BREAKING NEWS

ఆత్మహత్య సమాధానం కాదు

జీవితం అంటే కష్ట సుఖాల సమరం. ఒక రోజు కష్టం ఉంటే..... మరో రోజు ఆనందం ఉంటుంది. ఇలా రెండింటితో ఉంటేనే జీవితానికి అందం, ఆనందం. కానీ కష్టం వచ్చినప్పుడు దానినే తలచుకుంటూ, తనలో తానే కృంగిపోతూ.... బంగారు భవిష్యత్తుని చేతులారా నాశనం చేసుకోవడం ఎంత మాత్రము మంచిది కాదు. ఎప్పుడు కూడా ధైర్యం, ఆత్మ విశ్వాసం ఉండాలి. ప్రతీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేకుండా సమస్య ఉండదు అని గమనించాలి. ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతీ అడుగుని ఒక సవాల్ గా తీసుకోవాలి. చావు దేనికీ సమాధానం కాదు. బతికి సాధించాలి....సాదిద్దాం...!
 
చిన్ననాటి నుండి ఎంతో బాగా పెరుగుతూ, మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ వచ్చాము కదా...! అటువంటి మన నిండు ప్రాణాన్ని కేవలం సమస్యతో తీసుకోవాలా....? మేధస్సు కలిగిన మనిషే ఇలా చెయ్యడం ఒప్పేనా...? 
 
ఆత్మహత్య పాల్పడటానికి కారణాలు:
 
ఆత్మహత్య పాల్పడటానికి ముఖ్యమైన కారణాలు ఇవే... ఆత్మీయుల మోసాలు, ప్రేమ వైఫల్యాలు, పరీక్షల్లో పరాజయం, తల్లిదండ్రుల అంచనాలకు అందుకునే ర్యాంకు రాకపోవడం, ఆలోచనలేవీ కార్యరూపం లోకి రాకపోవడం,  కుటుంబ ఆర్థిక పరిస్థితులు, దాంపత్యంలో అభిప్రాయ భేదాలు, స్నేహితులతో, సన్నిహితులతో సమస్యలు, అనుకున్న ఉద్యోగం రాకపోవడం, ఉద్యోగుల మధ్య జరిగే  సంఘటనలు.... ఇలా ఇటువంటి సమస్యల వల్ల  జీవితంపై విరక్తి కలగవచ్చు.
 
ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి లక్షణాలు:
 
ఎప్పుడు ఒంటరిగా ఉంటూ అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా  కాలక్షేపం చేయడం, ఒక్కరే  ఒంటరిగా తలుపులు వేసుకుని ఉండడం,  ఎక్కువగా చావు గురించి మాట్లాడడం నిరాశావాదం, మత్తుపదార్థాలకు బానిస కావడం, చేసే పనుల్లో ఆసక్తి లేకపోవడం..... ఇలా ఏదో ఒక  కారణం తో కానీ కొన్ని కారణాలతో కానీ ఎక్కువగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇదే వారి సహజ లక్షణం. వీళ్ళు ఇలా కనుక ప్రవర్తిస్తే తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు గమనించి జీవితం పై భరోసా కలిపించాలి. ఈ సమస్యని దూరం చేసుకోవడానికి మంచి సలహాలు, మార్గాలు చూపించాలి, వాళ్ళల్లో ఉండే మంచి లక్షణాలు చెప్పడం లేదా గతంలో అందుకున్న విజయాల్ని చెబుతూ వాళ్ళని ప్రోత్సహించడం వంటివి చెయ్యాలి. 
 
ఓపిగ్గా మీరు ఉండాలి:
 
వాళ్ళ యొక్క భావాలని పంచుకునే సమయంలో వినేవారు ఎంతో ఓపిగ్గా వినాలి. ముందు వాళ్లను మనసు విప్పి మాట్లాడనివ్వండి. ఏడ్చినా కూడా పరవాలేదు. ఇలా వాళ్ళు  ఎన్ని కన్నీళ్లు కారుస్తారో కార్చనివ్వండి. మీరు మాత్రం అడ్డు చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయొద్దు. పూర్తిగా  వాళ్ల భావోద్వేగాల్ని బయట పెట్టే దాకా  ఓపిగ్గా చూడండి. అప్పుడు ఆఖరున మనసు కుదుటపడ్డాక జీవితం మీద ఆశ కల్గించే మంచి స్ఫూర్తినిచ్చే మాటలు చెబితే వాళ్ళకి  ఉండేది కొండంత కష్టమైనా కరిగిపోతుంది. వాళ్ళల్లో పాజివిటీని పెంచాలి. దీనితో ధైర్యం కూడా చేరుతుంది.
 
