BREAKING NEWS

ఆషాఢ మాస 'తొలి ఏకాదశి'..!

 ఏ మంచిపనిని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం మనకున్న సహజ అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశినే 'తొలి ఏకాదశి'గా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకాలం మొదలైందంటే చాలు.. అనారోగ్యాలు తలెత్తడం జరుగుతుంటుంది. అసలు తొలి ఏకాదశి పర్వదినం వెనుక దాగివున్న ప్రత్యేకతల గురుంచి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం:
 
తొలి ఏకాదశి.. ఈరోజునే పూర్వం సంవత్సర ప్రారంభంగా పరిగణించేవారు మన పెద్దలు. వానాకాలం మొదలయ్యే సమయం కావున అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే 'లంఖణం' అని పిలువబడే పరమ ఔషధం... ఉపవాస దీక్షకు నాంది పలుకుతుందని అంటుంటారు.
పురాణాల ప్రకారం ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిరోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు. స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి ఈరోజును 'శయన ఏకాదశి', 'ప్రథమ ఏకాదశి' అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ పండుగనాడు రోజంతా ఉపవాస దీక్షను పాటించి, జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజిస్తారు. దీంతోపాటు తీర్థప్రసాదాలను స్వీకరించి, భోజనం చేస్తే గనుక జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 
 
సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని ప్రతీతి. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలోనే పండుగలు పబ్బాలు ఎక్కువ. 
అంతేకాక తొలి ఏకాదశి రోజున నిద్రపోయే స్వామివారు మరలా నాలుగు నెలల తర్వాత అంటే, కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటాడు. ఈ ఏకాదశిని పద్మఏకాదశిగా కూడా పిలుస్తారు.
 
కథ

ఏకాదశి తిథి పేరు ఎలా వచ్చిందంటే, కృతయుగంలో మురాసురుడని పిలువబడే రాక్షసుడు బ్రహ్మ ఇచ్చిన వరంతో దేవతలను, రుషులను హింసించాడు. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు దాదాపు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా… ఆ సమయంలో  శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను సైతం వరం కోరుకోమని అడగ్గా, తాను విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుందట. 
అప్పటి నుంచి ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చిందని పండితులు చెబుతారు. 
 
ఉపవాసం

ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటే.. ఏకాదశి అంటే 'పదకొండు'. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనసు కలిపితే మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివల్ల మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని చెబుతుంటారు. 

ఈ నాలుగు నెలల కాలాన్నీ అత్యంత పవిత్రంగా పరిగణించి 'చాతుర్మాస్య దీక్ష' చేస్తారు. ప్రస్తుతం మఠాధిపతులు, సన్యాసం తీసుకున్న రుషులు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను సైతం వదిలేస్తారు. ఆహారం విషయంలోనూ కొన్ని నియమాలు పాటిస్తారు.
 
ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో కొన్ని మార్పులు వస్తాయి. తద్వారా శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై శరీరం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు అనేవి ఏర్పడ్డాయట. 
 
పేల పిండి

ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారం ఉంది. పేలాల్లో బెల్లం, యాలకులను చేర్చి దంచి ప్రత్యేకంగా ఈ పిండిని తయారుచేస్తారు. ఆరోగ్యానికి కూడా ఈ పిండి చాలా మంచిది. ఈ కాలంలో బయటి ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా దేహం తరచుగా మార్పు చెందుతుంది. గ్రీష్మ రుతువు ముగిసి వర్ష రుతువు ప్రారంభమయ్యే సమయం కాబట్టి శరీరానికి ఈ పిండి వేడి కలిగించి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
 
ఇంకో కథ ప్రకారం.. సూర్య వంశంలో ప్రఖ్యాతరాజు మాంధాత. అతడు ధర్మం తప్పడు, సత్యసంధుడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచనపై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు. దీంతో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెబుతున్నాయి. 
విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని మనకు సందేహం కలగొచ్చు. 

విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం. అంటే 'విష్ణువు' అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలు పెట్టి దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే మనకు అర్ధమయ్యే రీతిలో నిద్రపోవడంగా అభివర్ణించారు. 
 
ఈరోజున ఏం చేయాలి..

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున, సూర్యోదయానికి ముందే లేచి, ఇల్లంతా శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి.  విష్ణుమూర్తి పటాన్ని శుభ్రం చేసి, పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి.

ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు మాంసాహారం, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి అలాగే వండిన ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే మంచంపై కూడా పడుకోకూడదు.
 
మోక్షం

ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణంలో వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్య్మం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో చోటు చేసుకున్నాయి.
మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మ పురాణంలో పేర్కొనడమైంది.

ఈరోజున ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేయాలి.. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి.
 
పండుగ ఆంతర్యం

ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని, ఏ ఆంటకాలు ఎదురవకూడదని ఈరోజున వేడుకుంటారు.

తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి, అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ఆ తరువాత ప్రసాదంగా తీసుకుంటారు. 
ఈరోజున రైతులు పూజ పూర్తిచేసి పొలానికి వెళ్లి పని చేసుకుంటారు. ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడటం, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం మంచిదని నమ్మి అలా చేస్తారు.