BREAKING NEWS

గజముఖ దేవా 'గణనాథ'…!

పండుగైనా, పబ్బమైనా, ఎటువంటి శుభకార్యమైనా తొలి పూజ అందుకునేది గణేశుడే. 16 నామాలతో పిలువబడే వినాయకుడు మనకు బాల, తరుణ, భక్తి, వీర, శక్తి, ద్విజ, సిద్ధి, ఉచ్ఛిష్ట, విఘ్న, క్షిప్ర, హేరంబ, లక్ష్మీ, మహా, విజయ, నృత్య, ఊర్ధ్వ, ఏకాక్షర, వర, త్య్రక్షర, క్షిప్ర ప్రసాద, హరిద్రా, ఏకదంత, సృష్టి, ఉద్ధండ, రుణమోచన, ఢుంఢ, ద్విముఖ, త్రిముఖ, సింహ, యోగ, దుర్గా, సంకటహర గణపతిగా 32 రూపాలలో దర్శనమిస్తున్నాడు. వాటిల్లో కొన్ని ముఖ్యమైన రూపాలివి..
 
భక్తి గణపతి.. భక్తి గణపతికి నాలుగు చేతులుంటాయి. కుడివైపు చేతుల్లో కొబ్బరికాయ, బెల్లం పరమాన్నం ఉంటే, ఎడమవైపు చేతుల్లో మామిడి పండు, అరటిపండు ఉన్న గిన్నె పట్టుకుని దర్శనమిస్తాడు భక్తి గణపతి.

తరుణ గణపతి.. తరుణ అంటే యవ్వనం. ఈ రూపంలో గణపతికి ఎనిమిది చేతులుంటాయి. అంకుశం, జామపండు, దంతం, చెరుకు గడ, ఉండ్రాళ్ళు​, వెలగపండు గుజ్జు, మొక్కజొన్న కంకి, వల పట్టుకుని కనిపిస్తాడు. 

వీర గణపతి.. వినాయక రూపాల్లో చాలా శక్తివంతమైంది వీరగణపతి రూపం. ఈ రూపంలో గణపతికి 16 చేతులుంటాయి. బాణం, బేతాళుడు, చక్రం, మంచపు కోడు, గద, పాము, శూలం, గొడ్డలి బొమ్మ ఉన్న జెండా, శక్తి, కుంతమనే, ముద్గరం అనే ఆయుధాలతో పాటు విల్లు, ఖడ్గం, అంకుశం, పాశం, విరిగిన దంతంతో దర్శనమిస్తాడు.  

శక్తి గణపతి.. శక్తి గణపతిని పూజిస్తే కష్టాలు దరిచేరవని పురాణాలు చెబుతున్నాయి. ఈ రూపంలో నాలుగు చేతులతో దర్శనమిస్తాడు గణేశుడు. అంకుశం, పాశం, విరిగిన దంతం చేత పట్టుకుని భక్తుల కోర్కెలు తీర్చుతాడు. 

వక్రతుండ.. ఈ రూపంలో వినాయకుడి తొండం వక్రంగా ఉంటుంది. ఈర్ష్యా, ద్వేషాలను మనసు నుంచి తీసేసే ప్రతిరూపమే వక్రతుండ వినాయకుడు. 

లంబోదర.. పెద్ద పొట్టతో ఈ రూపంలో దర్శనమిస్తాడు గణనాథుడు. కోపం, అసూయ, ద్వేషాలని ఈ రూపంలో తరిమేస్తాడు. 

గజానన.. గజానన అంటే ఏనుగు తల అని అర్ధం.  ఈ రూపంలో ఉన్న వినాయకుడ్ని పూజిస్తే తెలివితేటలు పెరుగుతాయి. 

నృత్య గణపతి.. మనసుకు ప్రశాంతతని ఇచ్చే ఈ గణపతి చేతులలో పాశం, అప్పాలు, అంకుశం, విరిగిన దంతం ఉంటుంది.

జయ గణపతి.. విజయాలవైపు నడిపించే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి.  పాశం, విరిగిన దంతం, అంకుశం, పండిన మామిడి పండుతో దర్శనమిస్తాడు. 

