BREAKING NEWS

'క్విట్ ఇండియా'కు 80 ఏళ్ళు..!

'క్విట్ ఇండియా ఉద్యమం' 1942 ఆగస్టు 8న ప్రారంభమైంది. బ్రిటిష్ పాలన అంతాన్ని డిమాండ్ చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో మహాత్మాగాంధీ ఈ ఉద్యమానికి నాంది పలికారు. దీనినే 'ఆగస్టు ఉద్యమం' అని కూడా పిలుస్తారు. గోవాలియా ట్యాంక్ మైదానంలో నిర్వహించిన క్విట్ ఇండియా సభ ప్రసంగంలో గాంధీజీ 'డూ ఆర్ డై'కి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఎలాంటి విచారణ జరపకుండా భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వాన్ని బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించింది.

ఈ భయంతో ఆల్ ఇండియా ముస్లింలీగ్, రాచరిక సంస్థానాలు, ఇండియన్ ఇంపీరియల్ పోలీస్, బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ, హిందూ మహాసభ, ఇండియన్ సివిల్ సర్వీస్, వైస్రాయ్ కౌన్సిల్ తోపాటు భారతీయ వ్యాపారవేత్తలు సైతం క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్ గవర్నమెంట్‌కు మద్దతుగా నిలిచారు. ఈ విధంగా ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసిన బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వడానికి నిరాకరించింది. పదివేల మంది నాయకులను అరెస్టు చేసి 1945 వరకు జైల్లోనే ఉంచడమే కాక బలహీనమైన సమన్వయం, అస్పష్టమైన కార్యాచరణ, దీర్ఘకాలిక లక్ష్యం లేకపోవడంతో క్విట్ ఇండియా ఉద్యమం విఫలమైంది. అయితే ఈ ఉద్యమానికి గుర్తుగా 1992లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి స్మారక నాణాన్ని జారీ చేయడం విశేషం!
 
క్విట్ ఇండియా ఉద్యమం

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌కు వ్యతిరేకంగా భారత రక్షణను ప్రజాప్రభుత్వానికి అప్పజెప్పాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీనికిగాను గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని రూపొందించారు. 1942, జులైలో వార్దాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బ్రిటిష్‌వారిని భారతదేశం వదిలివెళ్లమని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనినే 'క్విట్ ఇండియా' అని అంటారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 1942, ఆగస్టు 8న ఆమోదించడంతో జాతీయోద్యమం తుది దశ బొంబాయిలో ప్రారంభమైంది. అదే రోజు బొంబాయిలోని గోవాలియా చెరువు మైదానంలో గాంధీజీ అశేషజనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఐక్యరాజ్యాల విజయం కోసం, భారతదేశం కోసం భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే ముగిసిపోవడం అత్యవసరం. కావున ప్రజాపోరాటమే ఏకైక మార్గమని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది.

ఈ ఉద్యమానికి ఆధారం 'అహింస'… ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కూడా ఆ తీర్మానం పేర్కొంది. 1942, ఆగస్టు 9న గాంధీని, ప్రముఖ నాయకులందరినీ ప్రభుత్వం నిర్బంధించడమే కాకుండా కాంగ్రెస్ సంస్థను నిషేధించింది. పోలీసులు ఉద్యమాన్ని అణచివేసేందుకు క్రూరమైన చర్యలకు దిగారు. 
'డూ ఆర్ డై(ఉద్యమించండి లేదా మరణించండి') అని ప్రజలకు గాంధీజీ పిలుపునిచ్చారు.

అంతేకాదు మనం భారతదేశాన్ని విముక్తి చేద్దాం లేదా ఆ ప్రయత్నంలోనైనా మరణిద్దాం అని ఆయన ఉద్దేశం. అందుకు కేవలం అహింసాత్మక ప్రజాఉద్యమమే మార్గమని కూడా గాంధీజీ వ్యాఖ్యానించారు.
జాతీయ నాయకులందరూ అరెస్టైనప్పుడు అరుణ అసఫ్ అలీ, జయప్రకాష్ నారాయణ్ లాంటి రెండో తరం నాయకులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఈ కారణంగా ఉషామెహతా కాంగ్రెస్ రేడియోను నిర్వహించారు.
గాంధీజీ ఆమోదంతో కాంగ్రెస్ తరఫున ముస్లింలీగ్ సహకారం కోసం, మత సమస్యల పరిష్కారం కోసం సి. రాజగోపాలచారి ఒక సూత్రాన్ని 1944, మార్చిలో ప్రతిపాదించారు. ఈ సూత్రాన్ని రాజగోపాలచారి తన 'ది వే ఔట్ పాంప్లెట్' అనే కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారంలోకి తీసుకొచ్చారు.

స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పాకిస్తాన్‌ను ఏర్పాటు చేయాలనే ముస్లింలీగ్ కోరికను ఆయన అంగీకరించారు. కాంగ్రెస్‌కు కావాల్సింది స్వాతంత్య్ర సాధన.. అందుకు ముస్లింల సహకారాన్ని పొందడానికి ఎంత నష్టాన్ని అయిన భరించడానికి  సిద్ధపడింది. కానీ ముస్లింలీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చి ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా దేశవిభజనను అంగీకరించాలని కాంగ్రెస్‌ను కోరింది.

భారతదేశం స్వాతంత్య్రాన్ని కోరడాన్ని ముస్లింలీగ్ ఆమోదించింది. ఇందుకు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌కు సహకరించాలని యోచించింది. యుద్ధం ముగిసిన తర్వాత ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాల సరిహద్దులను గుర్తించేందుకు వీలుగా ఒక కమిషన్ ఏర్పాటైంది. అప్పుడు ఆయా జిల్లాల్లో ముస్లింలతోపాటు ముస్లిమేతరులను కూడా కలుపుకొని వయోజన విధానంలో అందరి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుందని రాజగోపాలచారి భావించారు.

విభజన కారణంగా ప్రజలు తరలిపోవాల్సివస్తే వారి ఇష్టం మేరకే జరగాలి. భారత ప్రభుత్వానికి కావా
ల్సిన సంపూర్ణ బాధ్యతను, అధికారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా బదిలీచేసే పక్షంలో మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వం విధించే నిబంధనలకు కట్టుబడాలని రాజగోపాలచారి ప్రతిపాదించారు.
 
◆ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటైంది… 1946, జులైలో రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 205, ముస్లింలీగ్‌కు 73 సీట్లు వచ్చాయి. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్టు 24న ప్రకటించింది. మొత్తానికి సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యింది.

◆ కాంగ్రెస్ తరఫున వల్లభాయ్ పటేల్, డా. రాజేంద్రప్రసాద్, అరుణా అసఫ్ అలీ, రాజగోపాలచారి, జగ్జీవన్‌రామ్ లు.. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో అక్టోబర్ 29న చేరిన ముస్లింలీగ్ తరఫున లియాఖత్ అలీఖాన్, జేఎన్ మండల్, గజ్నేఫర్ అలీఖాన్, అబ్దుర్ రబ్ నిష్టార్‌లు మంత్రులుగానూ, జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా వ్యవహరించారు.
 
◆ క్విట్‌ ఇండియా ఉద్యమకారుల తిరుగుబాట్లు, పోలీసుల దౌర్జన్యపు వార్తలతో పాటు 1942 అక్టోబర్‌ 29న లోహియా అజ్ఞాత రేడియో పది ఆజ్ఞలను(విధులను) నిర్దేశించింది. 
ప్రతి ఇంటి మీద, కిటికీల మీద మువ్వన్నెల జెండా ఎగురవేయండి. 
సినిమాలు చూడవద్దు. ఇతరులను చూడనీయవద్దు.

ఎందుకంటే దానికి మీరు వెచ్చించే వ్యయం అధికార ప్రభుత్వానికి వెళ్తుంది.
కోర్టులకెళ్లడం పాపంగా పరిగణించాలి.

విదేశీ వస్తువులు కొనవద్దు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి మీ ధనాన్ని తీసేసుకోండి. 
న్యాయం లేని ప్రభుత్వానికి సేవలందించే అధికారులను బాయ్‌కాట్‌ చెయ్యండి. 

కోర్టుకు వెళ్లే అవసరమున్న ఏ వ్యవహారమైనా కొనసాగించవద్దు. 
నగరాలు వదలండి, పల్లెలకు తరలండి.

రైతు పండించే ధాన్యం, ఇతర పంటలు… అతని దగ్గరే ఉండనివ్వండి.
ఈ పది విధులను ప్రతి భారతీయుడు తప్పనిసరిగా నిర్వహించాలని ఉద్బోధించింది. 

◆ రైతులు, భూస్వాములు, అప్పులిచ్చే వడ్డీ వ్యాపారులు ఏకమైతే చాలు తిండిలేక బ్రిటిషు సైనికులు మాడిపోతారంటూ… డూ ఆర్‌ డై నియమానికి సంబంధించిన విశ్లేషణలను (1942 అక్టోబరు 20) వివరించారు. 
 
◆ క్విట్‌ ఇండియా ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులు, అంతేకాక రెండో ప్రపంచ యుద్ధం సాగిన రోజులు కూడా. బ్రిటిషు ప్రభుత్వం నడిపే ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్లు.. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, లక్నో, మద్రాసు, తిరుచిరాపల్లిలో మాత్రమే ఉన్నాయి. ఇవేకాక తిరువాంకూరు, మైసూరు, హైదరాబాద్, ఔరంగాబాద్ సంస్థానాలు నడిపే రేడియో కేంద్రాలున్నాయి. అయితే ఇవేవీ ప్రజల అభిప్రాయాలనుగానీ, స్వాతంత్రోద్యమం గురుంచిన వార్తలను ఇవ్వడం లేదు. వార్తాపత్రికలు సెన్సార్‌ కాకుండా అచ్చు కావడంలేదు. ఆ సమయంలో లోహియా రహస్య రేడియో కేంద్రాలే కీలకపాత్ర పోషించాయి.

రోజులో ఒకసారి ఇంగ్లీషులో, మరోసారి హిందూస్తానీలో.. ప్రతిసారి సుమారు అరగంటపాటు ప్రసారాలను అందించేవి. వార్తలు, వార్తా సమీక్షలు, గాంధీజీ, వల్లభాయ్‌ పటేల్, ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వంటి నాయకుల ప్రసంగాలు.. భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం ప్రత్యేకత, డూ ఆర్‌ డై కార్యాచరణ వెనుక ఉండే తాత్విక నేపథ్యం, వర్తమాన విషయాలపై ప్రశ్నోత్తరాలు.. ఇలా చాలా ప్రయోజనకారిగా ఉండేవి ఆ రేడియో ప్రసారాలు. 
క్విట్ ఇండియా ఉద్యమానికి నాందిగా గాంధీ పూరించిన నినాదమే.. 'డూ ఆర్ డై(విజయమో.. వీరస్వర్గమో)'.