BREAKING NEWS

సినిమాల్లో చెరగని 'కోట'

తెలంగాణ భాషైన… 
రాయలసీమ యాసైన… 
ఏదైనా సరే ఆయన శైలిలో... 
కడుపుబ్బా నవ్విస్తాడు.
నెగటివ్ షేడ్ తో కొద్దిరోజుల్లోనే విలనిజానికి మారుపేరుగా మారిన 
మన నవ్వుల 'కోట'...
మొదట్లో ప్రతినాయకుడి పాత్రలో భయపెట్టినా, ఆ తర్వాత కమెడియన్ పాత్రల్లో హాస్యాన్ని పండించడం ఆయనకే చెల్లింది. అంతేనా సహానటుడిగా ఎన్నో పాత్రలు చేశారాయన.

ఇచ్చిన పాత్ర ఏదైనా సరే ఆయనను తప్ప వేరే ఎవ్వరిని ఊహించుకోలేనంతగా జీవించేస్తారు. అవార్డులు, పురస్కారాలు ఎన్నో అందుకున్నారు. తెలుగులోనే కాదు… ఇతర భాషల్లోనూ నటించి, డబ్బింగ్ కూడా ఆయనే చెప్పేవారు. 
'నాకేంటి.... మరి నాకేంటంటా' అంటూ పిసినారి లక్ష్మిపతి పాత్రలో చేసి, ఆపై ఎన్నో కామెడి ట్రాక్ లతో అలరించిన ఆ కోట శ్రీనివాసరావు గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
జననం:-

1947 జులై 10న కృష్ణా జిల్లాలోని కంకిపాడు గ్రామంలో జన్మించారు కోట శ్రీనివాసరావు. ఈయన తండ్రి కోట సీతారామాంజనేయులు వైద్యుడు. అన్నయ్య నర్సింహారావు, తమ్ముడు శంకరరావు. ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ఇంట్లో అంతా ముద్దుగా కోట అని పిలిచేవారు. కోటకి చిన్నప్పటి నుంచి నాటకాలంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. 
 
చదువు:-

ప్రాథమిక విద్యాభ్యాసం కంకిపాడులో, మాధ్యమిక విద్యను విజయవాడలో పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి అతన్ని డాక్టర్ని చేయడానికనీ మద్రాస్ పంపించారు. అలా మద్రాస్ కాలేజీలో చేరాడు కోట. కానీ నాటకాల మీద ఉన్న కోరికతో తన అన్నలా నాటక ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు. దీంతో డాక్టర్ చదువును మధ్యలో ఆపేసి బి.కామ్ లో చేరిపోయాడు. 
 
ఉద్యోగం:-

నాటకాలు వేస్తూనే ఉద్యోగం కోసం ప్రయత్నించేవాడు. ఆ ప్రయత్నంలో స్టేట్ బ్యాంక్ లో హెడ్ క్లర్క్ గా జాబ్ వచ్చింది. ఉద్యోగరీత్యా హైదరాబాద్ కి మకాం మార్చి, ఇక్కడే స్థిరపడ్డారు.

1968లో కోటకు రుక్మిణి గారితో వివాహమైంది. వీరికి ఓ కొడుకు. పేరు వెంకట ఆంజనేయ ప్రసాద్, ఇద్దరు కుమార్తెలు పల్లవి, పావని. కానీ దురదృష్టవశాత్తు 2010 జూన్ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కొడుకు మరణించాడు. ఇది ఆయన జీవితంలోనే పెద్ద వెలితి అని చెప్పొచ్చు.
 
సినీరంగ ప్రవేశం:-

నాటకాలు వేయడంలో కోటకు 20 ఏళ్ల అనుభవముంది. కానీ ఎప్పుడు ఆయన సినిమాలోకి రావాలని అనుకోలేదు. అనుకోకుండా 1978లో “ప్రాణం ఖరీదు” అనే చిత్రంలో కోట తొలిసారిగా వెండితెరపై కనిపించారు. 1982లో "మీరైతే ఏం చేస్తారు" అనే నాటకాన్ని రవీంద్రభారతిలో వేశారు. అది చూసిన టి.కృష్ణగారు తాను తీయబోయే "ప్రతిఘటన" సినిమాకు ప్రతినాయకుడి పాత్రలో తీసుకున్నారు. ఆ చిత్రంలో ఆయన బాగా నటించారు. అది చూసిన ప్రజలు తెలుగు సినీరంగానికి విలన్ దొరికాడని మెచ్చుకున్నారు. ఆ తరువాత జంధ్యాల దర్శకత్వంలో "ఆహా నా పెళ్ళంట" చిత్రంలో పిసినారి లక్ష్మీపతిగా నటించి నవ్వులు పూయించారు.

ఆయన ఒకపక్క ప్రతినాయకుడిగా, మరోపక్క హాస్యనటుడిగా, ఇంకోవైపు అనేక ముఖ్య పాత్రల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. 
'మామగారు' సినిమాలో కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ ల మధ్య జరిగిన హాస్య సన్నివేశాలు చూస్తే కడుపు చెక్కలే! వాళ్లిద్దరీ కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఆపై వెనక్కి తిరిగి చూడలేదు. ఎంతలా అంటే  ఉదయం 8 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు నిత్యం షూటింగ్ లో పాల్గొనేవారట. అంటే అంత తీరిక లేకుండా నటించేశారు. ఇప్పటివరకు దాదాపు 800లకు పైగా చిత్రాల్లో నటించి, మర్చిపోలేని పాత్రలు చేసి మెప్పించారు.   
 
◆కమెడియన్స్ లో బాబుమోహన్, అలీ.
యాక్టింగ్ లో జూ. ఎన్టీఆర్, బన్నీ అంటే ఆయనకు చాలా ఇష్టమట. ఇప్పటి జనరేషన్ కు ఆయన ఇచ్చే సలహా        " పెద్ద గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం ఉండాలని" అలా ఉండటం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
◆'ఆహా నా పెళ్ళంట' సినిమాకు రావుగోపాల్ రావుగారిని తీసుకుందామనుకున్నారట. కానీ ఆ పాత్రకు మీరైతేనే ప్రాణం పోయగలరని రామానాయుడుగారు అనడం విశేషం!
 
అవార్డులు:-

2015లో ఈయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఉత్తమ నటుడిగా, ప్రతినాయకుడిగా, సహా నటుడిగా తొమ్మిది నంది అవార్డులను అందుకున్నారు. 
అవి...
1985లో స్పెషల్ జ్యూరీలో 'ప్రతిఘటన'కు నంది అవార్డు రాగా,
1993లో 'గాయం', 
1994లో 'తీర్పు' చిత్రాలకుగానూ ఉత్తమ ప్రతినాయకుడిగా అలాగే
1996లో ఉత్తమ సహానటుడిగా 'లిటిల్ సోల్జర్' చిత్రానికి నందులు వరించాయి.
1998లో గణేష్, 2000లో వచ్చిన 'చిన్నా' చిత్రాలకుగానూ ఉత్తమ ప్రతినాయకుడిగా,
2002లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డులను తీసుకున్నారు.
2004లో 'ఆ నలుగురు',
2006లో 'పెళ్ళైన కొత్తలో' చిత్రాలకుగానూ ఉత్తమ సహానటుడిగా నంది అవార్డును పొందారు.
"అల్లు రామలింగయ్య పురస్కారా"న్ని కూడా అందుకున్నారు.
2012లో 'కృష్ణంవందే జగద్గురుమ్' చిత్రానికిగానూ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును కోట పొందారు.
 
రాజకీయాల్లో...     
          
1990లో బీజేపీలో చేరి, ఆ పార్టీలోనే ఉంటూ 1999లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో తూర్పు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత మళ్లీ రాజకీయాలలోకి వెళ్లలేదు.