BREAKING NEWS

భజరే... నంద గోపాల హారే!

ఓ నంద గోపాలుడా,
దేవకీ సుతుడా, 
మురళీ మనోహరుడా,
నల్లని గోవిందుడా,
రాధామాధవుడా,
శ్యామసుందరుడా… 
మన్ను తిన్న చిన్ని కృష్ణుడా.. 
గోపికల్ని వేధించిన కొంటే కృష్ణుడా...
విశ్వాన్నే తనలో ఇముడ్చుకున్న లోకపాలకుడా!
చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులవాసుల్ని కాపాడిన గోవర్ధన గిరిధారుడా! ఇలా నిన్ను ఏ పేరుతో కొలిచినా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే అనాథరక్షక! పుట్టిన పర్వదినం(ఆగస్టు 30) 'సందర్భంగా ఆయన జన్మ వృత్తాంతం, విశిష్టతల గురించి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
పుట్టుక వెనుక కథ...

ఉత్తరప్రదేశ్‌లోని మధురలో కృష్ణుడి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. వాటి ప్రకారం… మధురలో ఉగ్రసేనుడనే ఒక యాదవ రాజు ఉండేవాడు. ఆయన వృద్ధుడు కావడం వల్ల అత్యాశపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. ఆయన చెల్లెలు దేవకి. ఆమెను మరొక యాదవ రాజైన వసుదేవుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. పెళ్లైన తరువాత వారిని కంసుడు తన రథంలో సంతోషంగా తీసుకెళ్తుండగా ఒక్కసారిగా ఆకాశవాణి ఇలా పలుకుతూ “ఓ కంసా! నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను చంపేస్తాడు. ఇదే నీ అంతం” అని చెబుతుంది. దాంతో కంసుడు ఒక్కసారిగా కోపోద్రిక్తుడవుతాడు. “ఓహో, ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఇప్పుడే దేవకిని చంపేస్తే.. ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేనూ చూస్తాను” అని ఆవేశంగా అంటాడు. వెంటనే 
కత్తిని తీసి తన చెల్లెలి తలను నరకాలని యత్నించగా వసుదేవుడు చంపొద్దని కంసుడ్ని వేడుకొంటాడు.  చేసేదేం లేక చెల్లెలిని, బావను కారాగారంలో బంధించి ఎప్పుడూ కాపలా ఉండేలా భటులను ఏర్పాటు చేస్తాడు.

మొదటి బిడ్డ పుట్టగానే కాపాలదారులు ఆ వార్తను కంసుడికి చేరవేయగా, ఆ శిశువు కాళ్లు పట్టుకొని బండకి బాది చంపేస్తాడు. ఇలా పుట్టిన ప్రతి బిడ్డను వదిలేయమని ప్రాధేయపడినా, వినకుండా వారి ప్రాణాలను తీసేస్తాడు.
అలా ఏడుగురు బిడ్డలు చనిపోగా, మరోసారి నెలలు నిండటంతో శ్రావణ మాస బహుళ అష్టమినాడు రోహిణీ నక్షత్రయుక్త లగ్నంలో అర్థరాత్రి పూట ఎనిమిదవ బిడ్డగా 'శ్రీకృష్ణుడు' జన్మిస్తాడు. ఆ సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఎవరు తెరవకుండానే కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలావాళ్లు అందరూ ఒకేసారి నిద్రపోతారు. వసుదేవుడి సంకెళ్లు తెగిపోతాయి. వెంటనే ఆయన బిడ్డను బుట్టలో నిద్రపుచ్చి యమునా నది దాటి రేపల్లెకు బయలుదేరతాడు. దారిలో కుండపోత వర్షం కురుస్తున్న చిన్నికృష్ణుడిపై చుక్క నీరు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు.

వసుదేవుడు నదిని దాటి రేపల్లెలోని యాదవ రాజైన నంద ఇంటికి వెళ్తాడు. అక్కడ యశోద ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఆ శిశువు స్థానంలో కృష్ణుడిని ఉంచి, తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. లోపలికి రాగానే తలుపులు మూసుకుంటాయి. చేతికి సంకెళ్లు వాటంతట అవే పడతాయి. పాప ఏడుపు విని కాపలావాళ్లు లేస్తారు. వెళ్లి కంసుడికి ఈ వార్త చేరవేస్తారు. ఎనిమిదవ సంతానంగా మగపిల్లవాడు పుట్టాలి కానీ ఆడపిల్ల పుట్టిందని నుమానపడతాడు. కాపలవాళ్లు ఈ శిశువు పుట్టినప్పుడు మేము కళ్లారా చూశామని చెప్తారు. కానీ వసుదేవుడు ఈ బిడ్డనైనా వదిలేయమని ప్రాధేయపడగా కనికరం చూపించకుండా చంపేయాలనుకుంటాడు. కానీ ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్లి “నిన్ను చంపేవాడు పుట్టాడు. రేపల్లెలో పెరుగుతున్నాడు” అని చెప్పి మాయమవుతుంది. 

