BREAKING NEWS

కృష్ణాష్టమి ప్రత్యేకత, పద్ధతులు

అల్లరి దొంగ, కన్నయ్య, క్రిష్ణయ్య, వెన్న దొంగ, గోపాలుడు, అల్లరి దొంగ అబ్బా చెప్పాలంటే ఎన్నో పేర్లు ఉన్నాయి శ్రీ కృష్ణుడికి. ఎంతో అందంగా, ఎంతో అల్లరిగా, కాస్త చిలిపితనంతో కృష్ణుడు ఎందరో మంది మనసులని దోచేశాడు. కృష్ణుడు గురించి విన్నా, చదివినా ఎంతో ఆనందంగా ఉంటుంది. అంతం లేని ఆ లీలలు, ఊహించనంత అద్భుతాలు తన జీవితంలో ఎన్నో..... ఈ పండుగని  జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. అయితే కృష్ణుడి గురించి, కృష్ణాష్టమి గురించి చాలానే చెప్పాలి. మరి ఆలస్యం చెయ్యకుండా మీరు కూడా చదివేయండి.

చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి
సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు.....

చిన్నప్పుడు నుండి చదువుకున్నదే ఈ చిన్ని  కృష్ణ  గురించి కదా....! ఎంత చదివినా, ఎన్ని చూసినా కృష్ణుడు అనగానే ఎంతో ఆసక్తి కలుగుతుంది.

భారతదేశంలో శ్రీ కృష్ణుడి ఆలయాలు:

మన భారతదేశంలో శ్రీ కృష్ణుడి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆలయాలు ఇవే....  పూరి- జగన్నాథ మందిరం, గురువాయూరు- గురువాఐరోపాప మందిరం,  నాథద్వార శ్రీనాధ్ జీ మందిరం, బృందావనం -ఉత్తర ప్రదేశ్, ఉడిపి - కర్ణాటక, ద్వారక - గుజరాత్,  మన్నార్ గుడి -  - రాజగోపాల మందిరం,  హరేకృష్ణ మందిరాలు - మాయాపూర్, బెంగళూరు, ముంబై, తిరుపతి.... నార్కెట్ పల్లి - నల్గొండ - తెలంగాణ - వారిజాల వేణుగోపాలస్వామి. 

శ్రీకృష్ణుడి జననం: 

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. అయన జననం సందర్భముగా శ్రీ కృష్ణాష్టమిని జరుపుకోవడం తరతరాల నుండి వస్తున్న సంప్రదాయం. 

కృష్ణాష్టమి పండుగ విధానం:

ఒక్కొక్కరు ఒక్కో సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ముఖ్యంగా ఆ రోజున  భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రాం శ్రీకృష్ణుని పూజిస్తారు. అలానే శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. అలానే ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకో బెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీటిని చుట్టు పక్కల ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళకి వచ్చి ఆ కార్యక్రమాలని చూస్తారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి ఉట్టి కొట్టే పోటీలలో పాల్గొంటారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని కూడా పిలుస్తారు. దీనితో పాటు ముగ్గుల పోటీ లాంటివి కూడా సరదాగా జరుపుతారు. 

వందే నవ ఘన శ్యామం, పీఠ కౌసేయ వాససం,
సనందం సుందరం సూధం, శ్రీ కృష్ణం ప్రాకృతే పరం.

 శ్రీకృష్ణ జయంతి వ్రతం చెయ్యడం ఎందుకు? 

భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా కనుక ఆచరిస్తే  గోదానం చేసిన ఫలితం కలుగుతుంది అని భక్తులు నమ్ముతారు. అలానే కురు క్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది. కనుక ఈ శ్రీకృష్ణ జయంతి వ్రతంగా కనుక ఆచరిస్తే   ఎంతో పుణ్యం, ఉపయోగాలు ఉన్నాయి.

శ్రీకృష్ణుడు గొప్పతనం: 

మహా భాగవతం కథలను విన్నా, ఆ దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. నిజంగా మంచి జీవితం పొందాలంటే ఈ మహా భాగవతం అంతా కూడా ఒక మార్గదర్శకమే. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ... అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి మన కృష్ణుడు. అయితే అటువంటి మహోన్నత కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది అనే చెప్పాలి. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయనని  అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. దీనిలో ఏ సంశయము లేదు.

యాదవుల సంప్రదాయం:

కృష్ణాష్టమి రోజున యాదవులు ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లో, పట్టణాల్లోనూ వేడుకలు జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. యాదవులు అత్యధికులు కలిగిన గ్రామాల్లో కృష్ణాష్టమికి ఒకరోజు ముందు నుంచే ఈ వేడుకల్లో నిమగ్నమవుతారు.అర్ధరాత్రి నుంచి వేడుకలను ప్రారంభిస్తారు.  కృష్ణుడు, గోపికల వేషధారణలతో అందంగా అలంకరిస్తారు. కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా ఎంతో అందంగా ఈ పండుగని జరుపుకుంటారు. 

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ |
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

శ్రీ కృష్ణుడి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని కోరుతూ..... శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు....