BREAKING NEWS

వ్యాపార దిగ్గజం : ఎలన్ మస్క్…

బాల్యంలో వీడియో గేమ్స్ ఆడటం కన్నా, వాటిని సృష్టించడాన్నే ఎక్కువగా ఇష్టపడ్డాడు. 

ఒక సంస్థను స్థాపించి సజావుగా నడిపించడమే కష్టం.. అలాంటిది,
ఏకంగా మూడు, నాలుగు సంస్థల్ని స్థాపించి సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి చేరుకుని,  స్పేస్ఎక్స్ లాంటి రాకెట్ ప్రయోగాలతోనే కాక, ఎలక్ట్రానిక్ కార్లను తయారుచేసే టెస్లా కంపెనీకి సిఈవోగా ఎదిగిన వైనం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. అటువంటి ఎలన్ మస్క్ జీవిత, వ్యాపార విశేషాల గురుంచి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
జననం:-

ఎలన్ మస్క్ 1971లో జూన్ 28న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు. తండ్రి పేరు ఎర్రోల్ మస్క్. దక్షిణాఫ్రికాలో ప్రఖ్యాత ఇంజనీర్.
తల్లి పేరు మే మస్క్ కెనడా మోడల్,  కవర్‌గర్ల్ ప్రచారంలో నటించింది. సోదరుడు కింబాల్, సోదరి టోస్కా.మస్క్ 10 సంవత్సరాల వయసప్పుడు అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తిని ఉండటంతో, సొంతంగా ఎలా ప్రోగ్రామ్ చేయాలో నేర్చుకున్నాడు. 12 ఏళ్లకే మొట్టమొదటి వీడియో గేమ్ "బ్లాస్టార్" సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు. ఆ తరవాత ఆ గేమ్ ను 500లడాలర్లకు అమ్మేశాడు. 
 
చదువు:-

1888లో వర్ణ వివక్ష కారణంగా మస్క్ దక్షిణాఫ్రికా వదిలి కెనడా వెళ్లిపోవాలనుకున్నాడు. అలా 17 ఏళ్ళ వయసులో 1989లో ఒంటారియోలోని కింగ్స్టెన్ లోని క్వీన్స్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేశాడు. 1992లో ఫిలడెల్వియాలోని  పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పట్టభద్రుడయ్యాడు. తర్వాత  భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డి కోసం కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. కానీ అతనికున్న ఆలోచనవల్ల రెండు రోజులకే ఆ చదువును మానేశాడు. 
 
వ్యక్తిగత జీవితం:-

2000ల సంవత్సరంలో జస్టిన్ విల్సన్ తో మస్క్ కు వివాహం జరిగింది. వీరికి ఆరుగురు పిల్లలు. వాళ్లలో మొదటి కొడుకు 10వారాల వయసులో శిశుసంబంధ వ్యాధితో చనిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు విల్సన్ తో విడిపోయారు.
2010లో నటి తలులా రిలేని రెండో  వివాహం చేసుకున్నారు. కానీ ఆమెతో ఎక్కువకాలం బంధంలో ఉండలేదు. తర్వాత గ్రిమ్స్ ను పెళ్లి చేసుకున్నాడు. 
వీరికి ఓ కొడుకు.
 
కంపెనీలు:
జిప్ 2 కార్పొరేషన్:-
1995లో తన సోదరుడితో కలిసి కోడింగ్ కు సంబంధించిన జిప్-2 కార్పొరేషన్ ను మొదటగా ప్రారంభించాడు. 
1999లో కాంపాక్ కంప్యూటర్ కార్పొరేషన్ సంస్థకు ఈ జిప్ -2ను 307 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు.
 
పేపాల్:-

1999లో జిప్-2 సంస్థను అమ్మడం వల్ల వచ్చిన డబ్బుతో ఎక్స్.కామ్ అనే వెబ్సైట్ ను ప్రారంభించారు. ఇది ఆన్లైన్ లో  నగదు బదిలి చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాతి సంవత్సరంలో ఈ వెబ్సైట్ ను పేపాల్ గా మార్చాడు. 2002 అక్టోబర్ లో  పేపాల్‌ను ఈ-బే 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అలా మస్క్ మొదటిసారి బిలియనీయర్ అయ్యారు. 
 
స్పేస్ఎక్స్:-

స్పేస్, రాకెట్ల గురుంచి తెలుసుకోవాలనే తపన చిన్నప్పటినుంచే ఉండటంతో, వాటికి సంబంధించిన పుస్తకాలు చదివేవాడట. అలా మొదటిసారి ఒక ప్రైవేట్ స్పేస్ రాకెట్ ను అతితక్కువ ఖర్చుతో తయారు చేసి ఆకాశంలోకి     పంపించాలనుకున్నాడు. అందుకు తన దగ్గరున్న 1 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టి, తన మూడవ సంస్థ స్పేస్ఎక్స్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ ను 2002లో తీసుకొచ్చాడు. అలా మూడుసార్లు రాకెట్ ను అంతరిక్షంలోకి పంపించారు. కానీ అవి సక్సెస్ కాలేదు.

