BREAKING NEWS

నటనకు నిలువెత్తు రూపం: దిలీప్ కుమార్

'జబ్ ప్యార్ కి యాతో డర్నా క్యా..' అనే పాటలో ప్రేయసి... ప్రేమను తెలపడానికి భయమెందుకు అని పాడగా… మౌనభరిత ప్రేమికుడిగా తనలో తాను వేదన చెందుతాడు.

'సుహాన సఫర్ ఔర్ యే మౌసమ్ హసిన్...' అనే మరో పాటలో ప్రకృతికి పరవశించి పాడే హీరోగా మనసుల్ని తేలికపరిచాడు.  

"జో లగ్ సచి తర్ఫదరి కి కసం కాట్ హై….జిందగి ఉంకే బడే కఠిన ఇంటిహాన్ లేటి హై"... సత్యంవైపు అడుగేసిన వారికి జీవితం ఎన్నో కఠిన పరీక్షలు పెడుతుందని తండ్రి కొడుకుతో అన్న సంభాషణ 'శక్తి' చిత్రంలోనిది. దిలీప్ తండ్రిగా, అమితాబ్ కొడుకుగా చేశారు. అప్పట్లో ఈ డైలాగ్ హిట్.
 
బాలీవుడ్ చిత్రసీమలో తన నటనతో చెదరని ముద్ర వేసిన దిగ్గజం... దిలీప్ కుమార్. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటనే చెప్పాలి. ఇందుకూ నివాళిగా ఆయన సినీ, జీవిత విశేషాలను ఈరోజు తెలుసుకుందాం:
 
జననం:-

1922 డిసెంబరు 11న పాకిస్థాన్ లోని పెషావర్‌లో  కిస్కాఖవానీ బజార్ లో జన్మించారు దిలీప్ కుమార్. అసలు పేరు యూసుఫ్ ఖాన్. తండ్రి లాల్ గులాం సర్వార్ ఖాన్, తల్లి ఆయుషా బేగం. సోదరి నసిర్ బేగం. అస్లాం ఖాన్, ఏహాన్ ఖాన్, నూర్ మొహమ్మద్, ఆయుబ్ సర్వార్ లు సోదరులు. తండ్రి పండ్ల వ్యాపారి. నాసిక్ లో దేవులాలిలోని బర్నేస్ స్కూల్ లో దిలీప్ చదువుకున్నారు.
 
సినీ ప్రస్థానం:-

ఒకానొక సమయంలో నిర్మాత దేవికారాణి తన సినిమాలో హీరో కోసం చూస్తుండగా పండ్లు అమ్ముతూ కనిపించిన యూసుఫ్ ఖాన్ ను చూసి అతనిలో హీరో లక్షణాలున్నాయని  ఆమె సినిమాలోకి తీసుకున్నారు. అలా 1944లో ‘జ్వార్‌భాటా'’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. కానీ తొలి చిత్రం పరాజయం పాలైంది. హాలీవుడ్ నటుడు జేమ్స్ స్టువర్ట్ స్ఫూర్తితో నటనలో ఎన్నో మెళకువలను నేర్చుకొని తనకంటూ కొత్త శైలిని ఏర్పరచుకున్నారు. తర్వాత  
1946లో 'మిలన్', 1947లో తీసిన 'జుగ్ను' సినిమాలతో హిట్ అందుకున్నారు. 

1951లో వచ్చిన దీదార్, 1955లోని దేవదాస్, 1958లో మధుమతి చిత్రాలతో ఆయన నటనకుగానూ "ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్"గా ఫేమ్ వచ్చింది. 
ఆ తర్వాత విధాత, క్రాంతి, నయాదౌర్, అందాజ్, గంగాజమున, దేవదాస్, శక్తి, రామ్ ఔర్ శ్యామ్, కర్మ లాంటి చిత్రాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి.

1960లో కె. ఆసిఫ్ నిర్మించిన "మొఘల్ ఎ ఆజం"లో  ఆయన నటన ఓ అద్భుతం.

ఆయన నటించే సినిమాల్లో "మెథడి యాక్టింగ్" కనబర్చేవారు. అంటే పాత్రలో పూర్తిగా లీనమవ్వడం అన్నమాట. దీనివల్ల మానసిక సమస్యలు వస్తాయని వైద్యులు చెప్పడంతో విషాద ప్రేమకథలను వీడి కామెడీ పాత్రలు చేయడం మొదలుపెట్టారు.

1950లో ఒక్కో సినిమాకు సుమారుగా లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా ఆయన పేరొందారు. 

1962లో బ్రిటీష్ నటుడు డేవిల్ లీన్ తన 'లారెన్స్ ఆఫ్ అరేబియా' చిత్రంలో షెరీఫ్ అలీ పాత్ర కోసం ఈయన్ని సంప్రదించగా చేయనన్నారట.
1998లో వచ్చిన 'ఖిలా'నే ఆఖరి చిత్రం.

'కళింగ' చిత్రానికి దర్శకత్వం, 'గంగా జమున' చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించారు. దాదాపు ఆరు దశాబ్దాలవరకు భారత సినీరంగంలో వెలుగొందారు. దిలీప్ నటనకు నిలువెత్తు రూపమని దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే ప్రశంసించారు.
 
అవార్డులు:-

బెస్ట్ యాక్టర్ గా 8సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు తీసుకున్నారు.

భారతీయ చిత్రరంగానికి ఆయన అందించిన సేవలకుగానూ 1994లో 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు' లభించింది.

భారత ప్రభుత్వం 1991లో పద్మ భూషణ్, 2015లో పద్మ విభూషణ్ అవార్డులతో ఆయనను సత్కరించింది.

1998లో పాక్ ప్రభుత్వం నిషాన్- ఇ- ఇంతియాజ్ అవార్డుతో దిలీప్ కుమార్ ను గౌరవించింది.

1997లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

1993లో 'ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచివెమెంట్' అవార్డును సొంతం చేసుకున్నారు.
భారత్ లోనే ఎక్కువ అవార్డులు అందుకున్న నటుడిగా 'గిన్నిస్ వరల్డ్ రికార్డు'లకెక్కారు.

ప్రఖ్యాత ఫిలింఫేర్ లో మొట్టమొదటిసారిగా 'దాగ్ అవార్డు'ను అందుకున్న నటుడిగా దిలీప్ కుమార్ నిలిచారు.

◆మహారాష్ట్రలో కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా చేరి సేవలందించారు.
 
◆1966లో సైరా బానును ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. అతనికి 44 ఏళ్ళు, ఆమెకు 22 ఏళ్లు. ఇద్దరు కలిసి జంటగా ఎన్నో సినిమాలు చేశారు.

◆దిలీప్ కుమార్ ఉర్దూ, పాష్టో, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు.
 
◆మొదటి సినిమా నిర్మాత దేవికా రాణి తెరపై వేరే పేరు ఉండాలని కోరడంతో, యూసుఫ్ ఖాన్ కు బదులుగా దిలీప్ కుమార్ అనే పేరును మార్చారు. అదే పేరు తర్వాత కూడా కొనసాగింది.
 
మరణం:-

గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా, ముంబయిలోని హిందుజా ఆసుపత్రిలో చేర్చారు. కానీ చికిత్స పొందుతూ ఈ నెల 7న ఉదయం 7.30గంటలకు తుదిశ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 98 సంవత్సరాలు. అదే రోజు             
సాయంత్రం 5గంటలకు ముంబయిలోని జుహు శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.