BREAKING NEWS

మార్షల్ ఆర్ట్స్ కింగ్… 'బ్రూస్ లీ'

 ప్రత్యర్థులను భయపెట్టే పంచ్… 
చిన్నవయసులోనే సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగాడు. మార్షల్ ఆర్ట్స్ తో ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. ఎంతోమందికి ఉచితంగా శిక్షణను అందిస్తూ తన నైపుణ్యాన్ని అందరికి పంచాడు. అతితక్కువ కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందాడు. కానీ సరైన కారణం తెలియకుండానే మరణించాడు. ఈయన చావు ఇప్పటికీ ఒక అంతులేని మిస్టరీగానే మిగిలింది. మూడు పదుల వయసులోనే లోకం విడిచిన "బ్రూస్ లీ"... జీవిత విశేషాల గురుంచి ఈరోజు తెలుసుకుందాం:
 
జననం

బ్రూస్ లీ తండ్రి లీ హోయ్ చుయన్ గాయకుడు, తల్లి గ్రేస్ హో. ఉపాధి నిమిత్తం హాంకాంగ్ నుంచి అమెరికా వెళ్లారు. అప్పుడు ఆమె నిండు గర్భిణి. అక్కడే స్ట్రీట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి మగబిడ్డకు జన్మనించింది. అలా 1940 నవంబర్ 27న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో బ్రూస్ లీ పుట్టాడు. అంటే చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరం, డ్రాగన్ గడియల్లో ఈయన జన్మించాడని చెబుతారు. ఇతన్ని ఇంట్లోవాళ్లు లిటిల్ ఫీనిక్స్ అని పిలిచేవారు. ఇతని పూర్తి పేరు 'బ్రూస్ జూన్ ఫాన్ లీ'. ఈయనతో కలిపి మొత్తం ఐదుగురు ఉన్నారు. అందులో బ్రూస్ లీ నాలుగోవాడు.
 
బాల్యంలో

మొదటి చిత్రం 'గోల్డెన్ గేట్ గర్ల్'. అప్పుడు బ్రూస్ లీకి 3 నెలల వయసు ఉంది. ఈ సినిమా కోసం తీసుకున్న అమెరికా అబ్బాయి అనారోగ్యం కారణంగా అతని బదులు బ్రూస్ లీని
తీసుకున్నారు. ఆ తర్వాత కుటుంబమంతా కలిసి హాంకాంగ్ వెళ్లిపోయారు. అక్కడే 6 ఏళ్ల వయసు నుంచే పలు సినిమాలో నటించాడు. 
 
చదువు

బ్రూస్ లీకి యుక్త వయసు రాగానే కుటుంబమంతా కలిసి వాషింగ్టన్ వచ్చేశారు. అక్కడ 'ఎడిసన్ స్కూల్' లో చేరి ఉన్నత విద్యను పూర్తి చేశాడు. ఆ తరువాత 'యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్'లో తత్వశాస్త్రం చదువుకున్నాడు. టీనేజ్ వచ్చేసరికి కవితలూ రాయడం మొదలుపెట్టాడు. అప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కూడా.
 
సినిమాలు

ది బిగ్ బాస్, ది ఫీస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ది చైనీస్ కనెక్షన్, వే ఆఫ్ డ్రాగన్ (రిటర్న్ ఆఫ్ డ్రాగన్), ఎంటర్ ది డ్రాగన్ వంటి పలు చిత్రాల్లో నటించారు.
ది బిగ్ బాస్ కంటే ముందు మర్లోవే అనే సినిమాలో నటించాడు. అంతకుముందే చిన్నారి బ్రూస్ లీ పలు చిత్రాల్లో నటించాడు. 1966 నుంచి 67లో వచ్చిన "ది గ్రీన్ హోర్నెట్" అనే సిరీస్ లో యాక్షన్ హీరోగా నటించి, మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా 1969లో మర్లోవే అనే చిత్రంలో నటించడానికి అవకాశం వచ్చింది. ఆయన సినిమాల్లో ఎక్కువగా చైనా సంప్రదాయాన్ని అనుకరించేవాడు. అందుకే చైనీస్ లు కూడా ఈయన్ని ఎక్కువగా అభిమానించేవారు. 
బ్రూస్ లీ 'ది గేమ్ ఆఫ్ డెత్' సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆయన మరణించారు. ఆయన సినిమాలో నటించడమే కాక ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈయన పూర్తిగా నటించిన ఆఖరి సినిమా 'ఎంటర్ ది డ్రాగన్'.
 
శిక్షణ కేంద్రాలు

హొంకాంగ్ లో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ అనుభవంతో అమెరికాలో ఉన్నవారికి ఈ విద్యను నేర్పించడానికి సీయోటాల్ లో ఒక స్కూల్ ని తెరిచాడు. డబ్బు తీసుకోకుండా వారికి ఉచితంగా నేర్పించేవాడు. అక్కడే పరిచయమైన లిండా ఎమిరి ని 1964లో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి లాస్ ఏంజెల్స్ వెళ్లారు. అక్కడ ఓక్లాండ్, లాస్ ఏంజెల్స్ లో రెండు స్కూళ్లను  మొదలుపెట్టాడు. వీరికో కుమారుడు బ్రాండన్ లీ, కుమార్తె షానన్ లీ.
 
ప్రత్యేకతలు

బ్రూస్ లీ ఆరేళ్ల వయసులోనే దాదాపు 20 సినిమాల్లో నటించారు. బ్రూస్ లీ.. మార్షల్ ఆర్ట్స్, ఇన్స్ పెక్టర్, ఫిలాసఫర్, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్, యాక్షన్, గైక్వాండో(మార్షల్ ఆర్ట్స్) సృష్టికర్తగా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు.

ఈయన కుంగ్ ఫూలో 'వన్ ఇంచ్ పంచ్' అనే కసరత్తును కనిపెట్టి, ప్రజల్లో ఎప్పటికి గుర్తుండిపోయే మాస్టర్ అయ్యారు. ఈయనకు డ్యాన్స్ చేయడం, కవితలు రాయడమంటే చాలా ఇష్టం. ఆ తరువాత మార్షల్ ఆర్ట్స్ పై ఆసక్తిని పెంచుకోని, దాని మీదే సాధన చేశాడు. 

బ్రూస్ లీ ఐదు అడుగుల ఏడున్నర అంగుళాల ఎత్తు ఉన్నాడు. "ఏ జ్ఞానమైనా చివరికి ఆత్మజ్ఞానానికే దారి తీస్తుంద"ని బ్రూస్ లీ ఎక్కువగా ఈ సిద్ధాంతాన్నే నమ్మేవారు.

ఈయన మాటల్లో ఏం చెప్పారంటే, మనిషి ఎల్లప్పుడూ నీటిలా... షేప్‌లెస్‌గా ఉండాలి. నీటికి సొంత ఆకృతి ఉండదు. గ్లాసులో పోస్తే గ్లాసులా ఉంటుంది. సీసాలో పోస్తే సీసాలా ఉంటుంది. టీ పాట్ లో పోస్తే టీ పాట్ ఆకృతిలో ఉంటుంది. కానీ నీరు ప్రవహిస్తుంది. ముంచెత్తుతుంది. మనిషి కూడా అలానే ఉండాలి. ఇదే గై క్వాండూ ఫిలాసఫీ. పోరాడే క్షణాలేవీ మనవి కావని గుర్తుంచుకోండి. తొలి క్షణంలోనే తేల్చిపారేయాలి. రెండో క్షణంలో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
 
ఒక సినిమా షూటింగ్ కోసం రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు నిరంతరాయంగా చిత్రీకరించేవారని బ్రూస్ లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దానికి కారణం అక్కడ ఎప్పుడు జనసంచారం ఉంటుందని రాత్రి అయితే ఎవరు ఉండరట.
 
ఆయన ప్రభావితం చేసినవి..
తావోయిజం, బౌద్ధం, జిడ్డు కృష్ణమూర్తితత్వం.
 
రాసిన పుస్తకాలు

చైనీస్ కుంగ్ ఫు ది ఫిలాసఫికల్, ఆర్ట్ సెల్ఫ్ డిఫెన్స్, తావో ఆఫ్ గైక్వాండో, వింగ్ చున్ కుంగ్ ఫు మొదలైనవి.
 
◆ మెదడు లోపల వాపు(సెరిబ్రల్ ఎడిమా) వ్యాధి కారణంగానే ఈయన మరణించి ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. 33 ఏళ్ల వయసులోనే అంటే 1973 జులై 20న బ్రూస్ లీ మరణించారు. ఈయన మరణ వార్త తెలిసి యావత్తు ప్రపంచం, ఆయన అభిమానులు దిగ్భ్రాంతి చెందారు.
బ్రూస్ లీ చనిపోయి దాదాపు నలభై ఏళ్లు దాటిపోయాయి. అయినా ఆయన ఎలా చనిపోయాడన్న విషయం నేటికీ హాంకాంగ్‌లో, అమెరికాలో ఆయన అభిమానులు గతాన్ని తవ్వుతూనే ఉన్నారు. విషప్రయోగం జరిగి ఉంటుందని ఒక అనుమానం, తలనొప్పి మాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల అవి వికటించి చనిపోయాయాడని ఒక వాదన. ఈ వాదనకు బలం చేకూర్చే సంఘటన ఒకటి, బ్రూస్ లీ చనిపోడానికి రెండు నెలల ముందు జరిగింది.
 
అదేంటంటే, ఆరోజు మే 10. హాంగ్‌కాంగ్‌లోని గోల్డెన్ హార్వెస్ట్ స్టూడియోస్‌లో ‘ఎంటర్ ది డ్రాగన్’ చిత్రానికి డబ్బింగ్ చెబుతూ, ఫిట్స్ వచ్చి బ్రూస్ లీ కుప్పకూలి పోయాడు. వెంటనే అక్కడ దగ్గర్లోని బాప్టిస్ట్ హాస్పిటల్‌కు అతడ్ని తరలించారు. డాక్టర్లు ‘సెరెబ్రెల్ ఎడెమా’ అన్నారు. మెదడు వాయడం వల్ల బ్రూస్ లీ కుప్పకూలిపోయాడని నిర్ధారించారు. సరిగ్గా ఇవే లక్షణాలు బ్రూస్ లీ మరణించిన రోజు జూలై 20న ఆయనలో కనిపించాయి. అయితే ఆ లక్షణాలు పైకి పెద్దగా కనిపించలేదు. లోలోపలే అంతా జరిగిపోయింది.
 
మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన శిష్యులు, గురువులు ‘బ్రూస్లీ ఇక లేడు’ అనే వార్త విని తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ టీవీలో పదే పదే ప్రసారమవుతున్న బ్రూస్ లీ చిట్టచివరి సినిమా  ‘ఎంటర్ ది డ్రాగన్’ను మనం ఎన్నోసార్లు చూసి ఉంటాం. కానీ బ్రూస్ లీ చూసుకోలేకపోయారు. ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఆయన మృత్యువాతపడ్డారు.
 
◆ ముప్పై మూడేళ్ల వయసులో తను చనిపోయే నాటికి బ్రూస్లీ నూరేళ్ల జీవితానికి సరిపడ తన ముద్రను అన్ని రంగాలపై చాటుకున్నారు. సినిమాలు, యుద్ధకళలు, సాహిత్యం... ఇలా. అందుకే అతడ్ని ప్రపంచంలోని చాలాదేశాలు, ముఖ్యంగా ఆసియా దేశాలు 20వ శతాబ్దంలోనే ప్రఖ్యాతిగాంచిన యుద్ధ ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తున్నాయి. బ్రూస్ లీ కుమారుడు బ్రాండన్‌లీ, కుమార్తె షానన్ లీ కొంతవరకు మాత్రమే ఆయన వారసత్వాన్ని కొనసాగించగలిగారు. అది కూడా సినిమాల్లో.
           
◆ తాను నేర్చుకోవడమే కాక, ఇతరులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో… కరాటే, కుంగ్ ఫు విద్యలను ఇతర దేశాల్లోనూ పరిచయం చేశాడు. ఇందుకుగానూ దేశీయ విద్యను ఇతర దేశాలకు వ్యాప్తి చేస్తున్నాడని, ఆ దేశీయులు తనని బెదిరించడమే కాక, చంపాలనుకున్నారు కూడా ఆయన తన సంకల్పాన్ని మాత్రం వీడలేదు. ఇది బ్రూస్లీ కథ.
 
పదివేల కిక్కుల్ని ప్రాక్టీస్ చేసి వచ్చినవాడికి నేను భయపడను. ఒకే ఒక కిక్కును పదివేల సార్లు ప్రాక్టీస్ చేసి వచ్చినవాడితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి
- బ్రూస్ లీ