BREAKING NEWS

గోల్కొండ 'ఖిల్లా'

ప్రముఖ పర్యటక ప్రదేశంగా పేరుగాంచి, ఎంతోమంది పర్యటకుల్ని ఆహ్లాదపరచడమే కాక, ఎన్నో విశిష్టతల్ని, అంతకన్నా మించి 500 ఏళ్ల చారిత్రక చరిత్రను కలిగి, చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటిగా మేటిగా నిలిచిన గోల్కొండ కోట తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ కి అతి దగర్లో 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఎంతో చరిత్ర, ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆసక్తికర విషయాలు కలిగిన ఈ ఖిల్లా గురుంచి పర్యటక దినోత్సవ సందర్భంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం:
 
గోల్కొండ చరిత్ర...

ఇది గొల్లకొండ నుంచి గోల్కొండ కోటగా మారింది. ఈ ప్రాంతాన్ని 1083 నుంచి 1323 వరకూ కాకతీయులు పరిపాలించారు. 1336లో ముసునూరి నాయకులు మహ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి దీన్ని సొంతం చేసుకున్నారు. 1364లో ఈ కోటను పరిపాలించిన ముసునూరి కాపయ భూపతి ఈ ప్రాంతాన్ని బహమనీ సుల్తాను మహ్మద్ షాకు అప్పగించాడు. 1518లో సుల్తాన్ కులీ కుతుబ్-ఉల్-ముల్క్ ను గవర్నర్‌గా  నియమించిన కొన్ని సంవత్సరాలకు ఈ కోటను నిర్మించారు. తరువాత వచ్చిన కుతుబ్ షాహీ రాజులు దీనిని మరింత దృఢపరిచారు. అలా ఈరోజు వరకు ఉన్న ఈ గొప్ప కోట కుతుబ్-ఉల్-ముల్క్‌ వల్లే సాధ్యపడింది.

కుతుబ్ షాహీ వంశస్తులు గోల్కొండ కోటను 60 ఏళ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై శత్రువుల బారి నుంచి రక్షణ కవచంలా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ కోటలో బురుజులు సుమారు 5 కిలోమీటర్ల మేర చుట్టుకొలత కలిగి ఉన్నాయి. అంతేకాదు నవాబుల కాలంలో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూరు, ఒర్లఫ్, హోప్, పిట్ వంటి వజ్రాలన్ని ఈ రాజ్యం పరిధిలోని పరిటాల-కొల్లూరు గనుల నుంచే ఉద్భవించాయి.

ఇక్కడి సంపద నిజాంలను అత్యంత ధనవంతులుగా మార్చింది. 1687లో మొదలైన యుద్ధంలో ఔరంగజేబు నవాబులను ఓడించడానికి దాదాపు 8 నెలలు పట్టింది. ఆ సమయంలోనే ఈ కోటను కొంత మేర నాశనం చేశాడు. ఆ తర్వాత మొఘల్ దక్కన్ ప్రతినిధిగా అసఫ్ షాను నియమించి ఔరంగజేబు ఢిల్లీ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈయన నిజాం ఉల్ ముల్క్ బిరుదును ధరించి నిజాం పాలకుడయ్యాడు. 2018తో గోల్కొండ కోట కట్టి 500సంవత్సరాలు అయ్యింది.
 
గోల్కొండ ప్రత్యేకతలు...

ఈ కోట నిర్మాణం జరిగి 500 సంవత్సరాలు గడిచింది. ఇన్ని సంవత్సరాలలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని రాజ్యాలు దండెత్తినా తట్టుకుని నిలబడి నవాబుల పాలనకు, చరిత్రకు సాక్ష్యంగా గోల్కొండ నిలిచింది. 
గోల్కొండ కోట 8 ప్రధాన సింహ ద్వారాలు, 4 ఎత్తగలిగే వంతెనలు, అనేక రాజ మందిరాలు, ఆలయాలు, మసీదులతో నేటికీ ఎంతో వైభవంగా కనిపిస్తుంది. 
 
చప్పట్ల శబ్దం...

కోటలో ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే తెలిసేలా ధ్వని శాస్త్రాన్ని ఉపయోగించి కట్టారు. ఆ నిర్మాణం చేపట్టిన దగ్గర నిలబడి చప్పట్లు కొడితే కిలోమీటరు దూరం వరకూ వ్యాపించి ఆ శబ్దం పైన ఉన్న బాలాహిసార్ లో స్పష్టంగా వినిపిస్తుంది. అప్పుడు శత్రువుల నుంచి రక్షణ నిమిత్తం నిర్మిస్తే, ఇప్పుడు ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచింది.
 