అలా నందుడి ఇంట మరో మగబిడ్డ జన్మించడంతో... రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తాడు. అదే 'గోకులాష్టమి'గా పేరుగాంచింది. అంతేకాదు శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే 'కృష్ణాష్టమి'గా నేడు మనం జరుపుకుంటున్నాం.
 
కృష్ణాష్టమి రోజున పాదముద్రలు ఎందుకు వేస్తారంటే...

ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా కృష్ణుడి పాదముద్రలు వేస్తాం. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లోకి సుఖసంతోషాలు ప్రవేశిస్తాయని నమ్ముతారు. పూజా మందిరాన్ని మన అంతరంగంగా భావిస్తే.. కృష్ణుని పాదాలు మన అంతరంగాన్ని తెలుసుకొనే మార్గంగా చెబుతుంటారు.
 
ఉట్టి కొట్టడం వెనుక కారణం...

గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజున చాలా సందడిగా గడుపుతూ, ఉట్టి కొడతారు. దీన్ని ఉత్త‌ర భార‌తంలో ‘ద‌హీ హండి’ అని పిలుస్తారు. ఇంటింటికీ వెళ్లి మ‌ట్టి కుండ‌లో పెరుగు, పాలుతోపాటు చిల్ల‌ర‌ డ‌బ్బులు సేక‌రించి దాన్ని ఉట్టిలో పోస్తారు. ఆ ఉట్టి కుండను పొడ‌వైన తాడుకు క‌ట్టి లాగుతూ ఉంటారు. సాధారణంగా ఉట్టిని ఒకరు పైకి, కిందకు లాగుతుంటే.. మరొకరు కొట్టడానికి ప్రయత్నిస్తారు. లేదంటే చేయీ చేయీ కలిపి ఒకరి భుజాలపై మరొకరు ఎక్కి పగలగొడతారు.

ఉట్టిని కొట్టనివ్వకుండా ముఖాలపై రంగు నీళ్లు పోస్తుంటారు. అయినా పట్టు వదలకుండా ఉట్టి కొడతారు. దీనర్థం అందరూ కలిసి కృషి చేస్తే ఎంత‌టి అవరోధానైనా అధిగ‌మించ‌వ‌చ్చు. అంతేకాదు 
చిన్న‌త‌నంలో గోపాల కృష్ణుడు ఉట్టిలో ఉన్న వెన్నను దొంగిలించి నలుగురికి పంచి పెడతాడు. న‌లుగురికి పంచివ్వడంలో ఉన్న ఆనంద‌మేమిటో ఆనాడే లోకానికి చాటి చెప్పాడు మన బాలకృష్ణుడు. 
 
ఇతరాంశాలు

●కృష్ణుడికి ఎనిమిదికి చాలా దగ్గరి సంబంధముంది. ఎందుకంటే 
ఆయన పుట్టింది ఎనిమిదవ తిథినే. దశావతారాలలో ఆయనది ఎనిమిదవ అవతారం. 
ఈయన వసుదేవునికి ఎనిమిదవ సంతానం. 
ఈయనకు ఎనిమిదిమంది పట్టపు రాణులు. 
ఎనిమిదితో గుణిస్తే 16వేల గోపికలు ఉన్నారు. 

●తనకు బదులుగా గోవర్ధనగిరిని పూజించారనే కోపంతో ఇంద్రుడు రేపల్లెపై ఏకధాటిగా వానను కురిపిస్తే.. ఆ వాన నుంచి తనవారిని, పశువులను రక్షించుకోవడానికి.. గోవర్ధన పర్వతాన్ని గోపాలుడు తన చిటికెన వేలిపై నిలిపాడు. ఆ విధంగా ఇంద్రుడి అహంకారాన్ని అణిచివేశాడు. పుట్టగానే తల్లిదండ్రులకు, యుద్ధ భూమిలో అర్జునుడికి కర్తవ్యబోధ చేశాడు. అందుకే ఆయన్ను ‘కృష్ణం వందే జగద్గురుమ్’ అని కీర్తిస్తారు.

●కన్నయ్య కటిక పేదరికంలో ఉన్న తన స్నేహితుడు కుచేలుని నుంచి అటుకులు స్వీకరించి బదులుగా అంతులేని సిరిసంపదలను బహుకరిస్తాడు. 

●మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపిన మార్గదర్శి, "దుష్ట శిక్షణ...శిష్ట రక్షణ" అన్న గీతోపదేశంతో మానవాళికి దిశా నిర్దేశం చేసింది 'శ్రీకృష్ణ భగవానుడే'. 

●సంతానం లేనివారు కన్నయను పూజిస్తే సంతానప్రాప్తి లభిస్తుందని అందరూ విశ్వసిస్తారు.

●కృష్ణుడికి ప్రేమతో, భక్తితో ఏది సమర్పించినా ఆనందంగా స్వీకరిస్తాడు కావున ఆ వెన్నెదొంగకు ఇష్టమైన వెన్నె ప్రసాదాలను సమర్పించి, ఆశీస్సులు పొందుదాం.
 
 "హరే కృష్ణ హరే కృష్ణ
 కృష్ణ కృష్ణ హరే హరే"