BREAKING NEWS

బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రమణ్యం

ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు గాయకునిగా, నటునిగా, డబ్బింగ్ కళాకారుడుగా ఇలా అన్నింట్లో తెలుగు ప్రేక్షకులని తనకున్న టాలెంట్ తో మెప్పించారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్నా కష్టమే.... ఎంత వివరించినా సాధ్యమేనా...?  బాలసుబ్రమణ్యం గారు 1946 సంవత్సరం జూన్ 4న  జన్మించడం జరిగింది. ఈయన నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు కూడా. కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. 
 
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి జీవిత విశేషాలు:
 
బాల సుబ్రహ్మణ్యం గారు సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి హరికథా కళాకారుడు కావడంతో చిన్ననాటి నుండి కూడా సంగీతంపై ఆసక్తి బాల సుబ్రహ్మణ్యం కి కలిగింది. ఈయన తండ్రి ఇంజనీరింగ్ చదవమనడంతో ఆయన కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. బాల సుబ్రమణ్యం గారికి చదువు కంటే కూడా వేదికల మీద పాటలు పాడుతూ వాటిలో పాల్గొని బహుమతులు గెలవడం లోనే ఆనందం కలిగేది, ఇష్టం కూడా. 
 
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి సినీ ప్రస్థానం: 
 
మొట్టమొదట ఈయన 1966వ సంవత్సరంలో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో సినీ గాయకుడుగా వ్యవహరించడం జరిగింది. ఆ పాట మొదలు అనేక పాటలు ఈయన పాడడం జరిగింది. ఇలా ఆ చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా 1969 వ సంవత్సరంలో మొట్ట మొదటిసారి నటుడిగా ఒక గెస్ట్ రోల్ చేయడం జరిగింది. ఆ తరువాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు.
 
ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరో ప్రాణం, రక్షకుడు, దీర్ఘసుమంగళీభవ మొదలైన సినిమాల్లో ఈయన నటించి చక్కటి పాత్రలు పోషించారు. కేవలం నటనలో మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా బాల సుబ్రహ్మణ్యం గారు వ్యవహరించి ఎంతో మంది కళాకారులకి గాత్రదానం చేశారు. స్టార్ హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమినీ గణేషన్,  రఘువరన్ మొదలైన వాళ్ళకి కూడా గాత్ర దానం చేయడం జరిగింది.
 
టీవీ రంగంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు:
 
కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా టీవీ రంగంలో కూడా బాలసుబ్రమణ్యం గురించి గారి గురించి చెప్పుకోదగ్గవి చాలానే ఉన్నాయి. పాడుతా తీయగా, పాడాలని ఉంది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది నూతన గాయనీ, గాయకులుని పరిచయం చేశారు బాలసుబ్రమణ్యం గారు. పాడుతా తీయగా లో ఆయన యాంకర్ గా, జడ్జ్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది గాయనీ గాయకులుని  ప్రోత్సహిస్తూనే ఉన్నారు బాలసుబ్రమణ్యం గారు. ఇది ఇలా ఉండగా ఈ టీవీలో ప్రసారమయ్యే స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో కూడా తన గాత్రాన్ని వినిపించాడు బాలసుబ్రమణ్యం గారు.
 
ఎస్పీ బాల సుబ్రమణ్యం గారి అవార్డులు:
 
ఇటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలికి ఎన్ని అవార్డులు వచ్చినా ఎన్ని ప్రశంసలు ఇచ్చినా తక్కువనే చెప్పాలి. బాల సుబ్రహ్మణ్యం గారికి భారత దేశ కేంద్ర ప్రభుత్వం నుంచి 2001లో పద్మశ్రీ పురస్కారం అందించడం జరిగింది. అలానే 2011వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం కూడా ఈయన దక్కించుకున్నారు. అలానే తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు బాల సుబ్రమణ్యం గారు. అలానే మిథునం సినిమా కి గాను నంది ప్రత్యేక బహుమతి లభించడం విశేషం. అందులో ఆయన పాత్ర చూస్తే ఎంతటి వారైనా మెచ్చుకుని తీరాల్సిందే. 
 
బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పుకోదగ్గవి :
 
అమరగాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినీ పాటలకు సిసలైన వారసుడిగా నిలిచారు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు. ఆయన పదాల మాధుర్యం, ఉచ్చారణ, పాట ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈయన పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. శంకరాభరణం, సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దూజే కేలియే లాంటి హిందీ సినిమాల్లో కూడా పాడడం జరిగింది. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే అరుదైన రికార్డు సృష్టించారు.
 
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం:
 

ఈయన మరణం తెలుగు ప్రేక్షకులకి  తీరని లోటు. ఆగస్ట్ 5వ తేదీ 2020 న ఎస్పీ బాల సుబ్రమణ్యం గారికి కరోనా సోకినట్లు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఆయనను చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ లో చేర్చారు. కొన్ని రోజులకి కరోనా  తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ ఉన్నారు. ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ సహాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. కానీ 2020 సెప్టెంబర్ నెల 25వ తేదీన చికిత్స పొందుతూ ఆయన ఆసుపత్రిలో మరణించారు. ఆసుపత్రిలో సుదీర్ఘ పోరాటం తర్వాత 74 ఏళ్ల వయసులో కన్నుమూసిన ప్రముఖ గాయకుడు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు.