BREAKING NEWS

ఉసిరి వల్ల కలిగే లాభాలు, ఉపయోగించే పద్ధతులు

ఉసిరిని పురాతన కాలం నుండి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూనే ఉన్నాం. అనేక సమస్యలని ఉసిరి ఎంతో సులువుగా చెక్ పెడుతుంది. దీని వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో ఉన్నాయి. అయితే మీరు కూడా ఈ ఉసిరి వల్ల కలిగే లాభాలు తెలుసుకోవాలనుకుంటున్నారా...? మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తిగా చదివేయండి. 
 
వైద్యంలో చూసినట్లయితే ఉసిరి ఎన్నో ఔషధగుణాలున్న వృక్షం అని మనం చెప్పవచ్చు. ఆయుర్వేదంలోను, యునానీ ఔషధాల్లో విరివిగా వాడతారు దీనిని. కేవలం ఉసిరి కాయలని మాత్రమే కాకుండా  పువ్వులు, బెరడు, వేరు అన్నీ సంపూర్ణ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ ఉసిరిలో  విటమిన్‌ సి, ఐ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టుకి ఎంతో మంచి ఔషధం. ఎన్నో సమస్యలని ఉసిరితో మనం పరిష్కరించుకోవచ్చు.

జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు లాంటివి పోగొడుతూ ఉసిరి జుట్టుని కాపాడుతుంది. ఇలా ఇన్ని సమస్యలని ఇది సాల్వ్ చేస్తుంది కనుకే హెయిర్ ఆయిల్స్ లో, షాంపూస్ లో దీనిని వాడుతారు. ఇలా కేవలం జుట్టు సమస్యలకి మాత్రమే కాక హెమరైజ్‌కి, మెన్‌రేజియా, లుకోమియా, గర్భసంచిలో రక్త స్రావాన్ని అరి కట్టడానికి ఇలా అనేక సమస్యలకి ఔషధం ఉసిరి. ఇలా ఔషధ గుణాల కారణంగా దీనిని అమృతఫలం అని అంటారు.
 
ఉసిరి వల్ల కలిగే లాభాలు:
 
దీని వల్ల అనేక లాభాలున్నాయి. ఉసిరి నూనెని కనుక ఉపయోగిస్తే  తలపోటు తగ్గుతుంది. అలానే మెదడుకి చల్ల దనాన్ని ఇస్తుంది. అలానే  బ్యూటీ ప్రోడక్ట్స్ లో, వంటకాలలో, మందుల్లో, కూడా ఉసిరిని ఉపయోగిస్తారు. దీనికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. మన భారతీయులు సాంప్రదాయరీతిలో ఉసిరిని పూజిస్తారు. ఉసిరితో చేసిన ఆమ్లా మురబా కనుక  తింటే వాంతులు, విరేచనాల నుండి ఉపశమనం లభిస్తుంది.
 
ఉసిరితో చేసిన మాత్రలని కనుక వాడితే  వాత, పిత్త, కఫ రోగాలకి పరిష్కారం చూపుతుంది.  మనిషికి సంపూర్ణ శక్తిని కలిగిస్తుంది అని చెప్పినా తక్కువే. అలానే ఉసిరి చెట్టుని పెంచడం కూడా ఎంతో మంచిది. భారతీయ వాస్తుశాస్త్రంలో ఈ చెట్టుకి ప్రాధాన్యత ఉంది. మన  ఇంటి పెరటిలో ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవి ఉన్నా హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం చెబుతున్నాయి. నారింజ కంటే కూడా ఉసిరిలో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ , ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్స్, టానిక్ ఆమ్లం, గ్లూకోజ్ వగైరా దీనిలో మనకి లభిస్తాయి.  
 
ఉసిరితో చిట్కాలు: 
 
నోటిపూతతో బాధపడే వారు అర కప్పు నీటిని తీసుకుని ఉసిరి కాయ రసాన్ని దానిలో  కలిపి పుక్కిలిస్తే నోటి పూత తగ్గుతుంది.
 
