BREAKING NEWS

'రాకెట్రి'- నంబి నారాయణన్..!

1994 నవంబర్‌ 30.. అప్పటివరకు ఆయన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త. యావత్‌ భారత్‌ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది. ఆయన కనిపెట్టిన ‘వికాస్‌’ ఇంజిన్‌ అద్భుతమైనదని ప్రపంచమంతా గొప్పగా చాటుకుంది. కానీ ఒకే ఒక ఘటనతో ఆయన జీవితం తలకిందులైపోయింది. దేశం కోసం అహర్నిశలు శ్రమించిన ఆయనను ‘దేశద్రోహి’ అని ఆరోపించాయి. చేయని తప్పుకు 50రోజులు జైలులో నరకం అనుభవించారు.

చివరకు నిర్దోషిగా బయటకు రావడమే కాకుండా.. దేశ మూడో అ‍త్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్‌’ను అందుకున్నారు. ఆయనే  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన నంబి నారాయణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. విలక్షణ నటుడు మాధవన్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి టాక్ అందుకుంది. ఈ సందర్భంగా నంబి నారాయణన్‌ గురించి..
 
పరిచయం

మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు నంబి నారాయణన్ గారు. 1941 డిసెంబర్‌ 12న తమిళనాడులో జన్మించారు. ఆయన తల్లిదంద్రులు కొబ్బరి పీచు వ్యాపారం చేసేవారు. ఐదుగురు అమ్మాయిల తర్వాత నంబి ఆఖరివాడు. ఇంట్లో అందరికంటే చిన్నవాడైన నారాయణన్‌.. చదువులో మాత్రం బాగా రాణించేవాడు. ఇంజనీరింగ్‌ పూర్తి చేశాక.. కొంతకాలం స్థానికంగా ఉండే చక్కెర కర్మాగారంలో పనిచేశాడు. అతనికి ఎప్పుడూ విమానాలు, ఎగిరే వస్తువుల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆ అభిరుచే 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో చేరెలా చేసింది. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని  ప్రిన్స్‌టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్‌షిప్ పొందారు.
 
నాసా ఆఫర్ వద్దనుకొని

నాసాలో ఉద్యోగ అవకాశం లభించినా, దేశ ప్రయోజనాల కోసం దాన్ని సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇస్రోలో చేరారు. అక్కడ  విక్రమ్ సారాబాయి, సతీష్ ధావన్, అబ్దుల్ కలాంలాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో నారాయణన్‌ కీలక పాత్ర పోషించారు. ప్యూయల్‌ టెక్నాలజీని ఇస్రోకు అందించాలన్నదే తన ధ్యేయం. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే క్రయోజెనిక్‌ ఇంజిన్స్‌. ఈ టెక్నాలజీ అప్పట్లో మనకు అందుబాటులో లేదు. దీంతో రష్యాతో రూ.235 కోట్ల ఒప్పందం కుదుర్చుకొని ఈ టెక్నాలజీని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. ఈమేరకు సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఆ సమయంలోనే ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. చేయని తప్పుకు నంబి నారాయణన్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
 
అసలేం జరిగిందంటే..?

1994 నవంబర్ 30న నంబిని కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతకు నెలరోజుల ముందు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్నారంటూ మాల్దీవులకు చెందిన మహిళ మరియమ్ రషీదా,  ఫయూజియా హసన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆ మహిళలిద్దరూ భారత రాకెట్‌ సాంకేతిక విషయాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారని తేలింది.

అంతేకాదు వీరికి ఇస్త్రోలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆ మహిళలు వేసిన వలలో నంబి నారాయణన్‌ కూడా ఉన్నారని కేరళ పోలీసులు అభియోగాలు మోపారు. దేశద్రోహం కేసు కింద అరెస్ట్‌ చేసి 50 రోజులు జైల్లో పెట్టి, విచారణ పేరుతో నరకం చూపించారు. దేశం గర్వించదగ్గ సైంటిస్ట్‌ అని కొనియాడిన మీడియానే ఆయన్ను ‘దేశద్రోహి’గా చూపించింది. గూఢచారి, దేశద్రోహి అంటూ అనేకమంది ఆయనను నిందించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆయన ఇంటిపై దాడి చేశారు. 
 
