BREAKING NEWS

'మన్యం వీరుడి' త్యాగం.. అజరామరం!

ఆయనొక మహోజ్వల శక్తి…
ఆయన పేరొక స్ఫూర్తిమంత్రం. స్వాతంత్ర్య స్ఫూర్తిప్రదాత. సాయుధ పోరాటం ద్వారానే దాస్య బంధనాల నుంచి దేశం విముక్తి చెందుతుందని విశ్వసించి ప్రాణాలర్పించిన మహాయోధుడు. ఆయన పోరాట పటిమ, ధైర్యసాహసాలు అచంచలం. ఆయన త్యాగం అజరామరం.

మన్యం వాసుల కష్టాలను రూపుమాపడానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని సంకల్పించిన మన్యం వీరుడు. ప్రజల హక్కులను వివరించి, వారిలో ఎనలేని ధైర్యాన్ని నింపి, అన్యాయాలను ఎదిరించే విధంగా తీర్చిదిద్దిన విప్లవ నాయకుడు జన్మించి నేటికి 125 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన జీవిత, పోరాట విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
బాల్యం:

1897వ సంవత్సరం జూలై 4వ తేదీన ప్రస్తుత విజయనగరం జిల్లా పాండ్రంగి గ్రామంలో జన్మించాడు అల్లూరి సీతారామరాజు. ఆయన తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ, విద్యావతి. తండ్రి చిత్రకళ, ఫొటోగ్రఫీలో ప్రావీణ్యుడు. 1902లో రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. సీతారామరాజుకు ఒక తమ్ముడు సత్యనారాయణరాజు, ఒక చెల్లెలు సీతమ్మ. పశ్చిమ గోదావరిజిల్లాలోని మోగల్లు వీరి స్వగ్రామం. 
గోదావరి పుష్కరాల సమయంలో వ్యాప్తి చెందిన కలరా వ్యాధితో సీతారామరాజు తండ్రి 1908లో మరణించాడు. అప్పుడు రామరాజు ఆరోతరగతి చదువుతున్నాడు. తండ్రి మరణంతో కుటుంబం పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది. 

భీమవరంలోని మిషన్ ఉన్నత పాఠశాలలో చేరినప్పటికీ తొలి సంవత్సరమే పరీక్ష తప్పాడు. ఆ తర్వాత కూడా చదువు విషయంలో చాలా ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు సీతరామరాజు. తండ్రి లేకపోవడం, పేదరికం, తరచూ ఇల్లు మారడంతో ఆ పరిస్థితుల ప్రభావం సీతారామరాజు చదువులో వెనకబడేలా చేశాయి. 

1918 వరకు సీతారామరాజు కుటుంబం తునిలో నివాసం ఉంది. ఆ కాలంలో చుట్టుపక్కల ఉన్న కొండలు, అడవులు తిరుగాడుతూ గిరిజనుల జీవన విధానాన్ని చాలా దగ్గరగా గమనిస్తూ ఉండేవాడు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం, సంస్కృతం, ఆయుర్వేదం వంటి విద్యలను నేర్చుకున్నాడు. పసితనం నుంచే రామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం ఎక్కువగా ఉండేవి. దేవాలయాల్లో, కొండలపై, శ్మశానాలలో రాత్రిపూట ధ్యానం చేసేవాడు. 

సీతారామరాజు అంటేనే ఓ మహోజ్వల శక్తి అనే విషయం అతి తక్కువ కాలంలోనే అక్కడి స్థానికులకు, బ్రిటిష్‌ వాళ్లకు బోధపడింది. 
సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సాధ్యమని విశ్వసించాడు. దాదాపు 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. 
అనతికాలంలోనే విప్లవాన్ని మొదలు పెట్టాడు. 

పాతకాలపు బాణాల్లాంటి ఆయుధాల ముందు తెల్ల వాళ్ళ తుపాకీ గుళ్లు  నిలబడకపోయేవి. అల్లూరి నేరుగా పోలీస్‌ స్టేషన్ల మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకులు, మందుగుండు సామగ్రిని పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నాడు. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి మొదలైన పోలీస్‌ స్టేషన్ల మీద మెరుపుదాడి చేసి, వారిని ముప్పుతిప్పలు పెట్టాడు. ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించాడు. ఈ చిచ్చరపిడుగుని ఎదుర్కోవడానికి ఆధునిక పరికరాలు, ఆయుధాలను ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించాల్సి వచ్చేది. అంతటి పరాక్రమవంతుడు ఏ ప్రజల కోసమైతే తాను పోరాడాడో చివరికి ఆ ప్రజల క్షేమం కోసమే ప్రాణత్యాగం గావించాడు.
 
రూథర్ ఫర్డ్ ఎంట్రీ

1924 ఏప్రిల్ 17న సీతారామరాజును చంపడానికి కార్యాచరణలో భాగంగా అక్కడ మన్యానికి కలెక్టర్ గా, స్పెషల్ కమిషనర్ గా రూథర్ ఫర్డ్ ని నియమించింది మన్యం ప్రభుత్వం. 
అతను బ్రిటిష్ వాళ్ళ మీద జరిగే విప్లవాలను అణచివేయడంలో పేరు మోసిన వ్యక్తి. 

