BREAKING NEWS

సాధనతోనే సాధిం'చాను'

 కట్టెల మోపుతో మొదలైన తన ప్రయాణం ప్రపంచ రికార్డులను తిరగరాస్తుందని ఊహించలేదు. ఓటమితో మానసికంగా కుంగిపోయింది. ఎన్నో అవమానాల్ని భరించింది. కానీ తిరిగి తన ఆటతో పుంజుకుంది. తన విజయానికి గుర్తుగా రజతం అందుకుంది. అవమానించిన వాళ్లే నేడు అభినందిస్తున్నారు. దాదాపు 21 ఏళ్ల తరువాత వెయిట్ లిఫ్టింగ్ లో మెడల్ సాధించి భారతదేశానికి గర్వకారణమయ్యింది. ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. పిల్లల్లో ప్రతిభను గుర్తించి వదిలేయకుండా, ప్రోత్సహించి, శిక్షణనిస్తే దేశానికి పేరుప్రఖ్యాతలు తీసుకొచ్చే దిశగా ఎదుగుతారని నిరూపించి చూపించింది చాను.
 
జననం:-

మీరాబాయి మణిపూర్లోని నాంగ్పోక్ కచింగ్ గ్రామంలో 1994 ఆగస్టు 18న జన్మించింది. ఆమె పూర్తి పేరు సైఖోమ్ మీరాబాయి చాను. తండ్రి సైఖోమ్ కృతి మీటి ఉద్యోగి. తల్లి సైఖోమ్ ఒంగిబి తొంబీ లీమా. వీరిది మధ్యతరగతి కుటుంబం. సోదరుడు సనతొంబ మీటి, సోదరీమణులు సైఖోమ్ షియా, సైఖోమ్ రంగితలు.
మీరాబాయి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందింది.
 
క్రీడల్లో...

చాను చిన్నతనంలో తల్లితో కలిసి వంటకు కావాల్సిన కట్టెలను నిత్యం అడవికి వెళ్లి కొట్టి మూటగట్టుకొని తీసుకొచ్చేది. ఆ కట్టెలు తను మోయలేనంత బరువుగా ఉండేవి. అయినా సరే ఆమె భుజాలపైనా పెట్టుకొని మోసుకొచ్చేది. అలా ఆమెలోని సామర్థ్యాన్ని ముందుగా గుర్తించింది ఆమె కుటుంబమే! మీరాకు పదేళ్లప్పుడేమో…అదే  రాష్ట్రానికి చెందిన కుంజురాణి అనే  క్రీడాకారిణి ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ ఆడటం చూసి, తనకు ఆ ఆటపైన ఆసక్తి పెరిగింది. కానీ ఎక్కడ నేర్చుకోవాలో తెలిసేది కాదు. అప్పుడే వెయిట్ లిఫ్టర్ కోచ్ అనితా శిక్షణ ఇస్తున్నారని తెలుసుకొని, సంప్రదించింది.

కానీ అక్కడ సదుపాయాలు సర్రిగా లేకపోవడంతో, వెదురు బొంగులను బరువులుగా అటు, ఇటు కట్టుకొని ప్రాక్టీస్ చేయించింది. అలా కఠిన శిక్షణ తీసుకుంటూనే అంచెలంచెలుగా ఎదిగి జాతీయస్థాయి ఆపై అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ గా మారింది. 2016లో కుంజురాణి పేరు మీదున్న రికార్డులను మీరా బద్దలు కొట్టింది. ఆ తర్వాతి సంవత్సరంలో ప్రపంచ రికార్డులను మీరా తిరగరాసింది.
 
అవార్డులు:-

2014లో కామన్వెల్త్ క్రీడల్లో 48 కేజీల విభాగంలో వెండి పతకాన్ని గెలుచుకుంది.
2016లో మహిళల సీనియర్ జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ లో బంగారు పతకం అందుకుంది.
2017లో యుఎస్ఎలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో 48 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
2018లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 48 కేజీల విభాగంలో,
2020లో ఆసియా ఛాంపియన్‌షిప్ లో బంగారు పతకాల్ని సాధించింది.
2018లో భారత ప్రభుత్వం మీరాకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్నతో పాటు, పద్మశ్రీ అవార్డులను ఇచ్చి గౌరవించింది.
2021 ఏప్రిల్ లో తాష్కెంట్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 119 కిలోలను ఎత్తి క్లీన్ & జెర్క్‌లో ప్రపంచ రికార్డ్ ను సృష్టించింది.
 
ప్రభుత్వం ఈమెకు ప్రోత్సాహకంగా కొంత డబ్బును కేటాయించింది.  ఆ ప్రోత్సాహంతో అమెరికాకు వెళ్లింది. అక్కడ మాజీ కోచ్ లిఫ్టర్ ఆరోన్ హర్షింగ్ దగ్గర రెండు నెలలు శిక్షణ తీసుకుంది. అతను బరువైన రాడ్డును ఎత్తడంలో కొత్త టెక్నిక్ లను నేర్పించాడు. ఆ కోచ్ నేర్పించిన మెళుకువలతోనే 2020 టోక్యో ఒలింపిక్స్ లో 2021 జులైలో ఆడి, రజతం గెలుచుకుంది.
 
గెలిచాక..

మీరా తల్లి లీమా తన దగ్గరున్న  బంగారంతోపాటు, దాచుకున్న డబ్బును కలిపి ఒలింపిక్స్ రింగులను పోలిన కమ్మలను ప్రత్యేకంగా చేయించింది. అవి మీరాకు అదృష్టాన్ని, విజయాన్ని అందిస్తుందని నమ్మి అలా చేయించిందంట. వాటిని 2016 రియో ఒలింపిక్స్ లో ధరించి పోటీ చేసింది కానీ ఓడిపోయింది. ఇప్పుడు వాటినే వేసుకొని పతకం సాధించింది.
 
శిక్షణ కోసం ఐదేళ్లు కుటుంబ సభ్యులకు, ఇంటికి దూరంగా ఉండి, నచ్చిన ఆహారాన్ని వదులుకున్నా. ఇన్నేళ్ల కష్టం తర్వాత విజయం అందుకున్నా. ఇప్పుడు నాకు ఇష్టమైన పిజ్జా తింటానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకుగానూ డొమినోస్ పిజ్జా కంపెనీ వాళ్లు జీవితాంతం ఆమెకు ఉచితంగా పిజ్జా డెలివరీ చేస్తామని చెప్పారు.
 
టోక్యో నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరిన మీరాకు ఘనస్వాగతం అందింది. క్రీడాభిమానులు "భారత్ మాతాకీ జై" అంటూ నినాదాలతో చుట్టూ చేరారు. తన తల్లితండ్రులను చూసిన మీరా గుండెలకు హత్తుకొని భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకుంది.

'బంగారు పతకం తేవాలని నా కల కానీ నావల్ల కాలేదు పర్వాలేదు రజతం అందుకున్నా సంతోషంగా ఉందని' ఒక ఇంటర్వ్యూలో చాను తెలిపింది.
 
◆మణిపూర్ ప్రభుత్వం మీరాకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా విధుల్లోకి తీసుకోవడమే కాదు, కోటి రూపాయల నజరానాను బహుమతిగా ప్రకటించింది. 
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ అథ్లెట్లకు స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు, రజతానికి రూ.40 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు చొప్పున ఇవ్వనున్న విషయం తెలిసిందే!
 
◆చైనాకు చెందిన జిహుయ్ హౌ 210 కిలోల బరువుతో కొత్త ఒలింపిక్ రికార్డ్‌తో స్వర్ణం సాధించి మొదటి స్థానంలో నిలిచింది.

◆ఇండోనేషియాకు చెందిన కాంటికా ఐసా 194 కిలోల బరువును ఎత్తి కాంస్యం గెలిచింది.