BREAKING NEWS

అంతర్వేది లక్ష్మినరసింహ స్వామి ఆలయ విశిష్టత, విశేషాలు మరియు చూడాల్సినవి...

తూర్పు గోదావరి జిల్లాలో అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల ప్రజలు వస్తూ ఉంటారు. ఈ  పురాతన, ప్రసిద్ధి ఆలయాల్లో అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కూడా ఒకటి.  అంతర్వేది మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ఠ గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. ఈ ఆలయ ప్రస్తావన పురాణాలలో కూడా ఉంది. అలానే ఇక్కడ ఈ  లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని నమ్మకం. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. 
 
అంతర్వేది ఆలయం:

 
గోదావరికి ఇటువైపు ఉన్న సఖినేటి పల్లి మండలానికి చెందిన అంతర్వేది మన తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. అలానే అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకి సమీపంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం దక్షిణ కాశీగా పేరు గాంచింది. ఒక వేళ కాశీకి వెళ్లలేని వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కాశీ వెళ్లినంత పుణ్యం లభిస్తుంది అని అంటారు. ఇక్కడ ఉన్న పవిత్ర గోదావరిలో స్నానం చేసి ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. కృత యుగము లోని అన్న మాట ప్రకారం ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది గురించి బ్రహ్మ, నారదుల మధ్య జరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు అని స్థల పురాణం చెబుతోంది.
 
వశిష్టాశ్రమము:
 
ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి కొంత దూరంలో ఈ ఆశ్రమం కలదు. ఇది చూడడానికి చాలా అద్భుతముగా ఉంటుంది. ఈ ఆశ్రమమం వికసించిన కమలం లాగ ఉంటుంది. దీనిని నాలుగు అంతస్తుల్లో నిర్మించడం జరిగింది. అలానే ఇక్కడ యాత్రికులు విశ్రాంతి తీసుకోవడానికి అద్భుతమైన పర్ణశాలల్ని కూడా నిర్మించడం జరిగింది. దీనికి సమీపంలోనే ధ్యాన మందిరం, యోగ శాల కూడా ఉన్నాయి. ఇలా ఎంతో అందంగా సౌకర్యాలతో కూడిన నిర్మాణం ఎంతో గొప్పదని చెప్పవచ్చు.
 
అన్నా చెల్లెళ్ళ గట్టు:
 
ఈ సముద్రం ఎంతో అందంగా.....రమణీయమైన ప్రకృతితో శోభాయమానంగా ఉంటుంది. ఈ సముద్రము లో వశిష్ట నది కలిసే చోటున అన్న చెల్లెళ్ళ గట్టు అని అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్యన కొంత భాగం పొడవైన గట్టులాగ ఉంటుంది. ఆ గట్టుకి ఇటు, అటు నీరు వేరు వేరుగా ఉంటుంది. ఒక వైపు నీరు అంతా కూడా స్వచ్ఛంగా ఉంటుంది. మరో పక్కైతే మట్టిగా ఉంటుంది. సముద్ర కెరటాలు వచ్చినప్పుడు కూడా ఈ నీరు అలానే ఉండడం విశేషం. ఏది ఏమైనా ఇంత  అద్భుతమైన, అందమైన  దృశ్యాలని చూసేకొద్దీ చూడాలనిపించే లాగే ఉంటాయి కదా...!
 
లైట్ హౌస్:
 
ఈ సముద్ర తీరానికి సమీపం లో లైట్ హౌస్ కూడా ఉంది. దీని పైకి ఎక్కి కూడా మనం చూడవచ్చు. మొన్నో, నిన్నో కట్టినది కాదు ఇది. బ్రిటీషుల కాలం లో దీనిని నిర్మించడం జరిగింది. అందమైన తోటలతో ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. కేవలం భక్తులు మాత్రమే కాకుండా యాత్రికులు, సందర్శకులు కూడా వస్తూ ఉంటారు. విద్యార్థులు కూడా ఇక్కడకి వచ్చి పిక్నిక్ లాంటివి చేసుకుంటారు. ఇలా సందర్శకులతో ఇది అంతా కూడా నిత్యం కళకళ్లాడుతుంది. ఈ లైట్ హౌస్ పైకి ఎక్కి చూస్తే అన్ని క్లియర్ గా కనపడతాయి. లక్ష్మి నరసింహ ఆలయం, వశిష్టాశ్రమంతో పాటు చిన్న చిన్న ఆలయాలు కూడా కనిపిస్తాయి. సర్వే తోటలతో ఈ ప్రాంతం అంతా కూడా యిట్టె ఆకర్షిస్తుంది. 
 
అంతర్వేదిలో షూటింగ్స్:
 
ఈ ప్రాంతం ఎంతో అందంగా ఉండడంతో పలు సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయి. ఒక వైపు ఆలయం, మరో పక్క సముద్ర తీరం..... గోదావరి అందాలని ఎంత వర్ణించినా తక్కువే.... అటువంటి సుందరమైన ప్రదేశంలో చాలా చిత్రాలని చిత్రీకరించడంలో సందేహమే లేదు. మూగ మనసులు నుండి సరిగమలు, అప్పుడప్పుడు, పెళ్ళైన కొత్తలో ఇలాంటి చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ చేసారు.
 
అంతర్వేది రధం: 
 
ఈ మధ్యనే ఇక్కడ ఉన్న బహు పురాతన రధం అగ్నికి ఆహుతైన సంగతి తెలిసినదే.  అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. అరవై ఏళ్ళ క్రితం చేసిన నలభై అడుగుల రధం ఎందుకు కాలిపోయిందనేది ఇంకా తేలలేదు. బహు పురాతన, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లో చోటు చేసుకున్న ఈ సంఘటన నిజంగా బాధాకరం. కల్యాణోత్సవాల్లో ఎంతో ఘనంగా ప్రతీ ఏటా రధోత్సవాలని జరపడం ఆనవాయితీ. 
 
అంతర్వేది ప్రముఖ ఉత్సవాలు:
 

ఇక్కడ మాఘ శుద్ధ సప్తమి నాడు, మాఘ బహుళ పాడ్యమి నాడు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. మాఘ శుద్ధ దశమినాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలానే  మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మైకాశి) నాడు రథోత్సవంని అతి వైభవంగా జరుపుతారు. జేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం,  వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున నృసింహ జయంతి అంగరంగ వైభవంగా జరుగుతాయి. 
 
చూసారు కదా....! ఈ ఆలయ విశిష్టత, విశేషాలు, చూడదగ్గ  ప్రదేశాలు.....మరి మీరు కూడా వీలైనప్పుడు మీ కుటుంబ సమేతంగా ఈ ఆలయంతో పాటు గోదావరి అందాలని కూడా చూసేయండి. ఈ అందమైన ప్రకృతికి ప్రతీ ఒక్కరూ ముగ్ధులు అవ్వాలసిందే....!