BREAKING NEWS

మగధ సామ్రాజ్యపు చక్రవర్తి: 'బింబిసార'!

మన భారతదేశం అనేక గొప్ప గొప్ప రాజ్యాలు, వంశస్తులు, చక్రవర్తులను నెలకొల్పిన దేశంగా కీర్తి గడించింది. భారతదేశ చరిత్రలో గొప్ప స్థానాలను, స్థాయిలను దక్కించుకున్న రాజ్యాలలో మగధ సామ్రాజ్యం ఒకటిగా నిలిచింది. ఈ మగధ సామ్రాజ్యం గురించి మన వేదాల్లో.. మరీ ముఖ్యంగా రామాయణ మహాభారతాల్లో ప్రస్తావించడమైంది.  ఎంతో గొప్ప చరిత్రను కలిగివున్న ఈ మగధ సామ్రాజ్యం గురుంచి మనం ఈరోజు తెలుసుకుందాం: 

మగధను పాలించిన రాజుల చరిత్రలో కొంతమంది స్వదేశీ చరిత్రకారులు, విదేశీ రాజులకు తొత్తులుగా మారడంతో భవిష్యత్తు తరాలకు వీరి గురించి తెలుసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. అందుకు వీరి చరిత్రలను కనుమరుగు చేశారు. కానీ అదృష్టవశాత్తు చలనచిత్ర పరిశ్రమ కారణంగా అప్పుడప్పుడు మనకు తెలియకుండా కనుమరుగైపోయిన ఎంతోమంది రాజుల చరిత్రలను, ప్రశస్తిని నేడు మనం సినిమాల ద్వారా తెలుసుకుంటున్నాం. అలా చరిత్రలో మనకు తెలియకుండా మిగిలిపోయిన సామ్రాజ్యాధిపతి అయిన బింబిసార మహారాజు గురుంచి ఈ మధ్యకాలంలో మన తెలుగు కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ గారు నటించిన చిత్రం విడుదలైంది. 

మహావంశం ప్రకారం క్రీ.పూ. 6వ శతాబ్దంలో మగధ రాజ్యాన్ని హర్యాంక రాజ్యవంశం పరిపాలించింది. ఈ రాజ్యాన్ని ఆ కాలంలో భాటియా అనే రాజు పరిపాలిస్తుండేవాడు. వీరి తనయుడే మన బింబిసారుడు. ఈయనకి 15 సంవత్సరాలు రాగానే తండ్రి, మగధ సామ్రాజ్యానికి కాబోయే రాజుగా ప్రకటించాడు. అలా చిన్న వయసులోనే మగధ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. ఈయన అంతిమ లక్ష్యం.. మగధ సామ్రాజ్యాన్ని భారతదేశ ఖండంలో విస్తరింపజేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇక తన చుట్టూవున్న రాజ్యాలను యుద్ధం చేసి గెలుపొందడం మొదలు పెట్టాడు.

ఇతర రాజ్యాలను గెలవడం కోసం బింబిసారుడు కేవలం యుద్ధమే కాకుండా సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించాడు. అవసరమైతే తప్ప యుద్ధం చేయడం, తప్పని స్థితిలో సంధి చేసుకోవడం.. అయినా కుదరకపోతే ఆ రాజ్యపు రాజకుమారునికి వివాహం జరిపించడం, ఇలా తన తెలివితేటలతో చాలా సామ్రాజ్యాలను మగధ రాజ్యంలో కలిపేసుకున్నాడు. క్రీ.పూ. 540వ సంవత్సరంలో బింబిసారుడు మగధ సామ్రాజ్యంలో 15 ఏళ్లకే రాజు అయ్యాడని తెలుస్తుంది. ఇక సింహాసనాన్ని  అధిష్టించిన తరువాత ఆ సామ్రాజ్యానికి రాజధానిగా రాజాగిరిని స్థాపించాడు. ఇది 5 కొండల మధ్యలో ఉంటుంది.