రామదాసు బంధికానా...
భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు శ్రీరామదాసును తానిషా ప్రభువు ఈ కోటలోని కారాగారంలో బంధించాడు. ఆ సమయంలో ఈయన సీతారాముల విగ్రహాలను చెక్కాడు. వాటిని ఇప్పటికి పూజించడం విశేషం. గోల్కొండకు వచ్చిన పర్యాటకులు తప్పనిసరిగా రామదాసు చెరసాలను దర్శిస్తారు.
 
బారాదరి...
బారాదరి కోటలోనే ఎత్తైన ప్రదేశం. ఇది మూడు అంతస్తులలో కట్టిన సభా మండపం. పైఅంతస్తులో రాజు సింహాసనం ఉంది. ఇక్కడి నుంచి రాజు చార్మినార్, మక్కామసీద్ లను వీక్షించేవాడు. అలా నగరంలోని 30 మైళ్ల విస్తీర్ణం వరకు కూడా చూడగలిగేవారు. దూరం నుంచి చూస్తే అది ఎంతో సుందరంగా కనిపిస్తుంది.
 
దాద్ మహల్...
ఇది బాల్కనీ రోడ్డుకు తూర్పువైపు ఉంది. దీని ముందు ఉన్న స్థలం పెద్దది.  ప్రజలు ఇక్కడికి చేరి వాళ్ల కష్టసుఖాలను రాజుకు చెప్పుకునేవారు. ఇక్కడి నుంచే విని తిరిగి వారి సమస్యలకు పరిష్కారం చెప్పేవాడు.
 
కోటలోని బురుజులు...
కోటలో మొత్తం 87 బురుజులు ఉన్నాయి. వాటిలో పెట్లా, మూసా, మజ్ను ప్రసిద్ధి చెందాయి. వీటిపైన సైనికులు నిలబడి శత్రువుల రాకను పసిగట్టి, ఫిరంగులను గురిపెట్టేందుకు బురుజుల పైన ప్రత్యేకంగా అమర్చారు.
 
ద్వారాలు...
కోటకు మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి. అందులో ఫతే దర్వాజా(విజయ దర్వాజా), మోతీ దర్వాజా, కొత్తకోట, జమాలి, మక్కా దర్వాజాలు కొన్ని… ఇప్పుడు మనం కోటలోకి ప్రవేశించాలంటే ఫతే దర్వాజా నుంచే వెళ్లాలి. ఔరంగజేబ్ సైన్యం గెలిచాక ఈ ద్వారం నుంచే లోపలికి వెళ్లారు. అందుకే దీనిని ఫతేహ్ దర్వాజా(విక్టరీ గేట్)అని పిలిచేవారు. 
 
నగీనా బాగ్...
తోటకు దక్షిణంగా ఆర్కులలో రాకుమారులు, రాకుమార్తెలు ఊగేందుకు విడిగా ఊయలలు అమర్చి ఉన్నాయి. ఇప్పటికీ వాటి గుర్తుగా ఆర్కులోని రాళ్లలో రంధ్రాలు కనిపిస్తుంటాయి. ఎడమవైపు రక్షకభటులు భవనాన్ని గమనిస్తుండే వారు.
 
ప్రత్యేక స్నానాలు...

కోటలోని బాలాహిసార్ గేటు నుంచి లోపలికి వెళుతుండగా ఈ స్నానాల గది కనిపిస్తుంది. చెరువులో నుంచి తెచ్చిన నీటితో దాన్ని నింపేవారు. వాటితో వేడినీళ్లు, చన్నీళ్లు వచ్చే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రాజ వంశస్తులు ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడ వేడి నీటితో స్నానం చేయించేవారు. ఆ తర్వాత ఉత్తరం వైపు నుండి శవపేటికలో తీసుకెళ్లేవారు.
 
ఆర్మరి...

ఇది బాలాహిసార్ గేట్ ప్రవేశంలో ఎడమవైపు ఉంది. ఇక్కడికి సమీపంలో దక్షిణాన ఒక ప్రసిద్ధిగాంచిన బావి ఉండేది. ఔరంగజేబు తానిషాను బంధించినపుడు అతని భార్య, బిడ్డలను శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఈ బావిలోనే తలదాచుకున్నారని చెబుతారు.
 
బడీ బౌలి...

బాలాహిసార్ మెట్లకు కుడిపక్కన ఒక పెద్ద బావి ఉంది. దాని దగ్గరలో రెండు వరండాలతో ఒక భవనముంది. అక్కడ రాజులు సేదతీరుతూ ప్రకృతిని ఆస్వాదించేవారు.
 
డ్రగ్ చెరువు...

