BREAKING NEWS

టాలీవుడ్ 'మన్మథుడు'కి 63 ఏళ్లు..!

మాస్, క్లాస్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అనే తేడా లేకుండా టాలీవుడ్ ప్రేక్షకుల్ని 30 ఏళ్లుగా తన సినిమాలతో అలరించిన నవ మన్మథుడి 63వ పుట్టినరోజు నేడు. తండ్రి సినీ పరిశ్రమలో ఎప్పట్నుంచో హిట్ కథానాయకుడిగా ఉన్నప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. కింగ్ గా, బాస్ గా, నవ మన్మథుడుగానే కాక అన్నమయ్య, శ్రీరామదాసు వంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో నటించి, మర్చిపోలేని గొప్ప అనుభూతిని అందించాడు. అగ్రస్థాయి హీరోల జాబితాలో ఒకరిగా నిలిచిన అక్కినేని నాగార్జున సినీ, నిజ జీవిత విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
 
బాల్యం, వివాహం
1959 ఆగస్టు 29న మద్రాసులో అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు నాగార్జున. నాగార్జునకి అన్నయ్య వెంకట్, సత్యవతి, సురోజన, సులోచనలు అక్కలు వున్నారు. చిన్న వయసు నుంచే నాగేశ్వరరావుగారు ఆయన  కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చేశారు. అలా ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో జరిగింది. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు లిటిల్ ప్రౌడ్ స్కూల్ లో చదివారు. మద్రాసులో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు.

కొన్ని సంవత్సరాలు అమెరికాలో ప్రాక్టీస్ కోసం వెళ్ళాడు కానీ అదే సమయంలో రామానాయుడుగారు నాగేశ్వరరావుగారితో వున్న స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని అనుకున్నారు. రామానాయుడి కుమార్తె అయిన లక్ష్మిని, నాగార్జునకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని, 1984 ఫిబ్రవరి 18న మద్రాస్ లోని శేష్ మహల్ కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. అయితే వీరిద్దరూ రెండేళ్లు బాగానే వున్నారు.  తర్వాత నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎదగాలని ప్రయత్నాలు చేయడంతో అది ఆమెకు ఇష్టం లేక అమెరికాలో సెటిల్ అవుదామని నిర్ణయించుకుంది. 
 
సినీ కెరీర్

నాగార్జున హీరోగా హిందీ సినిమాను విక్రమ్ పేరుతో తెలుగులో రిమేక్ చేశారు. 1986 మే 23న ఈ సినిమా విడుదలైంది. అదే సంవత్సరం నవంబర్ 23న నాగచైతన్య పుట్టాడు. విక్రమ్ తరువాత కెప్టెన్ నాగార్జున కుడా విడుదలయ్యింది. రెండు సినిమాలు నిరాశను మిగిల్చినా, కొడుకు పుట్టిన ఆనందంలో వాటన్నిటినీ మర్చిపోయాడు. 1987లో క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన అరణ్యకాండ కూడా నిరాశనే మిగిల్చింది.

దీని తరువాత దాసరి నారాయణరావుగారి దర్శకత్వంలోవచ్చిన మజ్ను పర్వాలేదు అనిపించింది. ఆపై వచ్చిన సంకీర్తన, తండ్రితో కలిసి నటించిన కలెక్టర్ గారి అబ్బాయి, అగ్ని పుత్రుడు, కిరాయిదాదా ఇవేవీ కూడా ఆయనకి సంతృప్తినివ్వలేదు. ఆ తరువాత రాఘవేంద్రగారి దర్శకత్వంలో శ్రీదేవి హీరోయిన్ గా జంటగా నటించిన ఆఖరి పోరాటం మంచి హిట్ అందుకుంది. కెరీయర్ లో హిట్ దక్కింది కానీ ఇండస్ట్రీలో మిగిలిన హీరోలు అందుకున్న విజయాలతో పోలిస్తే అది సరిపోదనిపిస్తుంది.