అందుకే ఈ ప్రాంతాన్ని గిరివజ్ర అని అనేవారు. బింబిసారుడు ఈ రాజ్యాన్ని ఎందుకు రాజధానిగా ప్రకటించాడంటే, తన రాజ్యంలోకి ఎవరైనా రావాలంటే ఆ రాజ్యం చుట్టూ ఉన్న కొండలను దాటి రావాల్సిందే.. ఆ కొండలను దాటి రావాలంటే అంత సాధ్యమయ్యే పనికాదు. ఇక రాజు అయ్యాక బింబిసారుడు తన పక్కరాజ్యం అయిన అంగరాజ్యంపై బింబిసార దృష్టి సారించారు.

ఎందుకంటే తన చిన్నతనంలో అంగరాజ్యపు రాజైన బ్రహ్మదత్తుడు, తన తండ్రిని ఓడించాడు. అందుకు ప్రతీకగా బింబిసారుడు ఈ రాజ్యంపైకి దండెత్తాడు. దాంతో బింబిసారుడు దెబ్బకి బ్రహ్మదత్తుడు నిలవలేకపోయాడు. దాంతో అంగరాజ్యం బింబిసార కైవసమైంది. ఇదే మనం ఇప్పుడు పిలుస్తున్న పశ్చిమ బెంగాల్ ప్రాంతం. ఇది సముద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల , ఆ కాలంలో విదేశీ వ్యాపార సంబంధాలను ఈ రాజ్యం నుంచే చేసుకొని తన మగధ సామ్రాజ్య సంపదను బింబిసారుడు కొనసాగించాడు.

ఇలా వరుసగా రాజ్యాలను గెలుచుకుంటూనే ఉన్నాడు బింబిసారుడు. ఇలా కోసల రాజ్యాన్ని జయించడానికి కోసలరాజు కూతురు అయిన కోసలదేవిని వివాహం చేసుకున్నాడు. దాంతో మగధ, కోసల దేశాల మధ్య శత్రుత్వం ముగిసింది. పైగా బింబిసారుడుకి కట్నంగా కాశి నగరాన్ని కూడా ఇచ్చేశారు. కాశీ నగరం అప్పటి నుంచి హిందూమతానికి పవిత్ర స్థలంగా మారింది. ఈ నగరం నుంచి కూడా బింబిసారుడుకి ఆదాయం వచ్చేది. ఆ తరువాత వైశాలికి చెందిన లిచ్చావి యువరాణిని మద్ర వంశానికి చెందిన యువరాణిని పెళ్లి చేసుకున్నాడు.

రాజ్యవిస్తీర్ణం కోసం బింబిసారుడు ఒకటికాదు రెండుకాదు ఏకంగా 500మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇక మరికొన్ని రాజ్యాలను తమ స్నేహంతో పొత్తు పెట్టుకొని గెలిచాడు. అదెలాగంటే ప్రత్యుత్తర రాజు ఈయనకి జబ్బు చేసినప్పుడు, బింబిసారుడు ఇతని వద్దకు ప్రత్యేక వైద్యుడిని పంపించి చికిత్స చేయించాడని బౌద్ధ గ్రంధంలో రాసివుంది. అప్పట్లో బింబిసారుడి ఆధీనంలో 80,000 గ్రామాలు ఉండేవి. ఒక్కొక గ్రామానికి ఒక్కొక అధికారిని నియమించి పన్నులు వసూలు చేయించేవాడు. అలాగే ఆ గ్రామ పరిపాలనను బాగా జరిపేవాడు. అలాగే తన మంత్రులు చెప్పే సలహాలను సైతం చాలా శ్రద్దగా వినేవాడు.

అలాగే యుద్ధం వచ్చినప్పుడు సైనిక దళాలలను సిద్ధం చేయకుండా ముందునుంచే పటిష్టమైన సైనిక వ్యవస్థను సిద్ధం చేసుకునేవాడు. బింబిసారుడు నియమించిన ఈ పద్దతినే 'స్టాండింగ్ ఆర్మీ' అని పిలుస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు తన రాజ్యంలోని సభ్యులు, తన పైఅధికారులతో చర్చలు జరిపేవాడు. ఇలా బింబిసారుడు దూరదృష్టిని కలిగి ఉండడం వలన మగధ రాజ్యఖజానా అనేది నిండుగా ఉంటుంది. అప్పట్లో మగధ సామ్రాజ్యంలో ఇనుము ఖనిజాలు నిక్షిప్తంగా దొరికాయి. ఈ నిక్షేపాలను వాడుకోవడంలో బింబిసారుడు విజయం సాధించాడు. దొరికిన ఇనుప ఖనిజాలతో ఇనుము వస్తువులను చేయించేవాడు.

