BREAKING NEWS

'జై శ్రీ కృష్ణా..!'

చిన్ని కృష్ణగా, వెన్న దొంగగా, కన్నయ్యగా, గోపాలుడిగా, మాధవుడిగా, లోకపాలకుడిగా.. ధర్మసంస్థాపన కోసం ఇలలో వెలసిన మహిమాన్విత అవతారమే శ్రీ కృష్ణావతారం.. అష్టమిరోజున పుట్టిన నల్లని కృష్ణయ్య.. పుట్టినరోజును పురస్కరించుకుని గోకులాష్టమిగా, కృష్ణాష్టమిగా మన తెలుగువారు వేడుకగా జరుపుకోవడం ఆనవాయితీ. అటువంటి పర్వదినం ఈ నెల 18న కాగా, ఈ సందర్భంగా ఆయన అవతారం వెనుక దాగివున్న కథ గురుంచి ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
కృష్ణుడు అవతరించిన విధం

త్రేతాయుగంలో మానవుడే దేవునిలా అవతరించాడని అంటారు. అందులోనూ ధర్మానికి ఎలా కట్టుబడి ఉండాలో వామనవతారం, పరశురామవతారం, రామావతరంలో బతికి చూపించాడు శ్రీ మహావిష్ణువు. త్రేతాయుగంలో మంచి చెడులు వేర్వేరు ఖండాల్లో, దేశాల్లో ఉండేవి.

మనిషికి మంచిని బోధించడానికే దేవుడు మానవుడి రూపంలో అవతరించాడు. అయినా కూడా మనిషి ఏం నేర్చుకోలేదు. దీంతో నేరుగా ప్రపంచానికి ధర్మంవైపు ఎలా నిలబడాలో నేర్పించడానికి ద్వాపరయుగంలో ఒక గురువు, అత్యంత జ్ఞాని, అన్ని లోకాలకు ఆదిగురువు, జగద్గురు కావాలని సాక్షాత్తు విష్ణుమూర్తి.. కృష్ణావతారం ఎత్తాలని నిర్ణయించుకున్నాడు.

ఇక వేర్వేరు ఖండాల్లో, దేశాల్లో ఉన్న మంచిచెడులు కాస్త ద్వాపరయుగం వచ్చేసరికి మన ఇంటి లోపలకు వచ్చేశాయి. ఇప్పుడేంటంటే, మన ఇంట్లోనే ఒక మంచివాడు చెడ్డవాడు ఉన్నాడు. మంచిచెడ్డ అనేవి మనుషుల నుంచి కాదు మనసుల మధ్యకు చేరింది. వాటి మధ్యే ప్రస్తుతం అంతరయుద్ధం జరుగుతుంది. కృష్ణుడికి మాత్రమే తాను పుట్టుక నుంచి విష్ణుఅవతారమని తెలుసు. ఏం చేసైనా, ఎలాగైనా సరే ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకునేవాడు ఆయన.
 
పుట్టుక..

మధుర రాజధానిలో ఉగ్రసేన మహారాజుకు ఇద్దరు పిల్లలు. వారి పేర్లు కంసుడు, దేవకి. కంసుడికి దేవకి అంటే అమితమైన ప్రేమ. చెల్లెలు అంటే ప్రాణం. అత్యంత గారభంగా పెంచుకున్నాడు. ఎంతో వైభవంగా వసుదేవుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. అత్తారింటికి రథం వెనుక రథం కట్టి ఘనంగా తీసుకెళ్తున్నాడు. అంత ఆనందంగా ఉన్న సమయంలో ఆకాశవాణి నుంచి అతనికి ఒక స్వరం వినిపించింది. కంసా.. నీ మృత్యువును సాగనంపుతున్నావా… నీ చెల్లెలి కడుపులో జన్మించే ఎనిమిదో సంతానమే నీ మృత్యువు! ఆ సంతానమే నిన్ను చంపుతుంది. అది విని ఉక్రోశంతో రథం దిగి, చెల్లెలి జుట్టు పట్టుకుని నిన్ను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నా.. నీవు నా మృత్యువును కంటావా..

అని ఆమె మీదకు కత్తి ఎత్తి పట్టుకుంటాడు. అప్పుడు వసుదేవుడు కంసుడి కాళ్ళు పట్టుకొని బావ తనని ఏం చేయొద్దు, దేవకీకి ఎనిమిదో బిడ్డ కదా… ఆ బిడ్డ పుట్టే సమయానికి మేము మీ దగ్గరే ఉంటాం. నీకే ఇచ్చేస్తాం. నీవు ఏమైనా చేసుకో అని అంటాడు. అందుకు సరేనని ఇద్దర్ని దగ్గర్లో ఉన్న జైల్లో బంధిస్తాడు. కొన్ని సంవత్సరాల్లో ఆమె ఆరుగురు బిడ్డలకు జన్మనిస్తుంది. ఆ అరుగురు కంసుడుకి అల్లుళ్ల వరుస అవుతారు. ఒకసారి నారదుడు వచ్చి, ఆహా నీ అల్లుళ్ళతో బాగా ఆడుకుంటున్నావా.. ఆ ఎనిమిదోవాడు పుట్టిన తరువాత… వీళ్లకు ఆ పుట్టబోయేవాడు తమ్ముడవుతాడు. అప్పుడు నా తమ్ముడే కదా అని అందరూ కలిసిపోతే నీ చావును నీవే పెంచుకున్నవాడివి అవుతావు అనేసి వెళ్ళిపోతాడు. అప్పుడు వెంటనే విచక్షణ కోల్పోయి తన కత్తిని తీసుకొని ఒక్కొక్కరి జుట్టు పట్టుకుని తలని నరికేశాడు.

ఈ విషయం తెలియగానే దేవకీకి బతికుండగానే లోకంలోని అన్ని బాధలు అనుభవించినట్లైంది. కొన్నాళ్ళకు ఆమె ఏడోసారి గర్భం దాల్చింది. ఆ సమయంలో.. విష్ణువుకి యోగమాయ అనే శక్తి ఉన్నందున.. దేవకి కడుపులోని పిండాన్ని రోహిణి అనే ఆవిడ కడుపులోకి మారుస్తాడు. ఆ పిండమే బలరాముడు. బలరాముడు అదిశేషుని అవతారం. విష్ణువుకి చెందిన ప్రతి అవతారంలో ఆదిశేషుడు సకలం ఉంటాడు. వామనుడికి ఛత్రి, రాముడికి లక్ష్మణుడు, కృష్ణుడికి బలరాముడు అన్నమాట…

ఈసారి దేవకి, వాసుదేవుడున్న కారాగారం చుట్టూ సైనిక బలగాన్ని పెంచాడు కంసుడు. ఎనిమిదో బిడ్డ పుట్టిన మొదటి ఏడుపుకే తనకు సమాచారం అందించాలని వారిని అజ్ఞాపిస్తాడు. దేవకీకి గర్భవేదన ఎక్కువైపోయింది. ఈ బిడ్డ కంసుడు చేతిలో చావడంకన్నా తన చేతిలోనే చావడం ఉత్తమమని భావిస్తుంది. అందుకు తన చేతులతో ఆ పిండాన్ని పిడి గుద్దులతో అంతమోదించాలని యత్నించింది. అప్పుడే ఒక పెద్ద వెలుగులో.. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కనిపించి, దేవకి నేను నీకు బిడ్డగా పుట్టాలనుకుంటున్నాను. నన్ను నీ బిడ్డగా స్వీకరిస్తావా అని అడుగుతాడు.

ఇక ఆ మాటకు ఆమె ఆశ్చర్యపడి, ఆనందపడుతుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే నేను కంటానా… నా గర్భంలో అతను జనిస్తాడా… ఇక నా బిడ్డని కంసుడు కాదు కదా ఇక ఎవరు ఏమి చేయలేరని అనుకుంటుంది. నవ మాసాలు నిండాయి. ఆ రోజు అష్టమి రోహిణి నక్షత్రం, అర్ధరాత్రి సమయంలో దేవకీకి నొప్పులు మొదలయ్యాయి. ఆమె ఎడవకుండా నొప్పిని భరిస్తూ ప్రసవానికి సిద్ధపడింది. కారాగారం అవతల కాపలాగా ఉన్న గాడిద కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు వసుదేవుడు. ఎందుకంటే పిల్లాడి అరుపు విని అది అరుస్తుందని.. నొప్పులు ఎక్కువై తన కడుపును చీల్చుకొని శ్రీ కృష్ణుడు జన్మించాడు.

బాబు ఏడుస్తాడని, గాడిద కాళ్ళను పట్టుకున్న వసుదేవుడు, దేవకీ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ బాబు ఏడవలేదు. పైగా అత్యంత అందంగా, నీలం రంగులో మెరుస్తూ పెదవి పై చిరునవ్వు ఒలుకుతూ, హాయిగా ఆడుకుంటున్నాడు.  వెంటనే గాడిదతో పాటు చెరసాల ముందున్న సైనికులందరూ స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆపై ఆ చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. అదే సమయంలో విష్ణువు యోగమాయ రేపల్లెలో యశోద, నందనుడుకి అడపిల్లగా జన్మించింది. యశోద స్పృహలో లేదు. మధురలో కారాగారంలో చివరిసారిగా బిడ్డకి ముద్దు పెట్టి, వసుదేవుడుకి ఇచ్చింది దేవకీ. ఆ బిడ్డని చిన్న బుట్టలో వేసి, తలపై పెట్టుకొని వేగంగా నడుస్తూ యమునానది వరకు వచ్చేశాడు వసుదేవుడు.

