BREAKING NEWS

లంబసింగి లో ఈ ప్రదేశాలని తప్పక చూడాల్సిందే...

ఎన్నో చెట్లతో నిండిన అందమైన ప్రకృతి, చల్లని గాలులు, సుందరమైన వాతావరణం, రంగు రంగుల పూల చెలిమితో ఇలా కాసేపు గడిపితే అబ్బా ఆ ఆనందం ఎనలేనిది. ఎన్నేళ్ళైనా మరువలేనిది. అటువంటి జ్ఞాపకాలని మీరు కూడా పొందాలనుకుంటున్నారా...? ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని మిస్ కాకుండా చూసేయాలనుకుంటున్నారా...? ఎక్కడికో వెళ్ళిపొక్కర్లేదు. మన ఆంధ్రాలోనే ఉంది ఈ అందమైన ప్రదేశం. అదే లంబసింగి. ఈ ప్రదేశాన్ని  కాశ్మీర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్' గా లేదా 'ఆంధ్రా ఊటీ' గా పిలుస్తారు. అలానే దీనిని 'కొర్రబొయలు' అని కూడా అంటారు.
 
లంబసింగి ఎలా చేరుకోవాలి: 
 
లంబసింగికి దగ్గర్లో వైజాగ్ ఎయిర్ పోర్ట్ 106 కిలో మీటర్ల దూరంలో ఉంది. అలాగే విశాఖపట్నం రైల్వే స్టేషన్ 114 కిలో మీటర్ల దూరంలో ఉంది. నర్సీపట్నం రైల్వే స్టేషన్ కూడా ఉంది. అలానే బస్సు మీద వచ్చే వాళ్ళు నర్సీపట్నం చింతపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సులో రావచ్చు ఈ ప్రదేశం విశాఖ జిల్లాలో సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది. చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నం దాటిన తర్వాత 60 కిలో మీటర్ల దూరంలో లంబసింగి ప్రాంతం ఉంది. అనుకోకుండా ఒక రోజు ఈ ప్రదేశంలో వాతావరణం 0 డిగ్రీలకు పడిపోవడంతో దీనికి ప్రాధాన్యత వచ్చింది.
 
ఇక్కడ ఉన్న ఉష్ణోగ్రతల కారణంగానే ఆంధ్ర కాశ్మీర్, ఆంధ్రా ఊటీ అనే పేర్లు దీనికి వచ్చాయి సహజమైన ప్రకృతి వల్ల పేరు రావడం విశేషం. అలానే దట్టమైన పొగ మంచుతో, మంచు తుంపరలతో, చల్లని గాలులతో పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ఆకుపచ్చని హరితారణ్యాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణయంగా నిలిచాయి.
 
తప్పక చూడాల్సిన ప్రదేశాలు: 
 
లంబసింగి మాత్రమే కాకుండా చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ప్రకృతి ఎంతో సుందరంగా ఉంటుంది. లంబసింగి ఘాట్ రోడ్డులో  కాఫీ తోటలు విస్తారంగా ఉన్నాయి. ఈ లంబసింగి వెళ్లే దారిలో బోడకొండమ్మ గుడి ఉంది. అలానే దీనికి అర కిలో మీటర్ దూరం లోనే జలపాతం ఉంది ఈ జలపాతం సుమారు యాభై అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంది. దీనికి కొంత దూరంలోనే లంబసింగి ఉంది. ఇలా జలపాతాలను చూసుకుంటూ ఆ ప్రదేశానికి చేరుకుంటే ఈ ట్రిప్ అంతా కూడా మరపురాని జ్ఞాపకంగా మారిపోతుంది.
 
వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. ప్రకృతి ప్రేమికులు లంబసింగి వస్తే విడిచి పెట్టడం కష్టమే. ఆదివారం తెల్లవారు జామున అయితే ఇక్కడ జాతరలాగే ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటలకే పర్యాటకులతో ఈ ప్రాంతం అంతా నిండి పోతుంది. పొగమంచు, పచ్చని చెట్లుతో ప్రాంతమంతా నిండి పోతుంది. సూర్యోదయం చూడాలని తెల్లవారుజాము నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. చలిమంటలు వేసుకుని దాని చుట్టూ ఆట పాటలతో సందడి చేస్తూ ఉంటారు. వెల్తురు వచ్చిన తర్వాత ఆ ప్రదేశాన్ని కెమెరాతో చిత్రీకరిస్తారు.
 
తాజంగి రిజర్వాయర్ వద్ద పర్యాటక శాఖ బోట్ షికార్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలానే మోద కొండమ్మ ఆలయం అక్కడ ఉన్న జలపాతం కూడా చూడాల్సినవివే. ఇది మాత్రమే కాకుండా 40 కిలో మీటర్ల దూరంలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అలానే 75 కిలో మీటర్ల దూరంలో దారకొండ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇలా వీటిని కూడా ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వీక్షిస్తూ ఉంటారు.
 
కాఫీ తోటలు అందాలు:
 
ఎంతో అందమైన తోటలతో చూడ ముచ్చటగా ఉంటుంది. లంబసింగిలో పండించే కాఫీ గింజలను, మిరియాలను అమెరికా బ్రిటన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. అలానే ఇక్కడ ఆపిల్ సాగుకి ఎంతో విశేషం వుంది. నిన్న మొన్నటి నుండి చేస్తున్నది కాదు ఈ సాగు ఏకంగా బ్రిటీషు వారి కాలం నుండే ఇక్కడ ఆపిల్ సాగు కొనసాగుతోంది.
 
ఇంత రమణీయమైన ప్రకృతికి ఎవరైనా ముగ్దులు అవ్వాల్సిందే. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శీతాకాలంలో లంబసింగిలో మంచు వర్షం కురుస్తుంది. ఉదయం 6 అయ్యే సరికి కనిపించే సూర్యుడు ఇక్కడ మాత్రం పది గంటలయినా కనిపించడు. వేసవి కాలంలో అయితే మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడు ప్రకాశిస్తాడు. వలిసె పూల తోటలు,  తాజంగి రిజర్వాయర్ ఇలా ఎన్నో ఆకర్షించేవి ఉన్నాయి. ప్రకృతికి ఇంత దగ్గరగా ఉండడం ఎక్కడ సాధ్యం కాదేమో...!
 
కాశ్మీర్ని తలపించే లోయలు ఎత్తులో ఉన్న లంబసింగి చేరుకునే టప్పుడు చల్లని వాతావరణం మంచు తెరలు కాశ్మీర్ వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇది మన్యం ప్రదేశంలో ఉంది కనుక కొండలు, అడవులు దాటుకుని వెళ్ళాల్సి ఉంది. రెండు పక్కలా లోయలు ఆ మధ్య నుండి  రోడ్డు ప్రయాణం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు లంబసింగి వచ్చి చూస్తూ ఉంటారు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా బెంగళూరు నుంచి కూడా ఇక్కడికి వాహనాల్లో వస్తూ ఉంటారు. ఇంత దూరం నుంచి పర్యాటకులు వీక్షిస్తున్నారు అంటే దీని ప్రత్యేకత మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లే. 
 
మరి ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని ఆ జ్ఞాపకాలని మీ జీవితంలో కూడా ఉండాలని భావిస్తున్నారా...? అయితే మరి ఇంకేం ఆలస్యం ఈ వింటర్ కి కుటుంబ సమేతంగా లంబసింగి వెళ్లిపోండి. ఆనందంగా, ఉత్సాహంగా ఆ క్షణాలని గడిపేయండి.