BREAKING NEWS

నీ ఆట 'కాంస్యం'గాను: సింధు

నాడు రియోలో రజతం…
నేడు టోక్యోలో కాంస్యం…
వరుసగా రెండు పతకాలు.
చరిత్రలో తనకంటూ ఓ పేరు,
ఆమె బ్యాడ్మింటన్ క్రీడాకారిణి 
' పీ.వి.సింధు'...
బ్యాడ్మింటన్ సింగిల్స్ మహిళా విభాగంలో అత్యుత్తమ ప్రదర్శననిచ్చింది.
నేడు ఈ పేరు తలవని భారతీయుడు లేడు.
ఆమె ఆటని ప్రశంసించని అభిమాని ఉండడు.
గల్లీ నుంచి గ్రౌండ్ దాకా ఒలంపిక్ కిక్ కోసం చూస్తున్న భారతావనికి పతకం అందించి…
అటు తల్లిదండ్రులకు, ఇటు భారత్ కు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆమె క్రీడా ప్రయాణం మొదలు జీవిత విశేషాలను ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
పుట్టింది...

1995 జూలై 5న పీవి రమణ, విజయ దంపతులకు హైదరాబాద్ లో జన్మించింది పీవి సింధు. ఈమె పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. ఈమె తల్లితండ్రులిద్దరూ ఒక్కప్పటి వాలీబాల్ ప్లేయర్స్. అప్పట్లో తన తండ్రికి రైల్వే ఉద్యోగం రావడంతో వాలీబాల్ ఆడటం కోసం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈమెకో అక్క దివ్య. 
 
చదివింది...

సికింద్రాబాద్ లోని ఆక్సైలియం హైస్కూల్ లో 10వ తరగతి వరకు చదువుకుంది. మెహిదీపట్నంలో ఎస్.టి ఆన్స్ ఫర్ ఉమెన్స్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసింది.
 
క్రీడల్లోకి...

చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకుంది. కానీ ఎనిమిదేళ్ళ వయసులో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లల గోపిచంద్ ఇంగ్లాండ్ పోటీలో గెలిచి వార్తల్లో రావడం చూసి, తను కూడా బ్యాడ్మింటన్ ఆడాలనుకుంది. అందుకుగానూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సికింద్రాబాద్ లోని ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ బ్యాడ్మింటన్ కోర్టులో చేరింది. మెహబూబ్ అలీ దగ్గర ఆటలో బేసిక్స్ నేర్చుకుంది. తర్వాత
గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో చేరిన కొన్ని రోజులకు 10 సంవత్సరాల కేటగిరీ కింద ఆడింది. అంతేకాదు ఆ తర్వాతి డబుల్స్, సింగిల్స్ విభాగంలో ఐదవ సర్వే ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఛాంపియన్‌షిప్‌ను సింధు గెలుచుకుంది. 
అండర్-13లో  పాండిచ్చేరిలో ఆడి, సబ్-జూనియర్ టైటిల్ ను అందుకుంది.
అండర్-14 జాతీయ క్రీడల్లో పాల్గొని బంగారు పతకం సాధించింది. 
14 సంవత్సరాల వయస్సులోనే  అంతర్జాతీయ ఆటలో చోటు సంపాదించింది. 
2009 కొలంబోలో జరిగిన సబ్- జూనియర్ ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఈమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 
2010 ఇరాన్ ఫజ్ర ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాలెంజ్‌లో రజత పతకం సాధించింది. 
2010లో మెక్సికోలో జరిగిన బిడబ్ల్యూఎఫ్(బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్)జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. కానీ ఫైనల్ లో ఓడిపోయింది. 
2011లో జరిగిన ఇండియన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో ఆడి, గెలుపొందింది. 
2012లో ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్ లో టాప్ 20లో చోటు దక్కించుకోవడంతో సింధుకు మొదటిసారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 
2014 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం పతకం సాధించింది.
2016లో రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ వరకు చేరి, రజత పతకం సాధించింది. 
2018 కామన్వెల్త్ క్రీడల్లో మిక్స్ డ్ టీం లో స్వర్ణం గెలిచింది.  
2018 బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ లో స్వర్ణంతో పాటు, 2017లో రజతం పతకం అందుకుంది.
2018 ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకోగా,
2019 ప్రపంచ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం రాగా… తాజాగా 
2021 టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్‌ క్రీడల్లో ఆమె కాంస్య పతకం కైవసం చేసుకుంది. 
 
అవార్డులు...

◆2012 ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సైనా నెహ్వాల్ తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది.
◆2013లో ఐబిఎఫ్ లో పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా ఈమె రికార్డులకెక్కింది. 
◆ఇదే ఏడాదిలో అర్జున అవార్డును అందుకుంది.
◆2013లో సిఎన్ఎన్ - ఐబిఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ స్పోర్ట్స్ అవార్డును పొందింది.
◆2015లో భారత ప్రభుత్వం సింధుకు పద్మశ్రీ అవార్డును ఇచ్చి గౌరవించింది.
◆2016లో రియో ఒలింపిక్స్ లో రజతం గెలిచిన పిన్న వయస్కురాలైన భారత మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. 
◆2016లో బ్యాడ్మింటన్ విభాగంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును సొంతం చేసుకుంది. 
◆2018లో అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా అథ్లెట్ల జాబితాల్లో సింధు ఒకరని ఫోర్బ్స్ జాబితాలో విడుదల చేసింది.
◆2020లో పద్మ భూషణ్‌ పురస్కారాన్ని అందుకుంది.    
 
ఇంకొన్ని...
 
■ 2020 ఏప్రిల్ క్రీడల్లో ఆరోగ్యకరమైన ఆటను ప్రోత్సహించడానికి బిడబ్ల్యూఎఫ్(BWF) కమిటీ  "ఐ యామ్ బాడ్మింటన్" అలాగే  2021 మేలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ "బిలీవ్ ఇన్ స్పోర్ట్స్" ప్రచారానికిగానూ బ్యాడ్మింటన్ నుంచి సింధు ఎంపికైంది.

■ 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుపొందడంతో వరుసగా రెండు ఒలింపిక్ మెడల్స్ గెల్చుకుని దేశంలోనే తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 

అంతేకాదు వరుసగా రెండు ఒలింపిక్స్ ను అందుకున్న మూడవ ప్లేయర్ గానూ రికార్డుకెక్కింది. 
 
■ 2021 ఒలింపిక్స్ లో పార్క్ తే సాంగ్ కోచ్ శిక్షణలో ఎన్నో కొత్త  మెలకువలు నేర్చుకొని, నా ఆట తీరును మెరుగుపర్చుకున్న అని తన కోచ్ గురుంచి అలాగే కరోనా సమయంలో  బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకోవడానికి గచ్చిబౌలి మైదానం ఎంతో ఉపయోగపడిందని, 2024లో రాబోయే పారిస్ ఒలింపిక్స్ లో బంగారు పతకం గెలవడమే తన ధ్యేయమని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. భవిష్యత్తులో ఆమె మరిన్ని పతకాలు సాధించాలని మనం ఆశిద్దాం.