BREAKING NEWS

అతి చిన్న వయసులో నోబెల్ గెలుచుకున్న… 'మలాల'!

వయసులో చాలా చిన్నది. ప్రపంచాన్ని గడగడలాడించే ఉగ్రవాద సంస్థల్ని సైతం ఎదురించింది.
చిన్న వయసులోనే బాలికల విద్య, మహిళా హక్కుల కోసం పోరాడింది. ఐక్య రాజ్య సమితిలో బాలికల సమస్యల గురుంచి ప్రసంగించింది. అత్యంత ప్రముఖమైన నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంది. ఆ బాలికే యూసఫ్ జాయ్ మలాల…
ఉగ్రవాదులు ఈ అమ్మాయిని టార్గెట్ చేసి కాల్చిన మళ్ళీ కోలుకుని తిరిగి తన పోరాటాన్ని కొనసాగించింది. అటువంటి మలాల పుట్టినరోజు పురస్కరించుకుని ఆమె పోరాటం గురుంచి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
బాల్యం..

1997 జూలై 12న పాకిస్తాన్‌లోని స్వాత్ లోయలో మలాలా జన్మించింది. సంప్రదాయ సున్నీ కుటుంబానికి చెందిన మలాలకు ఇద్దరు తమ్ముళ్లు. యూసఫ్ జాయ్ అనేది స్వాత్ లోయలోని ప్రముఖ తెగ. మలాల తండ్రి జియావుద్దీన్ కవి, విద్యావేత్త. కుశాల్ పబ్లిక్ స్కూల్స్ పేరిట పాఠశాలలను నిర్వహిస్తూ బాలికల విద్య కోసం కృషి చేస్తున్నాడు.
 
లక్ష్యం..

మలాల చిన్ననాటి నుంచి చురుకైన అమ్మాయి. బాగా చదువుకొని వైద్యురాలు కావాలనేది ఆమె కల. అయితే, తండ్రి జియావుద్దీన్ మాత్రం మలాలాను ఓ రాజకీయవేత్తగా చూడాలనుకునేవారు. ఇదే విషయాన్ని మలాలాతో చర్చించేవారు. అర్ధరాత్రి దాటేంతవరకూ ఈమె తన తండ్రితో కలిసి రాజకీయాల గురించి చర్చించేవారు. ఫలితంగా 2008లో పెషావర్ ప్రెస్‌క్లబ్‌లో బాలికల విద్యపై ఉపన్యసించింది. ‘చదువుకోవడం మా హక్కు. దాన్ని లాక్కోవడానికి తాలిబన్లు ఎవరు?’ అని శ్రోతలను ఎదురు ప్రశ్నించింది. ఈ ప్రశ్నను పాక్‌లోని ఛానళ్లు, పత్రికలు ప్రముఖంగా ప్రచారం చేయడంతో స్వాత్ లోయ మొత్తం ఆమె గురుంచే మాట్లాడుకునేది. అప్పటి నుంచే మలాల కుటుంబంపై తాలిబన్లు కక్ష గట్టారు.

సుమారు 50 వేల మంది బాలికలు పాఠశాలకు వెళ్లడమే మానేశారు. అంతేకాదు తాలిబన్లు కొన్ని బాలికల పాఠశాలలను కూల్చివేశారు. ఇంత జరిగినా మలాల మాత్రం ఇంటి దగ్గర ఉండే చదువుకునేది. 11 ఏళ్ల వయసులోనే గుల్ మాకాయ్ అనే పేరుతో బీబీసీ న్యూస్ కి బ్లాగ్ ద్వారా తాలిబన్ల వల్ల వాళ్లు పడుతున్న బాధలను వివరించింది. తాలిబన్లకు తెలిస్తే శిక్ష విధిస్తారని తెలిసిన తన తండ్రి ఆమెకు సహకరిస్తూ ఉండేవాడు. మలాల రాసిన బ్లాగ్ చూసిన 'న్యూయార్క్ టైమ్స్' వారు ఆమె గురుంచి, అక్కడి మహిళలు అనుభవిస్తున్న హింస గురుంచి ఒక డాక్యూమెంటరీ తీశారు. దాంతో తాలిబన్ల దృష్టి మలాల మీద పడింది.  
 
దాడి..

మలాలాపై తాలిబన్ల ఆగ్రహం మరింత పెరిగింది. స్వాత్‌లోయలో బాలికల విద్యను నిషేధించినప్పటికీ, పాఠశాలకు వెళ్తున్న ఆమెను తాలిబన్లు హెచ్చరించారు. అంతేకాక చంపేస్తామంటూ బెదిరించారు. అయినా మలాల బెదరలేదు. 2012 అక్టోబర్ 9న ఆకస్మాత్తుగా తాలిబన్లు దాడికి తెగబడ్డారు. తన శరీరంలోకి తూటాలు దూసుకెళ్లడంతో మలాల మృత్యువుకు చాలా దగ్గరగా వెళ్లింది. దీంతో ఈ బాలికను బ్రిటన్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. మరణంతో పోరాడిన ఈ సాహసి ఎట్టకేలకు ప్రాణాలతో గెలిచి నిలిచింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా హర్షధ్వానాలు మార్మోగాయి.
 
◆ చిన్నపిల్లల చదువుకోసం, మహిళల హక్కుల కోసం అతి పిన్న వయస్కురాలైన బాలిక చేసిన పోరాటానికి గౌరవంగా పాకిస్తాన్ ప్రభుత్వం “నేషనల్ యూత్ పీస్” అవార్డును ఇచ్చింది. ఆనంతరం బాలికల పాఠశాలలు తెరుచుకున్నాయి. అప్పటికి మలాలా వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. 
అలా అన్ని దేశాల్లో బాలికల చదువు కోసం, మహిళల హక్కుల కోసం పోరాటం చేసింది. 
తన పోరాటం, ఎదుర్కొన్న దాడుల గురుంచి హార్వార్డ్ యూనివర్సిటీలో ప్రసంగించింది. 

◆ 2013లో ఐక్యరాజ్య సమితి మలాల జన్మించిన జులై 12వ తేదీన 'మలాల డే'గా ప్రకటించడం విశేషం!
 
నోబెల్..

మలాల, తన తండ్రి కలిసి 'మలాల ఫండ్' అనే ఒక సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ నుంచి ఎంతోమంది బాలికల చదువుకయ్యే ఖర్చును భరిస్తున్నారు. ఆమె చేసిన కృషికి, తెగువకు 2014లో ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన 'నోబెల్' బహుమతికి ఎంపికయ్యింది. అప్పటికి ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. అతిచిన్న వయసులోనే నోబెల్ బహుమతి పొందిన వ్యక్తిగా మలాల చరిత్ర సృష్టించింది. అలాగే పాకిస్తాన్ నుంచి రెండో నోబెల్ పొందిన వ్యక్తి మలాల. (మరణాన్ని జయించిన పదిహేనేళ్ల మలాలాకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ‘డెస్మాండ్ టుటు’ ప్రతిపాదించారు). 
 
◆ 2013లో టైమ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోనే 'మోస్ట్ ఇన్ఫ్లున్సర్ పర్సన్'గా మాలాలను ఎంపిక చేసింది. చిన్న వయసులోనే “ఐ యామ్ మలాల” అనే పేరుతో ఆమె భావాలను వ్యక్తపరుస్తూ ఒక పుస్తకాన్ని రాసింది. ఆ పుస్తకం ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ లో ఒకటిగా నిలిచింది. 18లక్షల కాపీలు అమ్ముడవ్వడంతో వచ్చిన ఆ డబ్బులో 70శాతం బాలికల చదువుకు కృషి చేస్తున్న సంస్థలకు విరాళంగా ఇచ్చింది. 
 
◆ 2015లో మలాల గురుంచి “హి నేముడ్ మీ మలాల” అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ విడుదల అయ్యింది. ఇది 11 భాషల్లో, 172 దేశాల్లో విడుదల  అయ్యింది. అదే సంవత్సరం సిరియా బాలికల కోసం ఒక పాఠశాలను తెరిచింది. ఎన్నో దేశాల్లోని అధ్యక్షులను, మంత్రులను, ఎందరో ప్రముఖులను  కలిసి బాలికల చదువుల కోసం, మహిళల హక్కుల కోసం నిధుల రూపంలో సహాయం చేయమని కోరింది.
 
◆ ఆమె ఇంగ్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ లో ఫిలాసఫీ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ చేస్తోంది. ప్రతి ఒక్క బాలికకు చదువుకునే హక్కు ఉందని చివరకు తాలిబన్ల పిల్లలు కూడా చదువుకోవాలని కోరుకుంటుందామె.
 
◆ 2021 నవంబర్ లో మలాల, తన స్నేహితుడైన అసర్ మాలిక్ ను వివాహమాడింది.