బడీ బౌలికి కొద్ది దూరంలో మెట్లకిందుగా పారే ఒక కాలువ వుండేది. కోటకు 5 మైళ్ళ దూరంలో ఈ డ్రగ్ చెరువు వుంది. గోల్కొండలోని తోటలకు, చేలకు కావాల్సిన నీటిని ఈ  కాలువ నుంచే మళ్లించేవారు. అలాగే పంటలు కూడా పండించేవారు.
 
కర్టైన్ వాల్...

ఇది శత్రువుల దాడులను తిప్పి కొట్టేందుకు నిర్మించిన తెరవంటి గోడ. యుద్ధ సమయంలో శత్రుమూక బాలాహిసార్ గేటు ద్వారా లోనికి ఏనుగులను పంపించేటప్పుడు ఇక్కడి నుంచే సలసల కాగుతున్న నూనెను లేదా కాగుతున్న లోహ ద్రవాన్ని పోసేవారు.
 
సాటిలేని నిర్మాణం...

దక్కన్ లోనే అతిపెద్ద దుర్గం గోల్కొండ. ఇంతటి వాస్తు వైభవం, విస్తీర్ణం, వైవిధ్యం కలిగిన కోట దక్షిణ భారతదేశంలో మరొకటి లేదని చెప్పాలి. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో నిర్మించిన ఇటువంటి కోటను మళ్ళీ నిర్మించడం అసాధ్యమే! ఇటలీ, పర్షియన్ రీతిలో అద్భుతంగా తీర్చిదిద్దిన గోల్కొండను చూడటానికి ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు.
 
కుతుబ్ షాహీల గొప్పతనం...

కుతుబ్ షాహీలు కూచిపూడి నృత్యం ఉనికిని అందరికి తెలిసేలా చేశారు. కలంకారి, బిద్రి క్రాఫ్ట్ లను పరిచయం చేశారు. 
పర్షియన్‌ భాషతో పాటు తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు(ఫిర్మాన్స్) జారీ చేసేలా మొదటి ముస్లిం పాలకులైన వీరు అమలు చేశారు. సూక్ష్మ చిత్రలేఖనం, వాస్తు శిల్పాలతో కొత్త శైలి నిర్మాణాలను చూపించారు. అంతేకాదు సంగీతం విద్వాంసులు, కొందరు కవులు కూడా ఉండేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు గోల్కొండ- హైదరాబాద్‌లో దొరికే వజ్రాలు, ముత్యాలు, పట్టు, సుగంధ ద్రవ్యాలు, పత్తిని అమ్మడానికి, కొనడానికి ఒకరితో మరొకరు ఇక్కడ కలుసుకునేవారు.

●కుతుబ్ షాహీ పాలకులు హైదరాబాద్‌ను నిర్మించి, ఐదు శతాబ్దాల ముందు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన నగరంగా గుర్తింపు తీసుకొచ్చారు. ప్రపంచంలోని మొట్టమొదటి బహుళ అంతస్థుల, అనేక విభాగాలు కలిగిన ఆసుపత్రిని (దారుల్-షిఫా) వారు నిర్మించారు. ఇవేకాక హైదరాబాద్‌లో తోటలను ఏర్పాటు చేశారు. వాటితోపాటు హుస్సేన్ సాగర్, పురాణపుల్, చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ కోట, నగర శివార్లలో ఉన్న కార్వాన్సె రైస్ ను ఈ కోటతోపాటు అందించారు. 
 
ఎల్లమ్మ దేవి...
గోల్కొండ కొండపైన ఓ గొర్రెల కాపరి అమ్మవారి విగ్రహాన్ని కనిపెట్టగా కాకతీయ రాజులు అక్కడ మట్టితో ఎల్లమ్మ దేవి ఆలయాన్ని నిర్మించారు. బోనాలను మొదటగా ఇక్కడే మొదలుపెడతారు. వాటిని చూడడానికి ఏటా ఎంతోమంది భక్తులు తరలివస్తారు.
 
ఇతర విషయాలు...

●గొర్రెల కాపరులు, ఇప్పుడు కోట ఉన్న కొండ ప్రాంతంలో గొర్రెలను మేపేవారు. అందుకే ఈ కొండను గొల్లకొండ అని పిలిచేవారు.
●ఇబ్రహీం కుతుబ్ షా మసీదు- ఇది కుతుబ్ షా కాలంలో నిర్మించిన మసీదు. ఇక్కడి నుంచి గోల్కొండ మొత్తాన్ని, అలాగే హైదరాబాద్ భవనాలను చూడొచ్చు.
●గోల్కొండ కోటతో పాటు కుతుబ్ షాహీ భవనాలు, అసెంబ్లీ హాల్, దర్బార్- ఏ-ఖాన్ లు చూడదగ్గ వాటిలో ముఖ్యమైనవి.

Photo Gallery