అకస్మాత్తుగా పెద్ద వర్షం… ఆ వర్షం దాటితే యమునా నది పొంగి ప్రవహిస్తుంది. రేపల్లెకు వెళ్లాలంటే కచ్చితంగా ఆ నది దాటాలి. ఇంత చేసినా విష్ణువుదేవుడే దారి చూపడా.. అని ముందుకు సాగాడు. నీళ్లు నడుము వరకు వచ్చాయి. నీటి మట్టం పెరిగి తన మెడ వరకు చేరాయి. చివరిసారిగా ఊపిరి గట్టిగా పీల్చుకున్నాడు. బాబును ఒక చేత్తో పైకి ఎత్తి పట్టుకున్నాడు. అలా మోచేతి వరకు నీళ్లు చేరాయి. కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఆడుతుండగా, కృష్ణుడి కాలి స్పర్శ యమునానదికి తగిలింది. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్పర్శే అని గ్రహించి యమునా నది ఒక్కసారిగా రెండుగా చీలిపోయింది.

మధ్యలో వసుదేవుడు నిల్చొని ఉన్నాడు. అలా ఆదిశేషుడు పెద్ద పడగ విప్పి, వసుదేవుడు, కృష్ణుడు తడవకుండా రేపల్లెకు చేరుకున్నారు. రేపల్లెలో యశోదమ్మకు పుట్టిన యోగమాయను తీసుకొని, ఆ స్థానంలో కృష్ణుడుని తన కొడుకులా పెంచమని చెప్పి వసుదేవుడు నందుడికిచ్చాడు. వసుదేవుడు ఆ చిన్న పాపను తీసుకొని మరలా కారాగారంలోకి వచ్చాడు. రాగానే ఆ పాప గట్టిగా ఏడ్చేసింది. ఆ ఏడుపుకు అక్కడున్న గాడిద, సైనికులు లేచారు. ఈ విషయం తెలిసి కంసుడు కారాగారం దగ్గరకు వచ్చి, చూస్తే ఆడబిడ్డ కనిపించింది.

ఆడపిల్ల అయినా, అవకాశం తీసుకోకూడదని ఆ పాపను పైకి విసిరి కత్తితో నరికి చంపేయాలనుకుంటాడు. అలా పైకి విసిరిన పాప గాల్లోనే ఉండి, ఒక మాయరూపంలా మారి ఇలా అంది… కంసా నీ చెల్లిని, ఆమె భర్తను ఇద్దర్ని కారాగారంలో బంధించావు, వారికి పుట్టిన ఆరుగురు బిడ్డల్ని చంపేశావు. ఇప్పుడు పుట్టిన ఈ బిడ్డను చంపాలని చూశావు. ఈ రకంగా నీ పాపాల్ని పెంచుకుంటూ పోతున్నావు. నీ మృత్యువు ఇప్పటికే ఈ భూమ్మీదకు వచ్చేశాడు.

క్షేమంగా ఉన్నాడు. పెరిగి పెద్దై నీ పాపం పండిన రోజున నీకు మృత్యువుగా ఎదురవుతాడని హెచ్చరిస్తుంది. దీంతో కంసుడికి ప్రాణభయం మరింత పెరిగిపోయింది. నా అగర్భ శత్రువు పుట్టాడు. వాడ్ని పెరగకముందే చంపేయాలని అనుకుంటాడు. ఆ పుట్టిన బాలుడు ఎవరో తెలియక, రాజ్యంలోని పసిపిల్లలందర్ని చంపేయమని సైనికులను ఆదేశిస్తాడు. అలా వేలాదిమంది పసిపిల్లల్ని అకారణంగా చంపేస్తాడు కంసుడు. 

కృష్ణుడు ఏ రోజూ ఏడ్చేవాడు కాదు. ఎప్పుడు కూడా ముద్దుగా ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు కృష్ణుడికి పాలు పట్టించి పడుకోబెట్టి లోపల పని చేసుకోవడానికి వెళ్ళింది యశోద. ఇంతలో కంసుడు పంపిన రాక్షసుల్లో పూతన అనే రాక్షసి రూపం మార్చుకొని అందమైన యువతిలా మారి రేపల్లెకు వచ్చింది.

