BREAKING NEWS

పాక్ పై 'భారత్ సాధించిన విజయం'..!

భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకున్న పాకిస్తాన్‌పై మన సైన్యం సాధించిన అసామాన్య విజయమిది. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మట్టికరిపించిన రోజది… ‘‘మా దేశాన్ని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకండి’’ అని పరోక్షంగా భారతీయులందరూ ఆ దేశానికి హెచ్చరిక చేశాయి.
దీనికి భారత సైన్యం పెట్టుకున్న కోడ్- ‘ఆపరేషన్ విజయ్’. 

1999 మే-జూలై మధ్య జరిగిన ఈ యుద్ధం గురించి ప్రతి భారతీయుడు గుర్తుచేసుకోవాల్సిన తరుణమిది… కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల పోరాటాన్ని స్మరించేందుకు భారత్ ఏటా జూలై 26న 'విజయ్ దివస్' ను నిర్వహిస్తోంది. ఈ ఏడాదికి ‘కార్గిల్ విజయ్ దివస్‌’కు 21ఏళ్లు కావడం విశేషం!
 
కార్గిల్ యుద్ధానికి మొదటి కారణం.. పాకిస్తాన్ సైనికులు, కశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖను దాటి భారత‌దేశంలోకి చొరబడాలనుకోవడమే.
1999 ఫిబ్రవరిలో భారత్- పాకిస్థాన్ మధ్య లాహోర్ ఒప్పందం శాంతియుతంగానే జరిగింది. దీనిద్వారా జమ్మూకశ్మీర్ విషయంలో రెండు దేశాలూ దౌత్యపరంగా, శాంతియుతంగా పరిష్కారం చూపుకోవాలనుకున్నాయి. కానీ పాకిస్థాన్ సైన్యం ఒప్పుకున్నట్లే ఉండి, వెనకాల కుట్రలు పన్నింది.

ఉగ్రవాదమూకల్ని భారత భూభాగంలోకి పంపించింది. ఆ మూకకి ‘ఆపరేషన్ బద్ర్’ అనే పేరు పెట్టుకుంది. కశ్మీర్, లధక్ మధ్య సంబంధాన్ని తెగొట్టి,
సియాచిన్ హిమపర్వతాల నుంచి భారత్ సైన్యాన్ని పంపేయాలన్నది పాక్ కుట్ర అని భావించింది. 
అప్పటివరకూ.. ఇది కశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా వెల్లడించింది…

కానీ యుద్ధంలో మరణించిన వారి వద్ద లభించిన ఆధారాలను బట్టి, ఆపై పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టి ఇందులో పాకిస్తాన్ సైనికదళాల హస్తం ఉన్నట్లు తెలిసింది. పైగా ఎత్తైన పర్వత ప్రాంతం మీద ఈ యుద్ధం జరగడం వల్ల ఇరు దేశాలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. గడ్డకట్టే మంచులో, అది పర్వతాల్లో ఏ మాత్రం సహకరించని వాతావరణంలో.. దాదాపు 60రోజులపాటు రెండు దేశాల మధ్య నిరంతరాయంగా యుద్ధం జరిగింది. ఇందులో భారత్‌కు చెందిన 527మంది జవాన్లు వీరమరణం పొందారు.
 
యుద్ధం ఎలా మొదలు..

హిమాలయ పర్వతాల్లోని ఘర్‌కోం అనే గ్రామంలో తషీ నామ్‌గ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ భారత్-పాక్ సరిహద్దుల వరకు సమీపించాడు. అక్కడ చాలామంది సైనిక దుస్తుల్లో భారత్ సరిహద్దును దాటుకుని వచ్చి బంకర్లు తవ్వడాన్ని అతను గమనించాడు. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్ సైనికులని నిర్ధారించుకున్న తషీ.. వెంటనే భారత సైనిక శిబిరానికి వెళ్లి ఆ విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్‌ సౌరభ్‌ కాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకోగానే, పాక్‌ సైన్యం వారిని బంధించి, చిత్రహింసలకు గురిచేసి చంపేసింది. ఈ ప్రాంతం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి ఇదే మొదటి అడుగు.
ఇక ఆ తరువాత పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించేసింది. దీనిపై భారత సైనిక శిబిరాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. పాక్ సైన్యం పట్టించుకోకపోవడంతో భారత్ సైనిక చర్య చేపట్టింది. ఆపరేషన్ విజయ్ పేరుతో 1999, మే 3న భారత సైన్యం రంగంలోకి దిగింది.
 