మణిరత్నంగారి దర్శకత్వంలో వచ్చిన గీతాంజలితో నాగార్జున మంచి హిట్ తో పాటు ప్రేమికుడిగానూ పేరు సంపాదించుకున్నారు. మరలా రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్ గా నటించిన జానకి రాముడు మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో విజయవాడ బ్యాక్ గ్రౌండ్ లో 1989 వచ్చిన శివ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. నాగార్జున ఏ హిట్ కోసమైతే ఎదురుచూశాడో ఆ హిట్ ఈ సినిమాతో అతనికి దక్కింది. దీని తరువాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇందులో నటించిన అమలగారిని ప్రేమించి, ఆ ప్రేమ 'నిర్ణయం' సినిమాతో మరింత బలపడి,1992 జూన్ 11న పెళ్లికి దారితీసింది. వీరిద్దరికి 1994 ఏప్రిల్ 8న అఖిల్ పుట్టాడు. శివ సినిమా రీమేక్ తో హిందీలో నటించగా, మరొక సినిమా బుదగవా అనే హిందీ సినిమాలో నటించాడు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, హలో బ్రదర్ వంటి సినిమాలు మాస్ హీరోగా నిలబెట్టాయి.1996లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడతా ఫ్యామిలీ హిట్ అయింది. 1997లో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య నాగార్జున కెరియర్ లో ఎప్పటికి గుర్తుంచుకోదగ్గ ఆధ్యాత్మిక చిత్రంగా మిగిలిపోయింది. ఈ సినిమా విడుదలైన రెండు వారాలవరకు ఎటువంటి కలెక్షన్ రాలేదు.

ఆ తరువాతే కలెక్షన్ పెరిగింది. అయితే ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ సినిమాని డబ్బింగ్ చేసి తమిళంలో అన్నమాచార్యాగా, హిందీలో శ్రీ తిరుపతి బాలాజీగా విడుదలైంది. తిరుపతిలో షూటింగ్ కి అనుమతి ఇవ్వకపోవడం వలన అన్నపూర్ణ స్టూడియోలో సెట్టింగ్ వేసి సినిమా తీశారు. ఆ తరువాత ఆవిడే మా ఆవిడ, చంద్రలేఖ సినిమాలతో కామెడీ పరంగా సూపర్ హిట్ కొట్టాడు. హరికృష్ణతో కలిసి సీతారామరాజు, శ్రీకాంత్ తో కలిసి నిన్నే ప్రేమిస్తా చేసి మల్టిస్టారర్ హిట్లను అందుకున్నాడు. తన మేనల్లుడు సుమంత్ తో కలిసి స్నేహం అంటే ఇదేరా, ఆపై వచ్చిన సంతోషం సూపర్ హిట్ ల జాబితాలో చేరిపోయింది.

2002లో మన్మధుడు సినిమాతో టాలీవుడ్ మన్మధుడుగా పాపులర్ అయ్యాడు. 2003లో పూరి దర్శకత్వంలో వచ్చిన శివమణితో ఎటువంటి క్యారెక్టర్ అయిన చెయ్యగలడని రుజువు చేశాడు. ఆ తరువాత మాస్, సూపర్, నేనున్నానులతో అలరించాడు. 2006లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామదాసులో రామదాసుగా జీవించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. అదే ఏడాదిలో వచ్చిన బాస్ నుంచి 2013లో వచ్చిన భాయ్ వరకు ఒక్క కింగ్ తప్ప అన్ని నిరాశనే మిగిల్చాయి. ఆయన గ్రాఫ్ పడిపోతుందన్న సమయంలోనే తన తండ్రి ఏఎన్నార్ మరణంతో మరింత కుంగుబాటుకు గురయ్యారు.

తండ్రి కొడుకులు కలిసి విక్రమ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'మనం'తో మళ్లీ పుంజుకున్నారు. సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి వంటి ఉత్తమమైన సినిమాలతో అదరగొట్టాడు. ఓం నమో వెంకటేశాయా, దేవదాసు నిరాశపరిచిన 
2019లో వచ్చిన బిగ్ బాస్ సీజన్-3లో తనదైన శైలిలో హోస్ట్ గా వ్యవహరించాడు. అందుకు సంబంధించిన సెట్ ను కూడా అన్నపూర్ణ స్టూడియో లొనే నిర్మించాడు.

ఆయన ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. 2009లో పెద్దకొడుకు నాగచైతన్య నిదిల్ రాజ్ బ్యానర్ లో జోష్ మూవీతో పరిచయం చేశాడు. అలానే అఖిల్ కూడా హీరోగా తెరంగేట్రం చేశారు.

ఈయన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే షోతో మంచి సక్సెస్ సాధించాడు. మాటీవీలో ప్రధాన పెట్టుబడిదారుడు నాగార్జునే. ఈయనకి ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి. గీతాంజలి అన్నమయ్య సినిమాలకి భారతముని అవార్డులు లభించాయి. నిన్నే పెళ్లాడతా నిర్మించినందుకు ఉత్తమ పురస్కారమైన జాతీయ అవార్డు లభించింది. అన్నమయ్యలో నటించినందుకు జాతీయ పురస్కారం లభించింది. బంగార్రాజు, ది ఘోస్ట్, బ్రహ్మాస్త్రం-1 వంటి చిత్రాలతో ప్రస్తుతం
బిజీగా ఉన్నారు. అంతేకాక బిగ్ బాస్ సీజన్ 6కు వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను త్వరలోనే అలరించనున్నారు.