మల బద్దకం తో సతమతమయ్యేవాళ్ళు  ప్రతి రోజు ఒక ఉసిరి కాయని తింటే  ఈ సమస్య తగ్గిపోతుంది.
 
అలానే గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే.... ఉసిరిని మీ డైట్ లో చేర్చండి. ఉసిరి వల్ల ఆహారములోని ఇనుము ఎక్కువగా గ్రహించబడుటకు తోడ్పడుతుంది. దీనితో శరీరములో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది ఉసిరి. 
 
సగం కప్పు నీటిలో రెండు చెంచాల ఉసిరి రసాన్ని కలుపుకొని ప్రతి రోజు ఉదయం తాగితే  కళ్ళు ఎర్ర బడటం, దురదలు తగ్గిపోతాయి. కళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
 
అలానే  ఖాళీ కడుపుతో ఉసిరి రసాన్ని తాగితే వైటమిన్ లోపం వల్ల వచ్చే  కామెర్లు రాకుండ సహాయ పడుతుంది.
 
దాహం, మంట, వాంతులు, ఆకలి లేక పోవుట, చిక్కిపోవుట, ఎనీమియా,హైపర్ -ఎసిడిటి, వంటి జీర్ణ మండల వ్యాదులను కూడా తగ్గిస్తుంది ఉసిరి. 
 
ఉసిరితో పిల్లలకి నచ్చేలా:
 
ఆమ్లా స్వీట్  క్యాండీస్: 
 
ఆమ్లా స్వీట్ క్యాండీస్ ని కనుక ప్రిపేర్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి వీటిని ఎలా తయారు చెయ్యాలో చూసేసి మీ పిల్లలకి చేసి పెట్టేయండి.  ముందుగా పంచదారని లేత పాకం పట్టాలి. 100 గ్రాముల పంచదారకు 200 ml వాటర్ ని వేసుకోవాలి. ఇలా పట్టిన పాకాన్ని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఉసిరి కాయలని ముక్కలుగా చేసుకోవాలి. వీటిని పాకంలో వేసుకుని స్టవ్ మీద ఉంచాలి. కాసేపు వీటిని ఆలా ఉంచాక మూడు రోజుల పాటు ఎండలో ఎండ పెట్టాలి. అంతే ఇవి తయారు అయిపోయాయి. 
 
ఆమ్లా మురబ్బా: 
 
ఆమ్లా మురబ్బాని ఒకసారి తింటే ఎవరు వదిలి పెట్టారు. ఇంట్లో చేసుకోవడం వల్ల మరెంతో రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఎలా చెయ్యాలి అన్న విషయానికి వస్తే..... ముందుగా ఉసిరి కాయలని బాగా కడిగి ఒక రోజు పాటు నీళ్లల్లో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్ళని తీసేసి వీటిని ఫోర్క్ సహాయంతో చిన్న రంధ్రాల మాదిరి పెట్టుకోవాలి. ఇలా సిద్ధం చేసిన వాటిని ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆ కాసేపు నీటిలో ఉంచాలి. తర్వాత వాటిని నీటి నుండి తీసేయాలి. ఇప్పుడు పంచదార వేసి ఉసిరి కాయలని దానిలో వేసి బాగా కలపాలి. కొద్దిగా నీరు పోసి కలుపుకోవాలి. తర్వాత ఉసిరికాయలని తీసేసి దానిలో యాలుకల పొడి  వేసి కలుపుకోవాలి. కొంచెం బ్లాక్ సాల్ట్, ఎండుమిర్చిపొడి వేసుకోవాలి. అంతే తియ్యగా, పుల్లగా ఉండే ఈ ఆమ్లా మురబ్బా తయారైపోయింది.
 
ఉసిరి వల్ల లాభాలు చూసారు కదా...! మరి మీరు కూడా అనేక సమస్యలని ఉసిరితో తరిమికొట్టండి. రుచికరంగా ఉసిరితో తయారు చేసుకుని  ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి.