BREAKING NEWS

అలా... అంతరిక్షంలోకి!

 అందరికీ ఓ కల ఉంటుంది. 
 నిత్యం కళ్లలో మెదులుతుంటుంది. 
 కానీ నిజంలో మాత్రం అట్టే నిలబడదు. 
 కొందరూ కలని చేరుకుంటే, ఇంకొదరికి ఆ కలె చేరువవుతుంది. 
అవకాశమే అందలమెక్కిస్తుంది. అలాంటి కలె తనది. అటువంటి అవకాశమే తనను చేరుకుంది. 
శిరీష తనతో పాటు మరో నలుగురుతో కూడిన బృందం మరో వారంలో తెల్లవారుజామున నింగిలోకి పయనం కానుంది. 

చిన్నప్పుడు ఆకాశంలో చందమామను చూస్తూ, నక్షత్రాల్ని లెక్కపెట్టడం అదో సరదా! ఏకంగా అంతరిక్షంలోకి వెళ్తుంటే ఇక ఆ సంతోషానికి హద్దులుంటాయా.. అలాంటి అరుదైన అవకాశమే అందుకుంది మన తెలుగమ్మాయి. 
తనకి కంటిచూపు సమస్య ఉన్నా, దాన్ని ఖాతరు చేయకుండా, చదువే ధ్యేయంగా, ఉద్యోగంలో పైస్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగింది.

ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్తున్న రెండవ తెలుగమ్మాయిగా ప్రపంచ రికార్డులకెక్కింది. ఎందరో మన్ననల్ని పొందింది. తన తల్లిదండ్రులకే కాదు, మన దేశానికి పేరు తెచ్చింది. అస్సలు ఈ ప్రయాణం తన చిన్ననాటి నుంచే మొదలైనట్లుగా తెలుస్తోంది. ఇంతవరకు ఆమెను దోహదం చేసిన అంశాల నుంచి ఆకాశ ప్రస్థానం వరకు సాగిన ప్రయాణం గురించి ప్రత్యేకంగా...
 
ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా జానపాడు గ్రామంలో 1987లో జన్మిచింది శిరీష. ఆమె తండ్రి బండ్ల మురళీధర్‌, తల్లి అనురాధ. ఇద్దరూ యూఎస్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నారు. అక్క ప్రత్యూష వర్జీనియా యూనివర్సిటీలో సైంటిస్ట్‌గా ఉన్నారు. 
 
బాల్యం నుంచే...

శిరీషకు నాలుగేళ్లునప్పుడు వీళ్ల కుటుంబం టెక్సాస్‌లోని హోస్టన్‌కు 
మకాం మార్చింది. అలా అక్కడే స్థిరపడ్డారు కూడా. బాల్యం నుంచే స్పేస్‌సైన్స్‌ మీదున్న ఇష్టంతో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కోర్సు చేయాలనుకుంది.
ఫైలెట్ అయి, తర్వాత నాసాలో చేరే అవకాశం ఉంటుందని కలలు కనేది. కానీ చిన్ననాటి నుంచి తనకు కంటి చూపు సమస్య ఉండడంవల్ల ఫైలెట్ అయ్యే అవకాశం లేదని అర్థమైంది. 
 
చదువు...

ఇంటర్‌లో ఉండగా, ఒక ప్రైవేటు స్పేస్‌ టూరిజం సంస్థ గురించి తెలుసుకుంది. నాసా మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ప్రైవేట్ స్పేస్ లు అంతరిక్షంలోకి పంపగల అవకాశాలున్నాయని అప్పుడే తెలుసుకుంది. అందుకుగానూ పర్‌డ్యూ విశ్వవిద్యాలయంలో ఏరోనాటికల్‌ అండ్‌ అస్ట్రోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందింది. తర్వాత కమర్షియల్‌ స్పేస్‌ఫ్లైట్‌ ఫెడరేషన్‌ (సీఎస్ఎఫ్‌)లో ఏరోస్పేస్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఆధునాతన విమాన విడిభాగాలను రూపొందించేది. సాంకేతిక అంశాలతోపాటు, వ్యాపార అంశాల గురుంచి కూడా తెలుసుకోవాలనుకుంది. దాని కోసం జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీలో స్పేస్‌ ఇండస్ట్రీలో ఎంబీఏ పూర్తి చేసింది.
 
