర్యాదలు స్వీకరించమని అర్థం. ఇలా ఎవరినైనా గౌరవించాలన్నా, సత్కరించాలన్నా చందనం పూస్తారు. 
 
పూర్వం అయితే ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే వాళ్ళకి చందనం ఇవ్వకుండా పంపేవాళ్ళు కాదు. ఇదిలా ఉంటే ఇప్పటికీ కూడా మనం పూజలో చందనం తప్పక ఉపయోగిస్తూ ఉంటాము. కుంకుమ పసుపుతో పాటు చందనాన్ని కూడా భక్తితో అర్పిస్తాము. అలాగే లఘువుగా పంచోపచారాలు చేసినా అందులో తప్పక గంధం ఉంటుంది. అలానే సుగంధ ద్రవ్యాలు సమర్పించినప్పుడు తప్పకుండా చందనం ముఖ్యమైనది. శివుడికి అభిషేకం చేసినప్పుడు కూడా  గంధం తప్పకుండా సమర్పిస్తారు. అంతెందుకు మన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఎప్పుడూ చందనం పూతతో భక్తులకు దర్శనమిస్తారు అలానే హిందువులు చేసుకునే అక్షయ తదియ నాడు చందనోత్సవం కూడా జరుపుతారు.
 
ఔషధాలలో చందనం: 
 
ఆయుర్వేద వైద్యంలో కూడా చందనాన్ని ఉపయోగిస్తారు. చందనాది వటి, చందనావసం వంటి మొదలైన ఔషధాలలో వాడతారు. సౌందర్య సాధనాలకి మూలం చందనం. సబ్బులు, అగరత్తులు లో ఉపయోగిస్తారు. 
 
చందనం వల్ల ఉపయోగాలు:
 
చర్మం కనుక జీవం లేకుండా వాడిపోయినట్లు కనిపించినా స్నానం చేసే ముందు కాస్త బరకగా ఉండే చందనం పొడిని ముఖం, మెడ , చేతులు, కాళ్ళకి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉండే మృతకణాల పొర తొలగిపోతుంది. దీనితో కొత్త కాంతి లభిస్తూ చర్మం మరింత నిగారింపుగా ఉంటుంది. అలానే సెన్సిటివ్ చర్మానికి చందనం పూస్తే మరింత అందంగా కనిపిస్తారు. అలానే చర్మంపై మచ్చలు తొలగిపోవడానికి కూడా చందనం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఒకవేళ మీ చర్మం ఎండకి కమిలినట్టయితే మీరు చందనంని ముఖానికి పట్టించండి. దీని వల్ల చల్లని ప్రభావం చూపుతుంది. లేకపోతే చందనంతో చేసిన క్రీమ్ ని  వాడినా మంచి ఫలితం ఉంటుంది.
 
ఇలా మీరు చందనం కనుక ఉపయోగిస్తే చర్మం వికసించి సహజ కాంతితో మెరుస్తూ ఉంటుంది. చెమట వల్ల వచ్చే దుర్గంధాన్ని తొలగించడానికి రోజూ కొన్ని చుక్కల చందన తైలాన్ని వాడండి దీని వల్ల దుర్గందం కూడా తొలగిపోతుంది. చందనం కనుక బొట్టు పెట్టుకుంటే మనసు, మస్తిష్కము ప్రశాంతంగా ఉంటుంది. కేవలం చందనం మాత్రమే కాకుండా చందన వృక్షం తాలూకా ఆకులు, వేళ్ళు, చెక్క అన్ని కూడా చందన సుగుణాలు కలిగి ఉంటాయి. చందనంతో చేసిన  కాటుక తయారు చేసుకుని కళ్ళుకి పెట్టుకుంటే కళ్ళు చల్లగా ఉంటాయి. అలానే మనసుకు కూడా చల్లదనాన్ని ఇస్తుంది గంధం. గంధంతో నూనె చేసుకున్నా కూడా చాలా మేలు చేస్తుంది చందనం యాంటీసెప్టిక్ గా కూడా పనిచేస్తుంది వేసవిలో అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది చందనం.
 
రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోతే స్నానం చేసే నీటిలో మూడు చుక్కల నూనె వేసుకుని స్నానం చేస్తే నిద్ర పడుతుంది. అరగదీసిన గంధం, బాదం పొడి, మల్లె పువ్వుల గుజ్జు చెంచా చొప్పున తీసుకుని దీనిని ముఖానికి ఫేస్ ప్యాక్  వేసుకుంటే.... ముఖంపై నలుపు తగ్గి క్రమంగా ప్రకాశవంతంగా మారుతుంది. మీరు ఎండలో వెళ్లినా కూడా మీ చర్మం నల్లగా మారిపోదు. వేసవిలో కనుక మీరు చందనం ఎక్కువగా వాడితే చర్మం చాలా తేటగా కనిపిస్తుంది.
 
ఒకవేళ  దురద చెమట పొక్కులు బాధిస్తూ ఉంటే రెండు చెంచాల గంధం పొడి, పుదీనా రసం, ముల్తానీ మట్టి, కలబంద గుజ్జు చెంచా చొప్పున తీసుకుని మిశ్రమంలా చేసి దానిని  రాసుకుని  పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా రెండు సార్లు చేస్తే చర్మం మెరుపుని సంతరించుకుంటుంది. గంధాన్ని కొంచెం కొబ్బరి నీళ్ళలో కానీ మంచి నీళ్ళలో కలుపుకుని తాగితే వెర్రి దాహం తగ్గుతుంది. అలానే చందన తైలం శరీరానికి చలవ చేస్తుంది. కాబట్టి ఒక చుక్క చందన తైలం మాడు మీద రాస్తే చాలు. నుదుటికి రాసుకుంటే తలలో వేడి తగ్గుతుంది. తలనొప్పి రాకుండా రక్షణనిస్తుంది. గుండెల మీద రాసుకుంటే హృదయానికి మేలు చేసి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. 
 
చందనం వల్ల ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం అని సంప్రదాయాలలో మిళితం చేసిన సంస్కృతి మనది.