BREAKING NEWS

'బోగత'… పరవళ్ల వడపోత

అమెరికాలో ఉన్న నయగరా వాటర్ ఫాల్స్ ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలుసు…. మరీ ఇప్పుడు మన తెలంగాణలో కూడా అలాంటి నయగరా జలపాతం సందడి చేస్తూ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
పచ్చని వాతావరణం, పక్షుల కిలకిల రావాలు, ఆకట్టుకునే పచ్చిక బయళ్లు, కొండల మధ్య తిరుగుతుంటే మనసుకు ఎంతో ప్రశాంతత… 

అటువంటి ప్రశాంతత కోసం ఎంతో దూరం వెళ్లాల్సిన పని లేదు. మన తెలుగు రాష్ట్రాలోనే మనకు దగ్గర్లోనే ఉన్నాయి ఈ వాటర్ ఫాల్స్. అయినా ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఇది ఒకటని చెప్పకనే చెప్తుంది. మరీ ఇప్పుడు ఆ జలపాతం పుట్టుక, ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి లాంటి ఎన్నో విశేషాల గురుంచి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.
 
జలపాతం గురుంచి...

జలపాతాలను సందర్శించడం అంటే ఎవరికైనా భలే సరదాగా అనిపిస్తుంది. ఇక వర్షాకాలంలో ఈ జలపాతాల అందాలను చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పై నుంచి ఉబికొస్తూ కిందికి పారే జలపాతాల తీరుకి మైమర్చని వారుండరంటే అతిశయోక్తి కాదు!

ఆ కోవకు చెందిందే ఈ బోగత జలపాతం. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. ఛత్తీస్ గడ్ లోని దండకారణ్యంలో కురిసిన భారీ వర్షాలతో ఇక్కడి బోగతకు జలకళ మరింత పెరిగింది. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తయిన కొండల నడుమ ఉన్న ఈ జలపాతం నల్లందేవి గుట్టల మీదుగా ప్రవహిస్తూ చీకుపల్లికి వచ్చేసరికి పాలవాగుల మారి ఉరకలేస్తుంది.

రాతి బండలపై నుంచి బోగబోగమనే సడితో జాలువారుతూ జలాశయంలోకి చేరుకుంటాయి ఈ జలపాతం నీరు. అందుకే దీనికి 'బోగత జలాశయమ'నే పేరు వచ్చింది. ఇక్కడ పూర్వం జల కన్యలు నాట్యమాడటం వల్లే దీనికి ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. పైగా చుట్టుపక్కల దేవతామూర్తులు సంచరిస్తుంటారని అందరూ విశ్వసిస్తుంటారు. దీనిని "తెలంగాణ నయగరా"గా పిలుస్తుంటారు. అలాగే 'బొగత వాటర్‌ఫాల్స్', 'చీకులపల్లి ఫాల్స్' అని కూడా అంటుంటారు.

దీనికి దగ్గరలోనే కొలువై ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం ఈ నమ్మకాలను మరింత బలపరుస్తుంది. అంతేకాదు అక్కడ ఒక చిలుకల పార్కు కూడా ఉంది.
ఇప్పుడు ఎక్కువగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు నిండిపోతూ అవి జలపాతంలోకి చేరి మరింత పరవళ్లు తొక్కుతుంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
 
ఎక్కడుంది...

ఈ జలపాతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న చీకుపల్లి దగ్గర ఉంది. ఆ గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం కనిపిస్తుంటుంది. ఎత్తులో 50 అడుగులు, వెడల్పులో 85 మీటర్లు కలిగి ఉంది. హైదరాబాద్ కి 273 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి 120 కిలోమీటర్లు, వరంగల్ నుంచి 134 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి 195 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి 121 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని చేరుకునే ప్రయత్నంలో పచ్చిక బయళ్లతో చుట్టూ చల్లని వాతావరణం నెలకొన్న ఆ ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. ఎక్కువగా జూన్ నుంచి జనవరి వరకు బోగతలో పర్యాటకుల సందడి నెలకొంటుంది.

తెలంగాణలోని హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్‌, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. 
 
ఎలా వెళ్లాలి...

హైదరాబాద్ నుంచి పర్యాటకులు రైలు, రోడ్డు మార్గం ద్వారా బోగత జలపాతానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో రైలు ఎక్కి కొత్తగూడం చేరుకునే వెసులుబాటు ఉంది. అక్కడి నుంచి భద్రాచలం మీదుగా వాజేడు మండల కేంద్రానికి రోడ్డు మార్గాన చేరుకోవాలి. అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే అక్కడ పొంగిపొర్లుతున్న అందాల బోగత జలపాతం కనిపిస్తుంది. 

ఈ జలపాతాన్ని సందర్శించడానికి సంవత్సరానికి కొన్ని వందల, వేల మంది పర్యాటకులు వస్తారు. కొందరు నీళ్లలో దిగి జలకాలాడుతుంటారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు పర్యాటకులను అనుమతించరు. ఇప్పుడు కరోనా నిబంధనలను అనుసరించి తిరిగి అనుమతి పొందింది. కాబట్టి మీరు ఓసారి ఈ జలపాత అందాల్ని చూసేయండి మరీ!