BREAKING NEWS

అభినవతార 'సౌందర్య'

'ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ..' అని తన తల్లితో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకునే సాధారణ అమ్మాయిలా, 'పద్మావతి పద్మావతి' అని హీరో ఆటపట్టించే సీన్ లో అమాయకపు హీరోయిన్ లా, 'అపురూపమైనదమ్మా ఆడజన్మ' అనే పాటలో అనారోగ్యపాలైన భర్తని చూసుకునే ఇల్లాలిగా ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో సినిమాల్లో… 

భార్యగా, ఇల్లాలిగా, తల్లిగా పలు పాత్రలు చేసి మన ఇంటి అమ్మాయిగా మారిన ఆమె అందం, అభినయం, చక్కని చీరకట్టు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!
ఆమె డాక్టర్ అవ్వాలనుకొని యాక్టర్ అయ్యింది. తను నటిస్తే చాలు ఆ సినిమా హిట్ అవ్వుతుందనే నమ్మకం డైరెక్టర్, నిర్మాత, ప్రేక్షకులది కూడానూ. 
అందుకే ఇక్కడి అభిమానులు ఆమెను తెలుగింటి ఆడపడుచుగా ఆదరించేవారు. 

నటనలోనే కాదు, సేవా కార్యక్రమంలో ముందుండేవారు. సొంతంగా ఒక స్కూల్ నే నిర్మించి ఉచితంగా పిల్లలకు విద్యనందించారామె. ఒక పార్టీ ప్రచారంలో భాగంగా హెలికాఫ్టర్ లో వెళ్తుండగా ప్రమాదవశాత్తు అది పేలడంతో, ఆమె అక్కడిక్కక్కడే చనిపోయారు. 

సౌందర్య పుట్టినరోజును ఈ నెల(జులై) 18న జరుపుకుంటున్నాం. ఎన్ని తరాలు మారినా, ఎంతమంది హీరోయిన్లు వచ్చినా సౌందర్యలాంటి నటీమణులు పుట్టలేరేమో. దివికేగిన అభినవ తార సౌందర్య నిజ, సినీజీవితం విశేషాల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం:
 
జననం:-

సౌందర్య అసలు పేరు సౌమ్య. ఈమె కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాకు చెందిన ముల్బాగల్ గ్రామంలో 1977 జులై 18న జన్మించింది. తండ్రి కె.ఎస్.సత్యనారాయణ కన్నడ రచయిత, నిర్మాత కూడా. తల్లి మంజుల. అన్నయ్య అమర్నాథ్.
 
చదువు:-

ఆమె చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకుంది. అందుకు బెంగుళూరులోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరింది. కానీ అనుకోకుండా సినిమాల్లోకి రావడంతో, ఆమె తన చదువును కొనసాగించలేకపోయింది.
 
సినీరంగ ప్రవేశం:-

ఆమె తండ్రికి సౌందర్యను హీరోయిన్ గా చూడాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే ఆమె చదువును కూడా మధ్యలోనే ఆపించేశారు. పట్టుపట్టి మరి అతని స్నేహితుడు తీస్తున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం కల్పించమని కోరాడు. అలా 1992లో "గంధర్వ" అనే కన్నడ చిత్రంలో తొలిసారి వెండితెరకు సౌందర్య పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో కృష్ణగారితో "రైతు భారతం" అనే సినిమా ద్వారా తెలుగులో అరంగ్రేటం చేశారు. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. 

1995లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన "అమ్మోరు" అనే సినిమాలో ఆమెలోని నటవిశ్వరూపాన్ని చూపించారు. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా నంది, ఫిలింఫేర్లు దక్కాయి. 

1996లో నాగార్జునతో కలిసి "రాముడొచ్చాడు" అనే చిత్రంలో అప్పటివరకు చీరకట్టులో కనిపించిన ఆమె ఈ సినిమాలో మోడ్రన్ డ్రెస్సులో కనిపించడం విశేషం. వెంకటేష్ తో కలిసి "పవిత్ర బంధం" సినిమా చేశారు. అందులో ఆమె ఒప్పంద భార్యగా నటించారు. ఆ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఆపై వీరిద్దరి కాంబోలో 'రాజా', 'దేవిపుత్రుడు', 'పెళ్లి చేసుకుందాం రా', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' వంటి సినిమాలు వచ్చి, మంచి హిట్ అందుకున్నాయి. ఈ జోడి అంటేనే ప్రేక్షకులకు కన్నులపండుగ!
అప్పట్లో పెద్ద హీరోలతోనే కాదు, కమెడియన్లు అయిన అలీ, బాబు మోహన్ లతోనూ ఆడి పాడి అలరించారు. 'దొంగాట', 'సర్దుకుపోదాం రండి' లాంటి సినిమాలతో జగపతిబాబు, సౌందర్యలది బెస్ట్ పెయిర్ అనే టాక్ తెచుకున్నారు.
హీరో ఎవ్వరైనా, పాత్ర ఎలాంటిదైనా సరే డైరెక్టర్ ఏ వెర్షన్ కోరితే, అలా చేస్తూ తనదైన పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ నటించేవారు.

తెలుగులోనే కాదు మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో కలిపి 100కు పైగా చిత్రాలలో నటించారు. ఆమె 12 సంవత్సరాలు  సినీపరిశ్రమలో నిర్విరామంగా బిజీ హీరోయిన్ గా ఉన్నారు. చివరగా కన్నడలో "ఆప్తమిత్ర అనే సినిమాలో నటించారు. అది విజయవంతమైంది.
సౌందర్య "ద్వీప" అనే ఓ కన్నడ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.
 
అవార్డులు:-

'అమ్మోరు', 'అంత:పురం', 'పవిత్ర బంధం' సినిమాలకుగానూ నంది అవార్డులను అందుకున్నారు. మొత్తం
సినీకెరీర్ లో 6 ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.
ఇవేకాక 'దొనిసగలి'(తెలుగులో మహిళ), 'ద్వీప'(ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు), 
'ఆప్తమిత్ర' చిత్రాలకుగానూ కర్ణాటక ప్రభుత్వం నుంచి నాలుగు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి.
ఆమెకు 'నవరసనటనా మయూరి' అనే బిరుదు ఉంది.
అప్పట్లో ఒక అగ్రహీరో తీసుకునేంత రెమ్యూనరేషన్ సౌందర్య తీసుకునేవారట.
హిందీలో అమితాబ్ బచ్చన్ తో కలిసి 'సూర్యవంశం'లో నటించారు.
 
వివాహం:-

స్నేహితుడైన జి.ఎస్ రఘుతో 2003లో ఏప్రిల్ 27న ఆమెకు వివాహం జరిగింది. ఈయన బెంగళూర్ లో ఇంజనీరింగ్ గా ఉద్యోగం చేసేవారు.
 
మరణం:-

2004 ఏప్రిల్ 17న బిజేపి పార్టీ తరపున ప్రచారం చేయడం కోసం బెంగుళూరు నుంచి కరీంనగర్ వెళ్లారు. సౌందర్యతోపాటు అన్నయ్య అమర్నాథ్, అతని స్నేహితుడు రమేష్ ముగ్గురు కలిసి బెంగుళూరు విమానాశ్రయానికి కార్ లో బయల్దేరారు. అక్కడ హెలికాఫ్టర్ ఎక్కిన మూడు, నాలుగు నిముషాల్లోనే 50 అడుగుల ఎత్తు నుంచి అమాంతంగా నెలకొరిగింది. కొన్ని క్షణాల్లోనే హెలికాఫ్టర్ పేలి, అందులో ఉన్న పైలట్ తో సహా నలుగురు అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. 
 
◆ఆమె పేరిట "అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్" అనే ఓ పాఠశాల నడుస్తుంది. ఉచిత విద్యను అందించడమే ఈ పాఠశాల లక్ష్యం. ఆమె మరణానంతరం ఇది నేటికీ కొనసాగుతూనే ఉంది.
 
◆ఆమె జ్ఞాపకార్ధం కర్నాటకాంధ్ర లలిత కళాా అకాడమీ వారు "సౌందర్య స్మారక పురస్కారాన్ని" ప్రతీ సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటి, నటులకు బహుకరిస్తున్నారు. 
 
◆ప్రేక్షకులు ఆమెను జూనియర్ సావిత్రిగా భావించేవారు. ఆ కారణంచేతే సౌందర్యను 'అభినవ సావిత్రి'గా పిలుచుకునేవారు.
అంతేకాదు సావిత్రిగారి తర్వాత అంతటి మహిళాభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ గా సౌందర్య నిలిచారంటే అతిశయోక్తి కాదు.