BREAKING NEWS

గణపతి బప్పా మోరియా..!

"శుక్లాంబరధరం విష్ణుం 
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వ విజ్ఞోప శాంతయే"
 
ఏకదంతుడా, గౌరీ తనయా, మూషిక వాహనా, బొజ్జ గణపయ్య… ఇలా విఘ్నేశ్వరుడికి ఎన్నో పేర్లు… పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా పూజించే, పూజలు జరిపించే లంబోదరుడు వృత్తాంతం గురుంచి వినాయక పర్వదిన సందర్భంగా తెలుసుకుందాం: 
 
పూర్వపు కథ...

పూర్వం గజముకుడైన గజాసురుడు శివుని కోసం తపస్సు చేస్తుండగా ఒకసారి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమన్నాడట. అందుకు గజాసురుడు "స్వామీ నువ్వు నా ఉదరంలో నివసించాలని" కోరాడు. దాంతో శివుడు అతడి పొట్టలో ఉండిపోయాడు. పార్వతిదేవి శంకరుడిని వెదుకుతూ ఆయన గజాసురుని పొట్టలో ఉన్నాడని  తెలిసి ఆయన్ని దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థిస్తుంది. శ్రీహరి బ్రహ్మాదీ దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసురున్ని చంపడానికి గంగిరెద్దు మేళమే సరైందనుకుంటాడు. నందీశ్వరున్ని గంగిరెద్దుగా అలంకరించి, దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిని ధరించాడు. దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియైన హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు ఇది చూసి ఆనందంతో 'ఏం కావాలో కోరుకోండి..

ఇస్తాను' అని వచ్చిన వారితో అంటాడు. శ్రీహరి అతనికి సమీపించి 'ఇది శివుని వాహనమైన నంది, ఆయన్ని కనుగొనడానికి వచ్చింది. వారిని అప్పగించు' అని అంటాడు. అప్పుడు గజాసురునికి మరణం తప్పదనుకుని భావించి... 'స్వామీ, నా శిరస్సును త్రిలోక పూజ్యంగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించు' అని ప్రార్థించాడు. అప్పుడు తన గర్భంలోవున్న శివుణ్ణి తీసుకోమని విష్ణువుకు చెప్పగా, నందిని ప్రేరేపిస్తే తన కొమ్ములతో ఉదరాన్ని చీలుస్తాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్లగా, శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్తాడు.
 
వినాయకావతారానికి వెనక ఉన్న కథ...

కైలాసంలో పార్వతి భర్త రాక విని సంతోషిస్తుంది. స్వాగతం చెప్పడానీ
కంటూ స్నానాలంకారణలో భాగంగా తనకై ఉంచిన నలుగుపిండితో తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ పిండి ముద్దతో చేసిన ప్రతిమకు ప్రాణం పోసింది. ఆ దివ్యసుందురుని వాకిట్లో ఉంచి, ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలికి వెళ్తుంది. కాసేపట్లో శివుడు వస్తాడు. అలా వచ్చిన శివుని మందిరంలోనికి రానివ్వకుండా బాలుడు పరమశివుణ్ణి అడ్డుకున్నాడు. తన ఇంట్లోకి తనకే అవరోధమా అని శివుడు ఆ క్షణంలో కోపంతో రగిలిపోతాడు. రౌద్రంతో ఆ బాలుని తల నరికేసి, లోపలికి వెళ్తాడు. జరిగిందంతా తెలుసుకొని పార్వతి విలపిస్తుంది. అది చూసి శివుడు చింతిస్తాడు. వెంటనే గజాసురుని తలను తిరిగి ఆ బాలుడి మొండేనికి అతికించి ఆ శిరస్సుకు ముందు రూపాన్ని త్రిలోక పుణ్యతనూ కలిగిస్తాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దులపట్టిగా మారతాడు. తరువాత వీరిద్దరి కుమారస్వామి జన్మిస్తాడు.
 
పార్వతి దేవి శాపం...

విఘ్నేశ్వరుడు కుడుములు తినే సమయానికి సూర్యాస్తమయం అవుతుంది. కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేస్తుండగా, ఉదరం భూమికి ఆనిన చేతులు నెలకు ఆనకుండా ఇబ్బంది పడతాడు. అది చూసిన శివుని తలపైనా ఉన్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి నవ్వుతాడు. 'రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గవుతాయి' అన్నట్లు విఘ్నేష్వరుడు ఉదరం పగిలి, లోపలున్న కుడుములన్ని బయట పడతాయి. దాంతో మృత్యువాత చెందుతాడు. అది చూసిన పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి, 'పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక' అని శపిస్తుంది.
 
'ఏకదంతుడు'కి పేరు ఎలా వచ్చిందంటే...

కార్తవీర్యుని చంపేసిన పరశురాముడు తన గురువైన పరమేశ్వరుడుని దర్శించుకోవడానికి కైలాసానికి వెళ్తాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉంటారు. బయట కాపలాగా ఉన్న గణపతి లోపలికి వెళ్లడానికి కుదరదు అని చెప్తాడు. లోపలికి వెళ్ళనివ్వకుండా నన్నే ఆపుతావా అంటూ ఇద్దరి మధ్య మాట మాట పెరుగుతుంది. దాంతో కోపంతో గణేశుడు తన తొండంతో పరశురాముడ్ని నెలకేసి కొడతాడు. అందుకు పరుశురాముడు గండ్రగొడ్డలితో గణేశుని దంతం పై దాడి చేయడంతో దంతం తెగి నేల మీద పడుతుంది. రక్తంతో విలవిలాడుతున్న గణపతిని శివపార్వతులు ఓదారుస్తారు. చేసిన తప్పును క్షమించమని పరశురాముడు కోరతాడు. అలా కథ సమాప్తమైనా గణపతి ఒక దంతం పోగొట్టుకొని "ఏకదంతుడి"గా పేరు పొందాడు.
 
