BREAKING NEWS

దక్షిణకాశీగా పేరు గాంచిన పుణ్యగిరి ఆలయం

పురాతన ఆలయాల్లో ఏదో అందం ఉంటుంది. చూడడానికి ఎంతో ఆసక్తి కూడా ఉంటుంది. ఇప్పటి కట్టడాలతో పోల్చుకుంటే అప్పటి కట్టడాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అటువంటి పురాతన ఆలయాలను దర్శించుకోవడం నిజంగా మన భాగ్యం అనే చెప్పాలి. ఇప్పటిలా రంగులు, హంగులు లేకున్నా...  మెరిసే పాలరాయలు లేకపోయినా అప్పటి ఆలయాల్లో ఏదో తెలియని రహస్యం దాగి ఉంటుంది. అలానే ఆ పురాతన ఆలయాలకి గొప్ప చరిత్ర కూడా ఉంటుంది. అటువంటి ఆలయానికి వెళ్ళడం, ఆ చరిత్ర తెలుసుకోవడం, ఆ కట్టడాలను చూడడం నిజంగా అద్భుతంగా ఉంటుంది. మరెంత ఆనందంగా కూడా ఉంటుంది. అందుకేనేమో అక్కడికి వెళితే ఎనలేని  ఉత్సాహం మనకి కలుగుతుంది.
 
ఏది ఏమైనా ఆ ప్రకృతి గురించి మనం చెప్పుకునే తీరాలి. రమణీయమైన ప్రకృతి తో ఎంతో శోభాయమానంగా ఉంటుంది. నిజంగా ఇప్పటి ఆలయాలు కేవలం కృత్రిమ లైట్లతో మెరుస్తుంటే అప్పటి ఆలయాలకు మాత్రం ప్రకృతే ప్రధాన అందం. అటువంటి ఆలయమే పుణ్యగిరి దేవాలయం. ఈ పుణ్యగిరి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలో ఉంది. పశ్చిమ దిశలో ఎత్తైన కొండల వద్ద ఉన్న ఈ ఆలయం మహాద్భుతం. ఈ గ్రామం విజయ నగరానికి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది. శృంగవరపుకోటకి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం కలదు. ఎత్తైన ప్రాంతంలో స్వచ్ఛమైన ప్రకృతి నడుమ సందర్శించడానికి వెళ్తుంటే.... నిజంగా అదో  జ్ఞాపకంగా మారిపోతుంది.
 
పుణ్యగిరి ఆలయ రహస్యాలు:
 
పుణ్యగిరి ఆలయంలో ఉన్న పరమశివుడిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు పండుగ రోజుల్లో వస్తూ ఉంటారు. ఈ శివుడిని ఉమా కోటేశ్వర స్వామి అంటారు. ఈ ఆలయంలో చనిపోయిన వారి అస్తికలను కలిపితే వాళ్ళకి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే చాలా మంది చనిపోయిన వారి అస్తికలను తీసుకువెళ్లి అక్కడ కలుపుతూ ఉంటారు. 
 
శివరాత్రి నాడు పుణ్యగిరిలో: 
 
శివరాత్రి పండుగని పుణ్యగిరిలో అత్యంత వైభవంగా జరుపుతారు. కేవలం ఒక రోజు రెండు రోజులు కాకుండా ఏకంగా మూడు రోజులు ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఆ రోజున మాత్రం ఇసుకేస్తే రాలనంత జనం ఈ ఆలయానికి చేరుతారు. ఈ జాతరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారితో పాటు ఒడిశా ప్రాంత వాసులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. మెట్ల దారి నుండి ఆలయానికి చేరుకోవాలి కాబట్టి పరమ శివుడిని దర్శించుకోవడానికి పైకి నడిచి వెళ్తారు. ఆ వెళ్లేదారి అంతా కూడా ఎంతో ఆకుపచ్చగా నిండి ఉంటుంది. ఆ ప్రకృతిని కనుక  ఒక్కసారి చూస్తే వదిలి పెట్టడం కష్టమే. ఎప్పుడో కట్టిన ఆలయం ఇప్పటి తరాన్ని కూడా బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి.
 
 ఈ పుణ్యగిరి క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి...? 
 
పుణ్యగిరి క్షేత్రానికి దగ్గర్లో ఉండే విమానాశ్రయం విశాఖపట్నం. ఈ విశాఖపట్నం విమానాశ్రయం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే రైలు మార్గంలో రావాలంటే విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. విజయనగరం విశాఖపట్నం కూడా పెద్ద రైల్వే స్టేషన్లో కాబట్టి అనేక ప్రాంతాల నుంచి రైళ్ల సౌకర్యం ఉంటుంది. అదే కనుక మీరు రోడ్డు మార్గం లో రావాలనుకుంటే 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం లేదా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం నుంచి చేరుకోవచ్చు. ముందు శృంగవరపుకోట వచ్చేస్తే అక్కడి నుంచి కేవలం మూడు కిలో మీటర్లు మాత్రమే. విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి కూడా శృంగవరపుకోట కి డైరక్ట్ బస్సులు ఉన్నాయి.
 
పుణ్యగిరి ఆలయ చరిత్ర: 
 
దక్షిణ కాశీగా పేరు గాంచిన ఈ ఆలయంలో పూర్వం రుషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు. ఆ తర్వాత ఇక్కడ శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడని పూర్వీకుల చెబుతారు. ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఈ పుణ్యగిరి ఆలయం ఒకటి. ఈ క్షేత్రానికి ఎంతో విశిష్ట ఉంది అని పూర్వికులు అంటారు. మహాభారత కాలానికి సంబంధం ఉందని పౌరాణిక గాథల వల్ల మనకి తెలుస్తోంది. ఆనతి పాండవుల ఆవాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం. మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేశారు. అరణ్యవాసం పూర్తి చేసుకున్న పాండవులు ఇక్కడే అజ్ఞాత వాసం చేశారు అని చరిత్ర చెబుతోంది. 
 
పుణ్యగిరి జలధార:
 
మొదట చిన్న మందిరంగా ఏర్పడిన ఈ ఆలయం ఇప్పుడు అందమైన ప్రకృతితో పర్యటన కేంద్రంగా మారింది. మహా శివరాత్రి రోజున ఈ పవిత్ర జలధారల కింద స్నానాలు చేసి పరమేశ్వరుని దర్శించుకొని జాగరణ చేసినట్టయితే సర్వపాపాలు తొలగి పోవడమే కాకుండా  కైలాస ప్రాప్తి లభిస్తుందన్నది భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడకి వచ్చి భక్తులు స్నానమాచరించి పరమశివుని దర్శనానికి వెళ్తారు. 
 
ఆలయమంతా కూడ ఎన్నో చెట్లతో అందముగా ఉంటుంది. నడుస్తుంటే ఏదో కొత్త భూమిని చూసినట్టు అనిపిస్తుంది. చల్లని వాతావరణం, చక్కటి ప్రకృతి, గలగలా పారె అందమైన జలపాతాలు అబ్బా... నిజంగా ఈ క్షేత్రాన్ని చూస్తే జన్మతరించినట్టే....