BREAKING NEWS

'ఆంధ్ర తిలక్': గాడిచర్ల హరిసర్వోత్తమరావు

'స్వరాజ్య' పేరుతో తొలి తెలుగు పత్రికకు శ్రీకారం చుట్టారు.
'ఆంధ్ర పత్రిక'కు తొలి సంపాదికుడిగా వ్యవహరించారు.
'హోం రూల్' ఉద్యమంలో కీలక పాత్ర వహించారు.
'పౌరవిద్య' అనే పేరుతో ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం పుస్తకాన్ని అందించారు. 
ఈయనను అందరూ 'ఆంధ్ర తిలక్' గా పిలిచేవారు.
పత్రిక, పుస్తక రచయితనే కాక, సంపాదకుడు కూడా! అటువంటి గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారి జయంతి ఈ నెల(సెప్టెంబరు 14న) పురస్కరించుకుని ఆయన జీవిత విశేషాలతో పాటు సంపాదకీయ కృషి గురుంచి ప్రత్యేకంగా ఈరోజు మనం తెలుసుకుందాం:
 
బాల్యం...

హరిసర్వోత్తమరావు 1883 సెప్టెంబర్ 14న కర్నూలు జిల్లాలో జన్మించారు.  తండ్రి వెంకటరావు, తల్లి భాగీరథీ బాయి. 
కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చెందిన గుత్తిలో ఈయన పాఠశాల విద్యను పూర్తి చేశారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఎంఏ తెలుగును అభ్యసించారు. ఉపాధ్యాయ శిక్షణ కోసం రాజమండ్రి వెళ్లారు. అక్కడ బిపిన్ చంద్రపాల్ ప్రసంగానికి ఈయన ప్రభావితుడయ్యారు.
 
స్వాతంత్ర్య సమరయోధుడిగా...

ఆనాడు వందేమాతరం ఉద్యమంలోకి ఉత్తేజపరిచి విద్యార్థులందరిని పాల్గొనేలా చేశారు గాడిచర్ల సర్వోత్తమరావు. అలా వీరికి నాయకుడిగా వ్యవహరించినందుకు ఈయనను కళాశాల నుంచి బహిష్కరించడమే కాక, ఎక్కడా ఉపాధ్యాయ ఉద్యోగం ఇవ్వకూడదంటూ బ్రిటిష్ ప్రభుత్వం 1907లో ఒక ప్రత్యేక జివోను జారీ చేసింది.
 
పత్రికలోకి రంగప్రవేశం...

అలా బహిష్కరించినప్పటికీ, ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆయనే ఏకంగా "స్వరాజ్య" అనే తెలుగు పత్రికను ప్రారంభించారు. అందులో బ్రిటిషు పాలనలోని లోపాలను విమర్శిస్తూ వార్తలు ప్రచురించేవారు. 1908లో 
ఈయన రాసిన 'విపరీత బుద్ధి' సంపాదకీయం చూసి, బ్రిటిష్ ప్రభుత్వం కోపంతో మూడేళ్ల జైలు శిక్షను విధించింది. అలా ఆయన ఆంధ్రుల్లోనే మొట్టమొదటి రాజకీయ ఖైదీ అయ్యారు. జైల్లో ఉన్నన్నిరోజులు ఆయనతో అమానుషంగా ప్రవర్తించారు. జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన తర్వాత ఆయనతో ఎవరు మాట్లాడటానికి ముందుకు రాలేదు. అలాంటి సమయంలో మిత్రుడు కొమర్రాజు లక్ష్మణరావును కలుసుకున్నారు. 

"ఆంధ్రపత్రిక" వంటి దినపత్రిక మద్రాసులో ప్రారంభమైనప్పుడు దాని తొలి సంపాదకుడిగా గాడిచర్ల 1916 నుంచి 1918 వరకు పని చేశారు. నాటి నుంచి ఇంగ్లీష్, తెలుగు పత్రికలకు వ్యాసాలు, సమీక్షలు రాయటం చేశారు.

పత్రికా రచయితగా, సంపాదకుడిగా, పుస్తక రచయితగా ఆయన కృషి చేశారు. తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, మరాఠీ మొదలైన భాషల్లో ప్రావీణ్యం ఉంది.
●స్త్రీల కోసం విడిగా ‘సౌందర్యవల్లీ’ అనే తెలుగు మాసపత్రికను నడిపారు. 
 
రాజకీయ రంగప్రవేశం...

●1914లో 'హోం రూల్ ఉద్యమాని'కి ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా ఈయన ప్రచారకర్తగా వ్యవహరించారు.

●1924లో  హిందూస్థానీ సేవా దళ్ ఏర్పాటులో గాడిచర్ల కీలకపాత్ర వహించారు. 

●1927లో కాంగ్రెసు అభ్యర్థిగా ఉన్న రావు మద్రాసు రాష్ట్ర కౌన్సిల్ లో కొంతకాలం సభ్యుడిగా ఉన్నారు.

●మద్రాసు గ్రామ పంచాయితీ అనే పత్రికకు తెలుగు, తమిళ, ఇంగ్లిషు ప్రతులకు సంపాదకుడిగా ఉన్నారు.
జి.హెచ్.ఎస్ కలం పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు రాశారు.
 
పుస్తకాలు...

●'స్పిరిచ్యువల్ స్వదేశీ నేషనలిజం' అనే పుస్తకం రాశాడు.

● 'శ్రీరామ చరిత్ర' అనే పుస్తకాన్ని 11వ తరగతికి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకుంది. దాంతోపాటు 'పౌరవిద్య' అనే పుస్తకాన్ని మద్రాసు ప్రభుత్వం 1 నుంచి 6 తరగతుల వరకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించింది.

●'అబ్రహం లింకన్ చరిత్ర' అనే పుస్తకాన్ని కొమర్రాజు వెంకటలక్ష్మణ రావు విజ్ఞాన చంద్రికా గ్రంథంలో ప్రచురించారు.

●చిన్న వయసులోనే బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ లాంటి వారి నుంచి స్ఫూర్తి పొందుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు.

●హరి సర్వోత్తమరావుకు శ్రీ కృష్ణదేవరాయలు అంటే ఎంతో అభిమానం.

●1906లో ఆంధ్రాలో ఎంఏ పట్టా పొందినవారిలో ఇద్దరిలో ఒకరిగా గాడిచర్ల హరిసర్వోత్తమరావు నిలిచారు. ఆంధ్ర ప్రాంతంలో జాతీయోద్యమం ప్రస్తావన వస్తే మొదట స్మరించుకోవాల్సిన పేర్లలో గాడిచర్ల మొదటి వరుసలో ఉంటారు.

● 1928లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో రావు దత్తమండలం(సీడెడ్) ను 'రాయలసీమ'గా పేరు పెట్టారు.

●ఆంగ్ల పదం ఎడిటర్(Editor) అంటే తెలుగులో 'సంపాదకుడు' అని నామకరణం చేసి, అర్థం తీసుకొచ్చారు. 

●ప్రజలకు చదువు చాలా అవసరమని బలంగా నమ్మిన వ్యక్తులలో రావు ఒకరు. అందుకే ఆంధ్రదేశంలో 'వయోజన విద్యా' కేంద్రాలను నెలకొల్పారు. 

●గాడిచర్ల హరిసర్వోత్తమరావు స్నేహితుడు కాదర్‌బాద్ నరసింగరావుతో కలిసి నంద్యాలలో ఎడ్వర్డ్ కార్పొరేషన్ లైబ్రరీని (ప్రస్తుతం విక్టోరియా రీడింగ్ రూమ్ అని పిలుస్తారు) స్థాపించడానికి గ్రంథాలయోద్యమంలో ఈయన అధ్యక్షుడిగా ఉన్నారు. దీనితోపాటు కొన్ని ప్రచురణలు చేశారు. వాటిలో  ఆంధ్ర కేసరి(ఆంధ్ర సింహం), నవయుగం(న్యూ డాన్) ,ఆంధ్రపత్రిక, మాతృసేవ(తల్లి సేవలో) , ఆంధ్ర వర్త (ఆంధ్ర వార్తలు), పంచాయతీ రాజ్యం (స్థానిక పరిపాలన) లాంటివి ఉన్నాయి.

●ప్రతి సంవత్సరం రావు నాయకత్వం వహించిన ప్రాంతాల్లో కృషి చేసిన వ్యక్తులకు "గాడిచెర్ల ఫౌండేషన్ అవార్డు" అందజేస్తారు.

●1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత గాడిచర్ల 'భరతమాత సంకెళ్లు తొలగించేందుకు నేను పని చేశానే కానీ పదవులు ఆశించి కాదని' నాయకులతో అన్నారు.

●ఈయన అభిమానులు 1957లో సర్వోత్తమ భవనం పై అంతస్తును పూర్తి చేసి దానికి బాపూజీ మందిరంగా పేరు పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించి గాడిచర్లకు ఇచ్చారు.

●1960 ఫిబ్రవరి 29న రావు అనారోగ్యంతో మరణించారు. ఈయనను అందరూ 'ఆంధ్ర తిలక్' గా పిలిచేవారు.