ఓటమికి భయపడకూడదు:
 
ఒకసారి ఓటమి వస్తే మరో సారి గెలుపు వస్తుంది అనే భావనతో సాధన చెయ్యాలి. అంతే కానీ ఓటమిని తట్టుకోకుండా బాధపడి జీవితాన్ని కోల్పోవడం మంచిది కాదు. ఎవరి పైన వాళ్ళు దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. పాజిటివ్ గా ఉంటూ ముందుకెళ్లిపోవాలి. అలానే ఎప్పుడు ఒంటరిగా కూర్చుని బాధల్లోంచి బయటకు రాలేకపోతున్నామనే భావనతో కుమిలిపోవడం మంచిది కాదు. ఎంత సమస్య వచ్చినా... కాసేపు ఎవరో ఒకరితో పంచుకోవడం మంచిది. కానీ  భక్తి భావనలు, ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగి ఉన్నవాళ్లకు మాత్రం సహజంగానే ఇలాంటి ఆలోచనలు ఏమి రావు. మనల్ని మన ప్రపంచాన్ని ఏదో అద్భుత శక్తి నడిపిస్తుందన్న ఆశావాదమే ఇందుకు కారణం.
 
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం:
 
ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఎంహెచ్)ల సహకారంతో ప్రతి ఏటా  ‘ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం’సెప్టెంబర్ 10వ తేదీని 2003 నుంచి నిర్వహిస్తున్నారు.
 
డబ్ల్యూహెచ్ఓ చేసిన తాజా గణాంకాల ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంత దారుణమో కదా...! చిన్న చిన్న సమస్యలతో సతమతమై ప్రాణాలు తీసుకోవడం ఘోరం. ఈ ఆత్మహత్యలు చేసుకునే వారిలో  18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారి సంఖ్య సగానికి పైగా ఉంది. అలానే 15-29 ఏళ్ల మధ్య వారిలో రోడ్డు ప్రమాద మరణాల తర్వాత రెండో కారణంగా ఆత్మహత్యలు ఉండటం విచారకరం. నమ్మకం ఎప్పుడు కోల్పోకుండా ఉండాలి. సమస్యతో సవాల్ చెయ్యాలి కానీ ఆవేశంలో ప్రాణం తీసుకుంటే ఏం మిగులుతుంది. కనుక ఆవేశం లో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆచితూచి వ్యవహరించాలి. మరు క్షణం బాగుంటుండాలి పాజిటివిటీతో పయనించాలి. 
 
అలానే బలవన్మరణాలపై పెద్దగా చర్చ  ఏమి లేదని ఐఏఎస్‌పీ, డబ్ల్యూహెచ్ఓలు దశాబ్ధన్నరం నుండి ఈరోజుని జరపడం జరుగుతోంది. ఒకరు సూసైడ్ చేసుకుంటే దాని ప్రభావం దాదాపు 135 మందిపై పడుతుందని అమెరికన్లు చేసిన ఓ అధ్యయనంలో గతంలో వెల్లడైంది. ఒకరి జీవితం తో పాటు ఎంత మంది ఈ ప్రభావానికి గురవుతున్నారో....! 
 
నిజంగా ఎందరో మందిపై ప్రభావం పడడం దారుణమే.  ప్రపంచ దేశాలలో భారత్ 21వ స్థానంలో ఉంది. డబ్ల్యూహెచ్ఓ 2018 లెక్కల ప్రకారం 16.3 సూసైడ్ రేట్ (ప్రతి లక్ష మందికి)తో భారత్‌లోనూ ఆత్మహత్యలు ఎక్కువేనని తేలింది. అలానే మన భారత్ లో  ప్రతి 1,00,000 జనాభాలో పురుషుల్లో ఆత్మహత్యల రేటు 18.5 శాతం ఉండగా, మహిళల రేటు 14.5శాతంగా ఉంది. 
 
ఒకటే జీవితం మనకి, కనుక ధైర్యంగా సాగుదాం.....బ్రతికి సాధిద్దాం.....