BREAKING NEWS

వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి...? ఎలా జరుపుకుంటారు...?

ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం లో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వర లక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం మన ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. అయితే ఈ పండుగ హిందూ మతం ప్రకారం ఎంతో విశిష్టమైనది. అయితే వరలక్ష్మీ దేవిని వరాలు ఇచ్చే దేవతగా మనం కొలుస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మాత్రమే కాక కర్ణాటక లో కూడా అధికంగా స్త్రీలు కొలుస్తారు. ముఖ్యంగా వివాహమైన మహిళలు ఈ పండుగని జరుపుకుంటారు. అయితే ఈ రోజు కనుక దేవతను పూజిస్తే అష్ట లక్ష్మి పూజలతో సమానం అనే నమ్మకం తో కుటుంబ సమేతంగా ఈ పూజని జరుపుకుంటారు. భర్త, బిడ్డలు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు.

అయితే దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా ఉంటారని ప్రగాఢ విశ్వాసం. సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లభిస్తాయని దృఢమైన నమ్మకంతో ఆరోజు దేవిని పూజిస్తారు. ప్రతి ఒక్కరు వారి యొక్క సంప్రదాయాన్ని బట్టి అనుసరిస్తారు. అయితే పద్ధతి వేరైనా వ్రతం నియమ మాత్రం ఒకటే.

వ్రతం ఎందుకు చేసుకుంటారు..?

అష్టలక్ష్మి లో వర లక్ష్మీ దేవికి ఒక ప్రత్యేకత ఉందిట. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ దేవి పూజ శ్రేష్ఠమని శాస్త్రం చెబుతోంది. శ్రీ హరికి ఇష్టమైనది, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని, సర్వ మంగళ సంప్రాప్తి కోసం, సకల భక్తుల కోసం, సకల అభీష్టాలు కోసం, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తారు. వివిధ సంప్రదాయాల్లో మన దక్షిణ భారత దేశంలో ఆచరిస్తూ ఉంటారు. సకల శుభకరమైన సుమంగలి దాయకమైన వరలక్ష్మి దేవి పూజ చేస్తే తాము ఆనందంగా ఉంటారని నమ్మకం.

వరలక్ష్మి పూజ పద్ధతి:

పూజలో వివిధ భాగాలు ఉన్నాయి. అయితే ఏ పూజకైనా మొట్ట మొదటి చేసేది గణపతి పూజ. ఈ  వరలక్ష్మీ వ్రతం పూజ లో కూడా గణపతి పూజ మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఆచమనం, ప్రాణాయామం, సంకల్పం, కలశ పూజ, ఉద్వాసన, వరలక్ష్మి పూజ, ప్రాణ ప్రతిష్ఠ ధ్యానం, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఆభరణం, కంచుకం, గంధం, అక్షతలు, పుష్పాలు, ఆదాంగా పూజ, వరలక్ష్మీ దేవి అష్టోత్తర శతనామావళి, ధూపం, దీపం, నైవేద్యం, పానీయం, తాంబూలం, హారతి, మంత్రపుష్పం, ప్రదక్షిణం, సర్వోపచారాలు, తోరగ్రంథి పూజ మంత్రం, వరలక్ష్మి వ్రత కథ, క్షమా ప్రార్థన, నీరాజనం, అనుగ్రహం, వాయన దానము, ఉద్వాసన.

ఇలా ఈ క్రమంలో ఈ పండుగని జరుపుకోవాలి. అలానే పూజ నైవేద్యం లో ఐదు కానీ తొమ్మిది కానీ నైవేద్యానికి వండి నైవేద్యం పెట్టాలి.  అలాగే ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు పూజ చేసి వరలక్ష్మీ దేవిని ప్రార్ధిస్తారు.  ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు పూజ చేసి పేరంటం పెట్టుకుంటారు.

వరలక్ష్మీ వ్రతం పురాణగాథ:

స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీ దేవికి వివరించడం  జరిగింది. అయితే లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాల తో, పుత్ర పౌత్రాదులను పొందడానికి వీలుగా ఓ  వ్రతాన్ని చెప్పమని పార్వతి దేవి ఆది  దేవుడిని కోరగా ... అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు. అయితే అదే సందర్భం లో శివుడు ఆమెకు చారు మతీ దేవి వృత్తాంతాన్ని తెలియ చేశాడట. అయితే భర్త పట్ల ఆదరాన్ని అత్త మామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలిగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉంటుంది. 

మహా లక్ష్మీ దేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మ వారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుంది. ఆ మహా పతివ్రత పట్ల వర లక్ష్మీ దేవికి అనుగ్రహం కలిగి స్వప్నం లో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. అయితే శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తనని ఆరాధించమని కోరగా..... వరాలు ఇస్తానని ఆమెకు దేవ దేవి అభయమిస్తుంది. వర లక్ష్మీ దేవి చెప్పడం తో చారుమతి వర లక్ష్మి వ్రతాన్ని ఆచరించి సమస్త సిరి సంపద పొందుతుంది. అందుకని ఈశ్వరుడు గౌరీ కి చెప్పాడని  పురాణ కథనం. అయితే ముఖ్యంగా స్త్రీలు సకల ఐశ్వర్యాలతో, పుత్ర పౌత్రాదులను పొందడానికి వీలుగా ఈ వ్రతాన్ని నోచుకోవడం జరుగుతుంది. కనుక పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పక చేసుకుంటారు. 

''మంగళ గౌరీ మముగన్న తల్లీ!
మా మనవి దయతో వినువామ్మా...!


ఇలా శ్రావణ మాసం లో వచ్చే మంగళ వారాల నాడు మంగళ గౌరీ పూజ కూడా పెళ్ళైన స్త్రీలు చేసుకుంటారు. మంగళ  గౌరీకి పూజ చేస్తే కూడా స్త్రీలు సకల ఐశ్వర్యాలతో, పుత్ర పౌత్రాదులను కలిగి ఉంటారని నమ్మకం.