ఇంతలోనే కృష్ణుడు ఉన్న ఇంటికి వచ్చి, తనకి పాలు పట్టించింది. ఆ పాల ద్వారా మత్తును, విషాన్ని ఎక్కించి పసిపిల్లలను నొప్పి తెలియకుండా చంపాలనుకుంది. కృష్ణుడు పాలు తాగుతూనే ఉన్నాడు. ఆమె దగ్గర పాలు అయిపోయాయి. కానీ ఇంకా తాగుతూనే ఉన్నాడు. ఇప్పుడు తాగుతున్నది పాలు కాదు రక్తం. ఆ రాక్షసి బలాన్ని పాలరూపంలో పట్టి తాగేసి, చంపేస్తాడు. ఇంతలో యశోద వచ్చింది. పూతన చనిపోయి, తన అసలు రూపమైన రాక్షసి రూపంలోకి మారింది. ఆ రాక్షసి శరీరంపైన కృష్ణుడు పడుకొని హాయిగా ఆడుకుంటున్నాడు. ఇదంతా ఎలా సాధ్యపడిందో తెలియక ఈ విషయాన్ని నందుడికి తెలియజేసింది.

అతను విషయాన్ని గ్రహించి పూతనను ఊరి చివరకు తీసుకెళ్లి భస్మం చేస్తాడు. అలా భస్మమైన, పూతన ఆత్మను కొందరు దేవతలు వైకుంఠానికి తీసుకెళ్లారు. నీకు వైకుంఠ ప్రాప్తి దొరికింది ఇక నువ్వు ఇక్కడే ఉండొచ్చు అన్నారు. నీవు శ్రీ మహావిష్ణువుకే పాలు పట్టించావు. నీవు రాక్షసివే అయినా చిన్నపిల్లాడనే భావనతో నొప్పి తెలియకుండా చంపాలనుకున్నావు.  కేవలం కంసుడి ఆజ్ఞతోనే ఇలా చేశావుగాని, కావాలని చేయలేదు. అందుకే నీకు వైకుంఠ ప్రాప్తి దక్కిందని దేవతలు చెప్తారు. ఇలా కంసుడు పంపిన రాక్షసుల్లో అందరూ వెనక్కు తిరిగి వచ్చారు ఒక్క పూతన తప్ప, కంసుడికి అవగతమైంది తన మృత్యువు ఇంకా ఎక్కడో బతికే ఉందని, అలానే పూతన ఎక్కడ చనిపోయిందో కూడా అతనికి తెలియదు.

మళ్లీ అందర్నీ పంపించాడు. ఈసారి త్రినావర్తుడు అనే రాక్షసుడు రేపల్లెకు చేరాడు. మళ్లీ కృష్ణుడు ఏడవడం మొదలు పెట్టాడు. ఒక పెద్ద దుమ్ముతో కూడిన సునామీని సృష్టించాడు ఆ రాక్షసుడు. ఆ దుమ్ము వల్ల పక్కన నిలబడినవారు కూడా కనిపించడం లేదు. త్రినావర్తుడు కృష్ణుడు ఏడుపు విని అతడ్ని పట్టుకొని ఆకాశంలోకి ఒక్క ఉదుటున వెళ్ళిపోయాడు. ఈసారి త్రినావర్తుడు తిరిగి కంసుడు దగ్గరకు వెళ్ళలేదు.  ఇలా చాలా రాక్షసుల్ని కృష్ణుడు చంపేశాడు. తిరిగి రాని రాక్షసుల జాడ తెలియక, కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో తెలియక కంసుడు విశ్వప్రయత్నాలు చేశాడు. 

పెరిగిపెద్దవాడైన శ్రీకృష్ణుడిని కంసుడు తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు. ఆ ఆహ్వానం మేరకు శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి వెళ్తాడు. వాళ్లను చంపడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసి ఉంటాడు కంసుడు. కానీ ఫలితం ఉండదు. చివరకు, నువ్వు నా మామవి అని ఇన్నాళ్లు ఊరుకున్నాను. నీ అఘాయిత్యాలను నేను ఇక సహించను అంటాడు. కానీ ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదంటూ కంసుడ్ని చంపేస్తాడు శ్రీకృష్ణుడు. 
 
కృష్ణాష్టమిరోజున భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా నివేదిస్తారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు చేస్తారు. వీధుల్లో ఉట్టి కట్టి చిన్నాపెద్ద పోటీపడి మరీ ఉట్టి కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన పుణ్యం దక్కుతుందని బ్రహ్మాండ పురాణంలో రాసివుంది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇది.