BREAKING NEWS

మువ్వన్నెల జెండా: 'వెంకయ్య'

 రెపరేపలాడే మువ్వన్నెల జెండాను చూస్తే ప్రతి మది పులకిస్తుంది.
స్వాతంత్రం కాంక్షను స్ఫురించేలా చేస్తుంది.
ఎన్నో ఉద్యమాలు, మరెన్నో ప్రాణత్యాగాలను ఓర్చి, నిలిచిన మన జాతీయ పతాకం.
జాతికి గుర్తుగా, భావిభారతానికి ప్రతీక చిహ్నం.
అటువంటి భారతదేశ జాతీయ పతాకాన్ని రూపొందించిన
మహానుభావుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పింగళి వెంకయ్య కృషి, జీవిత విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
జననం:-

1876లో ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు పింగళి వెంకయ్య. తండ్రి హనుమంతరాయుడు. తల్లి వెంకటరత్నమ్మ. ఈయన భార్య పేరు రుక్మిణమ్మ. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
 
చదువు:-

ప్రాథమిక విద్యను పెదకళ్లేపల్లిలో పూర్తి చేశారు. హైస్కూల్ విద్యను బందరులో చదివారు. చిన్నవయసులోనే జాతీయోద్యమంవైపు బాగా ఆకర్షితులయ్యారు. దక్షిణాఫ్రికాలోని విట్‌వాటర్‌సాండ్‌ బంగారు గనుల మీద ఆధిపత్యం కోసం ఆఫ్రికన్‌లు(బోయర్లు) చేసిన తిరుగుబాటు చర్యే బోయర్‌ యుద్ధం. 19వ ఏటా బ్రిటీష్ ఎయిరిండియాలో సిపాయిగా చేరి, ఈ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో గాయాలపాలైన క్షతగాత్రులకు సేవ చేయడానికి గాంధీజీ నెటాల్‌ ఇండియన్‌ అంబులెన్స్‌ దళాన్ని ఏర్పాటు చేశారు.

అప్పుడే గాంధీజీతో పరిచయం ఏర్పడింది. అట్నుంచి వాళ్ళిద్దరి మధ్య స్నేహం 50ఏళ్ల పాటు కొనసాగింది. వెంకయ్యకు చదువుకోవాలన్న తృష్ణతో కొలంబియాలో అర్థశాస్త్రాన్ని అభ్యసించారు. అంతేకాకుండా లాహోర్ లోని ఆంగ్లో వేద పాఠశాలలో సంస్కృతం, ఉర్దూ, జపనీస్ భాషలను నేర్చుకున్నారు. 1913లో ఆయన బాపట్లలో జరిగిన సభలో జపాన్‌ భాషలో అనర్గళంగా మాట్లాడంవల్ల "జపాన్ వెంకయ్య"గా పేరు తెచ్చుకున్నారు. 

కొలంబో వెళ్లి సీనియర్‌ కేంబ్రిడ్జ్‌ పూర్తి చేసుకుని వచ్చారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భశాస్త్ర పరిశోధనల మీద పీహెచ్‌డీ చేశారు. ఆయ‌న విద్యాభ్యాసం కోసం అనేక దేశాల్లో ప‌ర్య‌టించారు. వివిధ భాష‌ల్లో ప్రావీణ్యం సంపాదించారు. 

ఇవే కాక నవరత్నాల మీద కూడా ఆయన అధ్యయనం చేశారు. దీంతో 'డైమండ్‌ వెంకయ్య' అన్న బిరుదు కూడా వచ్చింది. మచిలీపట్నంలో కొద్దీకాలం స్వయంగా విద్యాలయాన్ని కూడా నిర్వహించారు.
 
ఉద్యోగ ప్రస్థానం:-

వెంకయ్య మొదట్లో రైల్వేలో  పనిచేశారు. ఆ శాఖలో ఉండి బెంగళూరు, బళ్లారిలకు బదిలీ అయినప్పుడు మద్రాస్‌లో ప్లేగు వ్యాధి విజృభించింది. రోగులకు సేవ చేయడం కోసం వెంకయ్య తన ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టారు.
బందరులో జాతీయ కళాశాలలో 1911 నుంచి 1944 వరకు అధ్యాపకులుగా పనిచేశారు. అక్కడ విద్యార్థులకు వ్యవసాయ విద్యతోపాటు, గుర్రపుస్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణాలాంటివి కూడా నేర్పారు. ఇప్పుడున్న NCCని మొదటగా ఈయనే ప్రారంభించారు.
 
పరిశోధనలు:-

వ్యవసాయం మీదున్న ఆసక్తితో అమెరికా నుంచి కంబోడియా పత్తి విత్తనాలు తెప్పించి, వాటిని స్వదేశీ పత్తి విత్తనాలతో కలిపి ఒక కొత్త సంకర పత్తిని తయారు చేశారు. ఈ ప్రయోగాలన్నీ చల్లపల్లి సమీపంలోని ఓ గ్రామంలో చేశారు. అందులోని నాణ్యతని గుర్తించిన లండన్ వారు 'ది రాయల్‌ అగ్రికల్చరల్‌ సొసైటీ' ఫెలోషిప్‌తో ఆయనను గౌరవించింది. ఈ ప్రయోగాలు చేసినందుకుగానూ "పత్తి వెంకయ్య" అనే పేరు కూడా వచ్చింది. అంతేకాదు నాటి బ్రిటీష్ ప్రభుత్వం వెంకయ్య పరిశోధనలను ప్రశంసించింది. 
1924 నుంచి 1944దాకా నెల్లూరులో  మైకా గురుంచి పరిశోధనలు చేశారు. 
 
పుస్తకాలు:-

ఆనాటి చైనా జాతీయ నాయకుడైన సన్ యత్ సేనపైన జీవిత చరిత్రను రాశారు.
బొగ్గును వజ్రంగా మార్చే విధానం గురుంచి "తల్లిరాయి" అనే పుస్తకాన్ని రాశారు. 
1916లో "భారదేశానికి ఒక జాతీయ పతాకం" అనే గ్రంథాన్ని రచించారు. ఇందులో ముప్పైరకాల జాతీయ పతకాలను ప్రదర్శించారు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో, అంటే 1918 - 1921మధ్య కాలంలో వెంకయ్య కాంగ్రెస్ ప్రతి సెషన్లో సొంత జెండాను కలిగి ఉండాలని చెబుతుండేవారు. అప్పటికి ఆయన మచిలీపట్నంలోని ఆంధ్ర నేషనల్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.

గాంధీని కలిసిన వెంకయ్య తన పుస్తకంలో ప్రదర్శించిన అనేక రకాల పతకాలను చూపించి మనకంటూ ప్రత్యేకమైన జెండాను కలిగి ఉండాలని తన అభిప్రాయాన్ని తెలియపరిచారు. ఈ పనిని పింగళి వెంకయ్య తనకు తానుగా స్వీకరించారు. అందుకు అదే సంవత్సరంలో బెజవాడలోని విక్టోరియా మ్యూజియంలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీ సూచన మేరకు జాతీయ జెండాలో కాషాయం, శ్వేత వర్ణం, ఆకుపచ్చ రంగులు, మధ్యలో రాట్నంతో కూడిన జెండాన్ని రూపొందించారు.

కానీ 1947 జులై 22న జరిగిన భారత రాజ్యాంగ సభలో పతాకంలో రాట్నంకు బదులుగా అశోక ధర్మచక్రాన్ని పెట్టాలని నెహ్రు తీర్మానం చేశారు. 3 గంటల్లో జాతీయ జెండాను మార్చి, తయారుచేశారు. ఆఖరికి అశోక ధర్మచక్రంతో కూడిన  త్రివర్ణ పతాకాన్ని 22 జూలై, 1948న జాతీయ పతాకంగా భారతజాతి స్వీకరించింది. అందుకే ఆయనను 'జెండా వెంకయ్య' అనేవారు.

స్వాతంత్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఖనిజ పరిశోధనలో సలహాదారునిగా నియమించింది. ఆ ఉద్యోగంలో 1960 వరకు కొనసాగారు.
1921లో పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని ‘స్వరాజ్ పతాకం' గానూ, 1931లో ఆమోదించిన త్రివర్ణ పతాకాన్ని ‘పూర్ణ స్వరాజ్ పతాకం’గానూ కొందరు అభివర్ణిస్తున్నారు.
 
అవార్డులు:-

◆2009లో ఆయన జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపు విడుదలైంది. 
◆2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "భారత్ రత్నా"కి ఆయన పేరును సిఫారసు చేసింది. 
ఏప్రిల్‌ 13, 1936 నాటి ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో గాంధీజీ, పింగళి వెంకయ్యల ప్రత్యేకతను చాటేలా రాసుకొచ్చింది. 
 
ముఖ్య విషయాలు:-

సాహసం, త్యాగాలకు కాషాయవర్ణం, శాంతి - సత్యాలకు శ్వేతవర్ణం, నిజాయతీ- దయాగుణాలకు ఆకుపచ్చ రంగు చిహ్నాలుగా అభివర్ణించారు ఆయన. అదే సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఆయన భావాల్ని అధికారికంగా ఆమోదించింది.
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, వెంకయ్య నెల్లూరులో స్థిరపడ్డారు. నవరత్నాల మీద అనేక అధ్యయనాలు జరిపి, పరిశోధక వ్యాసాలు రాశారు. అలా భారత ప్రభుత్వ సలహాదారునిగా కూడా పనిచేశారు. జాతిరత్నాలు, వాటిని పోలి ఉండే రాళ్లు మనదేశంలో ఎక్కువ ప్రదేశాల్లో లభ్యమవుతాయని తెలియజేశారు. 
ఆయన కృషి, త్యాగం దేశం  గుర్తించలేకపోయినా, ఆయన మాత్రం ఏ గుర్తింపును, అధికారాలను ఆశించలేదు.

ఆయన చివరి రోజుల్లో మాత్రం తన వీలునామాలో ఇలా రాసుకొచ్చారు. "నేను చనిపోయాక నా భౌతికకాయానికి జాతీయ జెండాను కప్పండి. స్మశానానికి వచ్చాక నా శరీరంపైనున్న పతకాన్ని అక్కడే ఉన్న రావి చెట్టుకు కట్టేయండి. అదే నా చివరి కోరిక" అని. ఈ కోరికను మాత్రం భారతజాతి తీర్చింది. కాకపోతే ఆ జెండా ఆయన భౌతికదేహాన్నే కాదు, ఆయన త్యాగపటిమను, చరితను కూడా కప్పేసింది.