సిద్ధి గణపతి.. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి.  చేతుల్లో పండిన మామిడి పండు, పూలగుత్తి, గొడ్డలితో దర్శనమిస్తాడు.
 
స్వయంభువుగా

కాణిపాకం సిద్ధి వినాయకుడు.. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాక వినాయ‌కుడి గురించి అంద‌రికీ తెలిసిందే. బావిలో ఉండే ఇక్క‌డి గ‌ణ‌ప‌య్య విగ్ర‌హం నానాటికీ పెరిగిపోతోంద‌ని స్థానికులు చెబుతుంటారు. ఇక్క‌డి విగ్నేషుడు.. స‌త్య‌ప్ర‌మాణాల దేవుడిగా ప్ర‌తీతి. ఇక్క‌డ ప్ర‌మాణం చేసి చెప్పిన‌ వాంగ్మూలాల‌ను న్యాయ‌స్థానాలు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయట.
 
శ్వేతార్కతి.. శ్వేతార్క‌మూలం అంటే తెల్ల జిల్లేడు వేరు అని అర్థం. ఆ వేరులో విఘ్నేశ్వరుడు కొలువై ఉంటాడ‌ని ప్ర‌తీతి. ఎప్పుడైనా తెల్ల జిల్లేడు వేళ్ల‌ను ప‌రిశీలించండి. అవి అచ్చం గ‌ణేశుడి ఆకారంలో క‌నిపిస్తాయి. వ‌రంగ‌ల్ జిల్లా కాజీపేట ప‌ట్ట‌ణంలో రైల్వే దేవాల‌యం కాంప్లెక్స్‌లో ఉన్న గ‌ణ‌ప‌తి దేవాలయం శ్వేతార్క గ‌ణ‌ప‌తి ఆల‌యంగా ప్ర‌సిద్ధి చెందింది. ఈ దేవాలయంలో ఉన్న గ‌ణ‌ప‌తి విగ్ర‌హం స్వ‌యంభువుగా వెలిసింది. చెట్టు నుంచి ఉద్భ‌వించిన ఈ వినాయ‌కుడి క‌ళ్లు, నుదురు, వ‌క్ర‌తుండం, దంతాలు, కాళ్లు, పాదాలు, అర‌చేయి, ఆస‌నం, మూషికం అన్నీ స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. అందుకే ఇక్క‌డి గ‌ణ‌ప‌తిని సంపూర్ణ శ్వేతార్క మూల‌గ‌ణ‌ప‌తిగా కొలుస్తారు.
 
వినాయకుడి ఒడిలో శ్రీకృష్ణుడు.. పురాణాల ప్ర‌కారం పార్వ‌తీదేవికి శ్రీ మ‌హావిష్ణువు సోద‌రుడి వ‌రుస అవుతాడు. వినాయ‌కుడు పార్వ‌తీదేవి కుమారుడు అంటే శ్రీమ‌హావిష్ణువుకు మేన‌ల్లుడు అవుతాడు. ఇక శ్రీకృష్ణుడు.. శ్రీ మ‌హావిష్ణువు అంశ‌ కాబట్టి గ‌ణ‌ప‌తికి శ్రీకృష్ణుడు మేన‌మామ అవుతాడు. ఈ మేన‌మామ బాల‌కృష్ణుడి రూపంలో మేన‌ల్లుడి ఒడిలో కూర్చొని భాగ‌వతం వింటున్న అపురూపదృశ్యం నిజంగా అద్భుతం క‌దా! ఈ అద్భుతాన్ని కేర‌ళ‌లోని కొట్టాయం స‌మీపంలోని మ‌ళ్లియూర్ పుణ్య‌క్షేత్రంలో చూడ‌వ‌చ్చు.