ముఖ్యంగా గొడ్డలి, నాగలి యుద్ధంలో ఉపయోగించేందుకు ఆయుధాలను తయారు చేయించారు. తన రాజ్యం చుట్టూ ఉన్న అడవుల నుంచి కలప, ఏనుగులను తెప్పించుకున్నాడు. అలాగే ఈ రాజ్యం గంగానదికి ఒడ్డున ఉండటం వల్ల ఈ రాజ్యంలో విస్తారంగా పంటలు పండేవి. ఫలితంగా రైతులకు ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండేది. దాంతో వారు రాజ్యానికి పన్నులు సకాలంలో కట్టేవారు. ప్రతి అవసరాన్ని వదలకుండా బింబిసారుడు ఉపయోగించుకునేవాడు. సైనిక విభాగాలైన.. పదాతి దళం, ఆశ్వీకా దళం, రథాలు, ఏనుగులు. అలాగే ఇతను అంగరాజ్యాన్ని గెలిచాక, నావికా దళాన్ని సైతం ఏర్పాటు చేశాడు. ఇతను తన రాజ్యంలో అన్ని మతాలవారిని గౌరవించేవాడు.

ఇతని హయాంలోనే గౌతమ బుద్ధుడు,అలాగే వర్ధమాన మహా వీరుడు వారి వారి బోధనలను మొదలు పెట్టారని చరిత్ర చెబుతోంది. బింబిసారుడు, హిందూ మతంతో పాటు, జైన, బౌద్ధ మతాలను కూడా ఆదరించాడు. బౌద్ధ, జైన మత గ్రంథలలోనూ బింబిసారుడు తమ మతానికి చెందిన వారుగా ప్రస్తావించారు. బింబిసారుడుకి, గౌతమ బుద్ధుడి మధ్య ఉన్న అనుబంధం గురించి చాలా ఇతిహాసాలలో వివరించడం జరిగింది. బింబిసారుడు అన్ని మతాల వారికి ఆశ్రయాన్ని కల్పించాడు. ఇలా ప్రతి విషయంలో ఎంతో గొప్పగా, తెలివిగా, దూరదృష్టితో వుండే బింబిసారుడిని ఏ ఇతర రాజు ఎదుర్కొలేకపోయాడు.

కానీ బింబిసారుడు పతనం అనేది తన కొడుకు వలనే వచ్చింది. గౌతమ బుద్ధుడు బంధువైన దేవదత్తుడి మాటలు వింటూ ఉండేవాడు. ఈ దేవదత్తుడు చాలా దుర్మార్గుడు. ఇతను బింబిసారుడు రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలని ఆశించి అందుకు అడ్డుగా ఉన్న  బింబిసారుడిని తప్పించాలని, అతని కొడుకుకు తప్పుడు సలహాలు ఇచ్చాడు. దీంతో ఇతని మాటలు విన్న అజాత శత్రువు ఈ రాజ్యానికి తను రాజు అవ్వాలని తన తండ్రిని కారాగారంలో బంధించి, చంపించాడని బౌద్ధమత గ్రంథాలలో రాసి ఉంది.

తన కొడుకు చేసిన మోసానికి బింబిసారుడు తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకున్నాడని మరో మతం అయిన జైన మత గ్రంథంలో రాసి ఉంది. రెండింటిలో ఏది నిజం అనే విషయం తెలియక పోయిన కొడుకు చేతిలో తను మోసపోయాడు. బింబిసారుడుకి తన కొడుకు మీద ఉన్న అతి ప్రేమ,  అతని చావుకు కారణమైంది. ఏదిఏమైనా బింబిసారుడు ఒక గొప్ప మహా రాజు. మొత్తం మగధ సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేసిన మహాయోధుడు.