న్యాయమే గెలిచింది

దేశం కోసం నాసా ఆఫర్‌ని తిరస్కరించిన నంబి నారాయణన్‌కు.. అసలు తనని ఎందుకు అరెస్ట్‌ చేశారో కూడా మొదట్లో అర్థం కాలేదట. పోలీసులు ఎంత హింసించిన నేరం ఒప్పుకోలేదు. అరెస్టైన నెల రోజుల తర్వాత ఈ కేసు కేరళ ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి సీబీఐకు బదిలీ అయింది. 1995 జనవరి 19న ఆయనకు బెయిల్‌ వచ్చింది. సీబీఐ విచారణలో నంబి నారాయణన్‌ ఎలాంటి తప్పు చేయలేదని రుజువైంది.

సీబీఐ తమ నివేదికను 1996 ఏప్రిల్‌లో కేరళ హైకోర్టుకు సమర్పించింది. ఇస్రోకు చెందిన సమాచారం పాకిస్తాన్‌కు వెళ్లినట్లు ఎక్కడ ఆధారాలు లేకపోవడంతో నంబి నారాయణన్‌తో పాటు మరో ఐదుగురికి కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. దీంతో నంబి నారాయణన్‌ తిరిగి ఇస్రోలో చేరారు. సీబీఐ ఈ కేసును మూసివేసినా.. అప్పటి కేరళ ప్రభుత్వం మళ్లీ తెరిచేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఈ కేసుని మళ్లీ విచారించాలని కోరుతూ, 1998లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. కానీ  దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఈ కేసును తిరస్కరించడంతో అంతటితో సమసిపోయింది.
 
తనపై అక్రమంగా కేసు పెట్టి, వేధించిన కేరళ ప్రభుత్వంపై డా. నారాయణన్ తిరిగి కేసు వేశారు. నారాయణన్‌కు రూ.50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు తప్పుడు కేసు వేసినందుకు సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. తన తప్పును తెలుసుకున్న కేరళ ప్రభుత్వం కోర్టు ఆదేశించిన పరిహారానికి అదనంగా రూ.1.3 కోట్లు అదనంగా ఇస్తామని, 2019లో ప్రకటించింది. 2019లో భారత ప్రభుత్వం నారాయణన్‌ని ‘పద్మభూషణ్‌’తో సత్కరించింది. నారాయణన్‌పై కుట్ర పన్నిందెవరనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. గూఢచర్యం కేసు వెనుక అమెరికా హస్తం కూడా ఉందని  కేరళ హైకోర్టు ఎదుట నారాయణన్‌ తన అనుమానం వ్యక్తం చేశారు. 
 
◆ నంబి నారాయణన్ కాకుండా, మరో ఐదుగురుపై గూఢచర్యం, రాకెట్ సాంకేతికతను పాకిస్తాన్ కు బదిలీ చేశారని ఆరోపించారు. వారిలో ఒకరు ఇస్రోలో అతని సహోద్యోగి శశికుమార్, రషీదా, ఆమె స్నేహితుడు, మరో ఇద్దరు భారతీయయులు, రష్యన్ అంతరిక్ష సంస్థ ఉద్యోగి, కాంట్రాక్టర్. 1996లో విడుదలైన సిబిఐ చివరి నివేదిక వీరందరినీ నిర్దోషులుగా పేర్కొంది.

◆ పై సంఘటనలు అన్ని వివరిస్తూ "రెడీ టు ఫైర్" 'హౌ ఇండియా అండ్ ఐ సర్వైవడ్ ఇస్రో స్పై కేస్' అనే పుస్తకం అరుణ్ రాంతో కలిసి రాశారు నంబి నారాయణ్.

◆ నంబి నారాయణ్ గారి పై జరిగిన ఈ సంఘటనల ఆధారంగా మాధవన్ హీరోగా 'రాకెట్రీ' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు మొదటిసారిగా దర్శకత్వం, నిర్మాతగానూ వ్యవహరించారు. సినిమాపై ప్రముఖులు, సినీతారలు అభినందనలు తెలిపారు.