అయితే ఈ ఆల‌యం ప్రసిద్ధి చెంద‌డానికి శంక‌ర‌న్ నంబూద్రియే ముఖ్య కారణమని ప్రతీతి. నిత్యం భాగ‌వ‌తం పారాయ‌ణం చేస్తుండేవాడు. ఒక‌నాడు ఆయ‌న పూజ‌లో ఉండ‌గా.. వినాయ‌కుడి విగ్ర‌హంలో బాల‌కృష్ణుని రూపం గోచ‌రించింది. దీంతో ఆయ‌న చూసిన దృశ్యాన్ని ఒక విగ్ర‌హంగా తయారుచేశాడు. ఆ విగ్ర‌హ‌మే ఇప్పుడు ఈ ఆల‌యంలో ప్ర‌ధాన విగ్ర‌హంగా పూజ‌లందుకుంటుంది. వినాయ‌క చ‌వితి రోజు ఈ ఆల‌యంలో చ‌తుర్ధియాటు అనే పితృదోష ప‌రిహార పూజ‌లు జ‌రుపుతారు. సంతానభాగ్యం కోసం దంపతులు పాలు, పాయ‌సం నివేదించి పూజిస్తారు. తులాభార మొక్కులు కూడా తీర్చుకుంటారు.
 
విజయ వినాయకి.. పురుషదేవుళ్లు స్త్రీరూపం దాల్చినట్టుగా పురాణ కథల్లో వినేవుంటాం. వినాయకుడు కూడా స్త్రీశక్తిగా అవతరించాడని చెబుతారు. గజానని, వినాయకి, విఘ్నేశ్వరిగా ఆ మూర్తిని కొలుస్తారు. ఇందుకు నిదర్శనంగా తమిళనాడులోని పలు ఆలయాల కుడ్యాలపై స్త్రీమూర్తిగా ఉన్న గణపతిమూర్తులు మనకు దర్శనమిస్తాయి. ఆ రాష్ట్రంలోని సుచీంద్రం ఆలయంలో వినాయకి విగ్రహం చూడొచ్చు. పురాణాల్లోనూ వినాయకి ప్రస్తావన కనిపిస్తుంది. పరమేశ్వరుడు అంధకాసురుడిని వధించే సమయంలో ఆ అసురుడి రక్తబిందువులు దేవతలపై పడి, ఆయా పురుష దేవతల నుంచి స్త్రీ రూపాలు ఉద్భవించాయని తెలుస్తోంది. అలా వినాయకుడి నుంచి వినాయకి వచ్చిందని చెబుతారు. స్త్రీరూప వినాయకుడు 64మంది యోగినులలో ఒకరని కూడా చెబుతారు.
 
ధుర్ హాగతి ఆలయం.. కేర‌ళ, క‌ర్ణాట‌క రాష్ట్రాల స‌రిహ‌ద్దులోని కాస‌ర్ గోడ్ జిల్లాలోని మ‌ధుర్ గ్రామంలో ఉన్న శివాలయంలో వినాయ‌క విగ్ర‌హం పెరుగుతోంద‌ని అక్క‌డి స్థానిక ప్ర‌జ‌ల విశ్వాసం. ఈ ఆల‌య ఆవిర్భావం, చ‌రిత్ర రెండూ విశేష‌మే. ఈ ఆల‌యంలో ప్ర‌ధాన మూల విరాట్టు ప‌ర‌మేశ్వ‌రుడు. ఇక్క‌డ శివుడి విగ్ర‌హం స్వ‌యంభువుగా వెలిసింద‌ని ప్రతీతి. ఈ ఆల‌య స్థ‌ల పురాణం ప్ర‌కారం ఆల‌యపూజారి కుమారుడు ఈ శివాల‌యానికి వ‌చ్చాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ గ‌ర్భ‌గుడిలోకి వెళ్లిన ఆ పిల్లాడు అక్క‌డి గోడ‌పై వినాయ‌కుడి ప్ర‌తిరూపాన్ని చెక్కాడు. ఆ త‌ర్వాత ఆ బొమ్మ నుంచి వినాయ‌కుడి రూపం ఆవిర్భ‌వించ‌డం మొద‌లైంది.

అయితే ఈ గ‌ణ‌ప‌తి విగ్ర‌హం నానాటికీ పెర‌గ‌డాన్ని మ‌ధుర అనే ఒక స్త్రీ క‌నుగొన్న‌ది. దీంతో ఆమె పేరు మీదుగానే ఈ ఆల‌యం మ‌ధుర్ మ‌హాగ‌ణ‌ప‌తి ఆల‌యంగా ప్ర‌సిద్ధి చెందింది. ఈ విగ్ర‌హాన్ని మ‌ధుర తొలిసారిగా చూసింది కాబ‌ట్టి.. అప్ప‌టినుంచి ఆ ఆల‌యంలో తొలి ద‌ర్శ‌నం మ‌హిళ‌ల‌కే క‌ల్పిస్తుండ‌టం విశేషం. ఇక్క‌డి గ‌ణ‌ప‌తికి అప్పాలు అంటే చాలా ఇష్ట‌మట‌. అందుకనే స్వామివారిని ద‌ర్శించుకుని అప్పాల‌ను స‌మ‌ర్పిస్తే ఎలాంటి విఘ్నాలు అయినా ఇట్టే తీరిపోతాయ‌ని అంటారు. స‌హ‌స్రాప్పం పేరుతో వేయి అప్పాల‌ను నివేదించే ఆచారం కూడా ఇక్క‌డ ఉంది.
 
త్రినేత్ర తి.. గ‌ణ‌నాథుడికి సిద్ధి, బుద్ధి అనే ఇద్ద‌రు భార్య‌లు ఉన్నార‌ని పురాణాల్లో ఉంది. కానీ ఏ ఆల‌యంలో చూసినా గ‌ణేశుడు ఒక్క‌డే ద‌ర్శ‌న‌మిస్తాడు. ఇద్ద‌రు భార్య‌ల‌తో క‌నిపించే ఆల‌యాలు చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాల‌యం ఒక‌టుంది. అదే రాజ‌స్థాన్ రాష్ట్రంలోని స‌వాయ్ మ‌ధోపూర్ జిల్లా ర‌ణ‌థంబోర్ కోట‌లో ఉన్న త్రినేత్ర గ‌ణ‌ప‌తి ఆల‌యం. ర‌ణ‌థంబోర్ వినాయ‌కుడిని ప‌ర‌మశ‌క్తిమంతుడిగా చ‌రిత్ర అభివ‌ర్ణిస్తోంది. క్రీ.శ‌. 1299లో ర‌ణ‌థంబోర్ రాజు హ‌మీర్‌కూ, ఢిల్లీ పాల‌కుడు అల్లావుద్దీన్ ఖిల్జీకి మ‌ధ్య భీక‌ర యుద్ధం మొద‌లైంది. యుద్ధ స‌మ‌యంలో సైనికులకు అవ‌స‌ర‌మైన ఆహారాన్ని, ఇత‌ర స‌రుకుల‌ను కోట‌లోని ఒక ఆల‌యంలో నిల్వ చేశారు.

అయితే ఈ యుద్ధం దాదాపు ఏడాదిపాటు కొన‌సాగింది. దీంతో నిల్వ చేసిన స‌రుకులు మొత్తం నిండుకున్నాయి. అప్పుడు హ‌మీర్‌కు ఏమి చేయాలో పాలుపోలేదు. అదేవిష‌య‌మై ఒక‌రోజు మదన‌ప‌డుతూ నిద్ర‌పోతుండ‌గా వినాయ‌కుడు ఆయ‌న క‌ల‌లోకి వ‌చ్చాడు. మ‌రుస‌టి రోజు పొద్దున‌క‌ల్లా అన్ని స‌మ‌స్య‌లు తీరిపోతాయ‌ని అభయ‌మిచ్చాడు. తెల్లారాక కోట‌లో చూడ‌గా.. ఒక గోడ‌పై మూడు నేత్రాలున్న వినాయ‌కుడి ఆకృతి క‌నిపించింది. ఆ త‌ర్వాత ఖిల్జీ సేన‌లు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆశ్చ‌ర్యంగా కోట‌లోని గోదాముల‌న్నీ కూడా సరుకుల‌తో నిండివున్నాయి. దీంతో ఏక‌దంతుడే త‌మ రాజ్యాన్ని కాపాడాడ‌ని హమీర్ విశ్వ‌సించాడు. క్రీ.శ‌.1300లో ఆ కోట‌లోనే వినాయ‌క ఆల‌యాన్ని నిర్మించాడు. ఈ స్వామిని కొలిస్తే విద్య‌, విజ్ఞానాల‌తో పాటు సంప‌ద‌ను, సౌభాగ్యాన్ని అనుగ్ర‌హిస్తాడ‌ని నమ్ముతుంటారు.
 
