BREAKING NEWS

ఇంజనీర్లకు మార్గదర్శకులు: మోక్షగుండం విశ్వేశ్వరయ్య..!

ఇంజనీరింగ్ చదివి కొత్త కొత్త నిర్మాణాలను చేపట్టి, తరతరాలకు ఉపయోగపడేలా కట్టిన ఆనకట్టలు, వంతెనలు ఇప్పటికీ ధృడంగా నిలబడ్డాయి.
ఆయన కృషికి గుర్తింపుగానూ
ఎన్నో బిరుదులు, 
మరెన్నో పురస్కారాలు... 
ఎంతోమంది ఇంజినీరులకు మార్గదర్శనం చేశారాయన.
ఆయన పేరుమీద ఏకంగా కళాశాలనే నిర్మించేశారు. అందుకే విశ్వేశ్వరయ్య పుట్టిన రోజును ప్రతి ఏటా "ఇంజినీర్స్ డే" గా జరుపుకుంటున్నాం. అటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి కృషి, జీవిత విశేషాల గురుంచి ఈరోజు  ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
బాల్యం...

విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కబళ్లాపూరులోని ముద్దనహళ్లిలో జన్మించారు. తండ్రి మోక్షగుండం శ్రీనివాసశాస్త్రి సంస్కృత పండితుడు, అంతేకాక వైద్యుడు. తల్లి వెంకటలక్ష్మమ్మకు జన్మించారు. వీరిది బ్రాహ్మణ కుటుంబం. ఈయన పూర్తిపేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
 
చదువు...

ఈయన చిక్కబళ్లాపూరులో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. బెంగుళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. విశ్వేశ్వరయ్యకు 12 సంవత్సరాల  వయసున్నపుడు ఆయన తండ్రి మరణించాడు. మేనమామ ప్రోత్సహంతో చదువుకున్నాడు. ఉపకార వేతనంతోనే పుణె సైన్స్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణుడయ్యాడు.
 
ఉద్యోగం...

◆ ఈయన బొంబాయిలో పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఏడాది కాలంలోనే ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ఈయన పనితీరు అందరికి నచ్చడంతో విశ్వేశ్వరయ్యను సుక్నూర్‌ బ్యారేజ్‌ నిర్మించడానికి ఇంజనీరుగా నియమించారు. అంతేకాదు సింధూనది నీటిని సుద్నోరుకు చేరేలా చేయడంలో   కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. 

◆ 1909లో మైసూర్‌ ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను చీఫ్‌ ఇంజనీర్‌‌గా ఉద్యోగంలోకి తీసుకున్నారు. అక్కడి సమీపంలో కృష్ణరాజ సాగర్ ఆనకట్టకు ఈయనే చీఫ్ ఇంజినీర్‌గా వ్యవహరించారు.

◆ నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా అలాగే నీటిని నిల్వ చేసేలా ఆటోమేటిక్ వరద గేట్లను మొదటగా ఈయనే రూపొందించారు.

◆1903లో ఈ వ్యవస్థను ఖడక్‌వాస్లా దగ్గర మొదలుపెట్టారు. మైసూరు దగ్గర  ఉన్న కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోనూ ఇదే విధానాన్ని ప్రయోగించారు.

◆1900 సంవత్సరంలో హైదరాబాద్ లో వరదల కారణంగా మూసినది వరదతో పోటెత్తడంతో భాగ్యనగరవాసుల్ని రక్షించే బాధ్యతను అప్పటి నిజాం నవాబు విశ్వేశ్వరయ్యకు అప్పగించింది. అందుకు ఆయన మూసీపైన రిజర్వాయర్లు నిర్మించారు. మురుగునీటి పారుదల వ్యవస్థను కూడా ఈయనే నిర్మించారు. ఆయన కృషి వల్లే  హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్ల వల్ల ప్రస్తుతం హైదరాబాద్ ప్రజలు నీటిని తాగుతున్నారు.

◆ విశాఖపట్నం ఓడరేవు చివరన సముద్రపు అలల తాకిడి నుంచి ప్రజలను కాపాడటానికి ఓ మార్గం చూపించారు. అలల తీవ్రతను తగ్గించడం కోసం విశ్వేశ్వరయ్యగారు రెండు పాత పెద్ద నౌకల్లో బండరాళ్లను వేసి సాగర తీరానికి చేరువగా ముంచేయాలని సూచించారు. అలా చేయడం వల్ల అలల తీవ్రత కాస్త తగ్గింది. కొన్నాళ్ల తర్వాత కాంక్రీటుతో బ్రేక్ వాటర్స్ నిర్మించారు. ఆయనిచ్చిన సలహా ఎంతో ఉపయోగపడింది.

◆ తిరుపతి ఘాట్ రోడ్ కోసం మోక్షగుండం ఆయన వంతు కృషి చేశారు. 

◆ 1908లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తరువాత, మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన్ అభివృద్ధికి కృషి చేశారు. 

◆ 1911లో విశ్వేశ్వరయ్య 'కంపెనీయన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్' గా నియమితులయ్యారు.

◆ 1917లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించడంలో ఈయన కీలకపాత్ర వహించారు. ఇందుకుగానూ ఏకంగా యూనివర్సిటీకే 'విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్'గా పేరు మార్చారు. అంతేకాదు మైసూరు విశ్వవిద్యాలయం నిర్మించడంలో కూడా ఈయన ముఖ్యపాత్ర వహించారు.

◆ హైదరాబాద్ లోని పత్తర్ ఘట్ నిర్మాణానికి నమూనాను ఈయనే రూపొందించారు. 

◆ 1959లో రైల్వేబోర్డు ఛైర్మన్‌గా కూడా  విశ్వేశ్వరయ్య పని చేశారు. 
      
◆ బీహార్ రాష్ట్రంలో గంగానదిపై రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి స్థలం నిర్ణయించి, ఆపై వంతెన నిర్మించారు.
 
 గుర్తింపు, పురస్కారాలు...

◆ 1955లో ప్రజలకు చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఈయనకు "భారతరత్న" పురస్కారాన్ని అందజేసింది. 

అప్పట్లో విశ్వేశ్వరయ్య నిర్మించిన కృష్ణరాజ సాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా నిలిచింది.

◆ 1915లో మైసూర్ దివానుగా పనిచేసిన విశ్వేశ్వరయ్య సేవలకు బ్రిటిషు ప్రభుత్వం "నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్" అనే బిరుదునిచ్చింది. దీంతో ఆయన పేరు ముందు 'సర్' అని చేర్చారు.

◆ పుణెలో ఈయన విగ్రహాన్ని కట్టారు, అలాగే బెంగుళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక ప్రదర్శనశాలను నిర్మించారు.

◆ 1920లో ‘భారత దేశ పునర్నిర్మాణం’, 1934లో ‘భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం’ అనే గ్రంథాలను కూడా విశ్వేశ్వరయ్య స్వయంగా రాశారు.

◆ చైనా, జపాన్, ఈజిప్ట్, కెనడా, అమెరికా, రష్యా లాంటి దేశాలలో కూడా విశ్వేశ్వరయ్య పర్యటించి, అక్కడ కూడా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు.

◆ 1962 ఏప్రిల్ 14న ఈయన తుది శ్వాస విడిచారు.

◆ భారతదేశాన్ని పచ్చని పైర్లతో సస్యశ్యామలం చేసిన ముగ్గురు ఇంజనీర్లలో సర్ ఆర్థర్ కాటన్ దొర,  కేఎల్ రావ్ తో పాటు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు కూడా చోటు దక్కడం విశేషం!