BREAKING NEWS

వీక్షకులని కనువిందు చేసే రామనారాయణం

ఆలయం అంటే ప్రధాన విగ్రహం కలిగి ఉండడం పూజలు చెయ్యడం ఇలా ఇవన్నీ కలిగి ఉండడం సహజం. కానీ అద్భుతమైన, వీక్షకులని కనువిందు చేస్తూ, ప్రశాంతతని కలిగించేలా ఉంటుంది ఈ రామనారాయణ ఆలయం. ఈ రామనారాయణం అంతగా ప్రసిద్ధి చెందింది అంటే దానికి కారణం దాని విభిన్నత్వమే. మామూలు ఆలయంలా కాకుండా సరికొత్త ఆలోచనలతో, మంచి నెపముతో ఈ ఆలయాన్ని నిర్మించడం  జరిగింది. అయితే ఏమిటి ఈ ఆలయ ప్రత్యేకత..?, ఎందుకు ఇది అంత ప్రసిద్ధి చెందింది..? మామూలు ఆలయానికి దీనికి తేడా ఏమిటి? ఇలా వివిధ ప్రశ్నలు మీకు కలిగి ఉండవచ్చు. మరి ఎందుకు ఆలస్యం ఛలో రామనారాయణం.......!
 
భక్తులని అలరింపజేసే రామ నారాయణం ఎలా చేరుకోవాలి?
 
ఈ రామనారాయణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లాకు చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని అక్కడ మార్చి 22, 2014 లో ప్రారంభం చెయ్యడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయాన్ని విజయనగరానికి చెందిన ఎన్.పి.ఎస్ ఛారిటబుల్ ట్రస్టు స్థాపకులు, నిర్వాహకులు శ్రీ నారాయణ నరసింహ మూర్తి గారి సంకల్పంతో ఆయన కుమారులు కట్టించడం జరిగింది. అటువంటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయాన్ని చేరుకోవడం కూడా సులువే. విశాఖపట్నానికి ఇది కేవలం 45 కిలో మీటర్లు మాత్రమే. అలానే విజయనగారికి ఐదు కిలో మీటర్లు ముందే. సులువుగా ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి కుటుంబ సమేతంగా ఈ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లొచ్చు.
 
రామబాణం ఆకారంలో రామనారాయణం:
 
మన పురాణాలు, ఇతిహాసాలు ప్రకారం రామబాణంకి ఎంతో మహిమ ఉంది. అటువంటి శక్తిగల ఈ రామబాణం ఆకారంలో ఈ ఆలయం ఉండడం ఎంతో విశేషం అనే చెప్పాలి. భారతదేశం ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు. ఇంత మహిమగల, ప్రసిద్ధిగల పుణ్యక్షేత్రాలు ఉండడం నిజంగా మన అదృష్టం.
 
72 విగ్రహాలతో రామాయణ వివరణ:
 
రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారముల పై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణము లో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీ కొడుకులు, భార్యా భర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి.
 
ఈ ఆలయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  72 విగ్రహాలు కలిగి ఉన్నాయి. అలానే ప్రతీ విగ్రహం కూడా రామాయణాన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. మన రామాయణం లో జరిగిన అనేక విషయాలని మనకి ఈ విగ్రహాలు చూపించడం దీని విశిష్టత.  సుమారు పదిహేను నుండి ఇరవై ఎకరాలలో నిర్మించడం జరిగింది. అలానే ఈ ఆలయం లో ఆంజనేయుడి విగ్రహం ప్రధానంగా ఆకర్షిస్తుంది. దాని ఎత్తు 60 అడుగులు. నిజంగా ఇవన్నీ చూస్తే ఆ ఆనందమే వేరు. రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞుల  జననం, సీతని వివాహం చేసుకోవడం, రాముడు సీతని ఎత్తుకెళ్ళడం, సూర్పణక ముక్కు చెవులు కోసేయడం, పట్టాభిషేకం ఇలా అనేక సంఘటనలని కేవలం విగ్రహ రూపం లో చూపించడం నిజంగా అద్భుతం. 
 
 
వాహ్ శిల్పకారులకి భళా....
 
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రూపొందించిన ఈ చిత్రాలు అచ్చం మనుష్యుల్లాగ కనిపిస్తున్నట్టు ఉంటుంది. అలానే ఆ బొమ్మలని మనం దీర్ఘంగా చూస్తుంటే రామాయణ కాలం నాటికి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. ఈ దృశ్యాలని మనం చూస్తే ఎంతో విలువైన సమాచారం మనకి అందుతుంది. అలానే ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కూడా ఉంటుంది. నిజంగా ఇది అంత కూడా సంస్కృతికత కి అద్దం పట్టేలా ఉంటుంది. మరి అంత గొప్ప నిర్మాణం మరి. ఈ ఆలయాన్ని నిర్మాణం దిదంగత నారాయణ నరసింహ మూర్తి సంకల్పం తో జరగడం వల్లే ఈ ఆలయానికి ఆయన పేరు వచ్చింది. అదే రామనారాయణం. ఇలా రామనారాయణకి ఇంత చక్కటి రూపు తీసుకొచ్చిన ఆ కళాకారులకి భళా...!
 
ఆకట్టుకునే సరస్వతి విగ్రహం:
 
తెల్లని, పెద్ద సరస్వతి విగ్రహం బాగా ఆకట్టేసుకుంటుంది వీక్షకులని. ఈ విగ్రహం ఎత్తు 12 అడుగులు. ఇది నిజంగా ఒక ఆలయంలా కాకుండా పార్క్ లాగ ఎంతో అందంగా ఉంటుంది. ఉట్టిపడే సంప్రదాయాలతో పాటు, ఆహ్లాదం ఆనందం చేకూర్చే ప్రకృతి కూడా మంచి అనుభవాన్ని అందిస్తుంది. అలానే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో సీత రామ కల్యాణ మండపం, వాల్మీకి లైబ్రెరీ, అంజనాదేవి అల్పాహారశాల, శబరి అన్న ప్రసాదశాల, సుగ్రీవ గోశాల, ధ్యానం చేసుకునే గది ఇలా ప్రతీది ఎంత గానో ఆకట్టుకుంటాయి. 
 
వేదపాఠశాల:
 
ఇక్కడ టీటీడీ ఆధ్వర్యంలో వేద పాఠశాలని నెలకొల్పారు. ఇందులో సుమారు యాభై మంది వరకు విద్యార్థులు వేద విద్యని అభ్యసిస్తున్నారు. ఇక్కడ చదువు పూర్తయ్యాక టీటీడీలో ఉద్యోగ అవకాశాలని కూడా కలిపిస్తారు. 
 
అందమైన ప్రకృతి నడుమ, సువిశాలమైన ప్రాంగంలో కనువిందు చేస్తుంది వీక్షకులని. అలానే ఈ ఆలయం రామాయణాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించడం ఈ ఆలయ విశేషం.