BREAKING NEWS

ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు...!

ప్రణబ్ ముఖర్జీ (84) దివంగతులు కావడం పై యావత్ దేశం శోక సంద్రమైంది. కాకలు తీరిన రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయింది. ప్రణబ్ ముఖర్జీ నిరాడంబరత, నిబద్ధత్తా, నిజాయతీ అందరికి ఆదర్శం. భారత ఆర్ధిక విధానాల నుండి రక్షణ విధానం, దేశీయ, విదేశీ వ్యవహారాల రూప కల్పనల లో ఆయన్ని చేసిన కృషి ఎంతో గొప్పది. 
 
కేవలం నాయకుడుగా మాత్రమే కాక ఉపాధ్యాయుడిగా, జర్నలిస్టుగా, రాజనీతిజ్ఞుడుగా, మంత్రిగా, రాష్ట్రపతిగా వ్యవహరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. ఇలా భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర సంపాదించుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ 13 వ రాష్ట్రపతిగా దేశానికి గొప్ప సేవలని అందించారు. ఐదు దశాబ్దాల పాటు పార్లమెంట్  ద్వారా దేశానికి ఆదర్శ ప్రాయమైన సేవలని ప్రణబ్ అందించారు.
 
భారత రత్న ప్రణబ్ జీ అంత్యక్రియలు లోధీ స్మశాన వాటిక లో కుటుంబ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. కరోనా నిబంధనల ప్రకారం సైనిక లాంఛనాలతో భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలని నిర్వహించడం జరిగింది. ప్రముఖుల అంతిమ యాత్ర సాధారణంగా పుష్పాలతో అలంకరించిన గన్ క్యారేజీ వాహనంలో సాగుతుంది. కానీ కోవిడ్ కారణంగానే అంబులెన్సు లో పార్థివ దేహాన్ని తీసుకెళ్లారు. ప్రణబ్ ముఖర్జీ పార్థివ దేహానికి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవిద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు దేహానికి నివాళులు అర్పించారు. ఆయన జ్ఞాపకార్ధం కేబినెట్ రెండు నిముషాలు పాటు మౌనం పాటించినట్టు కేంద్ర హోమ్ శాఖ చెప్పింది.
 
ప్రణబ్ కుమార్ ముఖర్జీ జీవితం:
 
ప్రణబ్ జీ 1935 వ సంవత్సరం డిసెంబర్ 11 న జన్మించారు. ఆయన భారతదేశ రాజకీయ నాయకుడు. 2012 నుండి 2017 వరకు 13 వ రాష్ట్రపతిగా బాధ్యతలని నిర్వర్తించడం జరిగింది. 2009 నుండి 2012 వరకు ఆర్ధిక మంత్రిగా తన సేవలని అందించడం జరిగింది. ఏ పార్టీ తో ఈయనకి సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ఈయనకి ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఈయనకి సాటి ఎవరు లేరని రాజకీయ పక్షాలు అంటాయి. 
 
ప్రణబ్ తండ్రి కింకర ముఖర్జీ భారత స్వాతంత్రోద్యమం లో క్రియాశీల సభ్యుడు. 1969 లో మిడ్నాపూర్ ఉప ఎన్నికకు సంబంధించిన రాజకీయ ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి వి. కె. కృష్ణ మేనన్కు ప్రచార బాధ్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం ప్రారంభమయింది. ఇలా ఈయన రాజకీయాల్లోకి రావడం, అనేక పదవులని స్వీకరించడం........ ఎన్నో సేవలని చేయడం జరిగింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముఖర్జీని రక్షణ మంత్రిగా నియమించింది. అతను 2006 వరకు ఈ శాఖా బాధ్యతలను చేపట్టాడు.

2017లో ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికలలో మరలా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. వయసు పై బడినందున ఆరోగ్య సమస్యలరీత్యా రాజకీయాల నుండి పదవీ విరమణ చేయాలని భావించాడు. అతని రాష్ట్రపతి పదవీ కాలం 2017 జూలై 25 న ముగిసింది.
 
ప్రణబ్ ముఖర్జీ అవార్డులు:
 
ప్రణబ్ ముఖర్జీ కి 2008లో పద్మ విభూషణ్ పురస్కారం వచ్చింది. అలానే 2019 లో భారతరత్న కూడా ఈయనకి రావడం జరిగింది. ఈ జాతీయ పురస్కారాలతో పాటు విదేశీ పురస్కారాలు, విద్య గౌరవాలు, ఇతర గుర్తింపులు ఎన్నో.
 
ప్రణబ్ ముఖర్జీ రచనలు:
 
కేవలం ఓ నాయకుడు మాత్రమే కాదు. తన కలంతో ఎన్నో రచనలని కూడా ఈయన కురిపించారు. మిడ్ టెర్మ్‌ పోల్, బియాండ్ సర్వైవల్: ఎమర్జింగ్ డైమన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ – 1984 , ఆఫ్ ద ట్రాక్ – 1987 , సగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్ – 1992 , ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్ – 1992 , ఎ సెంటనరీ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ - వాల్యూం V: 1964–1984 – 2011 , కాంగ్రెస్ అండ్ ద మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ నేషన్ 2011 , థాట్స్ అండ్ రిప్లక్షన్స్ – 2014 తో పాటు పలు రచనలు చేసారు.  
 
దేశం విలువైన వజ్రాన్ని కోల్పోయింది:
 
భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర సంపాదించుకున్న ప్రణబ్ ముఖర్జీ మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా పలు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రోజా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, రితేష్ దేశముఖ్, సాయి ధరమ్ తేజ్, తాప్సి, మోహన్ లాల్, తమన్, కంగనా తదితరులు ట్విట్టర్ లో సంతాపం తెలిపారు. 
 
ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి దేశం విలువైన వజ్రం కోల్పోయిందని అన్నారు. శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతి నన్నెంత గానో బాధించింది. ఆయనతో మాట్లాడిన మాటలు నాకు ఎల్లప్పుడూ గుర్తుంటాయి. గొప్ప జ్ఞానం కలిగిన నిష్ణాతుడు ఆయన అని చిరంజీవి ట్విట్టర్ లో షేర్ చేసారు. ఈ అపార చాణక్యుడు అస్తమయం చెందడంతో దేశం దిగ్భ్రాంతికి గురవుతోంది.