ఉద్యోగం...

కమర్షియల్‌ స్పేస్‌ ఫెడరేషన్‌ సంస్థలో ఇంటర్వ్యూకు హాజరై, ఎంపికయ్యింది. ఉద్యోగం చేస్తూనే మాథ్యూ ఇసాకోయిజ్‌ అనే ఫెలోషిప్‌లో పాల్గొని అక్కడ అనేక అంశాల్ని నేర్చుకుంది. అలా 2015లో రిచర్డ్‌ బాన్సన్‌ ‘స్పేస్‌ఫ్లైట్‌’ అనే సంస్థ ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా చేరింది. అట్నుంచి అంచెలంచెలుగా ఎదిగి పరిశోధనా విభాగంలో వైస్‌ ప్రెసిడెంట్‌ గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఆ సంస్థ లాంచర్‌వన్‌, స్పేస్‌షిప్‌ -2 ప్రోగ్రాం సక్సెస్ అవ్వడంలో ఆమె కీలక పాత్ర వహించింది. 
 
బాధ్యతలు...

మరోపక్క అమెరికన్‌ ఆస్ట్రోనాటికల్‌ అండ్‌ ఫ్యూచర్‌ స్పేస్‌ లీడర్స్‌ ఫౌండేషన్‌ బోర్డ్ డైరెక్టర్లలో సభ్యురాలిగా ఉంటూనే, పర్డ్యూ యూనివర్సిటీలో యంగ్‌ ప్రొఫెషనల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ సభ్యురాలిగానూ వ్యవహరిస్తోంది.     
 
అలాఅంతరిక్ష ప్రయాణం
 
ఇప్పుడు ఈ ‘స్పేస్‌ఫ్లైట్‌’ సంస్థ అంతరిక్షంలో నాలుగో స్పేస్‌ ట్రిప్ ను ప్రవేశపెట్టనుంది. దీనిని ఈ నెల 11వ తేదీన తెల్లవారుజామున ఈ సంస్థ స్పేస్‌క్రాఫ్ట్‌ న్యూ మెక్సికో నుంచి నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. దీంతో అంతరిక్షంలో అడుగుపెట్టనున్న తొలి ప్రభుత్వేతర
ధనికురాలిగా రిచర్డ్‌ బ్రాన్సన్ ఉండగా, కల్పనా చావ్లా తర్వాత భారత్‌లో పుట్టి స్పేస్‌లో అడుగుపెట్టబోతున్న రెండో మహిళగా పేరొందనుంది మన తెలుగుతేజం. భారత సంతతికి చెందిన శిరీష నాలుగో వ్యోమగామిగా చాలా ముఖ్యపాత్రను పోషించనుంది. తనతోపాటు బెత్‌ మోసెస్‌ అనే మరో మహిళ కూడా ఉన్నారు.
 
సేవ చేస్తూ...

అమెరికాలో శిరీష విజయాలకు, సేవలకుగానూ 2014లో తానా(తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) నుంచి ‘యూత్‌ స్టార్‌ అవార్డు’ను అందుకుంది.
కమర్షియల్‌ స్పేస్‌ టెక్నాలజీపై ఆసక్తిని చూపే విద్యార్థుల కోసం రూపొందిస్తున్న  మాథ్యూ ఇసకోవైట్జ్ ఫెలోషిప్ ప్రోగ్రాంలో తనవంతుగా శిరీష సహకారం అందిస్తుంది.
 
చిన్నప్పటి నుంచి కొత్త విషయాలపట్ల ఆసక్తి పెరగడం, వాటిని నేర్చుకోవడం తనకు అలవాటు.

చదువు, ఆపై ఉద్యోగంతో తీరిక లేకున్నాగనీ శిరీష మాత్రం ఎంత బిజీగా ఉన్నా తన మూలాలు మరిచేది కాదు. తన తాతయ్య, నాన్నమ్మలకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకునేది. అంతేకాదు వీలు చిక్కినప్పుడల్లా స్వదేశానికి వచ్చి తన వాళ్ళతో సరదాగా గడిపేదట.

కాబట్టి మనలో ఎంతో స్ఫూర్తి నింపిన శిరీషలాంటి అమ్మాయిలు తాము మెచ్చిన రంగాల్లో రాణించాలని ఆశిద్దాం.