BREAKING NEWS

చరిత్రకు నిలువుటద్దం - 'రామప్ప'

రామప్ప దేవాలయం అంటే చరిత్రలో ఓ గొప్ప కట్టడం. కాకతీయుల సామ్రాజ్యానికి ప్రతిరూపం. నిర్మాణానికే దాదాపు 40 సంవత్సరాలు పట్టింది. పూర్వంలో శిల్పాలను చెక్కేవారని తెలుసు. కానీ సూది పట్టేంత సన్నని రంధ్రాలను చెక్కేంత గొప్ప శిల్పులు అప్పట్లో ఉన్నారంటే నమ్మశక్యం కలుగక మానదు. తేలియాడే ఇటుకలు.. 

ఎన్నో శిల్పాలు వాటి భంగిమలు.. 
ఎన్ని సంవత్సరాలైన సరే ఆ ఆలయం విశిష్టత మాత్రం తగ్గలేదు. అందుకే తాజాగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అరుదైన యునెస్కో వారసత్వ కట్టడంగా రామప్పకు గుర్తింపు లభించింది. అటువంటి రామప్ప అలయ నిర్మాణం, విశిష్టతల గురుంచి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం.
 
ఆలయ నిర్మాణం...

రామప్ప దేవాలయం వరంగల్ జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని కాకతీయ మహారాజు గణపతిదేవుడి ఆస్థానంలోని సామంత రాజైన రేచర్ల రుద్రుడు కట్టించాడు. 
క్రీ.శ.1173వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించే పనులు మొదలు పెట్టి, క్రీ.శ.1213లో పూర్తి చేశారు. సుమారు 40 దశాబ్దాల కాలం పట్టింది.
ఇక్కడ రుద్రేశ్వరస్వామి కొలువై ఉండగా ఆలయానికి మాత్రం ఆ దేవుని పేరు కాకుండా తయారీలో ముఖ్య పాత్ర పోషించిన శిల్పి రామప్ప అనే వ్యక్తి పేరును పెట్టడం విశేషం! 
 
ఆలయ ప్రత్యేకతలు

గుడి చూడటానికి నక్షత్రాకారంలో కనిపిస్తుంది. చుట్టూ మూడువైపులా
ద్వారాకాలున్నాయి. నిర్మాణానికి ఎక్కువగా ఎర్ర ఇసుకరాయిని ఉపయోగించారు.
పటిష్టమైన పునాది కోసం ఆరున్నర అడుగుల ఎత్తులో ఇసుకను పోసి ఎప్పుడు తడిగా ఉండేలా చేశారు.

అలాగే ఒకదానికొక ద్వారాన్ని కలపడానికి అంటూ, స్తంభాల పైకప్పుకు, మదనిక శిల్పాలకు, నంది విగ్రహంతోపాటు గర్భాలయంలోని శివలింగాలకు పూర్తిగా నల్లగా ఉండే గట్టి రాయిని వాడారు. దీన్నే బ్లాక్ డోలరైట్ అంటారు.
గోపురం సైతం ఎక్కువ బరువు లేకుండా చూసుకున్నారు. నీటిలో తేలియాడే ఇటుకలను తయారు చేయించి నిర్మించారు. ఇందుకు ప్రత్యేకమైన మట్టితోపాటు ఏనుగులద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారు. సూది పట్టేంత సన్నని రంధ్రాలను సైతం చెక్కారు.

మాములుగా అయితే గోడలపైన శాసనాలు ఉంటాయి.
కానీ ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఒక శాసన మండపం ఉంది. అందులో తెలుగు, కన్నడ భాషల్లోని లిపిలో కనిపిస్తుంటుంది.
'నేను ఎవరికైనా శత్రువును కావొచ్చు కానీ ఈ ఆలయం కాదు. దీన్ని ధ్వంసం చెయ్యొదు' అనీ ఒక శాసనంలో రాచర్ల రుద్రుడు రాసిన మాటలు ఇవి.
అంతేకాదు నంది కోసం ప్రత్యేకంగా ఒక మండపం ఉంది. శివుడు పిలిస్తే పలికినట్లుగా నంది చెవి, కన్ను ఆయన వైపు చూస్తూ, అలాగే కాలు ముందుకు చాచినట్లుగా ఉంటుంది.
గర్భద్వారం పక్కన ఉన్న నర్తకి శిల్పాలను తాకితే విచిత్రంగా వీణ శబ్దం వినిపిస్తుంది.
గుడి లోపలికి వాన నీరు పడకుండా ప్రత్యేకంగా పైకప్పును వెలుపలికి నిర్మించారు.
నాట్య గణపతి, భైరవుడు, వేణుగోపాలస్వామి, ఆయుధాలు ధరించిన యోధులు, భటులు, నాట్యమణులు, వాయిద్యకారులు, మల్లయుద్ధ దృశ్యాలతో పాటు నగిని, సూర్య, శృంగార శిల్పాలు లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇది హిందూ ఆలయమే అయినా కొన్నిచోట్ల జైన, బౌద్ధమూర్తుల చిత్రాలు ఉన్నాయి.
అలానే మహాభారతంలోని క్షీరసాగర మధన ఘట్టాన్ని శిల్పం రూపంలో మలిచారు.
 
ఆలయం ధ్వంసమైందిలా...

కట్టించిన 800 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని మినహా మిగతా శిల్పాలు, స్తంభాలు ఎక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. కాకతీయులు యుద్ధానికి వెళ్లే ముందు పెరణి నాట్యం చేసేవాళ్లట.  అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కఫర్ కాకతీయుల రాజ్యంపై దండెత్తి, ఆఖరి రాజైన ప్రతాప రుద్రుడ్ని ఓడించాడు. అలా ఈ ఆలయం కొంతభాగం ధ్వంసమైంది.
భూకంపాలు సంభవించడం వల్ల కొన్ని శిల్పాలు కనుమరుగయ్యాయి.
కాకతీయుల పతనం తర్వాత క్రీ.శ.1323లో ఈ ఆలయం మూతపడింది. నిజాం హయాంలో 1911లో తిరిగి మళ్లీ గుడికి మరమ్మతులు జరిపారు.
ఈ ఆలయంలో రుద్రేశ్వరస్వామితో పాటు, కాటేశ్వర, కామేశ్వర దేవుళ్లను పూజిస్తారు.
ఈ ఆలయానికి దగ్గర్లో ఒక చెరువు కూడా ఉంది.
 
ఆలయానికి వారసత్వం రావడానికి చేసిన ప్రయత్నాలు...

★2009లో వారసత్వం కోసం ప్రయత్నం మొదలు పెట్టారు.
★2012లో వారసత్వ కార్యకర్తలు అలాగే ఇతరులు కలిసి ఈ ఆలయాన్నీ పరిరక్షించాల్సిన అవసరం గురుంచి ప్రచారం చేశారు. 
★2015లో ఆలయానికి నామినేషన్ ప్రతిపాదించాలని కోరారు. 
★2016లో నామినేట్ చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
★2018లో యునెస్కో నిపుణుల బృందం ఆలయాన్ని సందర్శించింది.
★2019లో నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఆ తరువాత నిపుణులు ఆ స్థలాన్ని సందర్శించారు. 
★2020లో కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.
★ 2021లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దొరికింది. (21 సభ్య దేశాలలో 17 దేశాలు రామప్ప ఆలయానికి మద్దతు ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 42వ వారసత్వ కట్టడంగా ఈ రామప్ప ఆలయాన్ని యునెస్కో ఎంపిక చేసింది.)
 
గుర్తింపు వల్ల లాభం ఏమిటి?

రామప్ప ఆలయానికి సాంస్కృతిక, సహజ వారసత్వ సంరక్షణకు కావాల్సిన ఆర్థిక సహాయం అందుతుంది. అలాగే మరమ్మతులు చేయవలసి వస్తే ప్రపంచ ప్రాజెక్టు నిర్వహణతో పాటు కావాల్సిన వనరులను కూడా సమకూర్చడానికి వీలుంది.
 
ఇతరాంశాలు...

★1983లో నటరాజ రామకృష్ణగారు ఆలయంలో ఉన్న శిల్ప భంగిమలను చూసే పెరణి నాట్యాన్ని నేర్చుకున్నారు. అలా రామప్ప నుంచే ఈ నాట్యం మళ్లీ వెలుగులోకి వచ్చింది. 

★కాకతీయుల చిహ్నంగా ఉండేందుకనీ ద్వారంపైన గజలక్ష్మినిప్రతిష్టించేవారు.

★ఏ గుడిలోనైనా ప్రధాన ద్వారం బయట నవగ్రహాలు ఉంటాయి. కానీ ఈ రామప్ప ఆలయంలో మాత్రం గుడి చుట్టూ నవగ్రహాలు ఉన్నాయి.

★ఈ ఆలయంలో మొత్తం 12 మదనిక శిల్పాలు ఉన్నాయి. ఒక్కో శిల్పం ఒక్కో భంగిమతో విభిన్నంగా ఉంటుంది.