కాణిపాక వరసిద్ధి వినాయక...

●ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుకు 11 కిలోమీటర్ల దూరంలో ఐరాల మండలం కాణిపాకం గ్రామంలో బాహుదా నదీ తీరాన విరాజిల్లుతోంది కాణిపాకం పుణ్యక్షేత్రం. నిరంతరం పెల్లుబికే పాతాళ గంగ నడుమ బావిలో వినాయకుడు స్వయంభువుగా వెలిశాడు. వెయ్యేళ్లకు పైన చారిత్రక, ఆధ్యాత్మిక, పౌరాణిక నేపథ్యంతో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరంలానే ఈసారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 

●బాహుదా నదీ తీరాన విహారపురి గ్రామంలో పూర్వం ముగ్గురు అన్నదమ్ములుండేవారు. ఒకరు అంధుడు, మూగవాడు, బధిరుడు. వీరికి 'కాణి'లో - ఎకరాలో పాతికవంతు వ్యవసాయ భూమి ఉండేది. బావి నీటితోనే సాగు చేసేవారు. ఓసారి కరువుతో బావి ఎండిపోగా లోతు తవ్వేందుకు ముగ్గురు కలిసి పలుగూ పారలతో బావిలోకి దిగుతారు. అలా తవ్వుతుండగా ఇసుక పొరల్లో ఓ రాయి అడ్డుగా వస్తుంది. ఆ పలుగుపోటుకు రాయి నుంచి రక్తం కారగా, ఆ రక్త స్పర్శకి వారి వైకల్యాలు పోయాయట. అలా వినాయక విగ్రహం బయలు పడింది. చుట్టుపక్కల నుంచి వచ్చిన జనం పూజలు చేయడం మొదలు పెట్టారు. అలా కొట్టిన టెంకాయల నుంచి వచ్చిన తీర్థపు నీళ్లతో ఆ పొలమంతా తడిచింది. 

'కాణి' వైశాల్యమున్న ప్రదేశమంత పారినందుకు ఆ ప్రాంతాన్ని స్థానికులు 'కాణిపాకం'గా పిలిచేవారు. కాలక్రమేణా కాణిపాకం పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతి పొందింది. బావిలో వెలసిన స్వామి మూలవిరాట్టు బొజ్జవరకే భక్తులకు దర్శనమిస్తోంది. 

మిగిలిన సగం బావి లోపలి వుండి బయటకి కనిపించదు. శిల్పి చెక్కినట్టు కాక స్వామి వారి ఆకారం కలిగిన సహజశిలగా కనిపిస్తుంది. మూలవిరాట్టు పరిమాణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. గతంలో చేయించిన కవచాలు ఇప్పుడు స్వామి వారికి సరిపోకపోవడమే ఇందుకు నిదర్శనం. 

●కాళహస్తిలో ఓ జీవనదిని ప్రవహింపజేయాలన్న ఉద్దేశంతో అగస్త్యుడు పరమశివున్ని ప్రార్థించాడు. అందుకు శివుడి అనుగ్రహం తోడై స్వర్ణముఖి నది పుట్టుకొచ్చింది. కానీ అందులో నీళ్లు లేవు. వాటికోసం సకల శుభాలకూ మూలమైన గణపతి ఆరాధన చేయలేదని గుర్తించి తప్పును సవరించుకోవడానికి గజాననుడి అనుగ్రహం కోసం మళ్లీ తపస్సు చేస్తాడు. అసుర సంహారం చేసి పాతాళ మార్గం ద్వారా వస్తున్న వినాయకస్వామి, అగస్త్యుని గమనించి దర్శన భాగ్యం కల్పిస్తాడు. అతని కోరిక మేరకు స్వర్ణముఖిలో జలధార కురిపిస్తాడు. దర్శనం దొరికిన చోటే కొలువుదీరమని అగస్త్యుడు కోరడంతో అక్కడే "పాతాళ గణపతి"గా వెలుస్తాడు. ఇది ఆంధ్రప్రదేశ్ లోని 'శ్రీకాళహస్తి'లో ఉంది.

●తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి సిద్ధి వినాయక ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలోని గణపతి విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందనేది భక్తుల నమ్మకం. మొదట్లో రెండున్నర అడుగుల ఎత్తు, మూడడుగుల వెడల్పు ఉన్న స్వామివారి విగ్రహం, ఇప్పుడు ఐదున్నర అడుగుల ఎత్తు ఆరడుగుల వెడల్పు అయ్యిందనీ అంటారు.

● ఖైరతాబాద్ గణేశుడంటే అది ఎక్కడివారికైనా ప్రత్యేకమే. రెండేళ్ల కిందట 65 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ ఏడాది 40 అడుగుల మహా గణపతిని ఏర్పాటు చేయడమైంది. 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువుతో వినాయకుడు పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమివనున్నాడు.
 
'జై బోలో గణేష్ మారాజ్ కీ - జై'