కార్గిల్ పేరు వెనుక

కార్గిల్ అనే పేరు ఖర్, అర్కిల్ అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఖర్ అంటే ప్యాలెస్..  అర్కిల్ అంటే కేంద్రం. ఆ విధంగా ఇది రాజభవనాల కేంద్రంగా ఉంది.  ఎందుకంటే ఈ ప్రాంతం అనేక రాజవంశాల భూభాగాల మధ్యలో ఉంది. అయితే, మరికొందరు.. కార్గిల్ అనే పదం గర్.. ఖిల్ అనే పదాల నుంచి వచ్చిందని చెబుతున్నారు. స్థానిక భాషలో, గర్ అంటే ‘ఏదైనా ప్రదేశం’..  ఖిల్ అంటే ప్రజలు నివసించే ప్రాంతం. కార్గిల్ శ్రీనగర్, స్కార్డో, లేహ్, పాడమ్ నుంచి దాదాపు 200 కి.మీ దూరంలో ఉన్న వాస్తవాధిన రేఖ. కాలక్రమేణా ఖార్ అర్కిల్ లేదా గర్ ఖిల్ ను  కార్గిల్ గా పిలిచారు.
 
బ్యూరోక్రాట్, చరిత్రకారుడు పర్వేజ్ దేవాన్ ‘కార్గిల్ బ్లండర్’ పుస్తకంలో కార్గిల్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో నివసించడానికి అనువుగా మలిచాడని..  షిలిక్‌చాయ్ ప్రాంతంలోని అడవులను తొలగించి నివాసయోగ్య ప్రదేశంగా మార్చాడని.. కాలక్రమంలో ఈ ప్రాంతానికి అతని పేరు మీదుగా కార్గిల్ అని ప్రసిద్ధిగాంచిందని పేర్కొన్నారు.
 
కార్గిల్‌లో రాజవంశాన్ని స్థాపించిన మొదటి ప్రసిద్ధ యోధుడు గాషో థాథా ఖాన్ 8వ శతాబ్దం ప్రారంభంలో కార్గిల్‌ను జయించిన గిల్గిట్ రాజకుటుంబానికి చెందిన వారసుడు. అతని రాజవంశం మొదట్లో కార్గిల్‌లోని సోద్ ప్రాంతాన్ని పాలించింది. ఆ తర్వాత రాజవంశం షకర్ చిక్కాన్ ప్రాంతంలో శాశ్వతంగా స్థిరపడింది. అదే సమయంలో 31 ​​అక్టోబర్ 2019న లధక్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. దీంతో కార్గిల్ లధక్ కేంద్ర పాలిత ప్రాంతం కిందకు వచ్చింది.
 
కార్గిల్ సంస్కృతి

పురాతన కాలంలో, ప్రస్తుత కార్గిల్ ప్రధాన భాగాన్ని పూరిక్ అని పిలిచేవారు. టిబెటన్ పండితులు ఈ పేరు పెట్టారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు టిబెటన్ల లక్షణాలను కలిగి ఉంటారు. దర్ద్ కులం ప్రజలు ద్రాస్‌లో నివసిస్తున్నారు. లధఖీ ప్రజలు జంస్కార్ సమీపంలో నివసిస్తున్నారు. కార్గిల్‌లో నివసించే ప్రజల వారసులు ఆర్యులు, దర్దులు, టిబెటన్లు, మంగోలులుగా తెలుస్తోంది. కార్గిల్ బహుళజాతి, బహుభాషా, బహుళ సంస్కృతుల ప్రజలు నివసించే ప్రదేశం. బ్రోగ్పాస్, బాల్టిస్, పూరిక్, షినాస్, లధక్ ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక ఇక్కడ ప్రజలు షీనా, బాల్టీ, పూరిగ్, లధక్ మొదలైన భాషలు మాట్లాడతారు. బాల్టీ, షీనా భాషలు ఉర్దూ లిపిని కలిపి ఉంటాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉర్దూ సాధారణమైంది.
 

Photo Gallery