BREAKING NEWS

అందరికీ నచ్చే ఈ తెలుగు పుస్తకాలని మీరు చదివారా...?

అజ్ఞానమనే అంధకారం నుండి విజ్ఞానం అనే వెలుగుని అందిస్తుంది పుస్తకం. పుస్తకం ఒక స్నేహితుడిలా తోడుగా ఉంటుంది. ఆనందంగా ఉన్నా, బాధగా ఉన్నా..... పుస్తకం నిజంగా మనిషిలాగ తోడై ఉంటుంది. చదివే కొద్దీ మనలో ఆసక్తిని పెంచుతుంది. నిజంగా పుస్తకాలని మించిన మిత్రులు ఉండరు. పుస్తకాలలో కేవలం కవితో, కథో లేక ఏదైనా సారాంశం మాత్రమే  ఉంది అనుకుంటే పొరపాటు. పుస్తకం జీవితానికి వెలుగునిచ్చే సారం అని తెలుసుకోవాలి. ఎక్కువ సమయం పుస్తకాలతో గడిపితే ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. అంతే కాకుండా అవగాహన లేని విషయాలు కూడా తెలిసిపోతాయి. ఇలా పుస్తకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
 
అయితే పుస్తకాల గురించి ఇన్ని చెబుతున్నారు ఏ పుస్తకాలు చదివితే మంచిది...?  అనే ప్రశ్న ఈ పాటికే వచ్చి ఉండవచ్చు. అయితే మరి తెలుగులో తప్పక చదవాల్సిన కొన్ని మంచి పుస్తకాలు ఏమిటో తెలుసుకోండి... ఇక ఆలస్యం చేయకుండా దీనిని పూర్తిగా చదవండి....
 
 
మహాప్రస్థానం :
 
మహాప్రస్థానం నిజంగా మహా ప్రసాదం. ఈ పుస్తకం ఎంతో మందికి ఫేవరెట్ అనే చెప్పాలి. శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం ఈ మహాప్రస్థానం. ఈ పుస్తకం తెలుగు సాహిత్యపు ప్రస్థానానికి ఓ దిక్సూచిగా వెలుగొందింది. దీనిలో వివిధ రకాల కవితలని మనం చూడవచ్చు. మహా ప్రస్థానం, జయభేరి, బాటసారి, చేదుపాట, ప్రతిజ్ఞ  ఇలా అనేక రకాల కవితలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకంలో ప్రపంచవ్యాప్తంగా మానవజాతి ఎదుర్కొంటున్న బాధలు వీటికి నేపథ్యంగా ఉన్న చారిత్రక పరిణామాలు, పీడితుల పక్షాన నిలవాల్సిన కవికి అవసరమైన లక్షణాలు వంటివి కూడా ఇందులో ఉన్నాయి.
 
శ్రీశ్రీ అంటే మనందరికీ గుర్తుకొచ్చేది ''పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి''.... నిజంగా ఇది మరువలేనిది. ఇది మాత్రమే కాకుండా ఎన్నో గేయాలు నిజంగా పాఠకులకి ఏదో తెలియని శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పట్టుదల వంటి నింపుతాయి. రక్తం మరుగుతున్న భావన కలుగుతుంది. 
 
అమృతం కురిసిన రాత్రి:
 
అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాల గంగాధర తిలక్ గారు రచించారు. ఈ పుస్తకం నిజంగా పలు రచయితలకు సైతం ఇష్టమైన కవితాసంకలనం. ఈ కవితా సంపుటి కి 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. ఆత్మ గీతం, సీఏఐడి, రిపోర్ట్, వెళ్ళిపొండి- వెళ్ళిపొండి,   అమృతం కురిసిన రాత్రి ఇలా అనేక కవితలు ఇందులో ఉన్నాయి. అంత్యప్రాసలు వేసినంత మాత్రాన ప్రొసైక్ భావం కవిత్వం అవ్వదు అంటూ తన అక్షరాలని తుపాకీ తూటాల్లా పేల్చాడు. 
 
''నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, కాదు సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం''
 
ఇలా అనేక పంక్తులు నిజంగా పాఠకుల్ని ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ పుస్తకం గురించి ఎంత వివరించినా తక్కువే.
 
విముక్త:
 
ప్రముఖ రచయిత్రి ఓల్గా ఈ చిన్న కథల సంకలనం రచించారు. ఓల్గా రచించిన ఈ విముక్త కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ప్రగతిశీల సాహిత్యానికి ఒక గౌరవం. ఈ పుస్తకంలో బాగా ఆకట్టుకునే అంశం ఏమిటంటే పురాణాల పాత్రల్ని ఈ చిన్న కథలలోకి తీసుకు రావడం. ఈ పుస్తకంలో సీతా రాములు, ఊర్మిళ, లక్ష్మణ ఇలా అనేక పాత్రలను మనం చూడవచ్చు. ఆ పాత్రల స్వభావ మూలాన్ని మార్చడం అనివార్యం.
 
కేవలం ఆర్థిక స్వతంత్రం తోనే మహిళలకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు చట్టసభల్లో మహిళలు విధాన నిర్ణయ కర్తలు అయినప్పుడే అది సాధ్యపడుతుందని రచయిత్రి స్త్రీవాద ఉద్యమకారునిగా ఓల్గా స్పష్టంగా చెబుతారు. ఈ కథలు వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు కూడా. ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానలకూ హింసలకూ గురై వాటినధిగమించి లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో - తమను హింసించే భర్తల నుండి విముక్తం కావాలనే స్పృహ లేకుండా వారిని ద్వేషిస్తునే, అసహ్యించుకుంటునే వారిని గట్టిగా పట్టుకునే స్త్రీలు - ద్వేషంతో తమను తాము హింసించుకోడం అలవాటైన స్త్రీలు - ఆ స్త్రీల కోసం ఈ కథలు అని ఓల్గా ఈ పుస్తకం రాయడం జరిగింది.
 
 
విశ్వంభర:
 
విశ్వంభర పుస్తకాన్ని డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించారు. ఇది పద్య కావ్యము. ఈ గ్రంధానికి 1988 సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ప్రధానం చేయడం జరిగింది.'' నేను పుట్టక ముందే నెత్తి మీద నీలి తెర కాళ్ళ కింద ధూళి పొర'' ఇలా ఎంతో అద్భుతమైన పడాలని, వాక్యాలని ఇందులో మనం చూడవచ్చు. ఈ రచనని ఆంగ్ల, హిందీ భాషలలోకి కూడా అనువదించడం జరిగింది. కొన్ని విశ్వవిద్యాలయాలలో దీనిని పాఠ్యగ్రంధంగా కూడా నిర్ణయించారు. 
 
విశ్వంభర అంటే భూమి, ప్రపంచం అని అర్థాలు. అయితే ఇది కేవలం భూగోళం అనే మట్టిముద్దను గురించిన కావ్యం కాదు. ఆ మట్టిలో పుట్టిన మనిషి అనే ప్రాణి పొందిన వికారాన్ని గురించి, వికాసాన్ని గురించి ఆ వికాసక్రమంలో ఆ మనిషి చైతన్యస్థాయి గురించి, ఈ చైతన్యానికి మూలమైన మట్టితో అతని సంబంధాన్ని గురించి. మట్టే విశ్వంభర. విశ్వంభరే మానవుడు" అని ఆచార్య ఎన్.గోపి గారు చెప్పారు. ఇటువంటి అక్షరాలతో లిఖించిన ఈ పద్యకావ్యాన్ని చదివితే ఆ అనుభూతే వేరు.