శ్రీ మహాదేవర్ అతిశ వినాయర్‌..

ఆరు నెల‌ల‌కు ఒక‌సారి త‌న రంగు మార్చుకునే వినాయ‌కుడి గురించి ఎప్పుడైనా విన్నారా? త‌మిళ‌నాడులోని నాగ‌ర్ కోయిల్ జిల్లా కేర‌ళ‌పురంలోని ఓ ఆల‌యంలో వినాయ‌కుడు రంగులు మార్చుకుంటాడు. శ్రీ మ‌హాదేవ‌ర్ అతిశ‌య వినాయ‌గ‌ర్ ఆల‌యంలోని గ‌ణ‌ప‌తి మార్చి నుంచి జూన్ వ‌ర‌కు న‌ల్ల‌నిరంగులో ఉంటాడు. జూలై నుంచి ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు తెలుపురంగులో ద‌ర్శ‌న‌మిస్తాడు. ఈ ఆల‌యంలోని బావికి కూడా ఇలాంటి మ‌హ‌త్మ్య‌మే ఉంది. ఇక్క‌డి వినాయ‌కుడు త‌న రంగును మార్చుకున్న‌ట్టే.. ఈ బావిలోని నీరు కూడా రంగు మారుతుంది. గ‌ణేశుడు తెలుపు రంగులో ఉన్నప్పుడు బావిలో నీరు న‌లుపు వ‌ర్ణంలో క‌నిపిస్తాయి. అదే వినాయకుడు న‌లుపురంగులో క‌నిపిస్తే.. బావిలో నీరు తెలుపురంగులో క‌నిపిస్తాయి. అంతేకాదు ఈ ఆల‌యంలోని మ‌ర్రి చెట్టు శిశిర రుతువుకు బ‌దులు.. ద‌క్షిణాయ‌ణంలో ఆకులు రాల్చి, ఉత్త‌రాయ‌ణంలో చిగురిస్తుంది. అందుకే ఈ ఆల‌యాన్ని 'మిరాకిల్ వినాయ‌గ‌ర్ ఆల‌యం' అని కూడా పిలుస్తారు. ఏ కోరిక‌తోనైనా భ‌క్తులు ఈ ఆల‌యంలో కొబ్బ‌రికాయగానీ, బియ్య‌పు మూటగానీ ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక త‌ప్ప‌కుండా నెర‌వేరుతుంద‌ని ప్ర‌తీతి.
 
దొడ్డ తి..

బెంగ‌ళూరులోని బ‌స‌వ‌న‌గుడి బుల్ ఆల‌యం ప‌క్క‌నే దొడ్డ గ‌ణ‌ప‌తి ఆల‌యం కూడా ఉంది. ఈ ఆల‌యంలో గ‌ణ‌ప‌తి విగ్ర‌హం 18 అడుగుల పొడ‌వు, 16 అడుగుల వెడ‌ల్పు ఉంటుంది. ఈయ‌న‌ను స‌త్య గ‌ణ‌ప‌తి, శ‌క్తి గ‌ణ‌ప‌తి అని పిలుస్తుంటారు. వారంలో అన్ని రోజులు ఇక్క‌డ విఘ్నేశుడికి పూజ‌లు చేసి ర‌క‌ర‌కాల అలంక‌ర‌ణ‌లు చేస్తుంటారు. ఈ అలంక‌ర‌ణ‌లో ముఖ్య‌మైన‌ది వెన్న‌తో అలంక‌రించ‌డం. ఈ భారీ గ‌ణేశుడిని వెన్న‌తో అలంక‌రించేందుకు 100 కేజీలకు పైగా వెన్న అవ‌స‌రం ప‌డుతుంద‌ట‌. వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు ఇక్క‌డ వైభ‌వంగా జ‌రుగుతాయి.
 
మూడు తొండాల తి.. మూడు తొండాలు, ఆరు చేతులు ఉన్న వినాయ‌కుడు మ‌హారాష్ట్ర పుణేలోని సోమ్వార్ పేట్ జిల్లాలోని న‌జ‌గిరి న‌దీతీరంలో కనిపిస్తాడు. ఇక్కడ మూడు తొండాలు ఉన్న త్రిశుండ్ గ‌ణ‌ప‌తి దేవాల‌యం ఉంది. ఇక్క‌డి ఆల‌యంలో వినాయ‌కుడు నెమ‌లి వాహ‌నంపై ఆసీనుడై ఉంటాడు. ఈ ఆల‌యంలో సంక‌టహ‌ర చ‌తుర్థి, వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హిస్తారు.
 
21 రకాల పత్రాలతో స్వామిని ప్రత్యేకంగా పూజించడం వెనుక గల కారణం

ఏ పత్రాలు పడితే ఆ పత్రాల్ని సమర్పించడం కాదు. వాటికి కొన్ని ఔషధ గుణాలుండాలి. వాటిని ఉపయోగించడం వల్ల మనలో ఉండే చర్మసంబంధమైన వ్యాధులు నశిస్తాయి. అంతేకాదు గణపతిని నిమజ్జనం చేసేరోజు మట్టివిగ్రహంతో పాటు ఈ పత్రాలను కూడా నీటిలో పడవేయాలి. తద్వారా నీరు ఔషధవంతమవుతుంది. అవేంటంటే,
మాచీపత్రం(మాచిపత్రం), బృహతీపత్రం(మూలక), బిల్వపత్రం(మారేడు ఆకులు), దూర్వాపత్రం(గరిక), దుత్తూరపత్రం(ఉమ్మెత్త ఆకులు), బదరీపత్రం(రేగుచెట్టు ఆకులు), అపామార్గ(ఉత్తరేణి), తులసీపత్రం, చూతపత్రం(మామిడి ఆకులు), కరవీరపత్రం(గన్నేరు), విష్ణుక్రాంతపత్రం(నీలం, తెలుపు రంగులో పువ్వులుండే చిన్ని మొక్క), దాడిమీ పత్రం(దానిమ్మ ఆకులు), దేవదారు పత్రం(దేవతలకు ఇష్టమైన చెట్టు, దాని ఆకులు), మరువకపత్రం(మరువం), సింధువార పత్రం(వావిలి ఆకులు), జాజిపత్రం(సన్నజాజి, మల్లెజాతి మొక్క ఆకులు), గండలీ పత్రం(లతా దూర్వాపత్రం), శమీపత్రం(జమ్మిచెట్టు ఆకులు), అశ్వత్థ పత్రం(రావి ఆకులు), అర్జునపత్రం(మద్ది ఆకులు), అర్కపత్రం(జిల్లెడు ఆకులు).. వంటి 21 రకాల ప్రత్యేమైన పత్రములు, పూలు, నైవేద్యములు స్వామికి సమర్పించి వాటిని మనం భక్తితో ప్రసాదంగా తీసుకోవడమనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
 
చవితినాడు చంద్రుడిని చూడొద్దు

కుమారస్వామి జననం తర్వాత భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననునికి విఘ్నాధిపత్యం రావడం, అనేక పిండిపదార్థాలు తిని తల్లిదండ్రులకు ప్రణామం చేయడానికి ఇబ్బంది పడుతుండగా శివుని తలపై ఉన్న చంద్రుడు, వినాయక యాతన చూసి పక్కున నవ్వడం, అది నచ్చని పార్వతీదేవి చంద్రుని శపించడం, దానివల్ల లోకంలో వినాయక చవితినాడు చంద్రుని చూసినంతన నీలాపనిందలు కలుగుతాయనే నమ్మకం స్థిరపడిపోయింది.
 

Photo Gallery