అప్పటికి నష్టంలో ఉన్న మస్క్ 2012 మే 22న నాలుగో ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. దాంతో నాసా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కి వస్తువులు రవాణా చేయడానికి స్పేస్ఎక్స్ తో 1.8 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
 
టెస్లా మోటార్స్:-

వాతావరణానికి హాని కలిగించే మామూలుకార్ల కంటే బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రానిక్ కార్లు ఆరోగ్యానికి, వాతావరణానికి మేలని ఆలోచించి, వాటిని తయారుచేయాలనుకున్నాడు. అంతకుముందే ఉన్న టెస్లా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థను మార్టిన్ ఎబెర్హార్డ్, మార్క్ టార్పెన్నింగ్ లు కలిసి స్థాపించారు. ఈ టెస్లా కార్ల కంపెనీలో కొంత పెట్టుబడి పెట్టాడు. అలా మొదటగా తయారైన కారు పెరి "టెస్లా రోడ్ స్టార్". దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 320కిలోమీటర్ల వరకు నడుస్తుందని ప్రచారం చేశారు. అందుకు బిబిసి ఛానల్ టాప్ గేర్ ప్రోగ్రాంను లైవ్ లో ప్రసారం చేసింది.

ఈ ప్రోగ్రాంలో 'టెస్లారోడ్ స్టార్'ని టెస్ట్ చేస్తే 80 కిలోమీటర్లు మాత్రమే వెళ్లడంతో,  మొదటి ప్రయత్నం విఫలమైంది. 
ఈ కారణంగా టెస్లా సంస్థ మస్క్ ని తొలగించింది. కానీ స్పేస్ ఎక్స్ లో వచ్చిన లాభాన్ని పూర్తిస్థాయిలో ఈ కంపెనీలో పెట్టాడు. అలా టెస్లా సంస్థకు సీఈఓ అయ్యాడు. కొత్త వాళ్ళను ఉద్యోగంలో చేర్చుకున్నాడు. రెండు సంవత్సరాల తర్వాత ఎన్నో మార్పులు చేసి సురక్షితంగా ప్రయాణించగలిగే టెస్లా మోడల్ ఎస్ సెడాన్‌ను తీసుకొచ్చాడు. ఇది అందరి ప్రశంసలు అందుకుంది. 2015లో మార్కెట్లోకి విడుదలైన మరో మోడల్ ఎక్స్ లగ్జరీ ఎస్‌యూవీ బాగా క్లిక్ అయింది. తక్కువ ఖర్చుతో కూడిన వాహనం మోడల్ 3ను 2017లో తీసుకురాగా, మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయిన కార్లలో టెస్లా ఒకటిగా నిలవడం విశేషం.
 
సోలార్సిటీ:-

ప్రకృతి మీద ఇష్టంతో ప్రతిచోటా వీలుగా సోలార్ టన్నెల్ ని ఫిక్స్ చేసుకునేలా  సోలార్సిటీని స్థాపించాడు.
 
హై-స్పీడ్ రైలు:-

కాలిఫోర్నియాలోని హై-స్పీడ్ రైలుకు ప్రత్యామ్నాయంగా మస్క్ 2013లో  హైపర్ లూప్ అనే వేగవంతమైన రైలును తీసుకురావలనుకున్నాడు. ఒక్కో బోగీలో 28మంది ప్రయాణించేలా ఏంజిల్స్ టు శాన్ ఫ్రాన్సిస్కో మధ్యగల 560కిమీల దూరాన్ని 35 నిమిషాల్లో చేరుకునేలా, గంటకు 1,220కిమీల వేగంతో రూపొందించేయాలనుకున్నాడు. ఇందుకూ 6 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని, ప్రతి రెండు నిమిషాలకు సగటున ఒక రైలు బయలుదేరినా, ప్రతి సంవత్సరం ఆ మార్గంలో ప్రయాణించేవారికి రవాణా తేలికవుతుందని మస్క్ పేర్కొన్నారు. ఇవేకాక వినూత్నంగా ఒక్కో చెట్టుకు 1 డాలర్ చొప్పున 1 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు. ట్వీట్టర్లో తన పేరునే "ట్రీలాన్" గా మార్చుకున్నాడు. 
 
ఎలోన్ మస్క్ ఇప్పుడు 186 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో రెండవస్థానాన్ని కైవసం చేసుకున్నారు. స్వదేశాన్ని వదిలి పరాయి దేశానికి వలస వచ్చినా, తన పేరునే ఒక మార్క్ గా ప్రపంచానికి చూపించాడు. అనతి కాలంలోనే మూడు దిగ్గజ కంపెనీలను స్థాపించి సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా టాప్ లో నిలిచాడు. కానీ మొన్నామధ్య కొన్ని వివాదాస్పద ట్వీట్లతో చర్చనీయాంశమయ్యాడు.