BREAKING NEWS

సందర్శకులకు గొప్ప అనుభవాలని పంచే మంగినపూడి బీచ్

ఎప్పుడైనా వీకెండ్ కానీ ఏదైనా సెలవులు కానీ  వస్తే ఏదో ఒక కొత్త ప్రాంతాన్ని సందర్శించడం ఎంతో మందికి ఇష్టం. నిత్యం చూసే ప్రదేశాలు కంటే కొత్త ప్రదేశాలు చూడడంలో ఎంతో థ్రిల్  ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో అనేక బీచ్లు ఉన్నాయి. ఏ బీచ్ అయినా కూడా సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. సరదాగా కుటుంబంతో కలిపి బీచ్లో గడిపితే ఆ ఆనందమే వేరు...... బీచ్ లో సముద్ర కెరటాలు మధ్య ఆడుతూ, పాడుతూ సరదాగా గడిపితే ఎనలేని ఆనందం పొందవచ్చు. ఈ మచిలీపట్నంలో ఉన్న  మంగినపూడి బీచ్ మామూలు బీచ్లతో పోలిస్తే ఇది కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. మరి ఈ మంగినపూడి బీచ్ స్పెషల్ తెలుసుకోవాలనుకుంటున్నారా...?  ఇక ఆలస్యం చేయకండి పూర్తిగా ఈ చదివేయండి....... 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నంకి మంగినపూడి బీచ్ 11 కిలో మీటర్ల దూరంలో ఉంది. పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంది ఈ బీచ్. అద్భుతమైన చారిత్రక నేపథ్యాన్ని కూడా కలిగి ఉండడం విశేషం. డచ్ జ్ఞాపకాలతో ఈ బీచ్ ప్రసిద్ధి చెందింది. ఈ బీచ్ భారత దేశంలో వాణిజ్య కార్యకలాపాలకు ప్రవేశ ద్వారంగా పని చేస్తుంది. అలానే సహజసిద్ధ నౌకాశ్రయం కావడం విశేషం. ఇవన్నీ ఒక ఎత్తయితే మరెన్నో ప్రత్యేకతలు ఈ బీచ్ కలిగి ఉంది. సందర్శకులకి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ని అందిస్తుంది. కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి సరదాగా బీచ్లో గడిపితే ఎన్నడూ పొందని తీపి జ్ఞాపకాలని అందిస్తుంది. నిరంతరం కాలం వెనుక పరిగెడుతూ పని ఒత్తిడితో అనుదినం సతమతం అయ్యే వారు ఎందరో...... ఇటువంటి వారు కూడా కాస్త రిలీఫ్ గా రిలాక్స్ గా ఉండాలంటే ఈ బీచ్ కి వెళ్లాల్సిందే.
 
మంగినపూడి బీచ్ ప్రత్యేకత:
 
ఈ బీచ్ వాటర్ స్పోర్ట్స్ కు కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. వాటర్ స్పోర్ట్స్ కోసం అనేక మంది ఇక్కడికి వచ్చి వీక్షిస్తూ ఉంటారు. స్విమ్మింగ్, సర్ఫింగ్ , స్కీయింగ్ ఇలా వాళ్ళ అభిరుచి ప్రకారం పాల్గొంటూ ఆనందించవచ్చు. వినోదానికి ఇది మంచి స్పాట్. అలానే ఈ బీచ్ కూడా ఎంతో సురక్షితం. ఎందుకంటే దీని లోతు కూడా తక్కువే. అనేక రకాల వాటర్ స్పోర్ట్స్ తో ఈ బీచ్ ఆకట్టేసుకుంటుంది.  పారా గ్లైడింగ్, కార్ రేసింగ్, బోటింగ్, హార్స్ రేసింగ్ వంటి సాహస క్రీడలు కూడా అందుబాటులో ఉన్నాయి. లోతు తక్కువ ఉండడం మూలాన్నే ఎక్కువ శాతం ప్రజలు ఈ బీచ్ ని ప్రిఫర్ చేసి ఇక్కడికి వచ్చి ఆనందిస్తూ సెలవు రోజుల్లో ఎంతో ఆహ్లాదంగా గడుపుతారు. సరస్సు, నది చుట్టు పక్కల కలిగి ఉన్న ఈ బీచ్ భూమి పై స్వర్గంలా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏటా బీచ్ ఫెస్టివల్ ని కూడా జరుపుతారు. దానిలో భాగంగా బీచ్ కబడ్డీ,  బీచ్ వాలీబాల్ వంటి అనేక క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తారు. 
 
బీచ్ అందాలు, ఆకర్షణీయమైన ప్రదేశాలు:
 
ఇక్కడి బీచ్లో ఇసుకకి బదులుగా నల్లటి మన్ను ఉంటుంది. దీని కారణంగా ఈ బీచ్ కి మరింత దగ్గరవుతారు ప్రకృతి ప్రేమికులు. ఇలా చెప్పుకుపోతే ఈ బీచ్ అందాలు ఆకర్షణీయమైన ప్రదేశాల గురించి ఎన్నో చెప్పాలి..... మంగినపూడి బీచ్  వివిధ రకాల ప్రదేశాలతో ఎంతో ప్రత్యేకత సంపాదించుకుంది. ఈ బీచ్ కి దగ్గర్లోనే అందమైన ఉద్యానవనం కలదు. ఇది కూడా రమణీయమైన ప్రకృతితో ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులు కనుక ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే ఇంకా వదిలి పెట్టరు.  అలానే ఆకర్షణీయమైన మ్యూజియంలు  కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ వెళితే సమయమే తెలియదు. అలానే పురాతన ఆలయాలు భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఉన్నాయి.
 
మంగినపూడి బీచ్ లో మరో అద్భుత విశేషమేమిటంటే జాలర్లు చేపలని పడుతూ ఉంటే ఆ పద్ధతి చూడడానికి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. వారి నైపుణ్యాన్ని కూడా మనం నేరుగా చూడవచ్చు. ఈ బీచ్ లోని రుచికరమైన సముద్రపు ఆహారాన్ని కూడా తినవచ్చు. నోరూరించే సముద్రపు ఆహారంతో ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ని నడిపిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సందర్శకులు వినియోగించుకోవచ్చు. 
 
మంగినపూడి బీచ్ ని ఎలా చేరుకోవాలి ?
 
విజయవాడ నగరం నుంచి ట్రైన్ లేదా బస్సులో ఎంతో సులువుగా మచిలీపట్నం వెళ్ళవచ్చు మచిలీపట్నానికి 15 కిలో మీటర్ల దూరంలో ఉంది మంగినపూడి బీచ్. ఆటో ప్రైవేటు వాహనాల ద్వారా అక్కడ నుంచి సులువుగా బీచ్ ని చేరుకోవచ్చు. ప్రధాన నగరాలు, పట్టణాల నుండి మచిలీపట్నం కి డైరెక్ట్ ట్రైన్లు ఉన్నాయి. అలానే హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు నుండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ కు రైళ్లు అందుబాటులోనే ఉన్నాయి. అదే రోడ్డు మార్గంలో వచ్చే వాళ్లు విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు వంటి వివిధ నగరాల నుంచి బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి. కనుక ఎంతో సులువుగా ఈ బీచ్ ని చేరుకోవచ్చు.
 
బీచ్ కి సమీపంలో చూడాల్సిన ప్రదేశాలు:
 
ఇక్కడ బీచ్ కి దగ్గరలోనే రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, ఉండవల్లి గుహలు మచిలీపట్నం నౌకాశ్రయం చూడదగ్గవి. అలానే కార్తీకమాసం సమయంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడానికి వస్తారు. ఈ బీచ్ ని చూడడానికి  సాయంత్రం ఆరు గంటల వేళ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. 
 
ఈ మంగినపూడి బీచ్ ని, అక్కడ ఉన్న ప్రదేశాలని మీ కుటుంబ సమేతంగా వెళ్లి చూసేయండి. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేయండి.