BREAKING NEWS

మారేడుమిల్లి అందాలు, చూడదగ్గ ప్రదేశాలు...

గోదావరి జిల్లాల్లో ఏ ప్రదేశం అయినా ఎంతో అందంగా ఉంటుంది. పచ్చని చెట్లు, వరి పొలాలు, చల్ల గాలుల నడుమ ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. మారేడుమిల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం. ఈ ప్రదేశం ఒక మంచి వన భోజనాల స్పాట్. ఇక్కడ ఎక్కువగా పిక్నిక్స్ వగైరా వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఊరు చుట్టూ పక్కల అనేక ప్రాంతాలు వున్నాయి. ప్రకృతి ప్రేమికులు ఈ ప్రదేశాలని కనుక చూస్తే అంత త్వరగా వదలరు. ఇక్కడ ప్రకృతి అందాలు టూరిస్టుల మనసు దోచుకుంటాయి. వీకెండ్ ట్రిప్ లకు ఇది సరైన గమ్యస్థానం.
 
మారేడుమిల్లి ప్రాంతం:
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తూర్పు గోదావరి జిల్లా లో రాజమండ్రికి 87 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి. ఇక్కడ  ప్రకృతి ఎంతో అందంగా వచ్చిన వారిని ఆకట్టుకుంటుంది. రమణీయమైన ఈ ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలానే చుట్టూ కొబ్బరి చెట్లతో ఈ ప్రాంతం ఎంతో సుందరంగా ఉంటుంది. వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ ప్రాంతం వీక్షించడానికి అనుకూలం. ఆకుపచ్చ లోయలు, వృక్షజాలం పరవశింపజేస్తాయి. ఈ ప్రాంతాలని చూడడానికి రాష్ట్రంలో నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తూ ఉంటారు. ఈ ప్రాంతం చేరుకోవడం ఏమి కష్టం కూడా కాదు. హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం నగరాల నుంచి సులభంగా చేరుకోవచ్చు. ఉదయాన్నే బయలుదేరి అన్ని చూసుకుని సాయంత్రం వేళకి ఇళ్ళకి చేరుకోవచ్చు.
 
మారేడుమిల్లి విశాఖపట్నానికి 225 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఆ ప్రదేశానికి వెళ్లాలంటే చుట్టూ ఉంటే చూడదగ్గ ప్రదేశాలని కూడా తప్పక తెలుసుకోవాల్సిందే. మరి ఆ ప్రదేశాలు ఏమిటో...? ఎక్కడో ఉన్నాయో...? తెలుసుకోవాలనుకుంటున్నారా...? మరి చదివేయండి....
 
జలతరంగిణి వాటర్ ఫాల్స్:
 
ఈ మారేడుమిల్లి లో అనేక చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూడ దగ్గ ప్రాంతం జల తరంగిణి జలపాతం. ఇది పర్యాటకులని ప్రధానంగా ఆకర్షించే చోటు. అందమైన ప్రకృతి తో ఈ ప్రదేశం ఎంతో చూడ చక్కనిది. ఈ ప్రదేశాన్ని చూడడానికి తెల్లవారుజామున వెళితే మరెంత బాగుంటుంది. 
 
నందన వనం: 
 
బాంబు చికెన్ ఇక్కడ బాగా ప్రసిద్ధి. అలానే ఔషధ మొక్కలకి కూడా ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి చెందినది. ఇదంతా కూడా సహజ అందాల కోవకే చెందినవి. తూర్పు కనుమలు, ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన మొక్కలని సందర్శినకై ఉంచారు. 
 
కార్తీక వనం: 
 
ఈ వనం అంతా కూడా మొక్కలతో నిండిన ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. కార్తీక మాసంలో ఇక్కడ పెద్ద ఎత్తున వన భోజనాలని నిర్వహిస్తారు. ఇక్కడ  వేప, ఉసిరి , మర్రి, బిల్వ వంటి మొక్కలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ నందన వనం లో కాఫీ మరియు పెప్పర్ తోటలు కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాక చెట్లు, పొదలు అలానే వివిధ రకాల పండ్ల తోటలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు.
 
క్రొకోడైల్ స్పాట్: 
 
ఈ ప్రదేశం కూడా చూడదగ్గ ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ పాములేరు వాగు ఉంది. ఇక్కడ మొసళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడ స్నానాలు చెయ్యడం నిషేధం. 
 
జంగిల్ స్టార్ క్యాంప్ సైట్:
 
జంగిల్ స్టార్ క్యాంప్ సైట్ కి రామాయణానికి మధ్య ఎదో లింక్ ఉంది. రామాయణ కాలం లో ఇక్కడే యుద్ధం జరిగినట్టు భావిస్తారు. కొండలు, అడవులు, నీటి పారదులు, గడ్డి మైదానాలు ఇలా అన్ని చూస్తే ఇక్కడే కనుమల అందాలన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. 
 
వన విహారి రిసార్ట్: 
 
ఇక్కడ కనుక స్టే చేస్తే ఎన్నో ప్రాంతాలని సమీపం లో ఉండే ఆనందించవచ్చు. దీని దగ్గరే జంగిల్ స్టార్ రిసార్ట్ కి వెళ్లి ఆనందించవచ్చు. అలానే పాములేరు ప్రవాహాన్ని కూడా దగ్గర నుండే ఆనందించవచ్చు.
 
రంప జలపాతం: 
 
ఈ జలపాతం ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రదేశం రంప చోడవరానికి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి దీవించిన నీలకంఠేశ్వర మరియు రంప జలపాతాలు ఉన్నాయి. ఇక్కడ ప్రదేశం అంతా కూడా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. రమణీయమైన ప్రకృతితో, శ్రావ్యమైన జలపాతాల సవ్వడితో ఎంతో అద్భుతంగా ఉంటుంది. 
 
ఈ ప్రదేశాలని సందర్శించాలంటే మాన్సూన్ తర్వాతే చూడాలి. ఈ ప్రదేశం లో ఏడాది అంతా కూడా రాత్రిళ్ళు ఎంతో చల్లగా ఉంటుంది. ఉదయం వేడిగా ఉంటుంది.  వేసవి లో కూడా ఈ ప్రదేశం చూడడానికి ఎంతో అందంగా కొత్త అనుభూతిని అందిస్తుంది. మరి ఈ అందమైన ప్రాంతాన్ని చూడాలని మీరు కూడా అనుకుంటున్నారా...చాలా సులువే... రాజమండ్రి నుండి వచ్చే వాళ్ళు భద్రాచలం బస్సు కనుక ఎక్కితే రెండు మూడు గంటలలో చేరుకోవచ్చు. అదే భద్రాచలం నుండి వస్తే రాజమండ్రి బస్సు ఎక్కితే 88 కిలో మీటర్లు ప్రయాణం చేస్తే చాలు. 
 
ఇలా ప్రకృతికి దగ్గరగా....సుందరమైన వాతావరణంలో, అందమైన ఈ ప్రదేశాలని చూస్తే కనుల పండుగే.....