విప్లవకారుల్లో అగ్గిరాజు అతి సాహసవంతుడు.  ఆరోజుల్లో ప్రభుత్వాధికారులకు, పోలీసులకు ముచెమటలు పట్టించిన వీరుడితను.  ఆహారధాన్యాలను కొల్లగొట్టేవాడు, విప్లవానికి చేటు చేసే ద్రోహులను, అధికారులను దారుణంగా శిక్షించేవాడు. అలాంటి అగ్గిరాజుకు ప్రాణభయం అనేదే లేదు. 1924లో మేలో జరిగిన దాడిలో అతనికి పెద్ద గాయం అయింది. బ్రిటిష్ వారికి దొరకకుండా ఒక బావిలో దూకి, చనిపోవాలని భావించాడు. కానీ అతన్ని పసిగట్టి పట్టుకొని బంధించారు సైనికులు. అంతేకాదు అట్నుంచి అప్పట్లో ఎంతో క్రూరమైన అండమాన్ జైలుకు తరలించారు. అగ్గిరాజు అక్కడే కొన్ని సంవంత్సరాలు గడిపాడు. భయంకరమైన శిక్షల అనంతరం మరణించాడు. 
ఆ యుద్ధంలో ఆ రోజు రాత్రి రామరాజు మంపా అనే గ్రామానికి చేరుకున్నాడు.

అంతకుముందే రూథర్ ఫర్డ్ కృష్ణదేవ పట్నానికి వచ్చి, పెద్ద సభను నిర్వహించాడు. ఆ సభలో భాగంగా రామరాజు విప్లవ దళం ఆచూకీ వారం రోజుల్లోగా తెలుపకపోతే గ్రామప్రజలందర్నీ చంపేస్తానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. అతను ఆ సభలో ఏం చెప్పి ఉంటాడని, సీతారామరాజు ఎవ్వరికి తెలియకుండా ఆ ఊరి మునిసబు దగ్గరికెళ్లాడు. ఆ మీటింగ్ లో రూథర్ ఫర్డ్ హెచ్చరించిన విషయం తెలుసుకొని… నా కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు అని భావించి, బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోతానని అతనితో అంటాడు. 

ఎందుకంటే రాజుని పట్టిస్తే అప్పట్లో పదివేల రూపాయల పారితోషికం ఇస్తానని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. అందుచేత తనని బ్రిటిష్ వాళ్లకు అప్పగించి, వచ్చిన డబ్బుతో గ్రామానికి ఏదైనా మంచి చేయమని అతడిని కోరతాడు రాజు.  
ప్రజలకోసం ఎంతో పోరాడుతున్న రాజుని అకారణంగా బ్రిటీషర్లకు పట్టించడానికి ఎంతకీ ఒప్పుకోలేదు ఆ మునిసబు. ఇటువంటి నీచమైన పని తాను చేయనని, కావాలంటే నేను కూడా ఈ పోరులో చావడానికైనా సిద్దపడతానని చెప్తాడు. అతనేకాదు, గ్రామంలోని ప్రజల్లో ఎవ్వరు కూడా ఈ పని చేయడానికి అంగీకరించరు. 
 
1927 మే 7న కొయ్యూరు గ్రామంలోని ఒక ఏటి దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న పశువుల కాపరి ద్వారా పోలీసులకు తాను ఉన్న సమాచారాన్ని తెలియజేశాడు రాజు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రామరాజును పట్టుకోవడానికి బయలుదేరారు. అతనిని చుట్టుముట్టి బంధించారు.

బందీగా ఉన్న సీతారామరాజును ఎటువంటి విచారణ జరపకుండానే మేజర్ గుడాల్ ఒక చెట్టుకు కట్టేసి, ఎన్నోసార్లు తుపాకీతో కాల్చాడు. అతని మరణవార్తను తన తల్లికి కూడా తెలియజేయలేదు. అతనిని పై అధికారుల ఆదేశం మేరకు దహన సంస్కారాలు చేసి, తన చితాభస్మాన్ని పక్కనే ఉన్న వరహా నదిలో కలిపారు. అతని మరణ వార్త విన్న ఇతర విప్లవకారులు, మన్యం ప్రజలు ఆవేశంతో బ్రిటీషర్ల మీదకు విజృభించి విప్లవాన్ని కొనసాగించారు. ఈ విప్లవంలో భాగంగా కొందరూ మరణించారు. మరికొందరు పట్టుబడ్డారు.

కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడు. 1922 ఆగస్టు 22వ తేదీన ఆరంభమైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ పోరాటం 1924 జూలై మొదటివారంలో అంతమైంది.
 
అల్లూరి సీతారామరాజు ఈ నేలపై పుట్టి సరిగ్గా నేటికి(జూలై 4) 125 ఏళ్లవుతోంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల పేరుతో దేశవ్యాప్తంగా సమరయోధులను స్మరించుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు(జూలై 4)న భారత ప్రధాని నరేంద్రమోదీ భీమవరం వచ్చారు. ఆపై 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మన్యం వీరుడి పోరాటాలను బహిరంగ సభ ద్వారా ప్రపంచానికి వినిపించారు.