BREAKING NEWS

రావమ్మా… 'శ్రావణ వరలక్ష్మీ'..!

తెలుగు మాసాల్లో శ్రావణమాసం ఎంతో ప్రత్యేకమైంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసమిది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈ మాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు మంచి ఫలితాన్ని అందిస్తాయి. శ్రవణా నక్షత్ర ప్రవేశంతో మొదలయ్యే ఈ మాసం అంటే మహాశివుడికి కూడా అత్యంత ఇష్టమని భక్తుల నమ్మకం. శ్రావణమాసం అంటే, 'శుభ మాసం', ‘నభో మాసం’ అని కూడా అంటారు. ‘నభో’ అంటే ఆకాశమని అర్ధం. 

ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెలరోజులపాటు ఉదయం, సాయంత్రాల్లో భగవన్నామస్మరణతో కోవెలను తలపిస్తాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. అటువంటి మంగళకరమైన శ్రావణమాసం విశిష్టత గురుంచి ఈరోజు తెలుసుకుందాం:
 
వ్రతాలు- పర్వదినాలు!

ఏడాది మొత్తంగా చూసుకుంటే, ఈ నెలలోనే ఎక్కువగా వ్రతాలు జరుగుతాయి. ఈ నెలలో నాలుగు మంగళవారాలు మంగళగౌరీ వ్రతంగా, ప్రతి శుక్రవారం మహాలక్ష్మిని పూజిస్తారు. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వీటితోపాటు నాగుల చతుర్థి, శ్రావణ(రాఖీ) పౌర్ణమి, హయగ్రీవ జయంతి, కృష్ణాష్టమి, పోలెల అమావాస్య, పుత్రదా ఏకాదశి, కామిక ఏకాదశి, బలరామ జయంతి, గరుడ పంచమి, అఖండ దీపారాధన వంటి పర్వదినాలన్ని సైతం ఈ నెలలోనే వస్తాయి. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీ, తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వేంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. 
 
పురాణాల ప్రకారం

ఈ నెలలో గృహ నిర్మాణాన్ని చేపట్టడం, కొత్త పనుల్ని స్వీకరించడం మంచిదని మత్స్యపురాణం చెబుతోంది. ఈ పక్షంలోని ఒక్కో రోజు, ఒక్కో దేవుడికి పూజ చేయాలని వివరిస్తుంది.
పాడ్యమిరోజు- బ్రహ్మదేవుడు, విదియ- ప్రియవతి, తదియ- పార్వతీదేవి, చవితి- వినాయకుడు, పంచమి- శశి, షష్ఠి- నాగ దేవతలు, సప్తమి- సూర్యుడు, అష్టమి- దుర్గాదేవి, నవమి- మాతృదేవతలు, దశమి- ధర్మరాజు, ఏకాదశి- మహర్షులు, ద్వాదశి- శ్రీమహావిష్ణువు, త్రయోదశి- అనుంగుడు, చతుర్దశి- పరమశివుడు, పూర్ణిమ- పితృదేవతలకు పూజలు చేస్తే ఎలాంటి సమస్యలు రావని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
 
త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన శ్రావణమాసంగా చెప్పుకుంటారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ మాసంలో చేసే దైవకార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు గోచరిస్తున్నాయి.
 
శివారాధనకు ఎంతో విశిష్టత

శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసం శ్రావణమాసం. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. పాల సముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు ఈ శ్రావణమాసంలోనే స్వీకరించి నీలకంఠుడిగా పేరు పొందాడని ప్రతీతి. అందుకే ఈ నెలలో వచ్చే సోమవారాల్లో శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడం విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవకార్యమైనా కొన్ని వేలరెట్లు శుభ ఫలితాన్నిస్తుందని నమ్ముతారు. 

ఈ కారణంగా ప్రతి సోమవారం మహాలింగార్చన ఉంటుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును, శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. భక్తులు మనస్ఫూర్తిగా ఆరాధిస్తే నవగ్రహాలు శాంతిస్తాయని పండితులు చెబుతున్నారు.

సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని నమ్మకం.
సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఉపవాసదీక్షను చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా, అలా సాధ్యంకానీ పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. 
 
మంగళ గౌరీ వ్రతం

శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతప్రాముఖ్యత గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాల్లో ఉంది. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాసన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
 
వరలక్ష్మీ వ్రతం

ఈ నెలలో వచ్చే శుక్రవారాలను శ్రావణ శుక్రవారాలుగా పిలుస్తారు. ఈ రోజుల్లో మహిళలు తమ సౌభాగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం వరలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. చారుమతీదేవి అనే భక్తురాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలు, సకల శుభాలూ పొందిందని పురాణాలు చెబుతున్నాయి.

ఆ కథను అనుసరించే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం పేరుతో నవ వధువులు, వివాహితులు వరలక్ష్మీ దేవిని పూజించడం, ఇరుగుపొరుగు స్త్రీలను ఆహ్వానించి పేరంటం నిర్వహిస్తారు. ఆ తల్లిని భక్తిశ్రద్ధలతో కొలిచే శ్రావణాన్ని.. శుభకార్యాల మాసమని అంటారు. సర్వదేవతలకు అత్యంత ప్రీతికరమైన నెలగా పరిగణించే శ్రావణంలో చేసే ప్రతి పూజకూ ఎంతో ఫలితం ఉంటుంది. వేంకటేశ్వరస్వామికి పవిత్రోత్సవం పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించే ఈ శ్రావణ మాసం అంటే మహావిష్ణువుకు కూడా చాలా ఇష్టమట.

శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారంరోజున ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణమాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పూజాస్థలిలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి గౌరవప్రదమైన పూజ చేయాలి. అలాగే మంత్రాలను పటిస్తూనే ముతైదువులకు వాయినాలు ఇచ్చి, ఆశ్వీరాదాలు పొందాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధిలో ఉంది.
 
ఈ నెలలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలే కాదు, అమావాస్య, అష్టమి రోజులను కూడా పర్వదినాలుగా పరిగణించడం విశేషం!

అదేవిధంగా మంచి భర్త లభించాలని పెళ్లికాని యువతులు, తమ వైవాహిక బంధం మరింత సజావుగా సాగాలని వివాహితులు శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం… ఓ సంప్రదాయం. శ్రావణమాసంలో కొత్త పెళ్లి కూతుళ్లు ఈ వ్రతాల్ని ఆచరించడం అన్ని విధాల మంచిదని పెద్దలు చెబుతారు. ఈ నెలలో వచ్చే పంచమిని 'నాగపంచమి'గా పిలుస్తారు. సంతానం లేనివారు ఈ రోజున ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి నాగ దేవతను పూజిస్తే సంతానం కలుగుతుందని, సర్వదోషాలు పోతాయని భక్తుల విశ్వాసం.